చంద్రుడి రెండు ముఖాల మధ్య ఇంత తేడా ఎందుకుంది... మనకు కనిపించే మచ్చలకు ఏదో గ్రహశకలం ఢీకొనడమే కారణమా?

చంద్రుడు

ఫొటో సోర్స్, Brown University

ఫొటో క్యాప్షన్, చంద్రుడి ఈవలి ముఖం, ఆవలి ముఖం మధ్య అతి పెద్ద తేడాలకు రసాయన మిశ్రమాల కేంద్రీకరణకు సంబంధం ఉంది

చంద్రుడికి రెండు వేర్వేరు ముఖాలున్నాయని, ఆ ముఖాల మధ్య చాలా తేడా ఉందని 1950ల చివర్లో, 1960ల మొదట్లో సోవియట్ రష్యా, అమెరికా మూన్ మిషన్లు వెల్లడించాయి.

మనకు కనిపించే దగ్గరి ముఖాన్ని లూనార్ మారియా అని పిలుస్తుంటారు. దీని మీద పెద్ద పెద్ద నల్ల మచ్చలు కనిపిస్తుంటాయి. ఎన్నడో అక్కడ లావా సముద్రాలు ప్రవహించిన దానికి అవి చిహ్నాలు.

కానీ, చంద్రుడి మరోవైపు.. అంటే మనకు కనిపించే ముఖానికి వెనుకవైపు ముఖంలో ఈ లావా ప్రవాహ గుర్తులేవీ కనిపించవు.

ఈ తేడాకు కారణమేమిటనేది ఇప్పటివరకూ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.

ఈ పజిల్‌ను ఛేదించటానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనం ఒక వివరణ ఇస్తోంది: వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ మహా గ్రహ శకలం చంద్రుడిని ఢీకొని ఉండవచ్చునన్నదే ఆ వివరణ.

వీడియో క్యాప్షన్, ఆ ఉల్క భూమిని ఢీకొట్టకపోతే డైనోసార్లు ఇప్పటికీ ఉండేవా? మానవ జాతి ఉనికిలోకి వచ్చేదేనా?

రెండు భిన్న ముఖాలు

''చంద్రుడి మీద మనకు కనిపించే వైపుకు, కనిపించని అవతలి వైపుకు మధ్య గల అతిపెద్ద తేడాలకు.. ఈ చంద్ర ప్రాంతాల మీద రసాయనాల మిశ్రమానికి సంబంధం ఉంది'' అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ ఆండాలూసియాకు చెందిన ఖగోళభౌతిక శాస్త్రవేత్త జోస్ మారియా మాడియేడో బీబీసీ ముండోకు వివరించారు. చంద్రుడిని గ్రహశకలాలు ఢీకొనటం అనే అంశంలో నిపుణులైన జోస్ మారియా.. అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో పాలుపంచుకోలేదు.

''మనకు కనిపించే చంద్రుడి ముఖం మీద ఘనీభవించిన లావా ప్రాంతాలు చాలా విస్తారంగా, ఎక్కువగా ఉన్నాయి. వీటిని సముద్రాలు అని పిలుస్తున్నారు. అయితే చంద్రుడి ఆవలి వైపు ఈ సముద్రాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి'' అని చెప్పారామె.

అలాగే రసాయ మిశ్రమాల విషయంలో కూడా ఇప్పటివరకూ నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమాల ద్వారా చంద్రుడి మీద కొన్ని నిర్దిష్టమైన మూలకాల పరిమాణాల్లో చాలా తేడాలు ఉన్నట్లు కూడా గుర్తించారని ఆమె తెలిపారు.

''ఉదాహరణకు.. పొటాసియం, టైటానియం, థోరియం, ఫాస్ఫరస్ వంటి ఇతర రేర్-ఎర్త్ గ్రూప్ మూలకాలు.. మనకు కనిపించే చంద్రుడి ముఖం మీద ఎక్కువ మోతాదుల్లో ఉన్నాయి'' అని వివరించారు.

