హత్యకేసులో చైనా టీనేజర్‌కు జీవితఖైదు విధించిన కోర్టు...అసలేం జరిగిందంటే..

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 13 ఏళ్ల పిల్లాడిని హత్య చేయడం చైనాలో ప్రజల ఆగ్రహానికి కారణమైంది

చైనాలో క్లాస్‌మేట్ మరణానికి కారణమైన ఇద్దరు టీనేజర్లకు కోర్టు శిక్ష విధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారిలో ఒకరికి జీవితఖైదు విధించింది.

ఈ కేసులో నిందితుల అసలు పేర్లు కాకుండా ఇంటిపేర్లు మాత్రమే బయటకు వచ్చాయి.

చైనాలోని హెబీ ప్రావిన్సుకు చెందిన జాంగ్, లీ అనే ఇద్దరు టీనేజర్లను ఈ కేసులో దోషులుగా పేర్కొన్నారు.

మార్చిలో నేరం చేసినప్పుడు వారి వయస్సు 13 ఏళ్లుగా గుర్తించారు.

తమ క్లాస్‌మేట్‌ వాంగ్‌ను చంపి, అతని డబ్బును పంచుకోవాలని వారిద్దరూ పథకం పన్నారు. వాంగ్‌ను పారలాంటి ఆయుధంతో దాడి చేసి చంపిన తర్వాత, పాడుబడిన ఒక కూరగాయల తోటలో అతడిని పాతిపెట్టారని సోమవారం కోర్టు వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘క్రూర పద్ధతులు, నీచ పరిస్థితులు’’

ఈ ఘటనలో వారు చాలా క్రూరమైన పద్ధతులను అనుసరించారని, వారు నేరం చేసిన పరిస్థితులు చాలా నీచమైనవని కోర్టు వ్యాఖ్యానించింది.

నిందితులిద్దరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

ఈ కేసు మొదటిసారి వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

తోటి విద్యార్థుల్లో ముగ్గురు చాలా కాలం పాటు వాంగ్‌ను వేధించారని మార్చిలో వాంగ్ కుటుంబీకులు, వారి లాయర్ ఆరోపించారు.

జాంగ్, లీ అనే ఇద్దరి కారణంగా వాంగ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోమవారం కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ఘటనకు సంబంధించి 'మా' అనే విద్యార్థి పేరు కూడా వినిపించింది. అయితే, అతనికి ఎలాంటి క్రిమినల్ శిక్ష విధించలేదు.

మార్చి 3వ తేదీన వాంగ్‌ను స్కూటర్ మీద కూరగాయల తోటకు జాంగ్ తీసుకొచ్చారు. మరో స్కూటర్ మీద లీ, మా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాంగ్‌ను చంపడానికి జాంగ్ రచించిన ప్లాన్ గురించి 'మా' అనే విద్యార్థికి 'లీ' చెప్పారు.

నలుగురు ఆ తోటకు చేరుకోగానే జాంగ్ ఒక పారతో వాంగ్‌ను చావబాదడం మొదలుపెట్టారు. లీ అతనికి సహాయపడ్డారు. వారిద్దరు దాడి చేయడం చూసిన మా అక్కడి నుంచి పారిపోయారు.

జాంగ్, లీ కలిసి బాధితుడిని పాతిపెట్టారు. తరువాత జాంగ్, వాంగ్ ఫోన్‌ను తెరిచి వీచాట్ అకౌంట్‌లోని డబ్బును తన అకౌంట్‌తో పాటు లీ అకౌంట్‌కు పంపించాడు. ఫోన్‌లోని సిమ్ కార్డు తీసేసి దాన్ని ధ్వంసం చేయాలని 'మా'కు చెప్పాడు.

తర్వాత లీ, మా, జాంగ్‌లను పోలీసులు విచారించారు. మా, పోలీసులను ఘటనాస్థలానికి తీసుకెళ్లాడు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోర్టు టీనేజర్లకు విధించిన శిక్ష పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి.

ప్రధాన ముద్దాయి జాంగ్

ఈ నేరంలో ప్రధాన దోషి జాంగ్ అని కోర్టు తేల్చింది. వాంగ్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేసిన జాంగ్ మిగతా ఇద్దరిని ఇందులోకి లాగాడని, వాంగ్ మరణానికి అతనే మూల కారణమని కోర్టు స్పష్టం చేసింది.

అదే సమయంలో లీ కూడా ఈ నేరంలో పాల్గొని, డబ్బు తీసుకున్నాడని కోర్టు తెలిపింది.

నేరాలకు పాల్పడిన మైనర్లకు వర్తించే 'కరెక్షన్ అండ్ ఎడ్యుకేషన్' పద్ధతిని 'మా' అనుసరించాలని అధికారులు చెప్పారు.

సోమవారం కోర్టు ఈ టీనేజర్లకు విధించిన శిక్ష పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి. కొంతమంది మాత్రం ఈ శిక్షలు చాలా తేలికైనవని వ్యాఖ్యానిస్తున్నారు.

''12 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి, విడుదలై బయటకు వచ్చే సమయానికి యువకుడిగానే ఉంటాడు. అతను బయటకు వచ్చి సమాజం మీద ప్రతీకారంతో రగిలిపోవద్దని ఆశిస్తున్నా'' అని వీబోలో ఒకరు వ్యాఖ్యానించారు.

మరికొందరు వాంగ్ మరణానికి సంతాపం తెలిపారు.

''ఒక పేరెంట్‌గా ఆ పిల్లాడిని తలుచుకొని బాధపడుతున్నా'' అని ఒకరు రాయగా, ''ఇది చాలా బాధాకరం'' అని మరొకరు వీబోలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)