ఆదిత్య L1: సూర్యుడిపై పరిశోధనకు సెప్టెంబరు 2న ఇస్రో ప్రయోగం.. దీని లక్ష్యం ఏమిటి?

ఆదిత్య ఎల్1 ప్రయోగం

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని సెప్టెంబరు 2న చేపట్టనున్న ఇస్రో
    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), ఇక సూర్యుడిపై అధ్యయనం చేపట్టనుంది.

ఇందుకోసం ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకను సెప్టెంబరు 2 ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఆగస్టు 28న ట్విటర్‌లో తెలిపింది.

చంద్రయాన్, మంగళయాన్ తర్వాత ఇస్రో చేపట్టబోతున్న అతి కీలకమైన ప్రాజెక్టుగా ఆదిత్య L1 నిలవబోతోంది.

ఇస్రో చేసిన ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

సూర్యుడి మీద పరిశోధనలు ఎందుకు?

విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం.

భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి, వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం.

అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1.

ఆదిత్య L1

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యడు, భూమి మధ్య లెగ్రాంజ్ పాయింట్1 వద్ద ఆదిత్య L1

ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు.. సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది.

సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుపానులను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.

సూర్యుడి మీద పుట్టే సౌర తుపానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యుడి మీద పుట్టే సౌర తుపానులు(సోలార్ మాస్ ఎజెక్షన్)

సౌర తుపానులపై ఎందుకు కన్నేసి ఉంచాలి?

సౌరకుటుంబంలో శక్తికి మూల స్థానం సూర్యుడే. 450 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు...భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడిలోని నిరంతర కేంద్ర సంలీన చర్య ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఇలా మారే క్రమంలో అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది.

సూర్యుడి కేంద్రాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1 కోటి 50 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

సూర్యుడి ఉపరితలాన్ని క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీని నుంచి సూర్యుడి చుట్టూ ఆవరించిన ప్రదేశాన్ని కరోనా అంటారు. సూర్య గ్రహణాల సమయంలో దీనిని కంటితో చూడవచ్చు.

ఆదిత్య L1

ఫొటో సోర్స్, ESA

ఫొటో క్యాప్షన్, లెగ్రాంజ్ పాయింట్2 దగ్గర జేమ్స్ హబ్ టెలీస్కోప్

సూర్యుడి ఉపరితలం నుంచి నిత్యం అన్ని దిశల్లోనూ పెద్ద ఎత్తున సౌర పవనాలు విడుదల అవుతాయి. కొన్నిసార్లు సూర్యుడిపై కొన్ని ప్రదేశాల్లో తీవ్ర స్థాయిలో జరిగే కేంద్రక సంలీన చర్యల వల్ల ఒక్కసారిగా పేలుళ్లు జరిగి...సౌర తుపానులు పుడతాయి.

ఒకవేళ ఇలాంటి సౌర తుపానులు భూమి వైపుగా దూసుకొస్తే దాని ప్రభావం వల్ల చాలా ఉపద్రవాలు తతెత్తుతాయి. భూమ్మీద వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ సౌర తుపానులు నేరుగా భూమి దాకా రాలేవు.

కానీ ఆకాశంలో ఉండే శాటిలైట్లకు, భూమ్మీద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థలకు, విద్యుత్ గ్రిడ్‌లకు ప్రమాదం కలిగే అవకాశముంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి వాటిల్లో పనిచేసే వ్యోమగాములు నేరుగా ఇలాంటి సౌర తుపానుల బారిన పడితే చాలా ప్రమాదం.

కాబట్టి ముందుగానే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆదిత్య L1 చేసే పనుల్లో ఇదీ కీలకమైనది.

శాటిలైట్ల పై సౌర తుపానుల ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాటిలైట్ల పై సౌర తుపానుల ప్రభావం

ఆదిత్య L1 అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు?

సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్‌లను పంపిస్తున్న నాలుగో దేశంగా భారత్ నిలవబోతోంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగంతో ఇస్రో వాటి సరసన నిలవబోతోంది.

సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 అనే అబ్జర్వేటరీని సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టబోతోంది.

త్వరలో నింగిలోకి వెళ్లే ఈ అబ్జర్వేటరీ...నాలుగు నెలల ప్రయాణం తర్వాత తన నిర్ధిష్ట కక్ష్యలోకి వెళ్లబోతోంది. ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించింది కాబట్టి.. దీనికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య అంటే సూర్యుడు.

ఇక దీనిని సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర దీనిని ప్రవేశ పెట్టబోతున్నారు కాబట్టి ఈ మిషన్‌కి ఆదిత్య L1 అని పేరు పెట్టింది ఇస్రో.

