అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుంటున్నట్లుగా ఇరాన్‌లో నాయకత్వ మార్పు ఎందుకు జరగలేదు?

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఖమేనీ, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం ఐదో రోజుకు చేరింది.

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి యుద్ధం మొదలైతే దానిని నియంత్రించడం కష్టం.

అయితే యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు వాటిని ఎలా ముగించాలని కోరుకుంటున్నాయంటే...

ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నివాసం నుంచి యుద్ధం మొదలైందని వీడియో మెసేజ్‌లో చెప్పారు ట్రంప్. ఆ సందేశం ఇచ్చిన దగ్గరినుంచి ఎప్పటిలానే అమెరికా శక్తిపై తన నమ్మకాన్ని వ్యక్తంచేస్తున్నారు.

ఓపెన్-నెక్ షర్ట్ వేసుకున్న ట్రంప్, కళ్లపైవరకు ఉండే వైట్ బేస్‌బాల్ క్యాప్ పెట్టుకున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి అమెరికాకు ఇరాన్ పెద్దముప్పుగా ఉందని పెద్ద ఆరోపణల జాబితా చదువుతూ ట్రంప్ వాదించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఖమేనీ, గల్ఫ్ దేశాలు
ఫొటో క్యాప్షన్, ఇరాన్ భద్రతాబలగాలు ఆయుధాలు వీడాలని ట్రంప్ కోరుతున్నారు.

ట్రంప్ దృష్టిలో విజయమంటే...

విజయం ఎలా ఉండాలనుకుంటున్నారో ట్రంప్ తన ప్రసంగంలో నిర్వచించారు.

‘మేం వారి క్షిపణులను నాశనం చేస్తాం. వారి క్షిపణి పరిశ్రమను పూర్తిగా నేలమట్టం చేస్తాం.

నౌకాదళాన్ని ధ్వంసం చేస్తాం. ఈ ప్రాంతంలోని ఉగ్రవాద మద్దతుదారులు ఇకపై ఈ ప్రాంతాన్ని లేదా ప్రపంచాన్ని అస్థిరపరచకుండా చూస్తాం. ఐఈడీలు లేదా రోడ్డు పక్క బాంబులు ఉపయోగించి వారు అనేకమంది అమెరికన్లు సహా వేలమందిని తీవ్రంగా గాయపరచకుండా, చంపకుండా చూస్తాం’ అన్నారు.

అమెరికాను చేరగల క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోందని ట్రంప్ అన్నారు కానీ అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం ఇలాంటి అంచనాలేవీ వెల్లడించలేదు. ఇరాన్ అణ్వాయుధానికి దగ్గరగా ఉందని కూడా ట్రంప్ అన్నారు.

"ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నాశనం చేశాం" అని గత వేసవిలో ట్రంప్ చేసిన ప్రకటనకు ఇది విరుద్ధమైనది.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తెహ్రాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచగలవని ట్రంప్ భావిస్తున్నారు.

ఇరాన్ ప్రభుత్వం ఎంత లొంగకపోతే అంతగా దెబ్బతింటుందని ట్రంప్ హెచ్చరించారు.

తమ పని పూర్తికాగానే ప్రజలు వీదుల్లోకొచ్చి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఇది వారికి వచ్చిన అవకాశమని ఆయన అన్నారు. ప్రభుత్వ మార్పు బాధ్యతను ఇరాన్ ప్రజలపై మళ్లించడం ద్వారా, అలా చేయాలని ప్రోత్సహించినప్పటికీ, ప్రభుత్వం కూలిపోకుండా, మనుగడ సాగించగలిగితే...ఆ తర్వాత తప్పించుకునే అవకాశం ట్రంప్‌కు ఉంటుంది.

అయితే తాను కోరుకున్నది ఇరాన్ ప్రజలు చేస్తారని ట్రంప్ ఆశపడుతున్నారు.

