మూత్రం మీద రోమన్ చక్రవర్తులు పన్ను ఎందుకు విధించారు?

మూత్నంపై పన్ను

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్ అండ్ రీసెర్చర్

రోమన్ చక్రవర్తి వెస్పాసియన్ తన కొడుకు టైటస్ ముక్కుకు ఉన్న బంగారు నాణేన్ని పట్టుకుని, ఇది దుర్వాసన వస్తోందా? అని అడిగారు.

'రావడం లేదు' అని టైటస్ సమాధానమిచ్చారు.

'నాణేలు దుర్వాసన రావు, కానీ మూత్రం నుంచి ఆ వాసన వస్తుంది(నాణేలపై విధించిన పన్ను)' అని వెస్పాసియన్ అన్నారు.

వెస్పాసియన్, ఆయన కుమారుడు టైటస్ ఫ్లావియస్ పెట్రో మధ్య జరిగిన ఈ సంభాషణ వివరాలను రోమన్ చరిత్రకారుడు సూటోనియస్ అందించారు.

సూటోనియస్ పేర్కొన్న దాని ప్రకారం, తన తండ్రి వెస్పాసియన్ మూత్రం వ్యాపారంపై పన్ను విధించడాన్ని టైటస్ ''అసహ్యం''గా వర్ణించినప్పుడు, దాదాపు రెండు వేల ఏళ్ల కిందట ఈ సంభాషణ జరిగింది.

రోమ్‌కి చెందిన మొదటి 12 మంది సీజర్ల జీవిత చరిత్రలు రాయడం ద్వారా గయస్ సూటోనియస్ సుపరిచితులు. ఆయనకు రోమన్ ప్యాలెస్‌‌తో సంబంధాలు ఉండడం వల్ల రోమన్ రాజ కుటుంబం గురించి చాలా విషయాలు రాసినట్లు చెబుతారు.

పురాతన రోమన్ సామ్రాజ్యంలో మూత్రం ఓ విలువైన వస్తువు. దీన్ని పబ్లిక్ టాయిలెట్ల నుంచి సేకరించేవారు. టూత్ పేస్ట్ తయారీలో ముడి పదార్థంగా ఉపయోగించేవారు.

మూత్రంపై 'వెక్టిగల్ యూరిన్' అనే పన్ను విధించారు. వెస్పాసియన్‌ మాత్రమే కాకుండా, నీరో చక్రవర్తి హయాంలోనూ మూత్రం కొనుగోలు, విక్రయాలపై ఈ ప్రత్యేక పన్ను ఉండేది.

ఐదవ రోమన్ చక్రవర్తి నీరో (ఈయన పాలనలోనే రోమ్ తగలబడింది) హయాంలో, క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో మూత్రం సేకరణ, వినియోగం రెండింటిపై ఈ పన్ను ఉండేది. ఆ తర్వాత ఇది రద్దయింది.

ఈ పన్నుపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని తొలగించారని చెబుతారు. అయితే, 69వ సంవత్సరంలో ఆయన తర్వాత వచ్చిన రోమన్ చక్రవర్తి వెస్పాసియన్ మరోసారి మూత్రంపై పన్ను విధించారు.

మూత్రంపై పన్ను

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

మూత్రం విలువైనదిగా ఎలా మారింది?

ఆఫ్ రాబిన్సన్ రాసిన ''ఏన్షియంట్ రోమ్: సిటీ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్'' పుస్తకం ప్రకారం, రోమ్‌లో 144 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి.

''ఆ పబ్లిక్ టాయిలెట్లలో 'డొలియా కార్టా' అని పిలిచే బకెట్లు ఉండేవి. ఈ బకెట్లలో మూత్రాన్ని సేకరిస్తారు. మూత్రం సేకరణలో జాప్యం చేస్తే అధికారులకు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది'' అని ఆ పుస్తకంలో రాశారు.

సైన్స్ రైటర్ మోహీ కుమార్ ప్రకారం, "యూరియా తయారీకి మూత్రం మూలం. ఇది నైట్రోజన్, హైడ్రోజన్‌తో కూడిన సేంద్రీయ సమ్మేళనం. ఎక్కువ కాలం నిల్వ ఉంటే, యూరియా అమ్మోనియాగా మారుతుంది."

ప్రస్తుతం గాజు, ఇనుము, నూనె మరకలు శుభ్రం చేసేందుకు ఉపయోగించే లిక్విడ్స్‌లో అమ్మోనియా ఒకటి.

