ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే...

రవాణా

ఫొటో సోర్స్, AUKEVISSER

ఫొటో క్యాప్షన్, సద్దాం హుస్సేన్ సైన్యం బాంబు దాడులు చేయడంతో నౌక మునిగిపోయింది

ముప్పై ఏళ్ల తన జీవితకాలంలో 'సీవైజ్ జెయింట్'‌ను ప్రపంచంలోనే అతి పెద్ద నౌక (ది లార్జెస్ట్ షిప్ ఇన్ ది వరల్డ్), ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నౌక(ది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ షిప్), అత్యధిక చమురు రవాణా సామర్ధ్యం కలిగిన నౌక(ది షిప్ వాజ్ ది లార్జెస్ట్ కెపాసిటీ టు క్యారీ ఆయిల్) వంటి అనేక పేర్లతో గుర్తింపు పొందింది.

ఈ నౌకకు హ్యాపీ జెయింట్, జహ్రె వైకింగ్, నొక్ నోవిస్, మాంట్ అనే పేర్లు కూడా ఉన్నాయి. దీనిని సూపర్ ట్యాంకర్ అని కూడా పిలిచేవారు.

కోట్ల లీటర్ల చమురు రవాణా సామర్ధ్యం ఈ నౌకకు ఉన్నప్పటికీ, దాని భారీ పరిమాణం కారణంగా చాలా పోర్టులకు అది వెళ్లలేదు. ఈ భారీతనం వల్ల సూయిజ్ కెనాల్, పనామా కెనాల్ వంటి ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ప్రయాణం సాధ్యం కాదు.

ఈ భారీ నౌకపై సద్దాం హుస్సేన్ సైన్యం దాడి చేసి తగలబెట్టింది, దీంతో అది మునిగిపోయింది.

అయితే, సముద్రంలో మునిగిపోయిన ప్రతి నౌక కథ మాదిరిగా, దీని కథ మునిగిపోయిన దగ్గరే ఆగిపోలేదు.

రవాణా

ఫొటో సోర్స్, AUKEVISSER/TOBY YOUNG

ఫొటో క్యాప్షన్, గ్రీకు వ్యాపారవేత్త ఆర్డర్ చేసిన ఈ నౌకను హాంగ్‌కాంగ్ వ్యాపారి కొనుగోలు చేశారు

ఏ దేశంలో తయారుచేశారు?

ఈ సూపర్‌ట్యాంకర్‌ను మొదట 1979లో జపాన్‌లోని ఒపమాలో ఉన్న సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు.

వివిధ వర్గాల సమాచారం ప్రకారం, గ్రీకు వ్యాపారవేత్త ఈ ఓడ నిర్మాణానికి ఆర్డర్ చేశారని, అయితే అది సిద్ధమైన తర్వాత ఆయన దానిని కొనుగోలు చేయలేదని చెబుతారు. చివరికి, 1981‌లో హాంగ్‌కాంగ్‌కి చెందిన వ్యాపారవేత్త టింగ్ చావో యింగ్ దానిని కొనుగోలు చేశారు. ఆయన ఓరియెంట్ ఓవర్సీస్ కంటైనర్ లైన్ అనే షిప్పింగ్ కంపెనీ యాజమాని.

హాంగ్‌కాంగ్‌లోని మారీటైమ్ మ్యూజియం ప్రకారం, షిప్ కొనుగోలు చేసిన తర్వాత ఓడ ఇంకా భారీగా ఉండాలని కొత్త యజమాని భావించారు. దీంతో షిప్‌కి మరో పార్ట్ జతచేశారు. ఆ తర్వాత దాని చమురు రవాణా సామర్థ్యం లక్షా నలభై వేల టన్నులు పెరిగింది.

సూపర్‌ట్యాంకర్ పొడవు 458.45 మీటర్లు. అదే అతిపెద్ద రికార్డ్. దాని పొడవు మలేషియాలోని పెట్రొనాస్ టవర్, న్యూయార్క్‌లోని ఎంపైర్ ఎస్టేట్ బిల్డింగ్‌ కంటే ఎక్కువ.

రవాణా

ఫొటో సోర్స్, AUKEVISSER/TOBY YOUNG

ఫొటో క్యాప్షన్, ఈ నౌకకు రోజుకు 220 టన్నుల ఇంధనం అవసరం అవుతుంది

చమురు రవాణా సామర్థ్యం

ఈ నౌక నాలుగు బిలియన్ బ్యారెల్స్ (నాలుగు వందల కోట్ల బ్యారెళ్లు, ఒక బ్యారెల్ అంటే దాదాపు 159 లీటర్లు) చమురును మోసుకెళ్లగలదు. ఒక సాధారణ కారులో సూర్యుడికి భూమికి మధ్య పదిసార్లు తిరగడానికి ఈ ఆయిల్‌‌ సరిపోతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ అయిన 'ఐకాన్ ఆఫ్ ది సీ' కంటే ఈ నౌక 100 మీటర్ల పొడవు ఎక్కువ. టైటానిక్ కంటే 200 మీటర్లు ఎక్కువ.

