కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ

ఫొటో సోర్స్, INSTAGRAM/MANGYSTAU ECOLOGY DEPARTMENT
- రచయిత, మార్కో సిల్వా, డేనియల్ పలంబో, ఎర్వాన్ రివాల్ట్
- హోదా, బీబీసీ వెరిఫై
కజఖ్‌స్థాన్‌లో ఒక రిమోట్ వెల్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ లీక్ సంఘటన చోటు చేసుకుందని బీబీసీ వెరిఫై తాజా విశ్లేషణలో వెల్లడైంది.
బ్లోఅవుట్ సంభవించిన తర్వాత ఆరు నెలల పాటు కొనసాగిన ఈ లీకేజిలో సుమారు 1,27,000 టన్నుల గ్యాస్ బయటికి వచ్చినట్లు అంచనావేసింది.
మీథేన్ అనేది కార్బన్ డయాక్సైడ్ కంటే అత్యంత శక్తిమంతమైన గ్రీన్‌హౌజ్ గ్యాస్.
మీథేన్ గ్యాస్ లీకైన ఈ బావి బుజాచి నెఫ్ట్‌కు చెందినది. ఇంత మొత్తంలో మీథేన్ గ్యాస్ లీకైందన్న విషయాన్ని మాత్రం ఆ కంపెనీ కొట్టివేస్తుంది.
ఒక ఏడాదిలో 7,17,000కు పైగా పెట్రోల్ కార్లు రోడ్లపై తిరగడం వల్ల ఏ మేర అయితే పర్యావరణ ప్రభావం ఉంటుందో, ఆ మేర మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఉందని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ గ్రీన్‌హౌజ్ గ్యాస్ ఈక్వివాలెన్సీ కాలిక్యులేటర్ తెలిపింది.

‘‘ఈ గ్యాస్ లీక్ తీవ్రత, లీకైన వ్యవధి రెండూ కూడా అసాధారణమైనవి’’ అని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మీథేన్ ఉద్గారాల అబ్జర్వేటరీ అధినేత మాన్‌ఫ్రెడీ కాల్టగిరోన్ తెలిపారు. ఇది అతిపెద్ద ప్రమాదమని అన్నారు.
నైరుతి కజఖ్‌స్తాన్‌లోని మంగిస్తావ్ ప్రాంతంలో వెలికితీత బావి వద్ద డ్రిల్లింగ్ చేపట్టేటప్పుడు బ్లోఅవుట్ ఏర్పడి 2023 జూన్ 9న మీథేన్ లీక్ ప్రారంభమైందని, ఆ ఏడాది చివరి వరకు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని తెలిసింది.
2023 డిసెంబర్ 25న దీన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. సిమెంట్‌తో ఈ వెల్‌ను సీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్థానిక అధికారులు బీబీసీతో చెప్పారు.
మీథేన్ మానవ కంటికి ఈ ఒక స్ఫటికం వలె కనిపిస్తుంది. కానీ, మీథేన్ గుండా సూర్య కాంతి ప్రసరించినప్పుడు, ఒక ప్రత్యేకమైన ఫింగర్‌ప్రింట్ ఆకారం క్రియేట్ అవుతుంది. అప్పుడు కొన్ని ఉపగ్రహాలు దాన్ని ట్రాక్ చేయగలుగుతాయి.
ఫ్రెంచ్‌కు చెందిన జియోఅనాలటిక్స్ సంస్థ కైరోస్ ఈ మీథేన్ గ్యాస్ లీక్‌పై తొలుత విచారణ జరిపింది.
వీరి పరిశీలనను స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ వాలెన్సియా, నెదర్లాండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్‌లు ధ్రువీకరించాయి.
