జనరల్ డయ్యర్‌కు ‘సారీ’ చెప్పనంటూ కోర్టు జరిమానా కట్టిన ఈ నాయర్ ఎవరు, జలియన్‌వాలాబాగ్ దురాగతాన్ని ప్రపంచానికి చాటేందుకు ఆయనేం చేశారు?

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, బ్రిటిషు పాలనలో అత్యున్నత ప్రభుత్వ పదవుల్లో నియమితులైన అతి కొద్దిమందిలో నాయర్ ఒకరు.
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశం స్వాతంత్య్రం పొందడానికి చాలా కాలం ముందు, బ్రిటిషు సామ్రాజ్యంలో ఒక ధిక్కార స్వరం వలసవాద మారణహోమానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చే ధైర్యం చేసి, దానికి మూల్యం చెల్లించింది.

బ్రిటిషు పాలనాకాలంలో అత్యున్నత ప్రభుత్వ పదవులలో నియమితులైన కొద్దిమంది భారతీయులలో న్యాయవాది సర్ చెత్తూర్ శంకరన్ నాయర్ ఒకరు.1919లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ తర్వాత వైస్రాయ్ కౌన్సిల్‌కు ఆయన రాజీనామా చేశారు.

1919లో, పంజాబ్‌లోని అమృత్‌సర్ జలియన్ వాలాబాగ్‌లో ఒక బహిరంగ సభలో పాల్గొన్న వందలాది మంది పౌరులను బ్రిటిషు దళాలు కాల్చి చంపాయి.

ఈ మారణకాండ జరిగి వందేళ్లయిన సమయంలో అప్పటి యూకే ప్రధాన మంత్రి థెరిసా మే ఈ విషాదాన్ని భారతదేశంలో బ్రిటన్ చరిత్రపై ''అవమానకరమైన మచ్చ''గా అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డయ్యర్ చర్యలను వెలుగులోకి తెచ్చిన నాయర్

అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్‌పై నాయర్ చేసిన విమర్శలు ఆయనపై పరువు నష్టం దావా వేయడానికి దారితీశాయి. ఇది అమాయకుల ఊచకోతను, బ్రిటిష్ అధికారుల చర్యలను వెలుగులోకి తీసుకురావడానికి సాయపడింది.

‘‘ఆ సమయంలో నాయర్ చాలా వివాదాస్పద వ్యక్తి'' అని కేపీఎస్ మీనన్ తన జీవిత చరిత్రలో నాయర్ గురించి ప్రస్తావించారు. మీనన్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి.

నాయర్‌కు స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, అతివాద రాజకీయాలపై అయిష్టత ఉంది. వలస పాలనపైనా, భారత స్వాతంత్య్ర పోరాట కథానాయకుడు, ప్రస్తుతం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీపైనా విమర్శనాత్మకంగా మాట్లాడారు.

నాయర్ కుమార్తె సరస్వతిని మీనన్ వివాహం చేసుకున్నారు.

సర్వశక్తిమంతుడైన బ్రిటిషు వైస్రాయ్‌ను ముఖం మీదే అవమానించగలిగిన, మహాత్మా గాంధీని బహిరంగంగా వ్యతిరేకించగలిగిన ఏకైక వ్యక్తి నాయరే అని మీనన్ రాశారు.

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేసరి చాప్టర్‌ 2లో అక్షయ్ కుమార్ నాయర్ పాత్ర పోషించారు.

‘పేదరికానికి నైతిక బాధ్యత బ్రిటిషు ప్రభుత్వానిదే’

ఇటీవలి దశాబ్దాలలో భారత్‌లో నాయర్ పేరు అంతగా వినిపించడం లేదు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఓ కోర్టు కేసు ఆధారంగా అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ చిత్రం కేసరి చాప్టర్ 2 వల్ల నాయర్ జీవితం ప్రజల దృష్టిని ఆకర్షించింది.

కేరళలోని ప్రస్తుత పాలక్కాడ్ జిల్లాలో 1857లో ఒక సంపన్న కుటుంబంలో నాయర్ జన్మించారు. ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు, న్యాయశాస్త్రం అభ్యసించడానికి ముందు డిగ్రీ చదివారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వద్ద అప్రెంటిస్‌గా తన వృత్తిని ప్రారంభించారు.

మద్రాస్ ప్రెసిడెన్సీలో 1887లో ఆయన సామాజిక సంస్కరణ ఉద్యమంలో చేరారు. తన కెరీర్ మొత్తంలో, వివాహం, మహిళల హక్కులపై అప్పటి హిందూ చట్టాలను సంస్కరించడానికి, కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఆయన పోరాడారు.

కొన్ని సంవత్సరాలు, ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఉన్నారు.

