కలలు గుర్తుండాలంటే ఏం చేయాలి?

నా చిన్నప్పటి ప్రైమరీ స్కూల్ ముందు నిల్చుని ఉన్నాను నేను. ముఖ ద్వారం దగ్గర, టీచర్ల కార్ పార్కింగ్ దగ్గర నిల్చున్నా. ఎండ ప్రకాశంగా ఉంది. నా చుట్టూ నా క్లాస్‌మేట్స్ ఉన్నారు. వంద మందికి పైగా ఉన్నారు.
నా టీచర్లు కొంతమంది కూడా దగ్గర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది. కానీ నా దృష్టి ఇద్దరు పెద్దవాళ్ల మీద ఉంది. వాళ్లిద్దర్లో ఎవరినీ నేను గుర్తుపట్టలేదు. ఆ పురుషుడి జుట్టు నిగనిగా మెరుస్తోంది. అతడు ధరించిన చలువ కళ్లద్దాలు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి.
అతడి చేతిలో ఏదే వస్తువు ఉంది. దాని నుంచి చెవులు చిల్లులుపడే కేక వెలువడుతోంది. నేను చేతులతో చెవులు మూసుకుని మోకాళ్ల మీద కూలబడ్డాను. నా స్కూల్‌మేట్స్ అందరూ అలాగే చేస్తున్నారు. ఆ వ్యక్తి వెర్రిగా నవ్వుతున్నాడు.
దాదాపు 40 ఏళ్ళ కిందట వచ్చిన కల ఇది. ఇది నిన్న రాత్రే వచ్చిందా అన్నంత సవివరంగా నాకు గుర్తుంది. కానీ, ఈ వారంలో నాకు వచ్చిన కలల గురించి నన్ను అడిగితే నేను తెల్లమొహం వేయాల్సిందే. నేను కలలు కంటున్నట్లయితే - నాకు కలలు వచ్చే అవకాశం చాలా ఉందని జీవశాస్త్రం చెప్తోంది - నా చేతనావస్థలో గుర్తుండిపోయే కలలేవీ రాలేదు.
మనలో చాలా మందికి కలలు అనేవి దాదాపు నిత్యం వస్తుంటాయి. మనకు అదృష్టం ఉంటే.. తెల్లవారాక చాలావరకూ గుర్తుండవు. పాత కలలను అద్భుతమైన రీతిలో సవివరంగా గుర్తుంచుకోగలిగే వాళ్లకి కూడా.. కొన్నిసార్లు రాత్రి ఏ కల వచ్చిందో ఏమీ తెలియకుండా నిద్రలేస్తుంటారు.
ఇలా ఎందుకు జరుగుతుందనే కారణాలు నిగూఢమైనవేమీ కాదు. మనకు కలలు ఎందుకు వస్తాయి, వాటిని మనం గుర్తుంచుకోగలమా అనే దాని మూలాలు మన నిద్రావస్థ శరీరాల జీవశాస్త్రంలో, మన అచేతన మస్తిష్కంలో ఉన్నాయి.
నిద్ర అనేది మనం ఒకప్పుడు భావించినదానికన్నా చాలా సంక్లిష్టమైనది. మన చేతన మస్తిష్కం.. నిద్ర కొసకు వేలాడుతూ లోపలికీ, బయటికీ ఊగిసలాడటం కాదు.. మన మస్తిష్కం అనేక రకాల మానసిక పరిస్థితుల్లో రోలర్ కోస్టర్‌లా మలుపులు, ఎగుడుదిగుళ్లలో ప్రయాణిస్తుంటుంది. అందులో కొన్ని భాగాలు మానసిక కార్యకలాపాలతో నిండి ఉంటాయి.
కలలు కనటానికి - ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (రెమ్) అనే నిద్రావస్థతో ప్రధానంగా ముడిపడి ఉంది. ఈ నిద్రావస్థలో కొన్నిసార్లు మనం వేకువగా ఉన్నట్లే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. శ్వాస తీసుకోవటం, రక్తప్రసరణలో మార్పులు జరుగుతాయి. శరీరం అటోనియా అనే అచేతనావస్థలోకి వెళుతుంది. నిద్రపోయేటపుడు 90 నిమిషాల తరంగాల్లో ఇది జరుగుతుంది. ఈ దశలోనే మన మస్తిష్కాలు కలలు కంటుంటాయి.
ఈ రెమ్ స్థితిలో మన మెదడులోని కీలక ప్రాంతాలకు రక్త ప్రవాహం అధికంగా ఉంటుంది. మన కలలను తన కంటెంట్‌తో నింపేది కోర్టెక్స్. మన భావోద్వేగ స్థితిని పర్యవేక్షించేది లింబిక్ సిస్టమ్. ఈ రెండు ప్రాంతాలకూ రెమ్ నిద్రావస్థలో మామూలు కన్నా అధికంగా రక్తం ప్రవహిస్తుంది.

