బందరు కోట: దాదాపు 30వేల మంది జల సమాధికి మూగసాక్షిగా నిలిచిన ఈ కోటను ఎవరు కట్టారు? డచ్, ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఇక్కడ ఏం చేశారు?

బందరు అంటే లడ్డూలకే కాదు, చారిత్రక కట్టడమైన ఓ కోటకూ ప్రసిద్ధే.
విదేశీ వర్తకుల, పాలకుల జమానాకు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలకు ఈ కోట ఓ సాక్ష్యం. విదేశీయులు ఇక్కడ కాలుమోపకముందే కుతుబ్ షాహీల హయాంలోనే బందరు కోట నుంచి వాణిజ్య కలాపాలు సాగాయని చరిత్ర చెబుతోంది.
ఇంతకీ బందరు కోట ఎప్పుడు నిర్మించారు? ఏయే దేశాల వారు ఈ కోటను ఏలారు?


ఇది రాజులు కట్టించిన కోట కాదు
మచిలీపట్నం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బందరు కోట.
కోటకు దారి తీసే మార్గానికి ఫోర్ట్ రోడ్డు అని పేరు.
"మచిలీపట్నాన్నే బందరు అంటారు. బందరు అంటే పర్షియా భాషలో పోర్టు అని అర్థం" అని 'మచిలీపట్నం సర్వస్వం' పుస్తక రచయిత, చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ సిలార్ బీబీసీతో చెప్పారు.
భారీ భవనాలు, పెద్ద పెద్ద ప్రహరీలు, ఎత్తయిన స్తంభాలతో నిర్మించిన కట్టడం కాదీ బందరు కోట. ఇదో సాధారణ భవనంలా కనిపిస్తుంటుంది. ఇప్పుడిది కూడా శిథిలావస్థకు చేరింది.
సందర్శకులు కూడా ఈ ప్రాంతానికి పెద్దగా రారు. నేను అక్కడు వెళ్లినప్పుడు ఒకరిద్దరు మాత్రమే కనిపించారు.
బందరు కోటలో అడుగుపెట్టగానే పైకప్పు (రూఫ్) దాదాపుగా పడిపోయిన భవనం కనిపిస్తుంది.
"సుమారు 40-45 ఏళ్లుగా కోట పరిస్థితి దారుణంగా మారింది. నెర్రెలు బారి పైకప్పు కూలిపోతూ వచ్చింది" అని 75 ఏళ్ల వెంకటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
ఈయన కుటుంబం బందరు కోట పక్కనే నివాసం ఉంటోంది.
బందరు కోట భవనాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఆయుధాగార భవనం (డచ్ కోట) కనిపిస్తుంది. దీని లోపల భాగం అర్ధ వృత్తాకారంలో, పైభాగం త్రిభుజాకారంలో ఉంది.
కోట భవనానికి సమీపంలోనే జైలు గదులు ఉన్నప్పటికీ, పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.

ఆ భవనమే ‘బందరు కోట’ అయింది
బందరు కోటను 1617 సమయంలో డచ్ వారు అభివృద్ధి చేసినట్లు చెబుతున్నప్పటికీ, కుతుబ్ షాహీలు, గోల్కొండ నవాబుల కాలం నుంచే వర్తకం జరిగినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
ఈ భవనం కారణంగా ఆ ప్రాంతానికి 'బందరు కోట' అని పేరు వచ్చింది.
కుతుబ్ షాహీలు, గోల్కొండ నవాబుల పాలనలోనే బందరు కోట ప్రాంతం నుంచి సముద్ర మార్గం మీదుగా వర్తకం జరిగిందని చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ సిలార్ చెప్పారు.
"గోల్కొండ నవాబుల పాలనలో బందరు రేవు నుంచి వజ్రాలు, కెంపులు, రత్నాలతోపాటు రవసెల్లాలు, కలంకారీ వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి" అని 'మచిలీపట్టణ చరిత్ర' పుస్తకంలో డీవీ రాఘవరావు రాశారు.
అంతకుముందే బందరు కోట ప్రాంతంలో బహమనీ సుల్తానులు తమ రిజర్వ్ సైనికులను ఉంచారు.
"1638లో హవార్డ్ అనే చరిత్రకారుడు బందరును సందర్శించినప్పుడు అక్కడున్న రెండు మైళ్ల చెక్క వంతెనను చిత్రంగా గీశారు. ఈ చిత్రం ఇప్పటికీ ఇటలీలోని మ్యూజియంలో కనిపిస్తుంది" అని వివరించారు సిలార్.

