ఖమేనీ మరణం ప్రపంచంలోని ముస్లిం దేశాలపై ఎలాంటి ప్రభావం చూపించొచ్చు?

ఫొటో సోర్స్, Ashtari/SOPA Images/LightRocket via Getty Images
- రచయిత, రౌహన్ అహ్మద్
- హోదా, బీబీసీ ఉర్దూ
- చదివే సమయం: 5 నిమిషాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక హెచ్చరిక జారీ చేశారు.
ఈ ''దారుణమైన నేరానికి'' తగిన శాస్తి చెబుతామని అన్నారు.
''మా మొత్తం బలం, దృఢ సంకల్పంతో.. ముస్లిం కమ్యూనిటీ సాయంతో.. ప్రపంచంలోని స్వేచ్ఛాయుత ప్రజల సహకారంతో.. ఈ భయంకరమైన నేరానికి పాల్పడిన వారు పశ్చాత్తాపం చెందేలా చేస్తాం'' అని పెజెష్కియాన్ చెప్పారు.
అలీ ఖమేనీ ఇస్లామిక్ ఫ్రంట్‌ను 37 ఏళ్ల పాటు అత్యంత వివేకంతో, ముందుచూపుతో నడిపించారని పెజెష్కియాన్ అన్నారు. ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ క్లిష్ట కాలాన్ని ఎదుర్కొంటుందన్నారు.

ఖమేనీకి ఇరాన్‌లోనే కాకుండా పాకిస్తాన్ సహా చాలా దేశాల్లో షియా పద్ధతులను అనుసరించే వాళ్లలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.
భారత్‌లోని షియా కమ్యూనిటీ కూడా ఆయన్ను తమ సుప్రీం లీడర్‌గా భావిస్తుంటుంది.
ఇరాక్, పాకిస్తాన్, సిరియాతో పాటు ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాల్లో జరిగిన ర్యాలీల్లో షియా ముస్లింలు ఆయన ఫోటో పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు.
పాకిస్తాన్‌లోని కరాచీలో యూఎస్ కాన్సులేట్ బయట ఆదివారం కాల్పులు జరిగాయి. నిరసనకారులు బయట ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని దాటుకుని, లోపలికి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు.
గిల్గిత్ బాల్టిస్తాన్‌లో హింసాత్మక నిరసనల్లో యూఎన్ కార్యాలయాలు, ఇతర ఆస్తులకు నిరసనకారులు నిప్పంటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంపై ప్రభావమెంత?
ఇలాంటి పరిస్థితుల్లో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించడం ప్రపంచంపై ఎంత ప్రభావం చూపుతుందనే ప్రశ్న తలెత్తుతుంది.
గతంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల్లో పశ్చిమాసియాలోని హెజ్బొల్లా, హూతీ రెబెల్స్, ఇలాంటి ఇతర గ్రూప్‌లు ఇరాన్‌కు మద్దతు ఇచ్చాయి. కానీ, గత రెండేళ్లలో అమెరికా, ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్యలలో ఈ గ్రూప్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఖమేనీ మరణం తర్వాత, అమెరికా, ఇతర మిత్ర దేశాలకు బెదిరింపులు కచ్చితంగా తలెత్తవచ్చని అమెరికాలోని న్యూ లైన్స్ ఇనిస్టిట్యూట్ సీనియర్ డైరెక్టర్, పశ్చిమాసియా రాజకీయాలను సునిశితంగా పరిశీలించే డాక్టర్ కమ్రాన్ బుఖారి అన్నారు.
'' అయితే, రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్స్ ఫోర్స్ సామర్థ్యాలేంటి? ఇతర దేశాల్లో వాటి ప్రాక్సీ గ్రూప్‌ల బలమెంత? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది'' అని ఆయన బీబీసీ ఉర్దూకు తెలిపారు.
