‘‘ఈ మొండి మనిషి ఎవరు?’’అని సర్దార్ పటేల్ గురించి గాంధీజీ ఎందుకు అన్నారు,పటేల్ గాంధేయవాదా, గాంధీ వ్యతిరేకా?

గాంధీజీ, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీజీతో సర్దార్ పటేల్
    • రచయిత, ఉర్విష్ కొఠారి
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్

'ఉక్కు మనిషి, బిస్మార్క్ ఆఫ్ ఇండియా, భారత్ ఐక్యతా రూపశిల్పి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఉన్న వ్యక్తి' ...నిజానికి ఇలాంటి చాలా గుర్తింపులు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిజమైన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి సరిపోవు.

భారత స్వతంత్ర పోరాటంలో సర్దార్ పటేల్, గాంధీ మధ్య సంబంధాలు ముఖ్యమైన అధ్యాయం. దీనిపై ఉన్న సైద్ధాంతిక వివరణలు వివాదాస్పదమయ్యాయి. సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారంతా పటేల్ రాజకీయ అస్తిత్వం మొత్తం గాంధీజీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని నమ్ముతారు.

స్వతంత్ర పోరాటంలో భాగమైన మౌలానా ఆజాద్ కూడా తన ఆటోబయోగ్రఫీలో గాంధీజీ లేకపోతే పటేల్ శూన్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. స్వాతంత్య్రానంతర తొలి కేబినెట్లో ఆజాద్, పటేల్ మంత్రివర్గ సహచరులు. మరోవైపు రైట్ వింగ్ భావజాలం ఉండేవాళ్లు పటేల్ లేకపోతే గాంధీజీ ఆ స్థాయిలో ఆ విజయాలు సాధించేవారు కాదని నమ్ముతారు.

గాంధీజీని గుడ్డిగా అనుసరించిన వ్యక్తిగా పటేల్‌ను వారి సమకాలీనుల్లో కొందరు గుర్తిస్తే, గాంధీజీకి పటేల్ అనుచరుడు మాత్రమే కాదని, గాంధీజీకి సర్వం పటేలే అని మరి కొందరు నమ్మారు.

ఈ వాదనలను పక్కనపెడితే గాంధీజీ చెప్పినట్టల్లా సర్దార్ నడుచుకోలేదు. ఆయన చేయాలనుకున్నది చేశారు.

గాంధీజీకి, పటేల్‌కు మధ్య దాదాపు 30 ఏళ్ల ప్రజాజీవితానికి సంబంధించి ఇలాంటి అపోహలు, తీవ్రమైన అభిప్రాయాలు చాలా ప్రచారంలో ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సమావేశంలో సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Sardar Patel National Museum Bardoli

ఫొటో క్యాప్షన్, గాంధీజీ ఆలోచనలు, ఆయన చెప్పే మాటలు తొలిరోజుల్లో సర్దార్ పటేల్‌కు హాస్యంలా అన్పించేవి.

స్థిరమైన మిత్రుడిగా మారిన మొండి మనిషి

గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి అహ్మదాబాద్ వచ్చి స్థిరపడే సమయానికి, 40 ఏళ్ల బారిస్టర్ వల్లభ్ భాయ్ పటేల్ అహ్మదాబాద్‌లో క్రిమినల్ లాయర్‌గా సంపన్న జీవితం గడుపుతున్నారు. అప్పటికి రాజకీయాలపై ఆయనకు ఆసక్తి లేదు.

గాంధీజీ ఆలోచనలు, ఆయన చెప్పే మాటలు తొలిరోజుల్లో సర్దార్ పటేల్‌కు హాస్యంలా అన్పించేవి. చంపారన్‌ సత్యాగ్రహం ఉద్యమంలో గాంధీజీ మానసిక స్థైర్యం, భయం లేకుండా ముందుకు వెళ్లడం లాయర్ పటేల్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి.