ఫొటో సోర్స్, ‘Machilipatnam Sarwaswam’ book
'రెండు మైళ్ల పొడవైన చెక్క వంతెన'
బందరు కోట ప్రాంతం చుట్టూ చిత్తడి నేలలు, మధ్యలో మెరక (దిబ్బ) ప్రాంతం ఉండేది. ఆ దిబ్బ మీద నుంచే సరకులు, బట్టల ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
"చిత్తడి నేలల్లో నడుములోతు వరకు కార్మికులు దిగి చాలా కష్టపడి వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా గోల్కొండ ఏడో సుల్తాను అబ్దుల్లా వద్ద మంత్రిగా ఉన్న బాకీర్ రెండు మైళ్ల దూరంపాటు చెక్క వంతెన కట్టారు" అని మహమ్మద్ సిలార్ వివరించారు.
"దివిసీమ తాలూకా నుంచి టేకు చెట్లు నరుక్కొచ్చి రెండు వేల దిమ్మెల మీద 12 అడుగుల వెడల్పుతో చెక్క వంతెన కట్టినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. సామాన్లు దించుకోవడానికి రెండువైపులా నిచ్చెనలాంటి ఏర్పాటు చేశారని హవార్డ్ తన చిత్రం ద్వారా తెలియజేశారు" అని సిలార్ చెప్పారు.
అలాగే 1672లో బందరు ప్రాంతానికి వచ్చిన డచ్ దేశస్థుడు ఫిలిప్ బాల్ డోరస్ రాసిన 'సిలోన్ అండ్ కోరమండల్' అనే పుస్తకంలోనూ ఈ చెక్క వంతెన ప్రస్తావన కనిపిస్తుంది.
తర్వాత కాలంలో ఫ్రెంచ్ వ్యాపారుల హయాంలో వంతెన అవసరం లేదని తొలగించారు.

డచ్ వారి రాక దేనికి?
వస్త్ర వ్యాపారం నిమిత్తం 1605లో డచ్‌వారు బందరును తొలిసారి సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
"నెదర్లాండ్స్‌నే హాలెండ్ అని కూడా పిలుస్తారు. హాలెండ్ నుంచి వచ్చారు కనుక కాలక్రమంలో హాలెండియులు, వలందీయులు అయ్యారు. వారు బందరు పట్టణంలోని వలందపాలెంలో స్థిరపడ్డారు" అని మహమ్మద్ సిలార్ వివరించారు.
"1602లో డచ్ అడ్మిరల్ వాండర్ హాగన్‌ను మచిలీపట్నంలో బట్టల వ్యాపారం నిమిత్తం వర్తక స్థావరం ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యేక బృందం 1605లో గోల్కొండ నవాబులను కలిసి 4 శాతం సుంకంతో వర్తక స్థావరాన్ని బందరు కోటలో ఏర్పాటు చేసుకుంది" అని సిలార్ చెప్పారు.
"మొదట స్థావరాలు ఏర్పాటు చేసుకుని, తర్వాత విస్తరించుకున్నారు. కుతుబ్ షాహీల అంగీకారంతో 1606 ఆగస్టులో వలందపాలెంలో డచ్ వారు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టారు" అని 'మచిలీపట్టణ చరిత్ర' పుస్తకంలో రాసి ఉంది.
బందరు కోటలో అప్పటికే కుతుబ్ షాహీలు నిర్మించిన చిన్న చిన్న గోదాములు ఉండగా.. డచ్ వారు వాటిని అభివృద్ధి చేశారు. 1618నాటికి బందరు కోటలో దిబ్బ వంటి ప్రాంతంలో కోట భవనాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
'కృష్ణా జిల్లా మ్యానువల్' పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది. బందరు కోట భవనాన్ని డచ్ వారు తమ సెక్రటేరియట్‌గా వాడుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత భవనంలో కొంత భాగాన్ని ఆసుపత్రిగానూ వినియోగించారు.