నీటిలో ఉన్న అమ్మోనియా ఒక కాస్టిక్‌(శుభ్రం చేసే పదార్థం)లా పనిచేస్తుంది. అందువల్ల మూత్రాన్ని జంతువుల తోళ్లను మృదువుగా చేయడంతో పాటు రంగును మెరుగుపరిచేందుకు ఉపయోగించేవారని మోహీ కుమార్ తెలిపారు.

జంతువుల తోలును మూత్రంలో నానబెట్టడం ద్వారా వారి పని సులువయ్యేది. ఆ తోలుపై ఉన్న వెంట్రుకలు తొలగించేందుకు, దానికి ఉన్న చిన్న చిన్న మాంసం ముద్దలను తీసివేయడం వంటివి సులువుగా అయ్యేవి.

''జిడ్డుగా ఉండే మురికి, నూనె మరకలను అమ్మోనియాతో తొలగించవచ్చు. మూత్రం తెలుపు రంగును మరింత ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, ఇతర రంగులను కూడా మెరుగుపరుస్తుంది.'' అని ఆయన రాశారు.

''బకెట్లలో సేకరించిన మూత్రాన్ని ఎండలో ఉంచడంతో క్రిములు చనిపోయి, అమ్మోనియాగా మారుతుంది'' అని ఆఫ్ రాబిన్సన్ తన పుస్తకంలో రాశారు.

మూత్రంపైౌ పన్ను

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

మూత్రం వినియోగం, బట్టలు ఉతికే యంత్రం

వాంకోవర్ సన్‌లో ప్రచురితమైన నికోలస్ సోకిక్ రాసిన వ్యాసంలో, అమ్మోనియా కారణంగానే పురాతన రోమన్లు ​​తమ దంతాలను పాలిష్ చేయడానికి మూత్రాన్ని మౌత్ వాష్‌గా ఉపయోగించినట్లు రాశారు.

కానీ, రోమన్ సైన్యం, రోమన్ కళాఖండాలపై పరిశోధన జరిపిన డాక్టర్ మైక్ బిషప్, "రోమన్లందరూ ఇలా చేశారని కాదు. ఒకరు ఇలా చేసినందుకు కాటల్లస్ అనే కవి తన కవితలలో ఎగతాళి చేశాడు'' అని చెప్పారు.

చర్రితకారులు జోషువా.జె. మార్క్ మారిస్ట్ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌. పురాతన రోమ్‌లో బట్టలు ఉతికేవాళ్లు (ఫుల్లర్స్ అని పిలిచేవారు) బట్టలను శుభ్రం చేసేందుకు, వాటిని ప్రకాశవంతంగా మార్చేందుకు మానవ మూత్రంతో పాటు జంతువుల మూత్రాన్ని ఒక సహజ బ్లీచింగ్ పౌడర్‌ మాదిరిగా ఉపయోగించేవారని మార్క్ రాశారు.

అలా చేసినందుకు అగౌరవంగా చూసేవారని, అయినప్పటికీ బట్టలు ఉతికే ఫుల్లర్స్ ఆ పనితో విజయవంతమయ్యారని, బాగా డబ్బులు సంపాదించేవారని రాశారు.

పురాతన రోమ్‌పై పరిశోధన చేసిన చరిత్రకారుడు బీకే హార్వే ఇలా రాశారు. "లాంచర్లు (మూత్రం ఉపయోగించడం మొదలుపెట్టిన వారు) తమ పనిలో మూత్రాన్ని ఉపయోగించడాన్ని తొలుత ధిక్కారంగా భావించారు. కానీ, రోమ్‌లో అత్యధికంగా నగదు చెల్లించిన నిపుణుల్లో వారూ ఉన్నారు."

"బట్టలు ఉతికే చాలా మంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. వారి కార్మికులకు జీతాలు కూడా బాగా చెల్లించారు. మూత్రం వారికి చాలా విలువైనది. దాని కొనుగోలు, అమ్మకాలపై పన్ను విధించారు." అని రాశారు.

మూత్రంపైౌ పన్ను

ఫొటో సోర్స్, GETTY IMAGES

పురాతన రోమన్లు ఇంట్లో స్నానం చేయరు, బట్టలు ఉతకరు. అందువల్ల తమ దుస్తులను శుభ్రం చేయడానికి బట్టలు ఉతికే వారి వద్దకు తీసుకెళ్లాలి. ఈజిప్ట్, గ్రీస్‌లలో కూడా బట్టలు ఉతికేవారు ఉన్నారని ఆధారాలు లభించినట్లు ప్రొఫెసర్ జోషువా రాశారు.

