స్వప్న సాక్షాత్కారం: నిద్రలో కలలకు వలవేసి పట్టుకునే పరికరం ఇదిగో..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ఆడం హార్ హోరోవిట్జ్ ఒక సదస్సులో తామర పుష్పం వస్త్రధారణతో వేదిక మీదకు ఎక్కినప్పుడు.. అతడిని చూసిన వారికి ఏమీ అర్థంకాలేదు.
ఆపైన అతడు కంప్యూటర్లను కొడుతూ వింత శబ్దాలు చేస్తూ ఉంటే అందరూ నోరెళ్లబెట్టారు.
అతడు ఇటీవల తనకు వచ్చిన ఒక కలను ప్రదర్శించి చూపుతున్నాడు. ఎందుకంటే.. రాత్రి నిద్రలో వచ్చే కలలు మెలకువలోని మన జీవితం మీద ఎలా ప్రభావం చూపగలవు? వాటిని అందుకోవటానికి టెక్నాలజీ ఎలా సాయం చేయగలదు అనేది వివరించటానికి.
ఇది హోరోవిట్జ్‌కి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ‘‘కలల లోకం చాలా చిత్రమైనది. అస్పష్టమైనది. మనం అందుకోలేనిది. కలల్లో కవిత్వముంటుంది. ఉపమానముంటుంది. సాదృశ్యముంటుంది’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మీడియా ల్యాబ్‌లో బీబీసీ ఆయనను కలిసింది.

ఫొటో సోర్స్, MEDIA LAB, MIT
ఆ పరికరం ఏంటి? ఎలా పనిచేస్తుంది?
‘‘మన సొంత స్మృతిలో ఉన్న ఆ కవితాత్మక రూపకాత్మక కోణాన్ని అందుకోవటానికి ఒక ఖచ్చితమైన టెక్నాలజీ సాయం చేయగలదన్న ఆలోచన చాలా ఉద్వేగంగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది సాధించటానికి.. చేతితో పట్టుకుని ఉపయోగించే ఒక పరికరాన్ని ఆయన కనుగొన్నారు. దానికి ‘డార్మియో’ అని పేరు పెట్టారు.
నిద్ర దశల్లో మార్పులను గుర్తించే బయోసిగ్నల్స్‌ను ఇది సేకరిస్తుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, కండరాల బిగువు తగ్గటం, చర్మం వాహకతలో మార్పులు వంటి సంకేతాలన్నమాట.
నిద్రలో ‘హిప్నాగోగియా’ అనే ఒక నిర్దిష్ట దశను అధ్యయనం చేయటం దీని లక్ష్యం. మెలకువకు - గాఢ నిద్రకు మధ్య దశ ఇది.
ఇది కునుకు దశ. వందల ఏళ్లుగా దీని మీద శాస్త్రవేత్తలు, కళాకారులు దృష్టి సారించారు.
థామస్ ఎడిసన్, నికొలస్ టెస్లా, ఎడ్గర్ అలెన్ పో, సాల్వడార్ డాలి.. అందరూ తమ చేతుల్లో ఒక ఇనుప గుండు కానీ అటువంటి వస్తువేదైనా కానీ పట్టుకుని కునుకు తీయటం ద్వారా ఈ దశకు వెళ్లటానికి ప్రయత్నం చేశారు.
వాళ్లు గాఢ నిద్ర (రాపిడ్ ఐ మూవ్‌మెంట్ -ఆర్‌ఈఎమ్) లోకి జారినపుడు వారి చేతిలోని లోహ వస్తువు కిందకు జారి శబ్దం చేసి వారిని మేల్కొలుపుతుంది. హిప్నాగోగిక్‌లో ఊహలను మరచిపోకముందే వారు మెలకువలోకి వస్తారన్నమాట.
ఈ డార్మియో పరికరాన్ని ఒక స్మార్ట్‌ఫోన్ లేదా రోబోకు అనుసంధానిస్తారు. ఈ పరికరాన్ని ధరించిన వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్లినపుడు ఆ స్మార్ట్ ఫోన్ లేదా రోబో మాటలు చెప్తూ ఉంటుంది.

ఫొటో సోర్స్, MEDIA LAB, MIT
కలల నివేదికల తయారీ ఇలా..
‘‘ఇలా చెప్పిన మాటలు సదరు వ్యక్తి హిప్నాగోగిక్ స్వప్నాల్లో.. కలల్లో భాగంగా ప్రవేశించినట్లు మేం గుర్తించాం’’ అని హోరోవిట్జ్ తెలిపారు.
‘‘ఈ స్వల్ప మెలకువలో.. కలలోని అంశం గురించి జిబో సోషల్ రోబో ద్వారా యూజర్లతో సంభాషణ ప్రారంభిస్తాం. మాట్లాడినదంతా రికార్డు చేస్తాం. హిప్నాగోగిక్ ఆమ్నీసియా రిపోర్ట్ చేసింది చేసినట్లుగా. కలల్లో వచ్చే ఉపయోగకరమైన ఆలోచనలను వాళ్లు మరచిపోకుండా ఉండాలన్నది మా భావన’’ అని వివరించారు.
ఈ సంభాషణ అనంతరం ఈ వ్యవస్థ.. యూజర్లు తిరిగి నిద్రలోకి జారుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే వాళ్లు గాఢ నిద్రలోకి వెళుతున్నట్లు బయోసిగ్నల్స్ చూపటం మొదలవగానే మళ్లీ అడ్డుకుంటుంది.
‘‘కలలను విశ్లేషించటానికి కలల నివేదికలను సేకరించటానికి ఇలా మళ్లీ మళ్లీ చేస్తాం’’ అని హోరోవిట్జ్ చెప్పారు.
