ద్వారక: ఈ 'కృష్ణుడి నగరం'సముద్రంలో ఎన్నిసార్లు మునిగింది?

- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘శ్రీకృష్ణుడు మరణించిన తరువాత ద్వారకా నగరం మునిగిపోయింది. ఆ తర్వాత మళ్లీ నిర్మించారు. మళ్లీ మునిగిపోయింది. ఇలా ఐదుసార్లు నగరం నిర్మించారు’’ అనే నమ్మకం చాలాకాలంగా ఉంది.
అయితే, దీనికి మద్దతుగా శాస్త్రీయ లేదా పురావస్తు ఆధారాలు లేవు. అంతేకాదు, ప్రస్తుత ద్వారకా నగరం పురాతనమైనదేనా లేదా ద్వారక అనేది మరెక్కడైనా ఉందా? అనే చర్చ కూడా జరిగింది.
పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, సంప్రదాయాలతోపాటు, ప్రస్తుత ద్వారకా నగరం చుట్టూ ఉన్న దేవాలయాల శిథిలాలు ఈ చర్చకు ఆజ్యం పోశాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ద్వారకా నగరంలో జరిగిన తవ్వకాల్లో పురాతన నగరం గురించి అప్పటికే ఉన్న నమ్మకాలకు బలాన్నిచ్చే అనేక అంశాలను పరిశోధకులు గుర్తించారు.
దీంతో భూమి నుంచి సముద్రం దాకా ఇంకా అనేక తవ్వకాలు, పరిశోధనలు చేసేందుకు పురావస్తు శాస్త్రవేత్తలకు కొత్త అవకాశం దొరికింది.


ద్వారకలో అన్వేషణ
1947లో దేశ విభజనతో పాటే చారిత్రక, పురావస్తు ప్రాధాన్యమున్న ప్రదేశాలను కూడా విభజించారు. హరప్పా నాగరికతకు సంబంధించిన చారిత్రక ప్రదేశం సహా అనేక ముఖ్యమైన ప్రాంతాలు పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాయి.
భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుతం దేశంలోని ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలపై దృష్టి సారించారు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) చారిత్రక కట్టడాలు, పురాతన శిథిలాలు, స్థానిక సంప్రదాయాలు, పాత శాసనాల ఆధారంగా కొత్త అన్వేషణ ప్రాజెక్టులను ప్రారంభించింది.
గుజరాత్, మహారాష్ట్రలు విడిపోయిన మూడేళ్ల తర్వాత, పుణెలోని దక్కన్ కాలేజీకి చెందిన డాక్టర్ హస్ముఖ్ సంకాలియా నేతృత్వంలో ద్వారకలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
గుజరాత్ పురావస్తు శాఖ కూడా ఈ ప్రయత్నంలో భాగమైంది.

ఫొటో సోర్స్, Youtube Grab
పుస్తకంలో ఏముంది?
ఈ అన్వేషణ గురించి డెక్కన్ కాలేజ్ ‘ఎక్స్‌కావేషన్ ఎట్ ద్వారక’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. మొదటి అధ్యాయంలో డాక్టర్ సంకాలియా (8 నుంచి 17 పేజీల వరకు) కొంత రాశారు.
ద్వారకలో పురావస్తు పరిశోధనలు ప్రారంభం కావడానికి ముందు, డాక్టర్ జయంతిలాల్ థాకర్ అనే స్థానికుడు ద్వారక, దాని చుట్టుపక్కల భూమిని స్వయంగా అధ్యయనం చేశారు.
డాక్టర్ థాకర్ అధ్యయనం ప్రకారం ‘‘ద్వారకాధీశ ఆలయం చుట్టూ 35-40 అడుగుల లోతు వరకు జాగ్రత్తగా తవ్వితే ముఖ్యమైన అవశేషాలు బయటపడే అవకాశం ఉంది.’’ అని పేర్కొన్నారు.
డాక్టర్ సంకాలియా ఈ అధ్యయనాన్ని తార్కికమైనదిగా, సహేతుకమైనదిగా అభిప్రాయ పడ్డారు.
తవ్వకం ప్రక్రియలో ఎదురయిన సవాళ్లను పుస్తకంలో డాక్టర్ సంకాలియా ప్రస్తావించారు.