''ఈ వ్యక్తి విభిన్నమైన మనిషి'' అని గాంధీజీ గరించి పటేల్ అనుకున్నారు. ఆయన చేతల మనిషని, మాటలకే పరిమితమయ్యే వ్యక్తి కాదని, తన విధానాల కోసం చనిపోవడానికి సిద్ధమయ్యేటంత శక్తిమంతుడని భావించారు. కొన్నేళ్ల తర్వాత గాంధీజీ, పటేల్ గుజరాత్ సభలో పాల్గొన్నారు. తర్వాతి రోజుల్లో అది కాంగ్రెస్ గుజరాత్ ప్రొవిన్షియల్ కమిటీగా మారింది. ఆ సమయంలో ఖేడా జిల్లాలో భారీ వర్షాలకు పంటపొలాలు కొట్టుకుపోయాయి. నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది.

పరిస్థితిని లోతుగా పరిశీలించిన తర్వాత అన్యాయానికి వ్యతిరేకంగా భారత్‌లో తొలిసారి సత్యాగ్రహం ప్రారంభించాలని గాంధీజీ భావించారు. తర్వాత లాయర్‌గా తన ప్రాక్టీస్‌ను వదిలిపెట్టేందుకు పటేల్ సిద్ధమయ్యారు. నడియాడ్‌లో గాంధీజీతో కలిసి ముందుకు సాగడమే తర్వాత పటేల్ పని అయిపోయింది.

మిగతావాళ్లంతా మాటలకే పరిమితమని, స్వాతంత్య్రం తేగల ఏకైక వ్యక్తి గాంధీజీనే అని పటేల్ భావించారు. గాంధీజీతో దగ్గరగా అనుబంధం ఏర్పడిన తర్వాత పటేల్...గాంధీజీ ఆలోచనలకు, వ్యక్తిత్వానికి పూర్తిగా ప్రభావితమయ్యారు.

ఖేడా సత్యాగ్రహం ముగింపు సమయంలో పటేల్ గురించి గాంధీజీ అన్న మాట చాలా ప్రసిద్ధిగాంచింది.

''నేను మొదటిసారి పటేల్‌ను కలిసినప్పుడు ఈ మొండి మనిషి ఎవరు? ఆయనేంచేస్తారు? అనుకున్నా. కానీ ఇక్కడకు వచ్చినప్పుడు పటేల్‌ను కచ్చితంగా చూడాలనుకున్నా. నేను పటేల్‌ను కలిసి ఉండకపోతే ఇక్కడ ఇదంతా జరిగేది కాదు. సోదరుడితో నాకు మంచి అనుబంధమేర్పడింది'' అని గాంధీజీ చెప్పారు.

పటేల్ ప్రాముఖ్యత గురించి చెప్పడానికి గాంధీజీ అభిప్రాయం గురించి తరచూ ప్రస్తావిస్తుంటారు. ప్రత్యేక పోరాటం సాగుతున్న పరిస్థితుల్లో గాంధీజీ పటేల్ గురించి ఆ అభిప్రాయం చెప్పారన్న విషయం గుర్తుంచుకోవాలి.

తర్వాతిరోజుల్లో వారిద్దరి అనుబంధం మరింతగా పెరిగింది. గాంధీజీ జీవితంలో పటేల్ ప్రాముఖ్యాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ అభిప్రాయాన్ని తప్పుగా అర్ధంచేసుకోకూడదు.

గాంధీజీ, సర్దార్ పటేల్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాపు', 'బాపూజీ'లతో సర్దార్ పటేల్ కుమార్తె మణిబెహన్

సత్యాగ్రహ నాయకుడు, గాంధీజీకి సైనికుడు

1920వ దశాబ్దం సత్యాగ్రహానికి ప్రఖ్యాతి గాంచింది. గాంధీజీ విధానంలో, ఆయన నియమాలను పాటిస్తూ బొర్సాద్, బర్డోలి సత్యాగ్రహాలను పటేల్ నిర్వహించారు. బర్డోలి సత్యాగ్రహం పటేల్‌ను సర్దార్‌గా మార్చింది.

గాంధీజీలానే పటేల్ కూడా తన సహచరులు అంకితభావంతో పనిచేసేలా చూసుకునేవారు. బోర్సాద్, బర్డోలి సత్యాగ్రహాలను గాంధీజీ లేకుండా పటేల్ నిర్వహించడమే దీనికి సాక్ష్యం.

