ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎలా దెబ్బ పడనుంది?

ఫొటో సోర్స్, TelanganaCMO
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ పెద్ద దెబ్బే. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఫండ్స్ రావడం తగ్గిపోనుంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌తోపాటు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చే విరాళాలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా రాజకీయ పార్టీలు కొత్త దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
బాండ్లతో ఎక్కువ ప్రయోజనం ఏ పార్టీకి?
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్ ఎక్కువగా ప్రయోజనం పొందింది. ఆరేళ్ల కాలంలో.. అంటే 2017-18 నుంచి 2022-23 మధ్య కాలంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) అంచనా మేరకు బీఆర్ఎస్‌కు రూ.912.69 కోట్లు వచ్చాయి. ఈ కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు బాగా పెరిగాయి.
2017-18లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి రాకపోగా, మరుసటి ఏడాది నుంచి కనిష్టంగా రూ.52 కోట్లు మొదలుకుని గరిష్టంగా రూ.99 కోట్ల వరకు వచ్చాయి.
ఎలక్టోరల్ బాండ్ల పథకం అందుబాటులోకి వచ్చిన 2017-18 సంవత్సరం నుంచి భారీ మొత్తంలో విరాళాలు వీటి ద్వారానే పార్టీలకు అందాయి. ఇప్పుడు ఏ విధంగా విరాళాల సేకరణ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు ఇచ్చే విరాళాలు ఏ రూపంలో ఉంటాయో చూడాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డి.రాకేష్ రెడ్డి చెప్పారు.
‘‘ఎలక్టోరల్ బాండ్ల విధానంలో దాతల వివరాలు రహస్యంగా ఉంచారు. ఎస్బీఐలో బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా పార్టీలకు ఫండ్స్ అందించే విధానమిది. ఇక నుంచి రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కాదు కాబట్టి ట్రస్టుల ద్వారా ఇస్తారా.. లేదా అసలు ఎంత ఇస్తారనేది చూడాలి’’ అని చెప్పారు రాకేశ్ రెడ్డి.
‘‘ఇప్పటివరకు దాతల పేరు బయటకు రాదు కాబట్టి పెద్దమొత్తంలో ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ పథకం పూర్తిగా రద్దు కానుంది. దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొంతమంది అసలే ఇవ్వకపోవచ్చు’’ అని చెప్పారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని రాకేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు 2017-18 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల మొత్తం(రూ.కోట్లలో..)


ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు?
కేంద్ర ప్రభుత్వం ఈ బాండ్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో తీసుకువచ్చింది. నిర్దేశిత కాలపరిమితితో, వడ్డీ రహితంగా ఈ బాండ్ల విలువ రూ. 1000 నుంచి రూ. కోటి వరకు ఉంటాయి.
వీటిని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయొచ్చు. వీటిని ఏడాది పొడవునా నిర్దేశించిన సమయాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచీలలో విక్రయిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచీలు సహా దేశవ్యాప్తంగా 24 బ్రాంచీలలో ఈ బాండ్లను విక్రయించారు.
ప్రజలతోపాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించే వీలుంది. ఆ పార్టీలు 15 రోజుల తర్వాత వీటిని బ్యాంకులో జమచేసి డబ్బులను పొందాలి.
అయితే, కేవలం గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన, ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు రూపొందించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCP
అధికారంలో ఉన్నప్పుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎక్కువ నిధులు
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపేణా ఎక్కువ నిధులు సమకూరినట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు వచ్చాయి. 2019 వరకు తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు రాగా.. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎక్కువ నిధులు రావడం మొదలైంది.
ఎలక్టోరల్ బాండ్లపై తీర్పు ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు అనేవి క్విడ్ ప్రో కో జరిగేందుకు అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
‘‘క్విడ్ ప్రో జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చినప్పుడు బయటకు తెలియదు. ఎక్కువ మొత్తంలో విరాళాలు అధికారంలో ఉన్న వారికే వస్తున్నాయంటే.. క్విడ్ ప్రో కో అవకాశాలు ఉన్నాయి’’ అని చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి.