ఆలయానికి వాయువ్యంగా ఉన్న ఒక ఇంటిలో తవ్వకాలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతంతో పోలిస్తే ఈ ఇల్లు, ఆలయం మాదిరిగానే కొంచెం ఎత్తులో ఉంది. తవ్వకాల ప్రదేశానికి, జగత్ ఆలయానికి మధ్య ఒక చిన్న సందు మాత్రమే ఉంది. ఇది తవ్వకాలలో సాక్ష్యాలను కనుగొనే అవకాశాలను పెంచింది.
అయితే, కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఇంటిముందు ఇరుకైన సందు కారణంగా అక్కడ పని చేయాలంటే ముందుగా లోతైన కందకాన్ని తవ్వడం అవసరం. అంతేకాదు సమీపంలోని చాలా ఇళ్లకు సిమెంట్, సున్నం ప్లాస్టర్ లేవు.
సమీపంలోని ఇళ్లు దెబ్బతినకుండా, నివాసితులు తిరిగే సమయంలో మట్టి కూలిపోకుండా చూడాలి. ఈ పరిమితులను పరిగణనలోకి తీసుకుని పరిశోధకులు ప్రారంభంలో 25 x 20 అడుగుల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. కానీ ఇసుక నేల కారణంగా కందకం గోడలు కూలిపోవడం మొదలైంది.
దీంతో తవ్వకాల ప్రాంతాన్ని కేవలం 10 x 10 అడుగులకు తగ్గించారు. 20 అడుగుల లోతుకు చేరుకున్న తర్వాత, తవ్వకం స్థలాన్ని 6 x 6 అడుగులకు మరింత కుదించారు. నేల కూలిపోకుండా ఉండటానికి చెక్కలను ఏర్పాటు చేశారు.
ఇలా పరిశోధకులు చివరికి సుమారు 38 అడుగుల లోతుకు చేరుకున్నారు, అక్కడ వారికి రాతి నేల ఎదురైంది. ఇది ఆ కాలంనాటి సముద్ర మట్టం.

తవ్వకాల్లో ఏం దొరికాయి?
"ఒక మతపరమైన ప్రదేశం ఎక్కడ నాశనమైతే, అదే స్థలంలో దానిని పునర్నిర్మించాలి" అనే నమ్మకం కూడా ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రదేశంలో తవ్వకాలు జరిపేలా పరిశోధకులను ప్రేరేపించింది.
దీన్ని ఒక చిన్న ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. ఒక పుస్తకం ఏడు సిరీస్‌లుగా ప్రచురితమైంది. ఒకటి నుంచి ఏడు పుస్తకాలు టేబుల్‌పై ఒకదానిపై మరొకటి పెట్టారు. సమయంపరంగా పైన ఉన్నది కొత్త పుస్తకం, దిగువన ఉన్నది పాత పుస్తకం.
తవ్వకాల సమయంలో బయటపడిన ఏడవ లేయర్ (దిగువ పుస్తకం) ప్రారంభ కాలానికి చెందినది. అది బహుశా క్రీస్తుపూర్వం 1వ లేదా 2వ శతాబ్దం నాటిది. ఇది దాదాపు ఐదు మీటర్ల మందంతో ఉంది. దీనిలో పెయింట్ చేసిన కుండ ముక్కలు, గాజులు, ఇనుప ముక్క కనుగొన్నారు.
తదుపరి వరుస AD 4వ శతాబ్దం నాటిది, దాదాపు రెండున్నర మీటర్ల మందంతో ఉంది. ఇందులో కుండలు, అలాగే ఎరుపు రంగు పాలిష్ చేసిన సామగ్రి, జాడీలున్నాయి. వీటిని సాధారణంగా పశ్చిమ భారతదేశంలోని ఓడరేవు ప్రాంతాల్లో మద్యం, చమురు వ్యాపారం కోసం ఉపయోగించారు.