గాంధీజీని కలవడానికి ముందు పటేల్‌కు హింస, అహింస, నిజం, అబద్ధం వంటివాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఉద్యోగం చేయడం, సంతోషంగా జీవించడం మాత్రమే అప్పటిదాకా ఆయన జీవితం. గాంధీజీని కలిశాక కూడా పటేల్ ఒక్కసారిగా మొత్తం మారిపోలేదు.

ఖేడా సత్యాగ్రహ సమయంలో పటేల్ నెమ్మదిగా లా ప్రాక్టీస్ వదిలిపెట్టారు. ఇంగ్లీష్ వస్త్రధారణ వదిలేసి, నిరాడంబరత అలవర్చుకున్నారు. గాంధీజీ అనుచరుడిగా మారేముందు, తర్వాత కూడా గాంధీయిజం పేరుతో సాగుతున్న జడత్వాన్ని విమర్శించడానికి ఎప్పుడూ ఆలోచించలేదు. గాంధీజీతో కూడా ఆయన దీనిపై జోకులేసేవారు.

గాంధీజీకి అతిదగ్గరి అనుచరుల్లో పటేల్ ఒకరయినప్పటికీ ఆయన గాంధీ టోపీ పెట్టుకున్న ఫోటో ఒక్కటి కూడా కనిపించదు. పటేల్ కుమారుడు అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమంలో పెళ్లిచేసుకున్నారు. కానీ పటేల్ ఆశ్రమంలో ఎప్పుడూ ఉండలేదు.

దండి మార్చ్‌లో 1930లో అరెస్టయ్యేవరకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నట్టు ఆయన చెప్పారు. తర్వాత గాంధీజీ అనుచరుడిగా పటేల్ నిరాడంబరత, ధైర్యం, అంకితభావాన్ని అనుసరించారు.

1940లకు ముందు గాంధీజీ, పటేల్‌కు మధ్య భేదాభిప్రాయాలుండేవి. ఆ తర్వాత గాంధీజీ అభిప్రాయాలను పటేల్ అంగీకరించారు.

''పటేల్ ఒక సైనికుడు. తనను తాను మార్చుకోవడంపై ఆయన దృష్టిపెట్టారు. అంటే దానర్థం ఆయనకు సొంత అభిప్రాయాలు లేవని కాదు. మూలాలపై పూర్తి ఒప్పందం ఉంటే దానిపై విస్తృతంగా ప్రశ్నలు సంధించడం సరైనది కాదని ఆయన భావిస్తారు. కొన్నింటిపై ఆయనకు భిన్నాభిప్రాయాలుంటే..మేం విభిన్నదారుల్లో వెళతాం'' అని 1931లో బ్రిటిష్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీజీ చెప్పారు.

గాంధీజీ కోరిక మేరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకోవడం ద్వారా ఆయన నిజమైన అనుచరుడని పటేల్ అనిపించుకున్నారు. ఇది జరిగింది ఒక్కసారి మాత్రమే కాదు.

నెహ్రూ-గాంధీజీ-పటేల్

ఫొటో సోర్స్, Copyright-4

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో అధికార మార్పిడికి సంబంధించిన చర్చల్లో సర్దార్ జవహర్‌లాల్ నెహ్రూ గాంధీతో విభేదించారు.

రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనా నిర్ణయాలు

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో పడింది. గాంధీజీ అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే, పటేల్ సహా కాంగ్రెస్ నాయకులు దేశాన్ని రక్షించడం కోసం అవసరమైతే హింస కచ్చితంగా ప్రయోగించాల్సిఉంటుందని భావించారు.

'' నేను చెప్పే విషయం మీకు నిజమనిపిస్తేనే నన్ను అనుసరించండి. లేదంటే అవసరమైతే హింస ప్రయోగించాల్సిఉంటుందన్న తీర్మానాన్ని ఆమోదించండి'' అని గాంధీజీ అన్నారు.

గాంధీ ఆదేశం ఇస్తే దాన్ని తాను సంతోషంగా పాటిస్తానని, కానీ ఆయన మనం ఆలోచించాల్సిందిగా సూచించారని, ఈ విషయంలో మనం ఆయన్ను మోసం చేయకూడదని పటేల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గాంధీజీతో బహిరంగంగా విభేదించాల్సిరావడం పటేల్‌కు బాధ కలిగించింది.