''దీనినంతటిని బట్టి.. చంద్రుడు రూపొందే క్రమంలో ఈ తేడాలు పుట్టటానికి కారణమైన ఏదో గొప్ప సంఘటనకు లోనై ఉంటాడని తెలుస్తోంది'' అని చెప్పారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, ఈ రంగులు చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర ఎత్తు పల్లాలను చూపుతున్నాయి. ఊదారంగు (9 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతు) నుంచి, ఆకుపచ్చ (సమాంతరం), పసుపుపచ్చ (చంద్రమట్టానికి 2 కిలోమీటర్లు ఎత్తు), నారింజ (4 కిలోమీటర్ల ఎత్తు), ఎరుపు (8.2 కిలోమీటర్ల ఎత్తు) వరకూ ఈ తేడాలను చూపుతాయి. పెద్దగా, ముదురు ఊదారంగు, నీలి రంగులో ఉన్న ప్రాంతం దాదాపు 2,500 కిలోమీటర్ల వ్యాసం, 12 కిలోమీటర్ల లోతు ఉన్న ఏట్కెన్ బేసిన్.

2,500 కిలోమీటర్ల కందకం

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ కొత్త అధ్యయనం.. సౌత్‌ పోల్-ఏట్కెన్ బేసిన్‌ ఏర్పడటానికి కారణమైన భారీ గ్రహశకలం ఢీకొనటం వల్ల చంద్రుడి రెండు ముఖాల మధ్య ఈ తేడాలు వచ్చాయని సూచిస్తోంది.

సౌత్ పోల్-ఏట్కెన్ బేసిన్ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న భారీ కందకమని జోస్ మారియా వివరించారు.

''దాదాపు 2,500 కిలోమీటర్ల వ్యాసం, 12 కిలోమీటర్ల లోతు ఉన్న ఈ కందకం.. సౌర వ్యవస్థలోని అన్ని పదార్థాల్లో కెల్లా - అంటే గ్రహాలు, ఉపగ్రహాలన్నిటిలోకెల్లా - గ్రహశకలపు ఘాతం వల్ల ఏర్పడిన అతి పెద్ద నిర్మాణం'' అని కందకం అని చెప్పారామె.

ఈ బేసిన్ చంద్రుడి మీద ఆవలివైపు ఉంటుందని, కాబట్టి అది మనకు భూమి మీద నుంచి కనిపించదని ఆమె వివరించారు.

''మన భూగ్రహం నుంచి ఈ బేసిన్ అంచు మాత్రమే కనిపిస్తుంది. ఆ కందకం అంచు 9 కిలోమీటర్ల ఎత్తైన పర్వత శ్రేణితో ఏర్పడింది'' అని తెలిపారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Matt Jones/ Brown University

ఫొటో క్యాప్షన్, ప్రాచీన కాలంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద తగిలిన ఓ భారీ ఘాతం.. చంద్రుడి అంతర్గత క్రమాన్ని మార్చిందని తాజా అధ్యయనం చెప్తోంది

లావా ప్రవాహాలు

సౌత్ పోల్-ఏట్కెన్ బేసిన్ ఏర్పడటానికి కారణమైన గ్రహశకలపు ఘాతం.. భారీ స్థాయి ఉష్ణ కెరటాన్ని రాజేసి ఉంటుందని, అది చంద్రుడి మీద వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆ ఉష్ణ కెరటం వ్యాపిస్తున్న క్రమంలో అనేక లవణాలను.. చంద్రుడి మీద మనకు కనిపించే వైపు తీసుకుని వచ్చి ఉంటుంది. ఉష్ణాన్ని సృష్టించే ఆ మూలకాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల అగ్నిపర్వత చర్య జరిగి.. చంద్రుడి దగ్గరి ముఖం మీద లావా ప్రవాహాలను పుట్టించి ఉంటాయి.

''సౌత్ పోల్-ఏట్కెన్ బేస్‌ వంటి భారీ కందకాన్ని ఏర్పాటు చేసిన భారీ గ్రహశకలపు ఘాతాలు భారీ స్థాయిలో ఉష్ణాన్ని పుట్టిస్తాయని మనకు తెలుసు'' అని ఈ అధ్యయన సారథి మాట్ జోన్స్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆయన రోడ్ ఐలండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో పోస్ట్‌డాక్టొరల్ స్టూడెంట్‌గా ఉన్నారు.