ఆదిత్య L1 ప్రోబ్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఆదిత్య L1 ప్రోబ్

లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి?

అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఇలాంటి ఏవైనా రెండు ఖగోళ పదార్థాల మధ్య ఏదైనా వస్తువును ఉంచితే దాని మీద ఏ ఖగోళం గురుత్వాకర్షణ ఎక్కువగా పనిచేస్తే ఆ వస్తువు దానివైపుగా వెళ్తుంది.

కానీ ఆ రెండు ఖగోళ పదార్థాల మధ్య రెండింటి గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు ఐదు ఉంటాయి. వాటినే లెగ్రాంజ్ పాయింట్ అంటారు. అంటే భూమికి, సూర్యుడికి మధ్య కూడా ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.

సూర్యుడిని, భూమిని కలుపుతూ ఒక రేఖ గీస్తే... అందులో భూమికి సూర్యుడికి మధ్య వైపులో, భూమికి సూర్యుడికి మధ్య దూరంలో పదో వంతు దూరంలో భూమివైపుగా లెగ్రాంజ్ పాయింట్ 1 ఉంటుంది. భూమికి అవతల పక్క అంతే దూరంలో వెనుక వైపు లెగ్రాంజ్ పాయింట్ 2 ఉంటుంది.

అదే విధంగా సూర్యుడికి అవతలి పక్క లెగ్రాంజ్ పాయింట్ 3 ఉంటుంది. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ పేరు మీద వాటికి ఆ పేర్లు పెట్టారు.

ఈ రెండింటితో పాటుగా...ఈ రెండు ఖగోళ పదార్థాలకు బయటి వైపుగా ఒక సమబాహు త్రిభుజం గీస్తే, అందులో రెండు శీర్షాలలో మరో రెండు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. వాటినే L4, L5 అంటారు.

వీటిల్లో భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉండే ఒక శూన్య కక్ష్యలోకి ఆదిత్య L1ని ప్రవేశ పెట్టబోతున్నారు.

ఆదిత్య L1

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, సూర్యుడి పై పరిశోధనలకు లెగ్రాంజ్ పాయింట్లు కీలకం

లెగ్రాంజ్ పాయింట్లు ఎందుకంత కీలకం?

ఖగోళ పరిశోధనలు, ప్రయాణాల్లో ఈ లెగ్రాంజ్ పాయింట్లది కీలక పాత్ర. ముఖ్యంగా సూర్యుడిపై పరిశోధనలో ఈ పాయింట్లే కీలకం.

విశ్వంలో ప్రతి ఖగోళ వస్తువుకూ, అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటిలోనూ గురుత్వాకర్షణ ఉంటుంది. ఒక ఖగోళ వస్తువు గురుత్వాకర్షణ అందులోని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. అంటే సూర్యుడు, బృహస్పతి వంటి పెద్ద ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది.

భూమి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు వంటి చిన్న పాటి ఖగోళ పదార్థాలకు వాటికన్నా తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సౌర కుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99.86 శాతం ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిలోనే ఉంటుంది. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలన్నింటి ద్రవ్యరాశి మొత్తం 0.14 శాతమే ఉంటుంది.

సూర్యుడు భూమి కన్నా 3 లక్షల 33 వేల రెట్లు పెద్దగా ఉంటాడు. అంటే సూర్యుడిలో 13 లక్షల భూగ్రహాలను అమర్చవచ్చు. సూర్యుడు అంత భారీగా ఉంటాడు కాబట్టే భూమి గ్రావిటీ కన్నా సూర్యుడి గ్రావిటీ 27.9 రెట్లు ఎక్కువ ఉంటుంది.

కానీ చంద్రుడు భూమి కన్నా చిన్నగా ఉంటాడు కాబట్టి, అక్కడ గురుత్వాకర్షణ శక్తి భూ గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ సెకెన్‌కి 11.2 కిలోమీటర్ వేగంతో పైకి వెళ్లాలి. అదే సూర్యుడి గ్రావిటీ పరిధిని దాటి వెళ్లాలంటే... సెకన్‌కి 615 కిలోమీటర్ల వేగంతో పైకి వెళ్లాలి.

కాబట్టి ఈ రెండు గురుత్వాకర్షణలను బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా లెగ్రాంజ్ పాయింట్లలో ఆదిత్య L1 లాంటి ప్రోబ్‌లను ప్రవేశపెట్టి, సూర్యుడి మీద పరిశోధనలు చేస్తారు.

సూర్యుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యుడు

ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటే L1 దగ్గరకే ఎందుకు?