''నువ్వు ఎందుకు గందరగోళంలోఉన్నావు? నువ్వు చేసేది సహేతుకమైనది. ఎందుకంటే ఓ వ్యక్తి సొంత బలాన్ని, అభిప్రాయాన్ని అనుసరించాలి. ఏమన్నా పొరపాటు చేసినా...దాన్ని సరిదిద్దలేరా..?'' అని పటేల్‌కు గాంధీజీ లేఖరాశారు. పటేల్ సంశయాన్ని తొలగించేందుకు గాంధీజీ ఈ లేఖరాశారు.

ఆ తర్వాత ఆత్మ రక్షణ సందర్భం రాలేదు. దీంతో ఆ తీర్మానానికి అర్ధం లేకుండా పోయింది. ఇంకొన్ని విషయాల్లోనూ గాంధీజీ వైఖరికి భిన్నంగా పటేల్ నడుచుకున్నారు. 1917 నుంచి గాంధీజీని అనుసరిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో పటేల్‌కు భిన్నమైన వైఖరి ఉంది.

క్విట్ ఇండియా ఉద్యమం, జైలు జీవితం తర్వాత గాంధీజీ 1944లో, పటేల్ 1945లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత అధికార మార్పిడికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన చర్చలలో పటేల్, నెహ్రూ ఏకాభిప్రాయంతో ఉంటే గాంధీజీ వారితో విభేదించారు.

1937లో జరిగిన మొదటి ప్రావిన్స్ ఎన్నికల్లో గాంధీ విధానాల ప్రకారం వారు పోటీచేయలేదు. పటేల్ కాంగ్రెస్ హై కమాండ్ పాత్రలో ఉండేవారు. అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎన్నికల కోసం నిధులు సేకరించడం వల్ల పార్టీకి చాలా ఉపయోగం కలిగిందని నిరూపితమైంది.

1937 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. కానీ 1946 ఎన్నికల్లో కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య తీవ్ర పోటీనెలకొంది.

ఫలితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. ఉమ్మడి ప్రభుత్వంలో లీగ్‌తో ఏర్పడ్డ భేదాభిప్రాయాలతో విభజన గురించి ఆలోచించకుండా తప్పించుకునే మార్గమే లేదని పటేల్ గ్రహించారు. పటేల్ నిర్ణయాన్ని నెహ్రూ సమర్థించారు.

సర్దార్ వల్లబ్‌బాయ్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పటేల్ గాంధీజీకి వ్యతిరేకీ కాదు, గాంధేయవాదీ కాదు..

హిందూ ముస్లిం సమస్యపై భిన్నాభిప్రాయాలు

సమస్యలకు పరిపాలనా పరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించే పటేల్‌కు, తన నియమాలకు కట్టుబడి ఉన్న గాంధీజీకి మధ్య ఉన్న అంతరం ఇటీవలి సంవత్సరాల్లో కొన్నికోణాల్లో ఎక్కువ కనిపిస్తోంది. ఇద్దరికీ మధ్య ఉన్న అనుబంధం, గౌరవం చాలా లోతైనది. కానీ చరిత్రను పణంగా పెట్టి మాత్రమే ఇది నిర్లక్ష్యానికి గురవుతోంది.

దేశంలో వ్యాప్తి చెందుతున్న భయంకరమైన మతహింసతో గాంధీజీ ఎంతో బాధపడ్డారు. ఈ హింసను నియంత్రించేందుకు ప్రయత్నించారు. అత్యంత భయంకరమైన హంతకుడి మనసు మార్చేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా వదులుకోని స్వాధు స్వభావం గాంధీజీది.

