‘వ్యాగన్‌లో వందల మందిని కుక్కి తలుపులు వేశారు, రైలు కోయంబత్తూరుకు చేరుకునేసరికి 70 మంది చనిపోయారు’

కేరళలోని తిరూర్‌లో మెమోరియల్ హాల్ కాంప్లెక్స్ వద్ద ఉంచిన గూడ్స్ రైలు (వ్యాగన్) నమూనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళలోని తిరూర్‌లో మెమోరియల్ హాల్ కాంప్లెక్స్ వద్ద ఉంచిన గూడ్స్ రైలు (వ్యాగన్) నమూనా
    • రచయిత, సేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు కలవరపెట్టేలా ఉండవచ్చు)

భారత స్వాతంత్ర్య పోరాటంలో 'దక్షిణ భారతదేశ జలియన్‌వాలా బాగ్'గా పిలిచే 'రైల్వే వ్యాగన్ విషాదం' చరిత్రలో మరుగునపడిపోయింది.

బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రావిన్స్‌లో భాగంగా ఉన్న మలబార్ ప్రాంతంలో మోప్లా అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతం ఇప్పుడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉంది.

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ముస్లిముల పోరాటంగా కొంతమంది చరిత్రకారులు పేర్కొన్న ఈ సంఘటనలో, వందలాది మందిని ఒక గూడ్స్ రైలు వ్యాగన్‌లో కుక్కి కోయంబత్తూరుకు పంపారు.

గాలి, వెలుతురు రాని ఆ సరకు రవాణా వ్యాగన్లలో ఊపిరి ఆడక 70 మంది చనిపోయారు. ఈ విషాద సంఘటనను రచయితలు ఇంగ్లిష్‌లో 'వ్యాగన్ ట్రాజెడీ'గా పేర్కొంటే, మలయాళంలో 'బారవండి మారణహోమం' అని చెబుతారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''వారు తుపాకీతో భయపెట్టి మమ్మల్ని దిండులో దూది కుక్కినట్లుగా గూడ్స్ రైలులోకి నెట్టి తలుపులు మూసేశారు. లోపల నిలబడటానికి కూడా చోటు లేదు. దాహంతో అరిచాం. తాళలేక కొంతమంది మూత్రం కూడా తాగారు. కొంతమంది సోదరభావం మరచిపోయి, స్పృహ కోల్పోయి పక్కనున్నవారిపై దాడి చేశారు. మేకు ఊడిపోవడంతో ఏర్పడిన చిన్న రంధ్రం నుంచి వస్తున్న గాలిని కొంతమంది పీల్చుకున్నారు. మేం మూర్ఛపోయాం. మాకు మెలకువ వచ్చేసరికి, నలుగురైదుగురు చనిపోయి మాపైన పడిఉన్నారు.''

''పోదనూరులో వ్యాగన్ తలుపు తెరిచినప్పుడు ఆ భయంకరమైన దృశ్యం రాక్షసులకు సైతం దిగ్భ్రాంతి గొలిపేలా ఉంది. లోపల 64 మంది రక్తం, గాయాలతో చనిపోయి ఉన్నారు. మరికొంతమంది రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫారంపై చనిపోయారు. ఇంకొందరు కోయంబత్తూరు ఆసుపత్రిలో మరణించారు. మాలో 28 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాం''

ఇవీ 1921 సంవత్సరం నవంబరు 19, 20వ తేదీల్లో జరిగిన విషాదకరమైన 'వ్యాగన్ ట్రాజెడీ'లో ప్రత్యక్షంగా ప్రభావితమైన కొన్నోల అహ్మద్ హాజీ మాటలు.

కేరళలోని మలప్పురం జిల్లా కొట్టపాడికి చెందిన అహ్మద్ హాజీ అనుభవాన్ని మలయాళ రచయిత తిరూర్ దినేష్ తన 'మోప్లా అల్లర్లు' పుస్తకంలో రాశారు.

