అపోలో-11 కన్నా పదేళ్ళ ముందే చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపిన రష్యా... ఆ తరువాత ఎలా వెనుకబడింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండో డువార్టే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోవియట్ యూనియన్ అధినేత నికితా క్రుశ్చేవ్ 15 సెప్టెంబర్ 1959లో అమెరికాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడు హైసన్‌హోవర్‌కు సోవియట్ యూనియన్ చిహ్నాన్ని చెక్కిన ఒక గోళాకార వస్తువును బహుకరించారు.
ఇంతకీ ఆ వస్తువు ఏంటో తెలుసా? చంద్రుని ఉపరితలంలోకి రష్యా పంపిన లూనా 2 రాకెట్‌కు సంబంధించిన నమూనా అది.
1969లో అపోలో వాహకనౌక ద్వారా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారి మానవులను చంద్రుని పైకి పంపడానికంటే ముందే చంద్రుడిపై ప్రయోగాలలో మూడుసార్లు రష్యా విజయాన్ని సాధించింది.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్ష పరిశోధనల్లో పోటాపోటీ
చంద్రుని చెంతకు చేరడంతో పాటు అంతరిక్ష పరిశోధనల్లోనూ సోవియట్ యూనియన్ ముందునిలిచింది. 1957లో ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను అంతరిక్షంలోకి పంపి అమెరికాకు సవాల్ విసిరారు.
1966లో లునా-9 రాకెట్‌ను చంద్రుని పైకి పంపి అక్కడి ఉపరితలానికి సంబంధించిన ఫొటోలను తొలిసారిగా ప్రపంచానికి అందించింది.
మరో రెండు నెలల తర్వాత చంద్రుని కక్ష్యలోకి వెళ్లిన తొలి వాహకనౌకగా రష్యాకు చెందిన లునా 10 నిలిచింది.
ఈ ప్రయోగం వల్ల చంద్రుడి నైసర్గిక స్వరూపం అధ్యయనం చేసేందుకు వీలుకలిగింది.

ఫొటో సోర్స్, NASA
ల్యూనార్ ఆర్బిట్ రాండెవూ
1961లో నాసా ఇంజినీర్ జాన్ హౌబోల్ట్ 'ల్యూనార్ ఆర్బిట్ రాండెవూ' ప్రతిపాదన చేశాడు. దీని ప్రకారం వ్యోమనౌక మొదట చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. అక్కడి నుంచి నౌకలోని చిన్న రాకెట్ విడిపోయి చంద్రుని మీద దిగుతుంది.
ల్యూనార్ ఆర్బిట్ రెండెజౌస్(ఎల్‌వోఆర్) వల్ల చంద్రుడి పైకి వెళ్లే సమయం, ఇంధనం ఆదా అవుతుందని, మిషన్ అభివృద్ది, పరీక్షలు, నిర్మాణ ప్రక్రియ, ఫ్లయిట్ ఆపరేషన్స్ చాలా వరకు తగ్గుతాయని హౌబోల్ట్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన వల్లే అమెరికా చంద్రుని పైకి మానవులను రష్యా కంటే ముందుగానే పంపగలిగింది. కానీ, 1966 వరకు కూడా రష్యానే ముందుగా ఈ పని చేస్తుందని భావించారు. ఎందుకంటే, అప్పటికే రష్యా చంద్రుని మీద పరిశోధనల్లో ముందు నిలిచింది.

