జిమ్మీ కార్టర్: వేరుశనగ పొలం నుంచి వైట్‌హౌస్ వరకు

జిమ్మీ కార్టర్, అమెరికా, ఫార్మర్ యూఎస్ ప్రెసిడెంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1976లో జార్జియాలోని తన వేరుశనగ పొలంలో జిమ్మీ కార్టర్

అమెరికా ప్రజలకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పనని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జిమ్మీ కార్టర్ నూరేళ్ల వయసులో ఆదివారం మరణించారు.

వాటర్‌గేట్ కుంభకోణం తర్వాత తలెత్తిన గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడయ్యారు జార్జియాకు చెందిన ఈ వేరుశనగ రైతు.

వియత్నాం డ్రాఫ్ట్ ఎగవేతదారులకు క్షమాభిక్ష ప్రకటించిన, వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణించిన మొదటి అమెరికన్ ప్రెసిడెంట్‌గా నిలిచారు.

అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసిన జిమ్మీ కార్టర్, ఈజిప్ట్ - ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు.

అయితే, ఇరాన్ బందీల సంక్షోభం, అఫ్గానిస్తాన్‌పై సోవియెట్ యూనియన్ దాడిని ఆపడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

1980 ఎన్నికల్లో రోనాల్డ్ రీగల్ చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు. కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈయనకు అనుకూల ఫలితాలు వచ్చాయి.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైట్‌హౌస్ బాధ్యతల నుంచి నిష్క్రమణ తర్వాత శాంతి, పర్యావరణం, మానవ హక్కుల వంటి అంశాలపై కార్టర్ నిర్విరామంగా కృషి చేశారు.

ఆయన కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమతి వరించింది.

అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం జీవించిన అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

2024 అక్టోబర్‌లో తన 100వ పుట్టినరోజు జరుపుకొన్నారు.

కేన్సర్ బారిన పడిన కార్టర్ 19 నెలల పాటు హాస్పైస్ కేర్‌(జబ్బు నయం కాకపోయినా బాధను వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నం)లో గడిపారు.

జిమ్మీ కార్టర్, అతని కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడి, 1976 అధ్యక్ష ఎన్నికలలో విజయాన్ని జరుపుకుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1976 అధ్యక్ష ఎన్నికల్లో విజయానంతరం అభివాదం చేస్తున్న జిమ్మీకార్టర్, పక్కన ఆయన కుటుంబ సభ్యులు

జిమ్మీ కార్టర్ పూర్తి పేరు జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్. 1924 అక్టోబర్ 1న జార్జియాలోని ప్లెయిన్స్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. నలుగురు సంతానంలో ఈయన పెద్దవారు.

శ్వేతజాతి భావజాలం గల ఈయన తండ్రి వేరుశనగ వ్యాపారాన్ని ప్రారంభించారు. తల్లి లిలియాన్ ఒక రిజిస్టర్డ్ నర్స్.

కార్టర్ హైస్కూల్ రోజుల్లో బాస్కెట్‌బాల్ ఆడేవారు. యూఎస్ నేవీలో ఏడేళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే తన చెల్లెలి స్నేహితురాలు రోసాలిన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సబ్‌మెరైన్ ఆఫీసర్ అయ్యారు. 1953లో తండ్రి మరణించడంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టేందుకు నేవీ నుంచి వచ్చేశారు.

మొదటి ఏడాది కరవు కారణంగా పంట పోయినా వెనకడుగు వేయకుండా, వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించారు, ధనవంతుడయ్యారు.

కార్టర్ రాజకీయల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చారు. జార్జియా సెనేట్‌కు పోటీ చేయడానికంటే ముందు స్థానిక పాఠశాల, లైబ్రరీ బోర్డులకు ఎన్నికయ్యారు.

జిమ్మీ కార్టర్, అమెరికా, ఈజిప్ట్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1978లో క్యాంప్ డేవిడ్ వద్ద ఒప్పందం సందర్భంగా జిమ్మీ కార్టర్ సమక్షంలో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కరచాలనం

పౌరహక్కుల క్యాంపెయినర్‌గా..

పాఠశాలల్లో జాతివివక్ష ఉండకూడదన్న సుప్రీం కోర్టు నిర్ణయంతో అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా మారాయి.

దక్షిణాది రాష్ట్రానికి చెందిన రైతు నేపథ్యం కావడంతో, కార్టర్ ఈ సంస్కరణను వ్యతిరేకిస్తారని అంతా భావించారు కానీ కార్టర్ అభిప్రాయాలు తన తండ్రికి విరుద్ధంగా ఉన్నాయి.

సెనేట్‌లో రెండు పర్యాయాలు పనిచేసిన సమయంలోనూ జాతి భేద భావజాలమున్న వారితో వివాదాలకు దూరంగా ఉన్నారు కార్టర్. వారిలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు.