పటేల్ దృష్టిలో హిందూ-ముస్లిం సంక్షోభం శాంతిభద్రతలకు సంబంధించిన పెద్ద సమస్య. ముస్లింలను బుజ్జగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టడం, వారి నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేయడం వంటివాటిపై గాంధీ, నెహ్రులా పటేల్‌కు శ్రద్ధ ఉండేది కాదు. పటేల్ ముస్లింల వ్యతిరేకి అంటూ పెద్ద ఎత్తున గాంధీజీకి ఫిర్యాదులు అందేవి. చివరి కొన్ని నెలలు తప్ప గాంధీజీ దిల్లీకి దూరంగా కోల్‌కతా, నోఖాలి, బిహార్‌లో ఉన్నారు.

ఆ సమయంలోనూ, ఆ తర్వాత మహదేవ్‌భాయ్ దేశాయ్‌ (గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి) లేరని పటేల్ చాలా బాధపడేవారు. ఆయన ఉండుంటే గాంధీజీకి, తనకు మధ్య ఇంత అంతరం ఉండేది కాదని భావించారు. ప్రార్థనాస్థలంలో బాంబు విసరడం ద్వారా గాంధీని చంపేందుకు జరిగిన హత్యాయత్నం తర్వాత హోం మంత్రిగా గాంధీజీకి భద్రత పెంచాలని పటేల్ భావించారు. కానీ గాంధీజీ అంగీకరించలేదు. అయితే సాధారణ దుస్తులు ధరించిన పోలీసుల సంఖ్యను పెంచారు.

ఆర్‌ఎస్ఎస్ భావజాలంతో ఉండే నాథూరామ్ గాడ్సే జనవరి 30న గాంధీజీని హత్యచేశారు. ఆ తర్వాత రోజుల్లో గాంధీజీ హత్యకు పటేల్, హోంమంత్రిగా ఆయన వైఫల్యాలే కారణమని జయప్రకాశ్ నారాయణ్ సహా పలువురు విమర్శించారు.

గాంధీజీ హత్య తర్వాత దాదాపు మూడు దశాబ్దాలు జీవించిన జయప్రకాశ్ నారాయణ్, తర్వాతి రోజుల్లో పటేల్‌ను అర్ధం చేసుకోవడంలో తన తప్పును అంగీకరించి, ఆయనపై చేసిన ఆరోపణలకు పశ్చాత్తాపం వ్యక్తంచేశారు.

కొన్ని విషయాల్లో గాంధీతో విభేదాలున్నప్పటికీ ఆయనంటే అపారమైన గౌరవం ప్రదర్శించే పటేల్ ఈ ఆరోపణలతో తీవ్రంగా బాధపడ్డారు.

గాంధీజీ హత్య జరిగిన కొంతకాలానికే పటేల్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. స్పృహలోకి వచ్చిన వెంటనే ఆయన అడిగిన మొదటి ప్రశ్న...''నన్నెందుకు బతికించారు. నేను బాపు దగ్గరికి వెళ్లేవాడిని'' అని అన్నారు.

గాంధీజీ, పటేల్ అనుబంధంపై అనేక రకాల ప్రచారం

ఫొటో సోర్స్, MAHATAMAGANDHI.ORG

ఫొటో క్యాప్షన్, గాంధీజీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్‌భాయ్ దేశాయ్‌తో ఎరవాడ జైలులో పటేల్ ఎక్కువ సమయం గడిపారు.

పటేల్ నిజంగా ఎవరు?

ఎరవాడ జైలులో పటేల్, గాంధీజీ, మహదేవ్‌భాయ్‌తో ఎక్కువ సమయం గడిపారు. ఓ తల్లిలా పటేల్ తామిద్దరినీ చూసుకున్నారని గాంధీజీ చెప్పారు. మితవాదులు ప్రచారం చేసేటట్టుగా ఆయన గాంధీ వ్యతిరేకి కాదు. అలాగే కమ్యూనిస్టులు చెప్పేటట్టుగా ఆయన గాంధేయవాది కూడా కాదు.

గాంధీజీని కలిసిన తర్వాత పటేల్ తన వ్యక్తిత్వానికి ఆటంకం కలగకుండా, స్వతంత్రను కోల్పోకుండా తన జీవితంలో విప్లవాత్మక మార్పులు తెచ్చుకున్నారు. కొన్ని విషయాల్లో గాంధీజీ ఉత్తమ అనుచరుల్లో ఒకరిగా మారారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)