నిరంతర నిఘా...
బందరు కోట భవనం ఆధునిక పాశ్యాత్య నిర్మాణ శైలిలో ఉంటుంది. భవనంలోకి ప్రవేశించగానే, ఒకవైపు గదులు కనిపిస్తుంటాయి. కిటికీలు 'ఓవల్' ఆకారంలో కనిపిస్తాయి.
ఇక్కడ రిజర్వ్ సైన్యం ఉండేది. కోట చుట్టూ 11 ఎత్తైన బురుజులతో మట్టి గోడలు కట్టి నిరంతరం సైనికులు కాపలా కాసేవారని 'కృష్ణా జిల్లా మ్యానువల్' పుస్తకం చెబుతోంది.
"అక్కడ నుంచి చూస్తే సముద్రం వరకు అంతా కనిపించేది. షిఫ్టు పద్ధతిలో సైనికులు డ్యూటీ చేసేవారు" అని మహమ్మద్ సిలార్ వివరించారు.
అయితే ఆ బురుజులేవీ ఇప్పుడీ బందరుకోటలో కనిపించడంలేదు.
ఓడలు వచ్చినట్లు సంకేతాలు పంపించడానికి వీలుగా బందరు కోట, ఆయుధాగారం మధ్య భారీ గంట స్తంభం నిర్మించారు. అలాగే కోటపైన కూడా సమయం తెలియడానికి వీలుగా మరో గంటస్తంభం ఏర్పాటు చేసినిట్టు కనిపిస్తోంది.

డచ్ ఆయుధాగారం
అల్బర్ట్ హార్వే అనే డచ్ కెప్టెన్ భారత్‌లో పదేళ్ల పాటు ఉన్న సమయంలో ఆర్సెనల్ స్టోర్ పేరుతో ఆయుధాగారం నిర్మించారు. ఇక్కడ నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్ దళాలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేసేవారు.
"ఆయుధాగారం లోపల ఐదు అరలుగా విభజించుకున్నారు. ఫిరంగి మందుగుండు సామగ్రిని అరలు అరలుగా పెట్టుకునేవారు. ఒక్కొక్క అర ఖాళీ చేస్తూ ముందుకు వెళ్లేవారు" అని సిలార్ వివరించారు.
దీన్ని స్థానికులు 'ఫిరంగి కొట్టం' అని కూడా పిలుస్తుంటారు.
అక్కడ సర్ ఛార్లెస్ ట్రావెలిన్ డిజైన్ల మేరకు పార్కు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించగా.. తర్వాత 1864లో వచ్చిన భారీ తుపానుకు అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

డచ్.. ఫ్రెంచ్.. బ్రిటిషర్లు
"డచ్ వారు అభివృద్ధి చేసిన కోటను 1750 నాటికి ఫ్రెంచివారు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంపాటు ఫ్రెంచ్ వారు బందరు కోట నుంచే వాణిజ్యం జరిపారు. తర్వాత బ్రిటిష్ వారు దాన్ని స్వాధీనపరుచుకున్నారు" అని 'మచిలీపట్టణ చరిత్ర' పుస్తకంలో ఉంది.
1751లో కడప నవాబు నాజర్ జంగ్‌ను చంపడంలో సహకరించినందుకు గాను కుతుబ్ షాహీగా ఉన్న ముజఫర్ జంగ్ ఫ్రెంచివారికి మచిలీపట్నం, దివిసీమలను బహుమానంగా ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత మూడో కర్ణాటక యుద్ధంలో భాగంగా బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఆదేశాలతో 1758లో విజయనగర మహారాజుల సహకారంతో కల్నల్ ఫోర్డ్ నేతృత్వంలో విశాఖ మీదుగా మచిలీపట్నంపై దండెత్తడానికి బ్రిటిష్ సైన్యం వచ్చింది.
ఫ్రెంచి వారికి మద్దతుగా హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్ సైన్యం పెద్దఎత్తున వస్తున్న విషయం తెలుసుకుని బ్రిటిషు వారికి మద్దతు ఇవ్వలేనని విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆనంద గజపతి వెనుదిరిగారని 'మచిలీపట్టణ చరిత్ర' పుస్తకంలో ఉంది.