1970లో జార్జియా గవర్నర్ అయిన తర్వాత పౌరహక్కుల బలమైన మద్దతుదారుగా మారారు.

తన మొదటి ప్రసంగంలోనే ''నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నా. జాతి వివక్షకు కాలం చెల్లింది'' అని ప్రకటించారు.

కు క్లక్స్ క్లాన్ బయట ప్రదర్శించినట్లు, క్యాపిటల్ భవనం గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ చిత్రాలను ఏర్పాటు చేయించారు.

ఆఫ్రికన్ అమెరికన్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోకి తీసుకునేలా చేశారు.

అబార్షన్ చట్టం విషయంలో మహిళల హక్కులకు మద్దతు ఇచ్చినప్పటికీ, నిధుల పెంపుకు మాత్రం నిరాకరించారు.

తన ప్రభుత్వంలో మహిళలను కీలక స్థానాల్లో నియమించారు. లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ కల్పించే రాజ్యాంగ సవరణ(సమాన హక్కుల సవరణ)ను సమర్థించారు.

జిమ్మీ కార్టర్, మార్టిన్ లూథర్ కింగ్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జార్జియాలో మార్టిన్ లూథర్ కింగ్ తండ్రితో జిమ్మీ కార్టర్. 1960లలో పౌర హక్కుల కోసం కార్టర్ ప్రచారం చేశారు

వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణించిన మొదటితరం ప్రపంచ నాయకుల్లో ఒకరైన జిమ్మీ కార్టర్.. వైట్‌హౌస్‌లో జీన్స్, స్వెటర్లు ధరించేవారు. గదిని వేడిగా ఉంచేందుకు ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు కార్టర్ అలా చేసేవారు.

థియోడర్ రూజ్‌వెల్ట్, ఉడ్రో విల్సన్ తర్వాత నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మూడో అమెరికా ప్రెసిడెంట్‌ కార్టర్. అధ్యక్ష పదవీ కాలం తర్వాత చేసిన కృషికి ఆయనను నోబెల్ వరించింది.

''భూమిపై అతిపెద్ద సమస్య ఏంటంటే.. అత్యంత సంపన్నులు - పేద ప్రజల మధ్య పెరుగుతున్న అగాథం'' అని ఆయన నోబెల్ ఉపన్యాసంలో చెప్పారు.

నెల్సన్ మండేలాతో కలిసి శాంతి, మానవ హక్కులపై పనిచేసేందుకు కట్టుబడి ఉన్న ప్రపంచ నేతల గ్రూప్ ‘ది ఎల్డర్స్‌’ను కార్టర్ స్థాపించారు.

నెల్సన్ మండేలా, జిమ్మీ కార్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాంతి, మానవ హక్కుల కోసం నెల్సన్ మండేలాతో కార్టర్ కలిసి పనిచేశారు

నిరాడంబరమైన జీవనశైలి

పదవీ విరమణ తర్వాత కార్టర్ నిరాడంబరమైన జీవనశైలిని ఎంచుకున్నారు.

తాము పుట్టిన జార్జియాలోని ప్లెయిన్స్‌లో భార్య రోసాలిన్‌తో కలిసి సాధారణ జీవితం గడిపేందుకు హంగూఆర్భాటాలతో నిండిన కార్పొరేట్ శైలి జీవితాన్ని వదిలేశారు.

తాను రాజకీయాల్లోకి రాకముందు నివసించిన డబుల్ బెడ్రూం ఇంట్లోనే పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్న నిరాడంబరమైన అమెరికా అధ్యక్షుడు కార్టర్.

పోస్ట్ అంచనా ప్రకారం, ఆ ఇంటి విలువ సుమారు 1,67,000 డాలర్లు. అది వారి రక్షణ కోసం బయట పార్క్ చేసిన సీక్రెట్ సర్వీస్ వాహనాల విలువ కంటే తక్కువ.

తాను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లు 2015లో తెలిపారు. ఈయన తల్లిదండ్రులతో పాటు ముగ్గురు చెల్లెళ్లు కూడా క్యాన్సర్‌తోనే చనిపోయారు.

మరనాథ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం రోజు బోధనలు చేసేవారు, వాటికి డెమొక్రటిక్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఆశావహులను కూడా ఆహ్వానించేవారు.

2023 నవంబర్‌లో భార్య రోసాలిన్ కార్టర్ మరణించారు. ''నేను సాధించిన ప్రతిదానిలో నా భార్య సమాన భాగస్వామి'' అన్నారు కార్టర్.

చిన్నపట్టణంలో సంప్రదాయబద్దంగా పెరిగిన విధానం, తనలో సహజంగా పెంపొందిన ఉదారవాద భావాలు కార్టర్ రాజకీయ భావజాలంలో కొంత విరుద్ధంగా కనిపించేవి.

'' మీరు మత విశ్వాసాలు, ప్రజాసేవను వేర్వేరుగా చూడలేరు'' అని కార్టర్ అనేవారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)