అర్ధరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళగర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్
నిద్ర అలవాట్లను కొద్దిగా మార్చుకోవటం ద్వారా మనుషుల జీవ గడియారాలను అనుకూలంగా మలచుకోవచ్చునని, తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని బ్రిటన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అర్థరాత్రి దాటాక కూడా మెలకువగా ఉండే ‘‘నిశాచరుల’’ శరీరాల మీద వీరు తమ పరిశోధన కేంద్రీకరించారు.
నిద్రపోయే సమయం నిరంతరం ఒకేలా ఉండేలా చూసుకోవటం, కెఫీన్‌ను పరిహరించటం, ఉదయపు సూర్యరశ్మిని ఎక్కువగా పొందటం వంటి కిటుకులు ఇందులో ఉన్నాయి.
ఇది మామూలు విషయంగానే కనిపించవచ్చు గానీ.. మనుషుల జీవితాల్లో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురాగలదని పరిశోధకులు అంటున్నారు.
ప్రతి ఒక్కరి శరీరానికీ ఒక జీవ గడియారం ఉంటుంది. అది సూర్యుడి ఉదయాస్తమయాలకు అనుగుణంగా నడుస్తుంటుంది. అందుకే మనం రాత్రి పూట నిద్రపోతాం.
కానీ కొందరి జీవ గడియారాలు చాలా ఆలస్యంగా నడుస్తుంటాయి.
ఉదయంతో నడిచే మనుషులు చాలా త్వరగా నిద్ర నుంచి మేల్కొంటుంటారు. కానీ సాయంత్రానికి వీరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
నిశాచరులు దీనికి పూర్తిగా వ్యతిరేకం. సాయంత్రం అలా మెలకువగానే కూర్చుంటానికి ఇష్టపడతారు. అర్థరాత్రి పొద్దుపోయాక నిద్రకు ఉపక్రమిస్తుంటారు.
అయితే.. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పగటి పూట నడిచే ప్రపంచంతో ఇమడటం వీరికి పెద్ద సమస్య.
నిద్ర పట్టిన కొన్ని గంటలకే అలారం పెట్టుకుని లేవాల్సి వస్తుంది. కానీ అందుకు వీరి శరీరం సిద్ధంగా ఉండదు.
ఇటువంటి నిశాచరులకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి.


ఇటువంటి ‘తీవ్ర నిశాచరులు’ 21 మందిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీరు అర్థరాత్రి దాటాక సగటున 2:30 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం 10:00 గంటలకు మేల్కొంటారు.
వీరికి కొన్ని సూచనలు చేశారు. అవేమిటంటే:
- మామూలుగా మేల్కొనే సమయం కన్నా 2-3 గంటలు ముందు లేవాలి. ఉదయపు సూర్యరశ్మిని ఎక్కువగా పొందాలి
- సాధ్యమైనంత త్వరగా ఉదయపు అల్పాహారం తీసుకోవాలి
- ఉదయం పూట మాత్రమే వ్యాయామం చేయాలి
- ప్రతి రోజూ ఒకే సమయంలో మధ్యాహ్న భోజనం చేయాలి. సాయంత్రం 7:00 గంటల తర్వాత ఏమీ తినరాదు
- మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత కెఫీన్‌ను నిషేధించాలి
- మధ్యాహ్నం 4:00 గంటల తర్వాత కునుకు తీయరాదు
- మామూలు కన్నా 2-3 గంటలు ముందుగా నిద్రకు ఉపక్రమించాలి, సాయంత్రం ఎక్కువ వెలుతురు లేకుండా చూడాలి
- ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించటం, మేల్కోవటం కొనసాగించాలి
ఇలా మూడు వారాలు చేసిన తర్వాత వీరి జీవ గడియారం విజయవంతంగా రెండు గంటలు ముందుకు జరిగింది. వీరు నిద్రపోయే సమయం ఏమాత్రం తగ్గలేదు.
యూనివర్సిటీ ఆఫ్ బర్మింగామ్, యూనివర్సిటీ ఆఫ్ సర్రీ, మోనాష్ యూనివర్సిటీ అధ్యయన ఫలితాలను స్లీప్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
వీరికి మగతగా ఉండటం, ఒత్తిడిగా అనిపించటం, కుంగుబాటు తగ్గిపోయింది. వీరి ప్రతిస్పందన సమయాలు కూడా మెరుగయ్యాయని పరీక్షలు నిర్ధారించాయి.
‘‘చిన్నపాటి దినచర్యలను అలవరచుకోవటం ద్వారా నిశాచరులు తమ శరీర జీవగడియారాలను సరిచేసుకుని.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు’’ అని యూనివర్సిటీ ఆఫ్ సర్రీ ప్రొఫెసర్ డెబ్రా స్కీన్ పేర్కొన్నారు.
‘‘తగినంత నిద్ర లేకపోవటం, జీవగడియారం సక్రమంగా లేకపోవటం వల్ల.. చాలా శరీర ప్రక్రియలకు అవాంతరాలు రాగలవు. దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం వంటి జబ్బుల ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడి గమనంతో మన శరీరాన్ని జతకలిసేలా చేసే ప్రధానాంశాల్లో వెలుతురు ఒకటి. కాబట్టి మన శరీరాన్ని పగటి పూట ఎక్కువగా వెలుతురులో ఉంచాలని, రాత్రిపూట తక్కువగా ఉంచాలని సూచిస్తున్నారు.
నిద్రపోయే, మేల్కొనే సమయాలు తరచుగా మారుతుండటం కూడా మన శరీర అంతర్గత గడియారాన్ని గజిబిజిగా మారుస్తుంది.
దీనిని సరిచేయటానికి సూచిస్తున్న కిటుకులు.. మంచి నిద్ర కోసం ఇచ్చే సలహాలుగా కనిపించవచ్చు కానీ వీటిలో ప్రతి ఒక్కటీ శరీర జీవ గడియారానికి శిక్షణనివ్వటానికి దోహదపడతాయి.
అయితే.. ఎంత ప్రయత్నించినా కానీ తెల్లవారే వరకూ మెలకువగా ఉండేలా శరీర గడియారం మారిపోయిన వారు కొత్త అలవాట్లకు ప్రతిస్పందిస్తారా అన్నది పరిశోధకులకు తెలియలేదు.
‘‘ఇలాంటి తీవ్ర నిశాచరుల విషయంలో ఏమైనా చేయగలమా అన్నది ఇంకా తెలీదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగామ్ పరిశోధకుడు డాక్టర్ ఆండ్రూ బాగ్షా బీబీసీతో పేర్కొన్నారు.
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ఈ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత
- పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?
- నిద్రలో వచ్చే కలలు ఎందుకు గుర్తుండవు? గుర్తుండాలంటే ఏం చేయాలి...
- నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
- కష్టమైన ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