భూమికి, సూర్యుడికి మధ్య ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఇస్రో ఆదిత్య L1 ని లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గరికే పంపిస్తోంది. ఎందుకంటే ఇది భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో వందో వంతు దూరంలో భూమి వైపుగా ఉంటుంది. అంటే సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

L2 పాయింట్ భూమికి వెనుక ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లినా భూమి దానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి సూర్యుడి మీద పరిశోధనలు చేయడం కష్టం. L3 సూర్యుడి వెనుక ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం.

ఇక L4, L5లు కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి ఇస్రో L1 పాయింట్ దగ్గరకు తన అబ్జర్వేటర్‌ను పంపిస్తోంది. ఈ ఐదు పాయింట్లలోనూ L4, L5ల దగ్గర ఉండే ఖగోళ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. కానీ మిగిలిన మూడు పాయింట్ల దగ్గర ఉండే వస్తువులు అస్థిరంగా ఉంటాయి.

అంటే కాలంతో పాటు నెమ్మదిగా రెండింటిలో ఏదో ఒక ఖగోళపు గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. అందుకే వాటిలో అప్పుడప్పుడూ కాస్త ఇంధనాన్ని మండించి వాటి స్థానాన్ని సరి చేస్తూ ఉంటారు.

భూమికి, సూర్యుడికి మధ్య లెగ్రాంజ్ పాయింట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూమికి, సూర్యుడికి మధ్య లెగ్రాంజ్ పాయింట్లు

లెగ్రాంజ్ పాయింట్ 1 ప్రయోజనాలేంటి?

సూర్యుడి మీద పరిశోధనలకు భూమ్మీద చాలా చోట్ల సోలార్ అబ్జర్వేటర్లు ఉన్నాయి. కానీ భూమ్మీద ఉండే వాతావారణం కారణంగా పూర్తి స్థాయిలో సూర్యుడి గురించి పరిశోధనలు చేయడం వీటికి సాధ్యం కాదు. ముఖ్యంగా సూర్యుడి చుట్టూ ఉంటే కరోనా గురించి పరిశోధనలు చేయాలంటే...భూవాతావరణానికి అవతల ఉండాలి.

భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర ఉండే అబ్జర్వేటరీలు నేరుగా సూర్యుడిని ప్రతీక్షణం చూడగలుగుతాయి. వాటికి సూర్యుడికి మధ్య ఎలాంటి అడ్డంకీ ఉండదు.

సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌరతుపానులను ముందుగానే ఇవి గుర్తించగలుగుతాయి.

ఆదిత్య ఎల్1

ఫొటో సోర్స్, NSO/AURA/NSF

ఫొటో క్యాప్షన్, సోలార్ అబ్జర్వేటరీ

ఆదిత్య L1 వాటిని ఎలా గుర్తించగలుతుంది?

సూర్యుడి ఉపరితంలో ఉన్న కరోనాను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆదిత్య L1లో ఏడు రకాల పరికరాలు అమర్చారు. ఇందులో నాలుగు పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి.

మరో మూడు పరికరాలు లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి. ఈ ఏడు పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి.

సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్ , కరోనాలలో మార్పులను విశ్లేషిస్తాయి. వీటిలోని వేడిని, అక్కడ ఉండే ప్లాస్మాను, సూర్యుడి ఉపరితలం నుంచి పెల్లుబికే సోలార్ మాస్ ఎజెక్షన్లను, వాటి జ్వాలలను విశ్లేషిస్తాయి.

సూర్యుడి కరోనా స్థితిగతుల్ని, దాని హీటింగ్ మెకానిజం పరిశీలించడం, కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతలను పరిశీలించడం. కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనిమిక్స్, వాటి ప్రభావాలను, అవి ఉత్పత్తయ్యే అంశాలను పరిశీలించడం, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశీలించడం, సౌర పవనాలు పుట్టుక, వాటి గమనం, వాటి స్థితిగతుల్ని పరిశీలిస్తాయి.

ఇందుకోసం విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ అనే నాలుగు రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏర్పాటు చేసింది. ఇవి సూర్యుడి ఉపరితలాన్ని పరిశోధిస్తాయి.

వీటితో పాటు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్డ్స్ ట్రైయాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నటోమీటర్ పరికరాలు ఆదిత్య L1 ఉన్న స్థానిక పరిస్థితులను విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తాయి.

ఆదిత్య L1 ప్రోబ్‌లో పేలోడ్‌లు

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఆదిత్య L1 ప్రోబ్‌లో పేలోడ్‌లు

లెగ్రాంజ్ పాయింట్లు సూర్యుడికి భూమికి మాత్రమే ఉంటాయా?