ఇది చాలా పెద్ద జూదం. కేవలం బాంబింగ్‌తో ప్రభుత్వం మారే అవకాశాలు తక్కువ.

అంతర్గతంగా పాశ్చాత్య అనుకూల తిరుగుబాటు జరిగే అవకాశం పూర్తిగా అసాధ్యం కాదు.

ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు అజ్ఞాతంలో ఉంటూ మరిన్ని క్షిపణులు ప్రయోగించే అవకాశం ఎక్కువ. కష్టమంతా ఇరాన్ ప్రజలదే. కానీ వారికి ఈ విషయంలో ఎలాంటి మాటా చెప్పే అవకాశం లేదు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఖమేనీ, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, GPO HANDOUT/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, నెతన్యాహు

నెతన్యాహు ఏమంటున్నారు?

ట్రంప్‌లాగే నెతన్యాహూ కూడా ఇరాన్ ప్రజలు స్వయంగా చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించారు. కానీ ఇరాన్ ప్రజలు ప్రభుత్వ భద్రతా బలగాలను జయించలేకపోతే నెతన్యాహూ ప్రాధాన్యం ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేయడమే.

దశాబ్దాలుగా ఆయన ఇరాన్‌ను ఇజ్రాయెల్‌కు అత్యంత ప్రమాదకర శత్రువుగా చూస్తున్నారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకులు అణ్వాయుధం తయారు చేసి ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని ఆయన నమ్ముతున్నారు. "ఇజ్రాయెల్, అమెరికా కలిసి 40 ఏళ్లుగా నేను ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తాయి. ఉగ్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి" అని యుద్ధం రెండో రోజున నెతన్యాహు అన్నారు. ఈ హామీ నిజమయ్యేలా తాను చూస్తానని చెప్పారు.

యుద్ధాలకు ఎప్పుడూ దేశీయ రాజకీయ కోణం ఉంటుంది. నెతన్యాహూకి తన దేశంలో ఎన్నికలు ఉన్నాయి. కానీ ట్రంప్‌తో పోలిస్తే ఆయన పదవి ప్రమాదంలో ఉంది.

2023 అక్టోబర్ 7 దాడికి కారణమైన భద్రతా వైఫల్యాలకు చాలామంది ఇజ్రాయెలీయులు నెతన్యాహూ బాధ్యుడని భావిస్తున్నారు. ఇరాన్‌పై స్పష్టమైన విజయం సాధిస్తే, ఆయనకు ఎన్నికల్లో పెద్ద లాభం ఉంటుంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఖమేనీ, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ చనిపోయారు.

‘ఇరాన్ వ్యక్తి ఆధారిత వ్యవస్థ కాదు’

సుప్రీం లీడర్, ఆయన సైనిక సలహాదారుల హత్య ఇరాన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ.

కానీ దానర్థం ప్రభుత్వం కూలిపోతుందని కాదు. అయతొల్లా ఖొమేనీ, ఇతర ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థాపకులు దాదాపు 50 ఏళ్ల క్రితం యుద్ధాలు, హత్యలను తట్టుకునేలా వ్యవస్థను రూపొందించారు.

ఇది ఒక్క వ్యక్తి ఆధారిత వ్యవస్థ కాదు. సిరియా, లిబియా దేశాల్లో అసద్, గడాఫీ కుటుంబాల పాలన ఉండేది. అసద్ దేశం విడిచి వెళ్లగానే, గడాఫీ హత్యకు గురికాగానే ఆ ప్రభుత్వ వ్యవస్థలు కూలిపోయాయి. ఇరాన్ ప్రభుత్వం సంక్లిష్ట రాజకీయ, మత సంస్థల భావజాలంపై ఆధారపడి ఉంది.

ఇది యుద్ధాలు, హత్యలను తట్టుకునేలా నిర్మితమైంది. అది కూలిపోదని కాదు. కానీ ఇది అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితికి వారు ముందుగానే సిద్ధమయ్యారు.