ఆ సమయంలో ప్రజలు ఈ ప్రాంతంలో నివసించినట్టు ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. తరువాతి కాలంలో చెక్కిన రాతి అవశేషాలు కనుగొన్నారు. అవి అక్కడి పురాతన ఆలయానికి చెందినవని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తదుపరి రెండు వరుసలు మధ్య తేడాలు తక్కువగా ఉన్నాయి. నాలుగో వరుసలో పాలీక్రోమ్ (బహుళ-రంగు) బ్యాంగిల్స్ లేవు.
మొదటి మూడు వరుసల్లో గుజరాత్ సుల్తానేట్ కాలం నాటి నాణేలు, పాలీక్రోమ్ గాజులు, మెరుస్తున్న కుండలు ఉన్నాయి. అవి ఇటీవలి కాలానికి చెందినవిగా సూచిస్తున్నాయి.
గాజు బ్యాంగిల్స్, మెరుస్తున్న కుండలు సాధారణంగా ఇస్లామిక్ శకంతో సంబంధం కలిగి ఉంటాయి. దాదాపు 10వ శతాబ్దంలో ఓఖా మండల్ ప్రాంతానికి చెందిన ప్రజలు మధ్యధరా ప్రాంతంలోని వారితో సముద్ర మార్గంలో వ్యాపారం చేశారని, అక్కడి వస్తువులను ఈ ప్రాంతానికి తీసుకువచ్చారని పరిశోధకులు భావిస్తున్నారు.
తవ్వకాలలో బయటపడిన నమూనాలు చాలా తక్కువగా ఉన్నాయి. సముద్రపు నీటి తేమ కారణంగా అవి దెబ్బతిని ఉండొచ్చు. పురావస్తుపరంగా వాటి ఖచ్చితమైన వయస్సును గుర్తించడం కష్టం.
ఐదు ఆలయాలు
1980లలో ఎస్.ఆర్. రావు నేతృత్వంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారకలోని ఆలయ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధన తర్వాత సముద్ర గర్భం వరకు విస్తరించింది.
రావు తన "మెరైన్ ఆర్కియాలజీ" పుస్తకంలో (50-54 పేజీలలో) ద్వారక ఎన్నిసార్లు ధ్వంసమైంది, ఆ కాలాల నుంచి ఎలాంటి ఆధారాలు లభించాయో వివరించారు. ఆయన ప్రకారం మొదటి ద్వారక క్రీస్తుపూర్వం 14వ-15వ శతాబ్దంలో సముద్రంలో మునిగింది. పరిశోధకులు ఆ కాలానికి సాక్ష్యంగా ప్రకాశవంతమైన ఎరుపు కుండలను కనుగొన్నారు.
BCE 10వ శతాబ్దంలో రెండవసారి సముద్రంలో మునిగిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత క్షత్రప కాలం (BCE మొదటి శతాబ్ధం)లో మూడోసారి ఇక్కడ ఆవాసాలను నిర్మించారు. ఎర్రని పాలిష్ చేసిన కుండలు క్షత్రప కాలం నాటి నాణేలు కూడా ఇక్కడ కనుగొన్నారు. ఈ కాలంలోనే మొదటి ఆలయం ఉనికిలోకి వచ్చింది.
ఆలయం రాయికి సున్నం ఉంది. దానిపై కొన్ని బొమ్మలు కనిపిస్తాయి.
రెండో ఆలయం మొదటి ఆలయ అవశేషాలపై నిర్మించి ఉండవచ్చు. అయితే, అది కూడా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఆలయం క్రీస్తుశకం 3,7 శతాబ్దాల మధ్య ఉండొచ్చని రావు తన పుస్తకంలో తెలిపారు.
క్రీస్తుశకం 9వ శతాబ్దంలో మూడవ ఆలయం నిర్మించారు. అయితే, 12వ శతాబ్దంలో తుపానుల కారణంగా పైకప్పు ధ్వంసమైంది. పునాది, గోడలు మాత్రం నిలబడ్డాయి. నాలుగో ఆలయం వెంటనే నిర్మించారు. ప్రస్తుత ఆలయం ఈ శ్రేణిలోని ఐదవది.
ఈ ఐదు దేవాలయాలు ద్వారకలోని మూడు నుంచి ఏడు స్థావరాలను సూచిస్తాయి. ప్రస్తుత ఆధునిక పట్టణం ద్వారకలో ఎనిమిదో స్థావరం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