ఫ్రెంచ్‌వారిపై బ్రిటిష్ సేన యుద్ధం
బ్రిటిష్ సేన 1759 మార్చి 6న మచిలీపట్నం చేరుకుని ఫ్రెంచ్ వారిపై యుద్ధం చేసింది. కానీ మార్చి 19న కంపెనీ సైన్యం జీతాల కోసం తిరగబడ్డారు. కోటలో దొరికిన సంపదంతా సైన్యానికి ఇస్తానని ఒప్పించి ఫోర్టు యుద్దానికి సైనికులను ఒఫ్పించారు.
ఆ యుద్దంలో ఫ్రెంచి వారిని ఓడించి 1759 ఏప్రిల్ 7న బందరు కోటను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత బందరు కోట కేంద్రంగా బ్రిటిష్ వారు వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించారు.
"1957-60 ల సమయంలో బాగా రద్దీగా ఉండేది. షిప్పులు కోట భవనం నుంచి పది మైళ్ల దూరం వరకు వచ్చేవి. ఇక్కడ నుంచి పడవ వెళ్లేది. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన సరకు ఎగుమతి చేసి, అక్కడి నుంచి సరకు దిగుమతి చేసుకుని వచ్చేది. అలా ఎగుమతులు, దిగుమతులు జరుగుతుండేవి'' అని వెంకటేశ్వరరావు చెప్పారు.
బందరు కోటను పోర్టు ఆఫీసుగా ఉపయోగించేవారని, రానురానూ కాకినాడకు సిబ్బంది, అధికారులు తరలివెళ్లడంతో అది నిరుపయోగంగా మారిందని వెంకటేశ్వరరావు చెప్పారు.

ఎన్నో తుపానులు తట్టుకుని...
బందరు కోట ఎన్నో తుపానులు తట్టుకుని నిలబడినట్లు స్పష్టమవుతోంది.
ముఖ్యంగా 1864 నవంబర్ 1న భారీ ఉప్పెన మచిలీపట్నాన్ని ముంచెత్తింది.
ఆ విపత్తులో సుమారు 30వేల మంది చనిపోయారంటూ, నాటి మృతులకు నివాళిగా అప్పటి మద్రాసు చీఫ్ మేజిస్ట్రేట్ జి.థార్న్ హిల్ బందరు కోటలో స్మారక స్తూపం నిర్మించారు.
అది ఇప్పటికీ బందరు కోట ప్రాంతంలో కనిపిస్తుంటుంది.
ఆ తర్వాత 1949, 1977, 1990ల్లో వచ్చిన పెను తుపానులను తట్టుకుని బందరు కోట నిలబడింది. అయితే గోడలు, పైకప్పు శిథిలావస్థకు చేరినా, మరమ్మతులు చేపట్టడం లేదు.
ప్రస్తుతం బందరు కోట, ఆయుధాగారం (డచ్ కోట) పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయి.

'పునరుద్ధరణకు చర్యలు'
బందరు కోట పునరుద్ధరణకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు.
"ప్రస్తుతం మందుగుండు సామగ్రి నిల్వ చేసిన గన్ ఫౌండ్రీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం. దాని చుట్టూ గార్డెన్ అభివృద్ధి చేసి, తాగునీరు, మరుగుదొడ్ల వసతులు కల్పించి, సందర్శకుల సంఖ్య పెరిగేలా చూస్తాం" అని పురావస్తు శాఖ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు (ఇన్‌చార్జ్) డీఎన్ భోయి బీబీసీతో చెప్పారు.
బందరు కోటను 2026-27లో పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
"కోట గోడలు, పైకప్పు సహా భవాన్ని పూర్తిగా పునరుద్ధరించాలి. అందుకు అప్పట్లో వాడిన సిమెంట్ తరహా మెటీరీయల్స్‌నే ఉపయోగించాలనుకుంటున్నాం. కన్జర్వేషన్ ప్లాన్ నిధులతో పనులు చేపడతాం. ఇందుకు కొంత సమయం పడుతుంది" అని డీఎన్ భోయి బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