వ్యాగన్ ట్రాజెడీలో మరణించినవారి పేర్లతో ఉన్న శిలాఫలకం
ఫొటో క్యాప్షన్, వ్యాగన్ ట్రాజెడీలో మరణించినవారి పేర్లతో ఉన్న శిలాఫలకం

తిరూర్‌లో అమరుల పేర్లతో శిలాఫలకం

70 మంది ప్రాణాలను బలిగొన్న ఆనాటి సంఘటనను స్మరించుకునేందుకు కేరళలోని తిరూర్‌లో ఒక శిలాఫలకం ఏర్పాటుచేశారు. కానీ, వారు ప్రాణాలు కోల్పోయిన కోయంబత్తూరులోని పోదనూరులో మాత్రం ఎటువంటి స్మారక చిహ్నాలు లేవు.

భారత స్వాతంత్ర్య పోరాటం సమయంలో వివిధ సంఘటనలను అనేక భాషలలో ప్రత్యేక పుస్తకాలుగా, పాఠ్యపుస్తకాలుగా, చరిత్ర పరిశోధనా గ్రంథాలుగా ప్రచురితమయ్యాయి.

కానీ, కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ రైల్వేస్టేషన్‌లో మొదలై, తమిళనాడు కోయంబత్తూరు నగరంలోని పోదనూరు రైల్వే జంక్షన్ వరకూ సాగిన 70 మంది సామూహిక హత్యకాండ 'వ్యాగన్ ట్రాజెడీ'కి సంబంధించి ప్రత్యేక రికార్డులేవీ లేవని చరిత్రకారులు చెబుతున్నారు.

తిరూర్ దినేష్ రచించిన 'మోప్లా అల్లర్లు' పుస్తకం

ఫొటో సోర్స్, Tirur Dinesh

ఫొటో క్యాప్షన్, తిరూర్ దినేష్ రచించిన 'మోప్లా అల్లర్లు' పుస్తకం

ఆ రెండు రోజులలో ఏం జరిగింది?

1921 నవంబరు 19, 20వ తేదీలలో జరిగిన ఈ సంఘటన గురించి వివిధ పుస్తకాలలో కొంతమేర ప్రస్తావన ఉంది. తిరూర్ దినేష్ ఇంగ్లిష్, మలయాళంలో రచించిన 'మోప్లా అల్లర్లు' పుస్తకంలో ఈ సంఘటన గురించి సవివరంగా ఉంది.

అల్లర్లలో ప్రత్యక్ష బాధితులైన అనేక మందితో ఇంటర్వ్యూలు, వివిధ దినపత్రికలలో ఆర్టికల్స్, కోర్టు పత్రాలు, బ్రిటిష్ ప్రభుత్వ అధికార రికార్డులు వంటివాటిని ఆధారంగా చేసుకుని తిరూర్ దినేష్ 'మోప్లా అల్లర్లు' పుస్తక తీసుకొచ్చారు.

వ్యాగన్ ట్రాజెడీ గురించి తిరూర్ దినేష్ బీబీసీతో మాట్లాడారు.

''ఆ సమయంలో, మలప్పురం కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. మోప్లా అల్లర్లు తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు, అణచివేయడానికి బ్రిటిష్ సైన్యం, మలబార్ స్పెషల్ పోలీసులు వేలాది మంది ఉద్యమకారులను అరెస్టు చేశారు. గూడ్స్ రైలు వ్యాగన్లలో వారిని ఎక్కించి ఇక్కడి నుంచి అండమాన్, మద్రాసు, కోయంబత్తూరు, కన్ననూర్ తదితర ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగానే చాలామందిని కోయంబత్తూరు పంపినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది'' అని దినేష్ వివరించారు.

''1921, నవంబరు 19న వంద మందికి పైగా గూడ్స్ వ్యాగన్లలోకి ఎక్కించారు. వ్యాగన్‌లోపలికి గాలి రాకపోవడంతో లోపలున్నవారికి ఊపిరాడలేదు. గాలి కోసం పైకప్పు వద్దనున్న చిన్న రంధ్రం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించారు. మరుసటి రోజు పోదనూరు చేరుకున్న రైలు వ్యాగన్ తలుపులు తెరిచేసరికి చాలామంది చనిపోయి ఉన్నారు. మరికొందరు ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయారు. మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిని అక్కడ (పోదనూరులో) ఖననం చేయడానికి అనుమతించకుండా, ఆ మృతదేహాలను అదే రైలులో తిరూర్ పంపారు'' అని దినేష్ చెప్పారు.