ఇప్పటివరకూ 15 మంది మీద మాత్రమే దీనిని పరీక్షించారు. అయితే ఈ ప్రయోగాన్ని విస్తరించాలని.. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు.
‘‘భవిష్యత్తులో నిద్ర మరింతగా ఉపయోగపడుతుందని.. మనం బాగా అర్థం చేసుకునే వీలు ఎక్కువగా ఉంటుందని.. దానిని ప్రభావితం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని.. నిద్రలో గుర్తించే విషయాలను వెలికితీసుకురాగలిగుతామని నేను భావిస్తున్నా’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
ఈ పరికరం ధరించిన వారు తమ కలల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి.. తద్వారా తమ జ్ఞాపకాలను బలోపేతం చేసుకోవటానికి, అభ్యసనాన్ని మెరుగుపరచుకోవటానికి, తమ కలలు ఎలా ఉండాలో ప్రభావితం చేయటానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గొప్ప కోరికలను తీర్చే కలలు..
మన జీవితాల్లో మూడో వంతు భాగాన్ని నిద్రలో గడిపేస్తాం. కానీ నిద్రపోయేటపుడు ఏం జరుగుతుందో మనకు తెలిసింది అత్యల్పం.
మన తీరని కోరికలను తీర్చుకోవటానికి కలలు ఉపయోగపడతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ భావించేవారన్నది చాలా మందికి తెలిసిన విషయమే. భావోద్వేగాలు, సంఘటనలను విశ్లేషించటానికి, అవగాహన చేసుకోవటానికి కలలు కనటం ఒక దారని కొన్ని సిద్ధాంతాలు సూచిస్తాయి. అప్రధాన్యమైన జ్ఞాపకాలను పదిలపరచే ఒక పద్ధతి కావచ్చని అంటాయి. మనం మెలకువగా ఉన్నపుడు రాగల ప్రమాదాలకు సంబంధించి మన మెదడుకు ఒక విధమైన శిక్షణ వంటింది కూడా కావచ్చని చెప్తాయి.
ఒక రాత్రిలో నాలుగు నుంచి ఆరు సార్లు కలలు వస్తాయని.. ఆ కలల్లో 90 శాతాన్ని మెలకువలో అందరూ మరచిపోతుంటారని.. సాధారణంగా అంగీకరించే విషయం.
కలల రూపకల్పన వాటిని మరచిపోవటం కోసమే జరిగిందన్నది యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియాల్‌లో సైకాలజీ ప్రొఫెసర్ ఆంటోనియో జాద్రా అభిప్రాయం.
‘‘మన జీవితంలో ఆరేళ్ల సమయాన్ని కలలు కంటూ గడుపుతాం. అందులో అత్యల్ప భాగం మాత్రమే మనకు గుర్తుంటాయి. ఇంకా ఎక్కువ గుర్తుండాలన్నదే ఆ కలల ఉద్దేశమైతే.. కొండంత సమయం వృధానే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గాఢ ఆర్‌ఈఎం నిద్రలోని కలలు ‘‘ప్రభావితం చేయటానికి లొంగేవికావ’’ని.. హిప్నాగోగిక్ కలలను సులభంగా ప్రభావితం చేయొచ్చని ప్రొఫెసర్ జాద్రా చెప్తారు. అయితే.. ఇలా ప్రభావితం చేయటానికి కొత్త సాంకేతికత అవసరమనేదానిని ఆయన అంగీకరించటం లేదు.
‘‘లోహపు గోళీ విధానం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎంఐటీ వ్యవస్థ ఫ్యాన్సీగా చేసిన సాంకేతికత మాత్రమే. ఇదీ అదే పని చేస్తుంది. అయితే ఇది మరింత సంక్లిష్టం చేస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘కానీ.. ఎవరైనా నిద్రలో తమకు కనిపించే దృశ్యాలను శోధించాలనుకుంటే ఈ పరికరం ఉపయోగపడవచ్చు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మనల్ని మనం తెలుసుకునే ప్రయాణం’
మన రోజువారీ జీవితంలోని ఈ నిగూఢ భాగాన్ని శోధించటానికి ముందు కొన్ని నైతిక ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరముందని హోరోవిట్జ్ అంగీకరిస్తారు.
‘‘మనలో ఎంత భాగాన్ని మనం తెలుసుకోవాలని అనుకుంటాం?.’’
‘‘ఆ విషయంలో మనకు ఎంత శక్తి అవసరమని కోరుకుంటాం? మన సొంత బయోసిగ్నల్స్‌ను ఆటంకపరిచే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం?’’ అని ప్రశ్నించారు.
ఇదంతా చివరికి ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకునే ప్రయాణంలో భాగమని ఆయన పరిగణిస్తున్నారు.
‘‘మెలకువలోని మనం.. నిద్రలోని మనతో ఎక్కువగా అనుసంధానమై ఉంటాం. ఆ రెండిటి మధ్య అనుసంధానం ఆత్మజ్ఞానానికి ఒక రూపం’’ అని హోరోవిట్జ్ అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- #BBCArchives: ఫిడెల్ క్యాస్ట్రో అరుదైన వీడియో ఇంటర్వ్యూ
- థాయ్లాండ్ గుహల్లో బాలురు అదృశ్యం: 1000 మంది గాలింపు.. 9 రోజుల తర్వాత గుర్తింపు.. బయటకు వచ్చేదెలా?
- అభిప్రాయం: ‘అస్సాంలో భయాందోళనలో 90 లక్షల మంది ముస్లింలు’
- దక్షిణాఫ్రికా: మార్చురీ నుంచి బతికొచ్చిన మహిళ
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మీ మైండ్ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