ఫొటో సోర్స్, BRS PARTY
బీఆర్ఎస్ పార్టీకి అధిక విరాళాలు
ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే, ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తోంది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో.. ఆ పార్టీకే ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు వచ్చాయి. ప్రభుత్వాల నుంచి ఏదో ఒకటి ఆశించకుండా పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇవ్వరన్నది జగమెరిగిన సత్యం.
ఇలా అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా విరాళాలు రావడం దేనికి సంకేతమో కూడా తెలుస్తోంది.
‘‘కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా ఫండింగ్ అందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రూ.6566.12 కోట్లు వచ్చాయి. ఇది అన్ని పార్టీలకు ఇచ్చిన విరాళాలలో 57 శాతం. అంతేకాదు, టీఎంసీ, డీఎంకే.. ఇలా అధికారంలో ఉన్న పార్టీలకు ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చాయి’’ అని చెప్పారు రాకేశ్ రెడ్డి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి...
పశ్చిమ్ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీకి రూ.1093 కోట్లు సమకూరాయి. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రూ.6566 కోట్లు వచ్చినట్లు ఫ్యాక్ట్ లీఇండియా తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రధాన పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం



ఎన్నికల ముందు అత్యధిక ఫండింగ్
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చే ఫండింగ్‌ను గమనిస్తే ఎన్నికల ముందు సంవత్సరంలో వీటి ద్వారా పార్టీలకు ఎక్కువగా విరాళాలు వచ్చాయి. బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ విషయంలో ఇదే విషయం స్పష్టమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ. 529.03 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. 2023లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు ఆర్థిక సంవత్సరంలోనే అధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లు దక్కాయి.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ కు 2018-19 ఆర్థిక సంవత్సంలో అత్యధికంగా రూ. 99.84 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు రూపంలో వచ్చాయి. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తర్వాత కూడా పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు కొనసాగాయి.
ఇక నుంచి పార్టీలకు ఇచ్చే ఫండింగ్ ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు. ‘‘గతంలో తరహా చెక్కుల రూపంలో ఇవ్వాలి లేదా నేరుగా నగదు రూపంలో ఇవ్వాలి. పెద్దమొత్తంలో నగదు రూపంలో ఇచ్చేందుకు వీలుండదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అసలు ఎలక్టోరల్ బాండ్లు రద్దు ఎందుకంటే
రాజకీయ పార్టీలకు నల్లధనం చేరకుండా అడ్డుకునేందుకు, పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈ బాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈ బాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల చుట్టూ గోప్యత సంకెళ్లు ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు.
అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు? ఎవరికి వీటిని ఇస్తున్నారు? లాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు. అందుకే ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శలు వస్తున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది.
‘‘అదే సమయంలో ఇక్కడ పూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అటు బాండ్లు కొంటున్నవారు, ఇటు తీసుకుంటున్న వారు.. ఇద్దరి వివరాలూ ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. లేదా విరాళాలు ఇచ్చే వారిని ప్రభావితం కూడా చేయొచ్చు’’ అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉండేవారికి ఈ బాండ్లు చాలా ప్రయోజనాలు ఇస్తాయి’’ అని ఏడీఆర్ సహ-వ్యవస్థాపకుడు జగ్‌దీప్ ఛోకర్ గతంలో బీబీసీతో అన్నారు. 2017లో ఈ బాండ్లను మొదట ప్రవేశపెట్టినప్పుడు, వీటి వల్ల ఎన్నికల్లో పారదర్శకత కొరవడుతుందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
మరోవైపు అక్రమ నగదు రాజకీయాల్లోకి రాకుండా ఈ బాండ్లు అడ్డుకోలేవని కేంద్ర బ్యాంకు, న్యాయ మంత్రిత్వ శాఖలోని అధికారులతోపాటు కొందరు ఎంపీలు కూడా చెప్పారు.
‘ఎన్నికల బాండ్లతో ఓ అపారదర్శక విధానాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది’’అని వాషింగ్టన్‌కు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన మిలన్ వైష్ణవ్ గతంలో వ్యాఖ్యానించారు.
‘‘దాతలు ఎంత మొత్తంలోనైనా తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించుకోవచ్చు. ఇక్కడ ఏ వర్గమూ తమ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీన్ని పారదర్శక విధానంగా చెబుతున్నారు. నిజానికి ఇది పారదర్శకత అనే పదానికి కొత్త నిర్వచనంగా చూడొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














