చందమామ మట్టిలో మొక్కలు పెంచిన శాస్త్రవేత్తలు.. జాబిల్లి మీద నివాసం దిశగా ముందడుగు

చంద్రుడి మట్టిలో మొక్కలు

ఫొటో సోర్స్, UF/IFAS

ఫొటో క్యాప్షన్, చంద్రుడి మట్టిలో మొక్కలు పెరగటం (కుడివైపు) చూసి శాస్త్రవేత్తలు సంబరపడ్డారు అయితే ఆ మొక్కల పెరుగుదల నెమ్మదిగా ఉంది

చందమామ మీది నుంచి తెచ్చిన మట్టిలో శాస్త్రవేత్తలు తొలిసారిగా మొక్కలు పెంచారు. ఇది పెద్ద విజయంగా పరిశోధకులు భావిస్తున్నారు. చంద్రుడి మీద ఎక్కువ కాలం నివసించే దిశగా ఇది ముఖ్యమైన ముందడుగని చెప్తున్నారు.

1969-1972 మధ్య కాలంలో చంద్రుడి మీదకు వెళ్లి వచ్చిన అపోలో మిషన్ల సందర్భంగా జాబిల్లి మీద నుంచి మట్టి నమూనాలను సేకరించారు.

ఆ మట్టిలోని కొంత భాగంలో పరిశోధకులు ఒక విధమైన ఆకుకూరల గింజలు నాటారు. ఆ గింజల నుంచి రెండు రోజుల్లో మొలకలు రావటం చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు.

''మేం ఎంతగా దిగ్భ్రాంతి చెందామో వర్ణించి చెప్పలేం'' అని చెప్పారు అనా-లిసా పాల్. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఈ పరిశోధనకు సహ సారథ్యం వహించారు.

చంద్రుడి మట్టిలో మొక్కలు

ఫొటో సోర్స్, UF/IFAS

''చందమామ మట్టి నమూనాలో పెరిగిన మొక్కలు కానీ, నియంత్రిత పరిస్థితుల్లో పెరిగిన మొక్కలు కానీ.. ఆరో రోజు వరకూ ఒకే రకంగా కనిపించాయి'' అని చెప్పారామె.

ఆరో రోజు తర్వాత వీటి మధ్య తేడాలు కనిపించాయి. చంద్రుడి మట్టిలో పెరిగిన మొక్కలు ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపించాయి. వాటి పెరుగుదల నెమ్మదించి కురచబడ్డాయి.

అయితే.. ఈ పరిశోధన ఒక కీలక విజయమని ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

''భవిష్యత్తులో విశ్వంలోని సుదూర ప్రాంతాల్లో నివసిస్తూ పరిశోధనలు చేపట్టే అంతరిక్షయాత్రికుల కోసం.. చంద్రుడి మీద, అంగారకుడి మీద ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఆహార వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. నాసా దీర్ఘకాలిక విశ్వాన్వేషణ లక్ష్యాలకు ఈ పరిశోధన చాలా కీలకం'' అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ పేర్కొన్నారు.

చంద్రుడి మట్టి

ఫొటో సోర్స్, NASA/PA-MEDIA

ఫొటో క్యాప్షన్, నాసా అపోలో మిషన్ల ద్వారా చంద్రుడి మీద నుంచి మట్టి నమూనాలను తీసుకువచ్చింది

భూమి మీద కూడా ఆహార కొరత ఉండే ప్రాంతాల్లో అననుకూల పరిస్థితులను తట్టుకుని పెరిగే మొక్కలను అభివృద్ధి దిశగా సరికొత్త వ్యవసాయ ఆవిష్కరణలకు సైతం ఈ పరిశోధన తోడ్పడగలదని ఆయన చెప్పారు.

అయితే.. చంద్రుడి మట్టిలో మొక్కల పెంపకం మీద శాస్త్రవేత్తలు మరింత విస్తారంగా ప్రయోగాలు చేయటానికి చందమామ మట్టి ఎక్కువగా లేకపోవటం ఓ సవాలు.

నాసా వ్యోమగాములు 1969 నుంచి మూడేళ్ల కాలంలో చందమామ మీద నుంచి మట్టి, రాళ్లు, గులకరాళ్లు, ఇసుక, ధూళి తదితర శాంపిల్స్‌ను 382 కిలోలు తీసుకువచ్చారు.

దశాబ్దాల పాటు దాచిపెట్టి ఉంచిన ఈ నమూనాల నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఒక్కో మొక్కకు ఒక కిలో మట్టి చొప్పున మాత్రమే ఇచ్చారు.

1972 తర్వాత మళ్లీ మొదటిసారిగా 2025లో చంద్రుడి మీదకు మనుషులను పంపించటానికి నాసా ప్రణాళికలను రూపొందించింది.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)