''ఆ వేడి చంద్రుడి అంతర్గత చలనాల మీద ఎలా ప్రభావం చూపుతుందనేది ప్రశ్న. సౌత్ పోల్-ఏట్కెన్ బేస్ ఏర్పడినప్పటి పరిస్థితుల్లో.. ఉష్ణాన్ని పుట్టించే మూలకాలు చంద్రుడి అభిముఖం మీదకు చేరి కుప్పగా పేరుకుంటాయనేది మేం చూపుతున్నాం'' అని ఆయన వివరించారు.

''దీని ఫలితంగా చంద్రుడి అంతర్గత పొరల్లో ఒకటైన మాంటిల్ కరిగి ఉత్పత్తి అయిన లావా.. మనకు చంద్రుడి ఉపరితలం మీద కనిపిస్తున్నట్లుగా ప్రవహించింది'' అని విశ్లేషించారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, 1959లో చంద్రుడి ఆవలి ముఖాన్ని తొలిసారి ఫొటో తీసిన సోవియట్ మిషన్ లూనా 3 ఇలస్ట్రేషన్

ఓ సర్ఫర్ లాగా...

''చంద్రుడిపై మనకు కనిపించే ముఖం మీద.. ప్రొసెల్లారం క్రీప్ టెర్రెయిన్ (పీకేటీ) అనే ఒక మూలక మిశ్రమ వైపరీత్యం ఉంది. అంటే పొటాసియం, రేర్-ఎర్త్ మూలకాలు, ఫాస్ఫరస్‌లతో పాటు.. వేడిని ఉత్పత్తి చేసే థోరియం వంటి మూలకాల కేంద్రీకరణం ఉంది'' అని మాట్ జోన్స్ తెలిపారు.

ఓ మహా ఘాతం వల్ల పుట్టుకొచ్చిన వేడి.. చంద్రుడి అంతర్గత క్రమాన్ని ఎలా మారుస్తుంది, అలా మారటం వల్ల చంద్రుడి మాంటిల్‌లోని క్రీప్ పదార్థాలు ఎలా స్థానచలనం అవుతాయి అనేదానిపై శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్లు నిర్వహించారు.

చంద్రుడి అంతర్గత నమూనాలు.. ఆ క్రీప్ పదార్థాలు ఉపరితలం కింద అటూఇటూగా సమానాంగానే పంపిణీ అవుతాయని సూచిస్తున్నాయి. కానీ, ఇలా సమానంగా జరిగే పంపిణీకి.. సౌత్ పోల్-ఏట్కెన్ ఘాతం వల్ల పుట్టే ఉష్ణ కెరటం అంతరాయం కలిగిస్తుందని ఈ కొత్త నమూనా చూపుతోంది.

''ఈ మోడల్ ప్రకారం.. ఎస్‌పీఏ ఘాతం నుంచి పుట్టిన ఉష్ణ కెరటం మీద క్రీప్ పదార్థాలు సర్ఫర్‌లాగా స్వారీ చేస్తూ వెళ్లి ఉంటాయి'' అని బ్రౌన్ యూనివర్సిటీ ప్రకటన వివరించింది.

ఈ ఉష్ణ కెరటం చంద్రుడి పైపొర కిందికి విస్తరించటంతో.. ఆ పదార్థం మనకు కనిపించే చంద్రుడి ముఖంవైపు బయటకు వచ్చింది.

చంద్రుడికి సంబంధించిన అతి పెద్ద రహస్యాల్లో ఒక మిస్టరీకి ఈ అధ్యయనం విశ్వనీయమైన వివరణను ఇస్తోందని పరిశోధకులు అంటున్నారు.

''పీకేటీ ఎలా ఏర్పడిందనేది చంద్ర శాస్త్రంలో అతి పెద్ద ప్రశ్న. చంద్రుడి చరిత్రలో అతి పెద్ద సంఘటనల్లో సౌత్ పోల్-ఏట్కెన్ ఘాతం ఒకటి. ఈ అధ్యయనం ఆ రెండు అంశాలను ఒక దగ్గరకు చేరుస్తుంది. మా ఫలితాలు నిజంగా ఉత్తేజకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నా'' అని జోన్స్ పేర్కొన్నారు.

బ్రౌన్ యూనివర్సిటీతో పాటు.. ప్రూడ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆరిజోనాలోని లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ లేబరేటరీ, నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)