ప్రభుత్వానికి విజయం అంటే మనుగడ సాగించడం. దాని కోసం బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. భద్రతా బలగాలు, అణచివేత వ్యవస్థ బలంగా ఉంది.

సాధారణ సైన్యం, పోలీసులతోపాటు ప్రభుత్వాన్ని దేశంలోనూ, విదేశాల్లోనూ కాపాడడానికి ప్రత్యేక అధికారంతో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఉంది.

ఇది వెలాయత్-ఎ-ఫకీఫ్ అనే సిద్ధాంతానికి బలంగా నిలిచే శక్తిగా ఉంది. జ్యూరిస్ట్ పాలన చేయాలనే సిద్ధాంతానికి ఇది బలాన్నిస్తుంది.

ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి ముఖ్యమైన సిద్ధాంతం. ఇది షియా మత నేతల పాలనను సమర్థిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూలిపోతున్న సూచనలు లేవు. ఐఆర్‌జీసీలో 1,90,000 మంది సైనికులు ఉన్నారు. ఇంకా దాదాపు 6,00,000మంది రిజర్వ్ సైనికులున్నారు. వారు ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రభావం కలిగి ఉన్నారు. వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. సిద్ధాంతపరంగా విశ్వాసంగా ఉంటారు. ఐఆర్‌జీసీకి బసీజ్ అనే వలంటీర్ దళం కూడా మద్దతుగా ఉంది. ఇందులో 4,50,000మంది ఉన్నారు.వారు ప్రభుత్వానికి నిబద్ధతో ఉంటారు.

2009లో వివాదాస్పద ఎన్నికల తర్వాత జరిగిన నిరసనల్లో తెహ్రాన్‌లో వారి పనితీరును నేను చూశారు.

ప్రభుత్వానికి లొంగకపోతే మరణం తప్పదని ఐఆర్‌జీసీ, బసీజ్‌ను ట్రంప్ హచ్చరించారు.

ఇరాన్ నాయకత్వం
తెహ్రాన్‌లో పొగలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌

‘పశ్చిమాసియా సమీకరణాలను మార్చే యుద్ధం’

ప్రభుత్వాన్ని కాపాడే ఈ బలగాలను ట్రంప్ హెచ్చరించారు. కానీ ఆ బెదిరింపులు వారిని సులభంగా మార్చేలా కనిపించడం లేదు. ఇరానీయులకు మత భావన బలంగా ఉంది.

సుప్రీం లీడర్ మరణాన్ని వారు "అమరత్వం"గా ప్రకటించారు. దాడి త్వరలో జరుగుతుందని తెలిసినప్పటికీ ఆయన తన నివాస సముదాయంలో సీనియర్ సలహాదారులతో సమావేశం కొనసాగించారని, వీరమరణం పొందాలని ఆయన భావించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వానికి విశ్వాసపాత్రులైన ప్రజల మద్దతు కూడా ఉంది. వేలాది మంది తెహ్రాన్ వీధుల్లోకి వచ్చి సంతాపం తెలిపారు. అమెరికా , ఇజ్రాయెల్ ఈసారి తమ శక్తితో ప్రభుత్వం మార్పు సాధ్యమని నమ్ముతున్నాయి.

ఇరాన్ పెద్ద దేశం. జనాభా 9 కోట్లకు పైగా ఉంది.

ప్రభుత్వం పడిపోతే సిరియా, ఇరాక్‌లా గందరగోళం, రక్తపాతం జరిగే ప్రమాదం ఉంది.

ప్రస్తుత దాడులు ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరుస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం కొనసాగినప్పటికీ ఇది పశ్చిమాసియా సమీకరణాలను మారుస్తుంది. ప్రభుత్వం పడిపోతే చాలా మంది ఇరానీయులు సంతోషించవచ్చు.

కానీ శాంతియుతమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఈ యుద్ధం పశ్చిమాసియాను మరింత సురక్షితంగా చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు.. కానీ, అది నిజంగా జరుగుతుందా అనేది సందేహమే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)