''ఇటీవల నెలల్లో హెజ్బొల్లా కేంద్ర నాయకత్వం మొత్తాన్ని ఇజ్రాయెల్ తుడిచిపెట్టేసింది. సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. కానీ, ఇరాన్ వారికి ఎలాంటి సాయం చేయలేకపోయింది'' అని చెప్పారు.
అలీ ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలను కచ్చితంగా బాధపెడుతుందని ఆయన భావిస్తున్నారు.
''కానీ, ఇరాక్, లెబనాన్, సిరియా లాంటి దేశాల్లో.. ఇరాన్ సుప్రీం నాయకుడు కంటే అయతొల్లా సిస్తానీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మత పెద్దలు రాజకీయాల్లో పాలు పంచుకోవడాన్ని వారు ఇష్టపడరు'' అని తెలిపారు.
పశ్చిమాసియాను సునిశితంగా పరిశీలించే ఇతర విశ్లేషకులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.
''ఈ పరిస్థితిలో హెజ్బొల్లా ప్రేక్షక పాత్రను మానేసే అవకాశం ఉంది. ఇరాక్‌లో, దాని వెలుపల అమెరికా భద్రతా దళాలపై ఇరాకీ సాయుధ దళాలు దాడులు చేసే అవకాశం ఉంది'' అని హిబ్రూ యూనివర్సిటీలో ఇస్లామిక్ అండ్ మిడిల్ ఈస్ట్రన్ స్టడీస్, ఏసియన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే సిమోన్ వాల్ఫ్ గాంగ్ ఫుక్స్ చెప్పారు.
అయితే, 2023 అక్టోబర్ తర్వాత హెజ్బొల్లా సహా ఇరాన్ మద్దతు ఇచ్చే ఇతర గ్రూప్‌లు.. బలహీనంగా మారాయని ఆయన నమ్ముతున్నారు.
'' ముస్లిం ప్రపంచంలో కొన్ని వర్గాలు ఖమేనీ సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని సమర్థించవచ్చు. కానీ, ఖమేనీ మరణంపై వారు కన్నీళ్లు పెట్టుకుంటారని కాదు. ముఖ్యంగా సిరియా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ జోక్యంతో ఏర్పడిన పర్యవసానాలను ఎదుర్కొన్న వారు బాధపడరు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దేశం వెలుపల కూడా దీని ప్రభావాలు ఉంటాయా?
ఖమేనీ మరణం ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయదని నిపుణులు భావిస్తున్నారు.
''రహబార్-ఎ-ఆలా (సుప్రీం లీడర్) ఈ వ్యవస్థకు ముఖ్యమైన భాగం. అయితే, ఎన్నో ఏళ్ల పాటు ఆయన అనారోగ్యంతో ఉండటంతో, దేశాన్ని నడిపించేందుకు ఇరాన్ సైన్యం లేదా రివల్యూషనరీ గార్డ్స్‌పై ఆధారపడ్డారు'' అని డాక్టర్ కమ్రాన్ బుఖారి తెలిపారు.
రివల్యూషనరీ గార్డ్స్ శక్తిసామర్థ్యాలు గతం కంటే తగ్గినట్లు డాక్టర్ బుఖారి అభిప్రాయపడ్డారు.
''ఖమేనీ మరణంతో ఒక శకం ముగిసింది. ప్రస్తుత వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలదు. కానీ, కచ్చితంగా ప్రస్తుత వ్యవస్థలో మార్పులు ఉంటాయి'' అని తెలిపారు.
ఇరాన్‌లో ఎలాంటి వ్యవస్థను చూడాలనుకుంటున్నారో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు.
''ఐఆర్‌జీసీ, సైనిక అధికారులు,ఇతర భద్రతా, పోలీసు దళాలు చాలా మంది ఇకపై పోరాడటానికి ఇష్టపడటం లేదని, మమ్మల్ని రక్షణ కోరుతున్నారని తెలుస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు.. ఇప్పుడైతే వారికి రక్షణ లభించవచ్చు. ఆలస్యం చేస్తే మిగిలేది మరణమే'' అని ఇరాన్ సుప్రీం లీడర్ మరణ వార్త ప్రకటన తర్వాత ట్రంప్ అన్నారు.