"బట్టలు ఉతికేవారు పబ్లిక్ టాయిలెట్ల నుంచి వీలైనంత మొత్తంలో మూత్రాన్ని సేకరించేవారు. ఈ మూత్రాన్ని ఒక పెద్ద పాత్రలో పోసి అందులో బట్టలు నానబెట్టేవారు. కొందరితో బలవంతంగా బట్టలు ఉతికించారు. వాటిని కాళ్లతో తొక్కమని చెప్పారు. దీంతో ప్రస్తుత వాషింగ్ మెషీన్ తరహాలో బట్టలపై ఒత్తిడి పడి మురికి, మరకలు తొలగిపోయాయి'' అని ఆయన రాశారు.

"ఇలా బట్టలు శుభ్రపరిచే పద్ధతి చాలా కాలం పాటు కొనసాగింది. రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత కూడా, సబ్బు వచ్చేంత వరకూ కూడా ప్రజలు తమ దుస్తులను ఉతికేందుకు మూత్రాన్ని కొనసాగించారు."

ఈ అంశంపై సైమన్ వెర్నీస్, సారా బెస్ట్ ఒక పేపర్ రాశారు. అందులో వారు మూత్రాన్ని 'లిక్విడ్ గోల్డ్'‌గా పేర్కొన్నారు. "తోళ్లను మృదువుగా చేసేందుకు, బట్టలు, ఉన్నిని శుభ్రపరిచేందుకు, వాటికి రంగులు అద్దడంలో మూత్రాన్ని ఉపయోగించారు'' అని వారు రాశారు.

"1850ల వరకూ బట్టలకు రంగులు వేయడానికి, వాటిని శుభ్రపరచడానికి అవసరమైన అమ్మోనియాకి మూత్రమే ఆధారం" అని వారు రాశారు.

మూత్రంపై పన్ను

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

మూత్రంపై పన్ను

రోమన్ చక్రవర్తి నీరో మూత్రంపై పన్నును రద్దు చేశారు, కానీ ఆ తర్వాత వచ్చిన ఆయన వారసుడు వెస్పాసియన్ దానిని పునరుద్ధరించారు.

మూత్రంపై పన్నుకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలపడంతో మూత్రంపై విక్రయ పన్నును నీరో రద్దు చేశారని కర్డ్ రీడ్‌మన్ రాశారు. ఆయన చరిత్ర, పురావస్తు శాస్త్రాలపై అధ్యయనం చేశారు.

నీరో విధానాలతో మొత్తం సామ్రాజ్యం దివాళా తీసిందని శామ్యూల్ మచాక్స్ రాశారు. నీరోను ప్రజలకు శత్రువుగా సెనేట్ ప్రకటించింది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత రోమ్‌లో అంతర్యుద్ధం జరిగింది.

ఈ గందరగోళ సమయంలోనే వెస్పాసియన్ వచ్చారు. తన ఆర్థిక విధానాలు, సైనిక కార్యకలాపాలతో ఆయన పేరుగడించారు.

వెస్పాసియన్ చక్రవర్తి అయిన తర్వాత, ఖజానా ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు.

కర్ట్ రీడ్‌మన్ ప్రకారం, అతని పదేళ్ల పాలనలో రోమ్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆయన విజయం సాధించారు.

"పన్ను ఆదాయాన్ని మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీరో మాదిరిగా మూత్రంపై పన్నును ఆయన తీసివేయలేదు.''

దీనిని వ్యతిరేకించే వారు మూత్రం ద్వారా డబ్బు సంపాదించేవారు. అలాంటి వారిలో చర్మకారులు, వస్త్ర కార్మికులు, లాండ్రీలు నిర్వహించే వారు ఉన్నారు. వారు పబ్లిక్ టాయిలెట్‌‌లకు వెస్పాసియన్ అని పేరుపెట్టారు.

వెస్పాసియన్ తర్వాతి కాలంలో, ఇటలీలో పబ్లిక్ టాయిలెట్లను 'వెస్పాసియానో' అని, ఫ్రాన్స్‌లో 'వెస్పాసియన్' అని పిలిచేవారు.

క్రీ.శ. 79వ సంవత్సరంలో వెస్పాసియన్ చనిపోయేప్పటికి రోమ్ ధనిక దేశంగా మారింది. డబ్బు ఎలా వచ్చిందనే దానికంటే, డబ్బు ప్రాధాన్యం గురించి చెప్పేందుకు ఇప్పటికీ ఇటాలియన్‌లో ఆయన చెప్పిన మాటలు 'పెకునియా నాన్ ఒలెట్'‌‌ను వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)