ఉపగ్రహాల డేటాను చూసిన తర్వాత, జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 115 సందర్భాల్లో మీథేన్‌కు చెందిన అధిక సాంద్రతలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఉపగ్రహాల డేటాను ఆధారంగా చేసుకుని, ఈ ఒకే ఒక్క బావి నుంచి 1,27,000 టన్నుల మీథేన్ బయటికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మానవ చర్యలతో సంభవించిన రెండో అతిపెద్ద మీథేన్ గ్యాస్ లీక్ ప్రమాదం ఇది.

సెప్టెంబర్ 2022లో, సముద్ర గర్భంలో సంభవించిన పేలుళ్ల వల్ల రష్యన్ గ్యాస్‌ను జర్మనీకి తీసుకెళ్లే రెండు పైప్‌లైన్లు నార్డ్ స్ట్రీమ్ 1, 2లు విడిపోయాయి. దీని వల్ల వాతావరణంలోకి 2,30,000 టన్నుల వరకు మీథేన్ విడుదలైంది.
పారిశ్రామిక విప్లవం నాటి నుంచి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేందుకు 30 శాతం మీథేన్ కారణమవుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గణాంకాల్లో తేలింది.
మేఘాలు వంటి వాటివల్ల శాటిలైట్ రీడింగ్స్ ప్రభావంతమైనప్పటికీ, ఈ బావి నుంచి పెద్ద మొత్తంలో మీథేన్ బయటికి వచ్చిందన్నది పూర్తిగా వాస్తవం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐదు వివిధ రకాల మీథేన్ సెన్సిటివ్ శాటిలైట్ పరికరాల నుంచి మీథేన్ వాయువులను తాము గుర్తించామని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ వాలెన్సియాకు చెందిన లూయిస్ గ్వాంటర్ చెప్పారు.
ప్రతి ఒక్క పరికరం ద్వారా కూడా ఒక నిర్దిష్టమైన విధానంలో మీథేన్‌ను కొలిచామని, అన్నింట్లో స్థిరమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.
జూన్ 9 నుంచి సెప్టెంబర్ 21 మధ్య కాలంలో 10 సందర్భాల్లో చట్టబద్ధమైన పరిమితికి మంచి గాలిలో మీథేన్ సాంద్రతలు ఉన్నట్లు మంగిస్తావ్ ప్రాంతంలోని ఎకాలజీ డిపార్ట్‌మెంట్ తన ప్రకటనలో తెలిపింది.
ఈ బ్లోఅవుట్ సంభవించిన తొలుత కొన్ని గంటల వ్యవధిలో గాలిలో మీథేన్ స్థాయిలు అనుమతికి మించి 50 రెట్లు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది.

కానీ, ఇంత మొత్తంలో మీథేన్ గ్యాస్ లీకైందన్న విషయాన్ని మాత్రం కజఖ్‌స్తాన్‌కు చెందిన బుజాచి నెఫ్ట్ కంపెనీ కొట్టివేస్తుంది.
ఈ బావిలో కేవలం నామమాత్రంగానే గ్యాస్ ఉందని, బోర్ గొట్టం గుండా ఏదైనా మీథేన్ లీక్ అయినప్పుడు మంటలు అంటుకుంటాయని కంపెనీ చెప్పింది.
వాతావరణంలోకి నీటి ఆవిరి మాత్రమే లీక్ అయిందని తాము నమ్ముతున్నామని, దీనివల్ల అంతరిక్షంలో నుంచి కూడా చూడగలిగే తెల్లటి పొగ పెద్ద ఎత్తున కమ్ముకుందని కంపెనీ చెబుతోంది.
‘‘పరిస్థితిని మేం బాధ్యతాయుతంగా ఎదుర్కొన్నాం’’ అని కంపెనీ స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డానియర్ డ్యూసెంబయేవ్ బీబీసీకి చెప్పారు.
బుజాచి నెఫ్ట్ ఏర్పాటు చేసిన ఎక్స్‌టర్నల్ రీసెర్చ్ మాత్రం కైరోస్ కనుగొన్న విషయాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఎక్స్‌టర్నల్ రీసెర్చ్ ఫలితాలను బీబీసీ యాక్సస్ పొందలేదు.
వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి లాంటి ఇతర గ్యాస్‌లను ఉపగ్రహాలు మీథేన్‌గా భావించి ఉండొచ్చని, బ్లోఅవుట్ జరగడానికి ముందు నుంచి గాలిలో మీథేన్ ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకోలేదని కంపెనీ చెబుతోంది.
కానీ, ఈ లీక్‌పై తొలుత విచారణ జరిపిన, కైరోస్ పరిశీలనలో భాగమైన బృందాలు మాత్రం కంపెనీ వాదనను కొట్టివేస్తున్నాయి.
ప్రమాదానికి ముందు వాతావరణంలో అప్పటికే ఉన్న మీథేన్‌పై వారి విధానాలు ప్రభావం చూపవు. సింగిల్ మీథేన్ వాయువు కోసం మాత్రమే శాస్త్రవేత్తలు పరిశీలన చేపట్టేందుకు ప్రయత్నించారని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ వాలెన్సియాకు చెందిన లూయిస్ గ్వాంటర్ చెప్పారు.
మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు కజఖ్‌స్తాన్ ప్రయత్నాలు
ఈ బావి వద్ద డ్రిల్లింగ్ చేపట్టేటప్పుడు సరైన పర్యవేక్షణ చేపట్టడంలో బుజాచి నెఫ్ట్ విఫలమైందని ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించిన అతిరా ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ నేతృత్వంలోని అధికారిక విచారణ బృందం తేల్చింది.
డ్రిల్లింగ్ ప్రక్రియలో అనేక వైఫల్యాలకు సబ్‌కాంట్రాక్టర్ జమన్ ఎనెర్గో కారణమని తెలిపింది. దీన్ని జమన్ ఎనెర్గో కొట్టివేసింది.
ఈ లీక్ ‘‘క్లిష్టమైన సాంకేతిక నిర్వహణ’కు చెందిన కజఖ్‌స్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ బీబీసీకి తెలిపింది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి పరిష్కారం లేదని చెప్పింది.
అయితే, మధ్య ఆసియాలో ఇలాంటి భారీ మీథేన్ లీక్ ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు.
సరిహద్దు ప్రాంతం తుర్క్‌మెనిస్తాన్ మాదిరి, కజఖ్‌స్తాన్‌లో కూడా పలు ‘సూపర్ ఎమిటర్’ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘సూపర్ ఎమిటర్’ అనే పదాన్ని శాస్త్రవేత్తలు వాతావరణంలోకి పెద్ద మొత్తంలో మీథేన్ విడుదలైన సంఘటనల గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు.
మాంగిస్తావ్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగింది. సాధారణ మానవ కార్యకలాపాల నుంచి ఈ అతిపెద్ద మీథేన్ లీక్ ప్రమాదం జరిగింది. దాన్ని తాము కనుగొన్నామని గ్వాంటర్ చెప్పారు.
సహజ వాయువు ఉత్పత్తిని పెంచనున్న నేపథ్యంలో, గ్యాస్ పైప్‌లైన్ల ద్వారా మరింత మీథేన్ లీకేజీ ప్రమాదాలను కజఖ్‌స్తాన్ ఎదుర్కొంటుందని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్‌కు చెందిన వాతావరణ నిపుణులు చెప్పారు.
గత ఏడాది కాప్28 పర్యావరణ సదస్సులో, గ్లోబల్ మీథేన్ వాగ్దానంలో కజఖ్‌స్తాన్ కూడా చేరింది. 2030 కల్లా 30 శాతం మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు 150కి పైగా దేశాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే...
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- మాంసం బియ్యం: ఈ హైబ్రిడ్ బియ్యం తింటే, మాంసం తిన్నట్లే...
- హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మకు మరోసారి టీ20 కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఇదేనా?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