కలలకు అనుకూలంగా ఉండే రెమ్ నిద్రావస్థలో ఉన్నపుడు, ఇవి రెండూ తీవ్రమైన విద్యుత్ కార్యకలాపాలతో చెలరేగుతాయి. అయితే, మన భావోద్వేగాలను, నిర్ణయాత్మక శక్తిని, లైంగికతను నియంత్రించే మెదడులోని ముందు భాగం (ఫ్రంటల్ లోబ్స్) నిశ్చలంగా ఉంటుంది.
అంటే, తరచుగా అర్థంపర్థంలేని ఈ కథనాల్లో జరుగుతున్న పరిణామాలను మనం మేల్కొనే సమయం వచ్చేవరకూ గుడ్డిగా అంగీకరిస్తుంటాం.
సమస్య ఏమిటంటే, ఆ దృశ్యాలు ఎంత గందరగోళంగా ఉంటే... వాటిని అంటిపెట్టుకుని ఉండటం మనకు అంత కష్టమవుతుంది. కలలకు ఎంత ఎక్కువ స్పష్టమైన నిర్మాణం ఉంటే వాటిని గుర్తు పెట్టుకోవటం అంత సులభమని సైకాలజీ ప్రొఫెసర్ దీద్రే బారెట్ చెప్పారు.
అయితే, అటువంటి కలల దృశ్యాలు గుర్తుండిపోయేలా చేయటంలో కీలకమైన పని చేసే రసాయన పదార్థం ఒకటి ఉంది. అదే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేసే హార్మోన్ ఇది. గాఢ నిద్రలో ఉన్నపుడు సహజంగానే ఈ హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుంది.
మన నిద్రావస్థ, జాగరూకత స్థితులకు విస్పష్ట నిర్వచనాలు ఉన్నాయని, అది యాధృచ్ఛికం కాదని లాసాన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో నిద్ర పరిధోకురాలు డాక్టర్ ఫ్రాన్సెస్కా సిక్లారీ చెప్పారు. ''మన కలల జీవితం, మెలకువ జీవితం పూర్తిగా భిన్నంగా ఉండటం ఒక మంచి విషయం కావచ్చు'' అని ఆమె అంటారు.
''మనం మెలకువలో ఉన్నప్పటి విషయాలు గుర్తున్నట్లు గానే కలలకు సంబంధించి అన్ని వివరాలూ గుర్తున్నట్లయితే, మన నిజ జీవితంలో వాస్తవంగా ఏం జరుగుతోందనే గందరగోళంలో పడిపోతామని నేను అనుకుంటున్నా'' అని పేర్కొన్నారు.
నిద్ర లోపాలతో బాధపడే వారు తమ మెలకువ జీవితానికి, నిద్ర జీవితాలకు మధ్య తేడాలను చెప్పటం కష్టమవుతుందని, దీనివల్ల వారు అయోమయానికి, ఇబ్బందికర పరిస్థితులకు గురవుతుంటారని డాక్టర్ ఫ్రాన్సెస్కా చెప్పారు.
అంతేకాదు, ''రాత్రి వచ్చిన కలలను చాలా బాగా గుర్తుంచోగలిగే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లు ఆ జ్ఞాపకాలను తమ పగటి జీవితంలోకి ఎగుమతి చేస్తుంటారు'' అని తెలిపారు.
ఇక మనకు బాగా గుర్తుండిపోయే కలలు మన నిద్రా చక్రంలో, మన నిద్రావస్థ శరీరాల్లో ప్రవహించే రసాయనాలతో ప్రభావితమయ్యే నిర్దిష్ట కాలంలో వస్తుంటాయి.
''సాధారణంగా రెమ్ నిద్రలో మనకు చాలా స్పష్టంగా ఉండే కలలు వస్తుంటాయి. ఆ సమయంలో మన మెదడులో నోరాడ్రినలిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి'' అని డాక్టర్ ఫ్రాన్సెస్కో చెప్పారు.

''కొంతమంది తమ కలలను ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నామని నన్ను అడుగుతుంటారు. వాళ్లు త్వరగా నిద్రలోకి జారుతారని, చాలా మంచిగా నిద్రపోతారని, అలారమ్ మోతతో మెలకువలోకి వస్తారని, అందుకే వాళ్లకి కలలు గుర్తుండవని నేను చెప్తుంటాను. ఈ విషయం మీకు ఎలా తెలుసు? అని వాళ్లు అడుగుతారు'' అని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో కలలపై పరిశోధన చేస్తున్న రాబర్ట్ స్టిక్‌గోల్డ్ తెలిపారు.