కేరళలో మెమోరియల్ హాల్
ఫొటో క్యాప్షన్, కేరళలో మెమోరియల్ హాల్

వ్యాగన్ ట్రాజెడీ సన్నివేశాలతో '1921' సినిమా...

తిరూర్‌లోని గోరంగడ్ మసీదు ప్రాంతానికి చెందిన ప్రజలు బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం, ఈ విషాద ఘటనలో అమరులైన 70 మందిలో నలుగురు మాత్రమే హిందువులు. మిగిలిన వారంతా ముస్లింలు. 44 మంది మృతదేహాలను తిరూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గోరంగడ్ మసీదు ఆవరణలో, 11 మంది మృతదేహాలను కోట్ జుమ్మా మసీదు ఆవరణలో ఖననం చేశారు. వారి పేర్లతో అక్కడ శిలాఫలకాలను ఏర్పాటుచేశారు. మిగిలినవారి మృతదేహాలను వేరే చోట్ల ఖననం చేశారు.

నలుగురు హిందువుల మృతదేహాలకు తిరూర్ పట్టణ శివారులోని ముత్తూర్ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారని కేరళకు చెందిన జర్నలిస్టు ప్రమోద్ చెప్పారు.

70 మంది అమరుల జ్ఞాపకార్థం తిరూర్ పట్టణం నడిబొడ్డున మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'వ్యాగన్ ట్రాజెడీ మెమోరియల్ టౌన్ హాల్'ను నిర్మించారు.

వ్యాగన్ ట్రాజెడీకి గుర్తుగా రైలు చిహ్నాన్ని 1993 సంవత్సరంలో ఏర్పాటుచేశారు.

ఈ ప్రదేశాలన్నింటినీ స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలతో బీబీసీ మాట్లాడింది.

అంతకన్నా ముందు, 1988 సంవత్సరంలో 'వ్యాగన్ ట్రాజెడీ'లో కొన్ని ఘటనల ఆధారంగా '1921' అనే మలయాళ చిత్రం వచ్చింది. ముమ్ముట్టి, సురేష్ గోపి, పార్వతి జయరామ్, ఊర్వశి, సీమ తదితరులు ఈ చిత్రంలో నటించారు. మోప్లా అల్లర్ల నేపథ్యాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది.

రచయిత తిరూర్ దినేష్
ఫొటో క్యాప్షన్, రచయిత తిరూర్ దినేష్

'మోప్లా' నేపథ్యం ఏమిటి?

మలప్పురం (మలబార్), దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సమాజంలో ఒక ప్రత్యేక వర్గాన్ని 'మోప్లా' అని పిలుస్తారు.

స్వాతంత్ర్యం రాకముందు 1920లో ఇక్కడ జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణలు, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిముల నిరసనలను కలిపి 'మోప్లా అల్లర్లు'గా వ్యవహరిస్తారు.

''నేను దాదాపు 25 సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి, వందలాది మందిని కలిసి, బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అధికార పత్రాలను సేకరించి, మోప్లా అల్లర్లపై ఒక పుస్తకం రాశాను. 'మోప్లా అల్లర్ల'పై సాధారణంగా రెండు అభిప్రాయాలు ఉన్నాయి... ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిములు చేసిన పోరాటమని ఒకటి, ఇది భూమిని కాపాడుకోవడానికి జరిగిన భూపోరాటమని మరొకటి. ఈ రెండు కోణాల్లో జాగ్రత్తగా అధ్యయనం చేసి, వాటిని ఈ పుస్తకంలో నమోదు చేశాను'' అని రచయిత తిరూర్ దినేష్ బీబీసీతో చెప్పారు.

