కంప్యూటర్ స్క్రీన్‌ రంగుతో నిద్రను నియంత్రించొచ్చు

నిద్రపోతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఆకు పచ్చ, నీలి రంగులకు మధ్యస్థంగా ఉండే సియాన్ రంగు మన నిద్రపై ప్రభావం చూపిస్తుందని జీవశాస్త్రజ్ఞులు గుర్తించారు. నిద్రపుచ్చడంతో పాటు నిద్ర రాకుండా చేయడంలోనూ ఈ రంగు ప్రభావం ఉంటుందని తేల్చారు.

సియాన్ రంగును ఎక్కువగా చూస్తే నిద్ర రాకుండా చేస్తుందని, అదే తక్కువ స్థాయిలో ఉంటే నిద్రపుచ్చేందుకు సాయపడుతుందని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వివరించారు.

ఆ రంగులో కంటికి కనిపించనంత సూక్ష్మ మార్పు జరిగినా దాని ప్రభావం నిద్రపై పడుతుందని తేలింది.

సియాన్‌ను ఎక్కువ, తక్కువ చేసుకునేలా ఉండే కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ తెరలను అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

ముదురు నీలి రంగు
ఫొటో క్యాప్షన్, ఎక్కువ స్థాయి సియాన్ ప్రభావానికి గురైతే నిద్ర రాదా?

తక్కువ లేదా ఎక్కువ స్థాయి సియాన్ కలర్‌ ప్రభావానికి గురైన వ్యక్తుల్లో నిద్ర హార్మోన్ స్థాయిలో వ్యత్యాసాలను గుర్తించారు. సియాన్ రంగును ఎంత చూశారన్నదాన్ని బట్టి వారి లాలాజలంలో ఉండే నిద్ర హార్మోన్ మెలటోనిన్లో హెచ్చుతగ్గులు నమోదైనట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.

'ఆ కలర్ మారిందో లేదో కూడా మన కంటికి తెలియకపోవచ్చు. కానీ, ఏమాత్రం మార్పు జరిగినా దానికి తగినట్టుగానే మన శరీరం స్పందిస్తుంది' అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాబ్ లుకాస్ అన్నారు.

సియాన్ కలిపిన ఇతర రంగులతోనూ ఆ ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.

రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఉండాలనుకునే వారికోసం కంప్యూటర్ తెరల్లో సియాన్‌ కలిసిన రంగులను వాడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అలాగే నిద్రలేమి నుంచి దూరం కావాలనుకుంటే సియాన్ లేని మరో వెర్షన్ స్క్రీన్‌ను రూపొందించుకోవాలని సూచించారు.

కంప్యూటర్ తెర
ఫొటో క్యాప్షన్, పరిశోధకులు రెండు రకాల తెరలు తయారు చేశారు. వాటిలో ఒకటి సియాన్ లేనిది, ఇంకోటి సియాన్‌ ఉన్నది.

ఈ అధ్యయనంలో భాగంగా రెండు రకాల (ఒకటి సియాన్ లేనిది, ఇంకోటి సియాన్ ఉన్నది) తెరలపై ఓ సినిమా ప్రదర్శించారు. అప్పుడు ప్రేక్షకులు నిద్రమత్తులో జారుకున్నాక వారి లాలాజలంలో మెలటోనిన్ స్థాయిలో వచ్చిన తేడాలను పరిశీలించారు.

తమ పరిశోధన కొత్తరకం కంప్యూటర్ తెరలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్ల తెరల తయారీకి దోహదపడనుందని పరిశోధకులు తెలిపారు.

ముఖ్యంగా రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్లతో గడుపుతూ నిద్రను దూరం చేసుకుంటున్న టీనేజీ పిల్లలకు సియాన్‌ రహిత తెరలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాజెల్‌కు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం పూర్తి వివరాలను 'స్లీప్' జర్నల్‌లో ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)