ఫొటో సోర్స్, NASA
లూనా 2
గోళాకార అంతరిక్ష వాహకనౌకను 12 సెప్టెంబర్ 1959లో రష్యా ప్రయోగించింది. ఈ ప్రయోగం చాలా రహస్యంగా ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలు బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త బెర్నార్డ్ లోవెల్‌కి మాత్రమే తెలియజేశారు.
రష్యా అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయినట్లు లోవెల్ ద్వారానే ప్రపంచానికి తెలిసింది.
14 సెప్టెంబర్ 1959న అర్ధరాత్రి (మాస్కో సమయం) తర్వాత లూనా 2 చంద్రుని ఉపరితలంపైకి 12,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
ఈ ప్రయోగంతో అమెరికా, రష్యాల మధ్య అంతరిక్ష పోటీ బాగా పెరిగింది.
చంద్రునిపై చెప్పుకోదగ్గ అయస్కాంత క్షేత్రం లేదని, రేడియేషన్ బెల్ట్‌కు సంబంధించిన రుజువులు కూడా లేవని ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది.
''ఈ ప్రయోగం చంద్రుని భూగర్భానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను శాస్త్రవేత్తలకు అందించింది'' అని ఖగోళ శాస్త్రవేత్త లిబ్బీ జాక్సన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Kansas Cosmosphere
లూనా-9
ఏడేళ్ల తర్వాత ప్రయోగించిన లూనా-9 వాస్తవానికి అపోలో కార్యక్రమానికి బాగా ఉపకరించింది. ఈ రాకెట్ ప్రయోగాని కంటే ముందు చంద్రుని ఉపరితలం సున్నితంగా ఉంటుందని, దీని వల్ల వాహకనౌక చంద్రుడిపై దిగితే కూరుకుపోతుందని అమెరికా, రష్యా శాస్త్రవేత్తలు భావించారు. కానీ, ఈ భావన తప్పని లూనా-9 ప్రయోగం నిరూపించింది.
''చంద్రునిపై ప్రయోగాల్లో ఇది అద్భుతమైన ఘట్టం. భవిష్యత్తు ప్రయోగాలకు ఇది చాలా సహాపడింది'' అని లూనా 9 ప్రయోగం గురించి జాక్సన్ తెలిపారు.
లూనా-10
లూనా-10 ప్రయోగం అమెరికన్లపై సోవియట్లు చేసిన చేసిన ప్రచార విజయం.
''భౌగోళిక రాజకీయాలు అంతరిక్ష పోటీని నడిపించాయని మనం గుర్తుంచుకోవాలి'' అని లిబ్బీ జాక్సన్ అన్నారు.
లూనా-10 ప్రయోగం వల్ల చంద్రుడిపై ఉన్న మట్టి మిశ్రమాలు, మైక్రోమీటోరాయిడ్ల గురించి ప్రపంచానికి తెలిసింది.
''1961లో అంతరిక్షంలోకి మానవుడ్ని పంపడం, 1965లో అంతరిక్షంలో రష్యన్‌ను నడిపించడం, వరసగా రాకెట్లను ప్రయోగించడంతో ఇక అంతరిక్ష పోటీలో తామే ముందుంటామని సోవియట్ యూనియన్ భావించింది'' అని ఖగోళ చరిత్రకారుడు అసిఫ్ సిద్ధిఖీ పేర్కొన్నారు.
''చంద్రునిపై తమ కంటే ముందు అమెరికా మనుషులను పంపుతుంది అని రష్యా ఊహించలేదు'' అని ఆయన తెలిపారు.
1968లో అమెరికా అపోలో-8 మిషన్‌తో రష్యాను దెబ్బతీసింది. ఈ వ్యోమనౌక చంద్రుని మొదటిసారిగా ముగ్గురు వ్యోమగాములతో చంద్రుని వద్దకు వెళ్ళి, దాని కక్ష్యలో పరిభ్రమించి క్షేమంగా తిరిగి వచ్చింది. మరో ఏడాది తర్వాత అపోలో 11 చంద్రుని మీదకు మనుషుల్ని తీసుకువెళ్ళి దింపింది.
అంతరిక్షంలో అప్పటి వరకు ఎన్నో తొలి విజయాలు నమోదు చేసిన రష్యా, అమెరికా ప్రయోగించిన అపోలో 8కు మాత్రం జవాబు ఇవ్వలేకపోయింది.
సోవియట్ యూనియన్‌లో నెలకొన్ని బ్యూరాక్రసీ, అధికార పోరాటాలు, కేంద్రీకరణ పాలన చంద్రుడిపై మానవసహిత యాత్రను తాత్సారం చేశాయి.

ఫొటో సోర్స్, NASA
అంతా రహస్యమే
'1964 వరకు చంద్రుడిపైకి మానవుడిని పంపాలని సోవియట్ యూనియన్ సీరియస్‌గా ఆలోచించలేదు' అని
'చాలెంజ్ టు అపోలో: ది సోవియట్ యూనియన్ అండ్ స్పేస్ రేస్ 1945-1974' పుస్తకంలో అసిఫ్ సిద్ధిఖీ పేర్కొన్నారు.
''సోవియట్ అంతరిక్ష కార్యక్రమాలు చాలా రహస్యంగా సాగేవి. అందువల్లే స్పేస్ వాక్ అప్పుడో అద్భుతంగా ప్రపంచానికి తోచింది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చివరి ప్రయత్నం
అపోలో 11ను అమెరికా చంద్రుడిపైకి పంపడానికి మూడు రోజుల ముందు అంటే 13 జులై 1969న రష్యా లూనా 15ను అంతరిక్షంలోకి పంపింది. ఇది నాలుగు రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది.
అపోలో ప్రయోగానికి 72 గంటల ముందే చంద్రుడికి అతి సమీపంలోకి వచ్చింది. కానీ, చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిపోయింది.
''భూగ్రహం మీద అందరింకటే మేమే ముందున్నామని విశ్వసించాం. చంద్రుడిపై మానవసహిత యాత్రలోనూ అమెరికా కంటే ముందే ఉంటామని అనుకున్నాం. కానీ, మేం కోరుకున్నది ఒకటి..అయినది మరొకటి'' అని సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో కీలకంగా పని చేసిన వస్సిల్లీ మిషిన్ 1999లో అమెరికా టీవీ నెట్‌వర్క్ పీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాత్వికంగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చారు.. భారత్‌లో బాద్‌షాలయ్యారు
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