"ఇరాన్ దేశభక్తులతో ఐఆర్‌జీసీ, పోలీసులు కలిసి ఒక యూనిట్‌గా, దేశాన్ని వీలైనంత గొప్పగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా" అని ట్రంప్ అన్నారు.
ఖమేనీ తన జీవితాంతం పశ్చిమ దేశాలను ముఖ్యంగా అమెరికాను ఒక అపనమ్మకంతో చూశారు. ఆయన మరణం తర్వాత మార్పు అనివార్యమని పరిశోధకులు భావిస్తున్నారు.
''ఖమేనీ నాయకత్వంలో, ఇరాన్‌లో ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు తీసుకురాలేదు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చలేదు. కానీ, భవిష్యత్‌లో ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడికి ఇరాన్ దిశను మార్చే స్వేచ్ఛ ఉంటుంది'' అని సిమోన్ వాల్ఫ్ గాంగ్ ఫుక్స్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఇరాన్ పాలన వ్యవస్థలో ఏ మార్పులు రానున్నాయన్నది కాలమే చెప్పనుంది. కానీ, ఖమేనీ మరణం కచ్చితంగా చాలా ఇతర దేశాలకు ఇబ్బంది కలిగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ విప్లవం రాడికల్ సిద్ధాంతాలతో పోరాడేప్పుడు, విలాయత్ ఎ ఫఖీని (ఇస్లామిక్ నాయకత్వ పరిరక్షణ) మీరు విస్మరించలేరు అన్నారు ఫిలిప్ స్మిత్.
స్మిత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ అనుకూల గ్రూపులపై పరిశోధన చేస్తుంటారు. ''ఈ సిద్ధాంతం మతపరమైనది, రాజకీయమైనది, సామాజికమైనది కూడా''.
''మొత్తం ముస్లిం ఉమ్మాకు నాయకుడు కావాలని ఖమేనీ కోరుకోవడమే సమస్య. కానీ, ఆయన అసలైన అయతొల్లా కాదు. అయతొల్లా సిస్తానీ కంటే ఆయన హోదా తక్కువ'' అని ఫిలిప్ తెలిపారు.
అందుకే, ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజ్యాంగాన్ని సవరించారు. 'రహబార్' (నాయకుడు)కు 'మర్జా' (అధికారం) ఉండాలనే షరతును రద్దు చేశారు.
విలాయత్-ఎ-ఫఖీని ప్రజలను సమీకరించేందుకు ఆయుధంగా ఇరాన్ వాడుకుందని ఫిలిప్ తెలిపారు.
''దీన్ని ఉపయోగించే లెబనాన్‌లో హెజ్బొల్లాను సృష్టించింది. ఇరాక్‌లో 'కతైబ్ సయ్యిద్ అల్-షుహాదా' వంటి గ్రూప్‌లు ఉన్నాయి, పాకిస్తాన్‌లో 'లష్కర్-ఎ-జైనబియోన్' ఏర్పాటైంది'' అని ఫిలిప్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలందరికీ ఖమేనీ మత గురువు కాకపోవచ్చు. కానీ, ఆయన మరణం ఆయన్ని అనుసరిస్తున్న వారి జీవనాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని కొట్టివేయలేం.
''భారత్, పాకిస్తాన్, ఇరాక్, లెబనాన్‌లలో ప్రజలు వారి జీవితకాలం ఆయన మత బోధనలను అనుసరించకపోవచ్చు. కానీ, ఈ ప్రాంతాల్లో ఆయన ఫాలోవర్స్ తమ బలానికి, గౌరవానికి సూచికగా ఆయన్ను గుర్తుంచుకుంటారు'' అని ప్రొఫెసర్ సిమోన్ వాల్ఫ్‌గాంగ్ ఫుక్స్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