చాలా మందికి నిద్ర ప్రారంభమయ్యే దశలో వచ్చిన కలలు గుర్తుంటాయని ఆయన చెప్పారు. ఆ వ్యక్తులు నిద్రలోకి వెళ్తూ బయటకు వస్తూ ఉండే ఆ దశలో మస్తిష్కం అటూ ఇటూ వెళ్ళడం మొదలవుతుందని, అప్పుడు కలలాంటి దృశ్యాలు సంభవిస్తాయని వివరించారు. ఈ ప్రక్రియనే 'హిప్నోగోగిక్ డ్రీమింగ్' అని పిలుస్తారు.
''మనం నిద్రలోకి జారిన మొదటి ఐదు, పది నిమిషాలు ఈ దశ ఉంటుంది. ఒకవేళ వేగంగా నిద్రలోకి జారిపోయినట్లయితే, మన నిద్రా చక్రంలోని ఈ దశలో జరిగేదేదీ మనకు గుర్తుండదు'' అని ఆయన పేర్కొన్నారు.
మరి మన కలలను గుర్తుంచుకోవాలంటే ఎలా? ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి నిద్ర భిన్నంగా ఉంటుంది. అయితే, కలలను గుర్తుపెట్టుకోవటానికి సాయం చేయగల కొన్ని సాధారణ చిట్కాలున్నాయి.
''మనం మొదట నిద్రలేచినప్పుడు కలల జ్ఞాపకాలు చాలా సున్నితంగా ఉంటాయి. నిద్రలేచీ లేవగానే రోజువారీ కార్యకలాపాల్లోకి దూకేసే వారికి కలలు గుర్తుండవు. శనివారం, ఆదివారం ఉదయం వరకూ నిద్రపోయే సమయం... కలలను గుర్తుంచుకోవటానికి అద్భుత సమయం'' అంటారు రాబర్ట్.
''నిద్ర లేచినపుడు, కదలకుండా పడుకునే ఉండటానికి ప్రయత్నం చేయండి. కనీసం కళ్లు కూడా తెరవవద్దు. అలా తేలిపోయే ప్రయత్నం చేయండి. కలల్లో ఏముందో గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అంటే, మీరు మెలకువ స్థితిలోకి వస్తూ మీ కలలను సమీక్షించటానికి ప్రయత్నిస్తున్నారన్న మాట. అలా చేసినపుడు ఇతర జ్ఞాపకాల్లాగానే కలలు కూడా గుర్తుంటాయి'' అని ఆయన వివరించారు.
కలలను గుర్తుంచుకోవటానికి మరికొన్ని చిట్కాలు ఉన్నాయి.
''నిద్రపోయే ముందు మూడు పెద్ద గ్లాసుల నీళ్లు తాగండి. మూడు గ్లాసుల బీరు తాగటం కాదు. ఎందుకంటే రెమ్ నిద్రను మద్యం అణచివేస్తుంది. నీళ్లు తాగితే రాత్రిపూట మూడు నాలుగు సార్లు మెలకువ వస్తుంది. అది కూడా ఒక రెమ్ నిద్ర సైకిల్ ముగిసే సమయానికి మెలకువ వస్తుంటుంది'' అని తెలిపారు రాబర్ట్.
పరిశోధకులు చెప్తున్న మరొక చిట్కా ఏమిటంటే, నిద్రపోయే సమయంలో 'నేను కలలను గుర్తు పెట్టుకోవాలి' అని పదే పదే మీకు మీరు చెప్పుకోవటం. ఇది నిజంగా పనిచేస్తుందని రాబర్ట్ నవ్వుతూ చెప్పారు.
(ఈ కథనంలో... అర్జెంటీనాలో జన్మించి స్పెయిన్‌లో పనిచేస్తున్న విజువల్ ఆర్టిస్ట్ ఇమాన్యుయెల్ లాఫాంట్ కళాఖండాలు ఉన్నాయి. ఆయన వెబ్‌సైట్ www.emmanuellafont.com.)
ఇవి కూడా చదవండి:
- ప్రేమలేఖ: ‘ఇలాంటి ఓ ప్రేమ, ఇలాంటి ఓ ముద్దు, ఇలాంటి ఆలింగనం ఒక్కటైనా... ఒక్కసారైన వుండాలి’
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- పసిబిడ్డను సజీవ సమాధి చేసిన తల్లి.. మట్టిని తవ్వి బిడ్డను కాపాడిన శునకం
- బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