ఈ లెగ్రాంజ్ పాయింట్లు ఒక్క భూమికి, సూర్యుడికే కాదు.. విశ్వంలో ఏ రెండు ఖగోళ పదార్థాల మధ్యనైనా ఉంటాయి. సౌరకుటుంబంలో భూమికి, సూర్యుడికి మధ్య ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉన్నట్లే అన్నిగ్రహాలకు సూర్యుడికి మధ్య కూడా ఈ లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.

సూర్యుడికి, బృహస్పతికి మధ్య ఉన్న L4, L5 పాయింట్లలో ఎన్నో ఆస్టరాయిడ్లు స్థిరంగా ఉన్నాయి. ఈ స్థానంలో ఆస్టరాయిడ్లు ఉన్నట్లు 1906లో తొలిసారిగా కనుగొన్నారు. 2022నాటికి ఇలాంటి 12వేలకు పైగా ఆస్టరాయిడ్లను కనుగొన్నారు. వీటిలో L4 పాయింట్ దగ్గర ఉన్న ఆస్టరాయిడ్లను ఇల్లియాడ్ ఆస్టరాయిడ్లు అని, L5 దగ్గర ఉన్న ఆస్టరాయిడ్లను ట్రోజన్ ఆస్టరాయిడ్లు అని అంటారు.

ఇక భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న L4 పాయింట్ దగ్గర రెండు ట్రోజన్ ఆస్టరాయిడ్లు కూడా ఉన్నాయి. ఇదే విధంగా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర చైనా తన చాంగీ ప్రోబ్‌ను ఉంచి చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తోంది.

అదే విధంగా భూమికి, సూర్యుడి ఉన్న లెగ్రాంజ్ పాయింట్ టూ దగ్గర యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన గయా టెలీస్కోప్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అమెరికా సంయుక్తంగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్‌లు ఉన్నాయి.

ఇవి లెగ్రాంజ్ పాయింట్ టూ.. అంటే భూమికి వెనుక వైపు ఉండటం వల్ల ఈ టెలీస్కోప్‌ల మీద సౌర పవనాలు పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. సూర్యుడు కిరణాలు ఈ టెలిస్కోప్ పై పడవు కాబట్టి, ఇది విశ్వాంతరాళలోకి సుదూరంగా తొంగి చూసేందుకు వీలుంటుంది.

అయితే లెగ్రాంజ్ పాయింట్ 1,2,3లో ఉండే శాటిలైట్లు, ఉప గ్రహాలు అస్థిరంగా ఉంటాయి. అందుకే ప్రతీ 21 రోజులకు ఒకసారి జేమ్స్ వెబ్ టెలీస్కోప్‌లో ఇంధనాన్ని మండించి, దాని స్థానాన్ని సరి చేస్తూ ఉంటారు.

సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన వాయేజర్ పార్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన పార్కర్ ప్రోబ్

సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లడం సాధ్యమవుతుందా?

సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే ఆ స్థితిలో ఏ పదార్థం కూడా మనుగడ సాగించలేదు. కానీ సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను పరిశీలించడానికి చాలా ప్రోబ్‌లు సూర్యుడికి దగ్గరగా వెళ్లాయి.

నాసా ప్రయోగించిన పార్కర్ అనే సోలార్ ప్రోబ్ మాత్రమే ఇప్పటి వరకూ సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన మావన నిర్మిత ప్రోబ్. 2018లో ప్రయోగించిన నాటి నుంచి 2023 జూన్ 27 వరకూ సూర్యుడి చుట్టూ 16 సార్లు విజయవంతంగా పరిభ్రమించినట్లు నాసా వెల్లడించింది.

సూర్యుడికి ఇంత దగ్గరగా ఉన్న ఈ పార్కర్ ప్రోబ్...సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వకుండా నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగేందుకు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ చేసుకుంటోంది.

అయితే 2023 జూన్ 22న సూర్యుడికి అత్యంత దగ్గరగా అంటే 5.3 మిలియన్ మైళ్ల దూరంలో గంటకు 3,64,610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వెళ్లింది. ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటి వరకూ సూర్యుడి కరోనా గురించిన విలువైన డేటాను నాసాకు అంద చేసింది.

ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య L1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు, సౌరతుపానులను అనునిత్యం కనిపెడుతూ ఉంటుంది.

వీడియో క్యాప్షన్, చంద్రుడి మీదకు చేపట్టబోయే తదుపరి మిషన్ల కోసం కొత్త రకం స్పేస్‌సూట్‌ తయారు చేసింది నాసా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)