ఈ నౌకను పూర్తి సామర్థ్యం వరకూ నింపితే దాని బరువు 6 లక్షల 57 వేల టన్నులు. ఈ భారీ నౌక నడిచేందుకు రోజుకు 220 టన్నుల ఇంధనం అవసరమవుతుంది.

1998లో బీబీసీ ఈ నౌకను సందర్శించినప్పుడు దాని కెప్టెన్ సురేంద్ర కుమార్ మోహన్ మాట్లాడుతూ సూపర్‌ట్యాంకర్ గంటకు 16 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదని చెప్పారు. అంటే, గంటలకు దాదాపు 30 కిలోమీటర్ల వేగం.

రవాణా

ఫొటో సోర్స్, AUKEVISSER/TOBY YOUNG

ఫొటో క్యాప్షన్, మలేషియాలోని పెట్రోనాస్ టవర్ ఎత్తు కంటే కంటే ఈ నౌక పొడవు ఎక్కువ

ఈ భారీ నౌక ఎలా ప్రయాణించింది..

కెప్టెన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నౌకను ఎక్కడైనా ఆపాలంటే దానికి ఎనిమిది కిలోమీటర్ల ముందు బ్రేకులు వేయడం మొదలు పెట్టాలి.

నౌక వెళ్తున్న దిశను మార్చి, దాని వ్యతిరేక దిశలోకి తిప్పడం చాలా కష్టమైన పని. అందుకు దాదాపు 3 కిలోమీటర్ల ప్రాంతం అవసరమవుతుంది.

అయితే, బీబీసీ సందర్శించిన ఈ ఓడకు మరమ్మతులు జరిగాయి, దానిని పునర్నిర్మించారు.

మిడిల్ ఈస్ట్, పాశ్చాత్య దేశాల మధ్య చమురు వ్యాపారం భారీ స్థాయిలో జరుగుతున్న సమయంలో ఈ సూపర్‌ట్యాంకర్ ప్రపంచవ్యాప్తంగా చమురును మోసుకెళ్లడమే కాకుండా, తేలియాడే గోడౌన్‌గా కూడా పనికొచ్చింది.

1988లో ఇరాన్‌లో లంగర్ వేయడంతో దాని చివరి ప్రయాణం ముగిసింది. ఆ సమయంలో గల్ఫ్ దేశాల్లో ఇరాక్, ఇరాన్ యుద్ధం చివరి దశలో ఉంది.

సద్దాం హుస్సేన్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఈ నౌకపై బాంబు దాడులు చేసింది. దీంతో మంటల్లో చిక్కుకుని ఓడ మునిగిపోయింది.

యుద్ధం ముగిసిన అనంతరం నార్వేకు చెందిన షిప్పింగ్ కంపెనీ నార్మన్ ఇంటర్నేషనల్ ఈ నౌకపై ఆసక్తి చూపింది. దాదాపు 3,700 టన్నుల ఇనుము వినియోగించి, దానికి మరమ్మతులు చేసి 1991లో మళ్లీ అది తేలియాడేలా చేశారు.

అయితే, దాని పాత పేరు సీవైజ్ జెయింట్ స్థానంలో హ్యాపీ జెయింట్‌గా మార్చారు.

రవాణా

ఫొటో సోర్స్, AUKEVISSER/HONZA PLENER

ఫొటో క్యాప్షన్, ఈ సూపర్‌ట్యాంకర్ పొడవు 485.45 మీటర్లు

భారీ నౌక చివరి మజిలీ

మరమ్మతుల తర్వాత ఈ సూపర్‌ట్యాంకర్‌ తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అయితే, దానిని రవాణా వ్యాపార సంస్థ కేఎస్ సొంతం చేసుకుంది. జహ్రె వైకింగ్‌ అని పేరుమారింది.

కానీ, 1990లలో షిప్పింగ్ ఇండస్ట్రీలో తక్కువ ఇంధనంతో నడిచే ట్యాంకర్ల వినియోగం మొదలైంది. దీంతో దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

దానికి తోడు, దాని పరిణామం కూడా మరో కారణం. సూయిజ్ కెనాల్, పనామా కెనాల్ మార్గాల్లో దీని పరిమాణం కారణంగా ప్రయాణించలేకపోవడం మరో అవరోధం.

2004లో నార్వే సంస్థ నార్వేజియన్ ఫస్ట్ ఒస్లెన్ ట్యాంకర్స్ ఈ భారీ నౌకను కొనుగోలు చేసి ఫ్లోటింగ్ గోడౌన్‌గా మార్చేసింది. దానిని నొక్ నోవిస్‌గా పేరుమార్చి ఖతార్ తీరంలో ఉంచారు.

2009 నుంచి దీని వినియోగం ముగిసిపోయింది. ఆ తర్వాత దాని పేరును 'మాంట్‌'గా మార్చారు. ఆ తర్వాత దానిని తుక్కుగా మార్చేందుకు భారత్‌కు తరలించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా పేరుపొందిన సీవైజ్ జెయింట్ ఎక్కడ ప్రారంభమైందో చివరికి అక్కడికే, అంటే హాంగ్‌కాంగ్ పోర్టుకే చేరింది. దాని 36 టన్నుల లంగరును హాంగ్‌కాంగ్‌లోని మారీటైమ్ మ్యూజియంలో ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)