రచయిత సీఆర్ ఇళంగోవన్
ఫొటో క్యాప్షన్, రచయిత సీఆర్ ఇళంగోవన్

'ఇది దక్షిణాదిలో జలియన్‌‌వాలా బాగ్ మారణకాండ'

''ఈ సంఘటన భారత స్వాతంత్ర్య పోరాటంలో దక్షిణాదిలో జలియన్ వాలాబాగ్ మారణకాండ వంటిది. ఇది కోల్‌కతాలో జరిగిన 'బ్లాక్ హోల్ ట్రాజెడీ'ని మించిపోయింది. దీని గురించి చారిత్రక రికార్డులు చాలా తక్కువగా ఉన్నాయి'' అని రచయిత, చరిత్రకారుడు సీఆర్ ఇళంగోవన్ బీబీసీతో అన్నారు.

''1920లలో, గాంధీ ఖిలాఫత్ ఉద్యమంలో చేరడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినప్పుడు, మలబార్ ప్రాంతంలో ఒక పోరాటం మొదలైంది. కష్టపడి పనిచేసే, పోరాట స్వభావం కలిగిన మలబార్ ముస్లింలు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో బ్రిటిష్ అధికారులు సైన్యాన్ని, మలబార్ స్పెషల్ పోలీసులను మోహరించారు. వారి కాల్పుల్లో చాలామంది చనిపోయారు. ఈ విషాదం (వ్యాగన్ ట్రాజెడీ) కూడా దాని ఫలితంగానే జరిగింది'' అని చెప్పారు.

ఆ సమయంలో మద్రాస్ సదరన్ మరాఠా అనే ఒక ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంలో రైల్వే ఉండేది. కోల్‌కతా నుంచి వచ్చే రైలుకు తిరూర్ వద్ద గూడ్స్ రైలు వ్యాగన్‌ను జోడించి, చాలామందిని అందులో ఎక్కించేవారని రచయితలు తెలిపారు. అలా వంద మందికి పైగా ఉద్యమకారులను ఎక్కించిన వ్యాగన్‌లో 70 మంది ఊపిరాడక, దాహంతో మరణించారని రచయిత ఇళంగోవన్ చెప్పారు. ఈ దుర్ఘటనపై అప్పట్లో పత్రికలు విమర్శనాత్మకంగా వార్తలను ప్రచురించాయని వెల్లడించారు.

ఇంతటి దారుణానికి బాధ్యులైన అధికారులలో కొంతమందికి మాత్రమే నామమాత్ర శిక్షతో సరిపెట్టారని, మృతుల కుటుంబాలకు రూ.300 చొప్పున పరిహారం చెల్లించినట్లు రచయితలు చెప్పారు.

సమరసం పత్రిక ప్రధాన సంపాదకుడు వీఎస్ మహమ్మద్ అమీన్
ఫొటో క్యాప్షన్, సమరసం పత్రిక ప్రధాన సంపాదకుడు వీఎస్ మహమ్మద్ అమీన్

'వ్యాగన్ ట్రాజెడీ' సంఘటనకు సంబంధించిన మృతులలో 66 మంది ముస్లింలే కాబట్టి ఈ చరిత్ర చాలావరకూ తెరమరుగు అయిపోయిందని సమరసం పత్రిక ప్రధాన సంపాదకుడు వీఎస్ మహమ్మద్ అమీన్ ఆరోపించారు.

''ఈ సంఘటన జరిగి ఒక శతాబ్దం గడిచింది. కానీ ప్రస్తుతం, భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల సహకారం పూర్తిగా మరుగునపడిపోయింది. దాన్ని వక్రీకరిస్తున్నారు'' అని అమీన్ బీబీసీకి చెప్పారు.

తిరువారూర్‌లో ఖననం చేసిన 55 మంది సమాధులు ఇప్పటికీ నిర్వహణలో ఉన్నప్పటికీ, మసీదు పునర్నిర్మించినప్పుడు అవి అక్కడ ఉంటాయో లేదో తనకు తెలియదని అమీన్ అన్నారు.

ఈ సంఘటనలో మరణించినవారి త్యాగాలకు గౌరవంగా కేరళ ప్రభుత్వం అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని ఆయన కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)