1897లో అమరావతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

"ప్రజల తీవ్ర పేదరికానికి నైతిక బాధ్యత బ్రిటిషు ప్రభుత్వానిదే'' అని తన ప్రసంగంలో విమర్శించారు

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013లో అప్పటి యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్ జలియన్‌వాలా బాగ్ మెమోరియల్‌ను సందర్శించారు.

వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా

నాయర్ 1899లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. వార్తాపత్రికల్లో వచ్చే దేశద్రోహ కథనాలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం గురించి తన ఆత్మకథలో ఆయన రాశారు, వాటిలో ది హిందూ వార్తాపత్రిక తొలి సంపాదకుడు, తన సన్నిహిత మిత్రుడు జి. సుబ్రహ్మణ్య అయ్యర్ రాసిన కథనాలు కూడా ఉండేవి. "చాలా సందర్భాలలో... ఆయన (సుబ్రహ్మణ్యం)పై ఎటువంటి చర్య తీసుకోవద్దని ఒప్పించగలిగాను'' అని రాసుకున్నారు.

నాయర్ 1908లో హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. నాలుగేళ్ల తర్వాత ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 1915లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన తర్వాత నాయర్ దిల్లీ వెళ్లారు. ఆ పదవిలో నియమితులైన మూడవ భారతీయుడు ఆయనే.

భారత్ తనను తాను పరిపాలించుకునే హక్కును ఆయన గట్టిగా సమర్థించారు. కౌన్సిల్‌లో ఉన్న సమయంలో రాజ్యాంగ సంస్కరణలకు మద్దతు ఇచ్చారు. 1918- 1919 వరకు, అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి ఎడ్విన్ మాంటేగుతో ఆయన చేసిన సంప్రదింపులు, అసమ్మతి చర్చలు...భారత్ క్రమంగా స్వయం పాలనను ఎలా సాధిస్తుందో వివరించే మాంటేగ్-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల నిబంధనలను విస్తరించడానికి సహాయపడ్డాయి.

"శంకరన్ నాయర్ మిగిలిన భారతీయులందరి కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగలడు. ఆయననను మనవైపు తిప్పుకోవడం చాలా అవసరం" అని ఆయా వర్గాల నుంచి తనకు హెచ్చరికలు అందాయని మాంటేగు తన డైరీలో రాసుకున్నారు.

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలపై కాల్పులు జరపాలని బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తన బలగాలను ఆదేశించారు.

జలియన్‌వాలాబాగ్ దురాగతంతో చలించి...

ప్రభుత్వ ప్రతినిధిగా నాయర్ కెరీర్‌లో కీలకమైన ఘట్టం జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఊచకోత. వైశాఖీ పండుగ రోజున జలియన్‌వాలాబాగ్‌లో వందలాది మంది నిరాయుధ భారతీయులను కాల్చి చంపారు. బ్రిగేడియర్ జనరల్ ఆర్‌ఈహెచ్ డయ్యర్ ఆదేశాల మేరకు సైనికులు జరిపిన కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 400 మంది మరణించారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. భారత వర్గాలు మరణాల సంఖ్య 1,000 కి దగ్గరగా ఉందని చెప్పాయి.

నాయర్ 1922లో రాసిన "గాంధీ అండ్ అనార్కీ" అనే పుస్తకంలో పంజాబ్‌లో జరిగిన సంఘటనల తర్వాత వెల్లువెత్తుతున్న ఆందోళనల గురించి రాశారు. జలియన్ వాలాబాగ్ కాల్పులు ఆ ప్రావిన్స్‌లో జరిగిన అతిపెద్ద అణచివేత చర్యలో భాగం .అక్కడ మార్షల్ లా అమలులో ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈ ప్రాంతానికి సంబంధం తెగిపోయింది. ఏ వార్తాపత్రికలనూ అనుమతించలేదు.

"దేశాన్ని పరిపాలించాలంటే, జలియన్ వాలాబాగ్‌‌లోలా అమాయకులను ఊచకోత కోయాల్సి వస్తే ఏ పౌర అధికారైనా ఎప్పుడైనా, సైన్యాన్ని పిలిపించి, ఇద్దరూ కలిసి జలియన్ వాలాబాగ్‌లో చేసినట్టుగా ప్రజలను ఊచకోత కోసే పరిస్థితి ఉంటే అటువంటి దేశంలో జీవించాల్సిన అవసరమే లేదు’’ అని ఆయన రాశారు.

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగింది.

అలా ప్రపంచం దృష్టికి..

ఒక నెల తర్వాత నాయర్ కౌన్సిల్‌కు రాజీనామా చేసి బ్రిటన్ వెళ్ళారు. ఈ ఊచకోతపై అక్కడి ప్రజలు స్పందించేలా చేయాలని ఆయన భావించారు.

ది వెస్ట్ మినిస్టర్ గెజిట్ సంపాదకునితో మాట్లాడినట్టు నాయర్ తర్వాత తన జ్ఞాపకాల్లో రాశారు. నాయర్ వెళ్లిన కొన్నిరోజులకే అమృత్‌సర్ మారణహోమం పేరుతో వెస్ట్‌మినిస్టర్ గెజిట్ ప్రచురించింది. ది టైమ్స్ సహా ఇతర పత్రికలు కూడా దీనిని ప్రచురించాయి.

"బ్రిటిష్ పాలనలో ఇంతకంటే దారుణమైన విషయాలు జరిగాయి, కానీ కనీసం దీన్నయినా అందరి దృష్టికి తీసుకెళ్లినందుకు నేను సంతోషిస్తున్నాను" అని నాయర్ రాశారు.

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జలియన్‌వాలాబాగ్ కాల్పుల్లో మరణాల సంఖ్య 1,000 కి దగ్గరగా ఉందని అనధికార లెక్కలు చెబుతున్నాయి.

క్షమాపణ చెబితే పరిహారం వద్దన్న డయ్యర్

నాయర్ రాసిన "గాంధీ అండ్ అనార్కీ" అనే పుస్తకం ఆ కాలంలోని అనేక మంది భారతీయ జాతీయవాదుల ఆగ్రహానికి గురైంది. గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆయన విమర్శిస్తూ, రాజ్యాంగ పద్ధతులు మన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైనప్పుడు ఉపయోగించాల్సిన ఆయుధం అదని వ్యాఖ్యానించారు.

ఈ పుస్తకంలో జనరల్ డయ్యర్‌పై ఆయన రాసిన కొన్ని భాగాలే 1924లో నాయర్‌పై పరువు నష్టం దావాకు ఆధారం అయ్యాయి. డయ్యర్‌ను నాయర్ ఉగ్రవాదిగా ఆరోపించారు. మార్షల్ లా విధించడానికి ముందు ప్రభుత్వం పాల్పడిన దురాగతాలకు డయ్యర్ బాధ్యులని నాయర్ ఆరోపించారు.

లండన్‌లోని కోర్ట్ ఆఫ్ కింగ్స్ బెంచ్‌లో ఐదు వారాల పాటు జరిగిన విచారణలో డయ్యర్‌కు అనుకూలంగా 11:1 తీర్పువచ్చింది, ఆయను 500 పౌండ్ల నష్టపరిహారం, 7,000 పౌండ్ల ఖర్చులు చెల్లించాలని తీర్పునిచ్చింది.

క్షమాపణ చెబితే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని డయ్యర్ ప్రతిపాదించారు. కానీ నాయర్ అందుకు నిరాకరించి డబ్బు చెల్లించారు.

విచారణలో వాంగ్మూలాల నివేదికను ది టైమ్స్‌లో ప్రతిరోజూ ప్రచురించారు. ఓడిపోయినప్పటికీ, ఈ దారుణాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనే తన లక్ష్యాన్ని కేసు సాధించిందని నాయర్ కుటుంబం చెబుతోంది.

జలియన్‌వాలా బాగ్, పంజాబ్, అమృత్‌సర్, డయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

నాయర్ కుటుంబం ఏం చెబుతోంది?

నాయర్ మునిమనవడు రఘు పలాట్, తన భార్య పుష్పతో కలిసి "ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్" అనే పుస్తకాన్ని రాశారు. ఈ కేసు "స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక అలజడిని" రేకెత్తించడానికి సహాయపడిందని ఆయన చెప్పారు.

"బ్రిటిషు వారు తమ ప్రజలతో న్యాయంగా వ్యవహరిస్తారని ఆశించలేనప్పుడు డొమినియన్ స్టేటస్ కలిగి ఉండటంలో అర్థం లేదని" కూడా ఇది చూపించిందని పుష్ప తెలిపారు. గాంధీ కూడా ఈ కేసును చాలాసార్లు ప్రస్తావించారని, విజయంపై ఆశ లేకుండా పోరాడడంలో నాయర్ ధైర్యం చూపించారని ఒకసారి రాశారని చరిత్రకారుడు పీసీ రాయ్ చౌదరి తర్వాత తెలిపారు.

ఆ కేసులో ఓడిపోయిన తర్వాత, నాయర్ భారత్‌లో తన వృత్తిని కొనసాగించారు. 1928లో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల పనితీరును సమీక్షించిన సైమన్ కమిషన్ భారత కమిటీకి ఆయన చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 1934లో 77 ఏళ్ల వయసులో మరణించారు.

"విదేశీ ఆధిపత్యం, స్థానిక ఆచారాల బానిసత్వం నుంచి తన దేశాన్ని విముక్తి చేయడంపై తన ఆలోచనలు, శక్తులన్నింటినీ నాయర్ కేంద్రీకరించారు. రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి విజయాన్ని సాధించారు'' అని నాయర్ ప్రయాణం గురించి మీనన్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)