దామోదరం సంజీవయ్య: సీఎం పదవి చేపట్టినా కులం పేరుతో అవమానాలు తప్పలేదా?

భార్య కృష్ణవేణితో సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

ఫొటో క్యాప్షన్, భార్య కృష్ణవేణితో సంజీవయ్య
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది బహుశా 1959వ సంవత్సరం.. హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ కారు కర్నూలు పట్టణం దాటి దగ్గర్లోని పెద్దపాడు అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ దళితవాడలో ఓ చిన్న ఇంటి ముందు ఆగింది.

ఓ పెద్ద బంగ్లాను ఊహించుకున్న ఆ కారులోని మనిషి ఆ చిన్న ఇంటిని చూసి కాస్త తికమక పడ్డారు. ఇంటి ముందు కట్టెలపొయ్యిపై వంట చేస్తూ కనిపించారో పెద్దావిడ. కారు దిగి ఆమెతో మాట్లాడి, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.

ఆ ఇల్లు ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యది. వంట చేస్తున్న పెద్దావిడ ఆయన తల్లి. దామోదరం సంజీవయ్యకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవులు ఇచ్చే క్రమంలో జరిగిందీ ఘటన.

ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఫిర్యాదులు చేశారు కొందరు కాంగ్రెస్ నాయకులు.

దానిపై స్పందించిన నెహ్రూ రహస్యంగా ఒక వ్యక్తిని విచారణకు పంపారు. ఆ వ్యక్తి సంజీవయ్య వాళ్ల ఊరెళ్లి విచారించారు. తిరిగి దిల్లీ వెళ్లి ఆయన వాస్తవ ఆర్థిక పరిస్థితిని నెహ్రూకు వివరించారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ సంజీవయ్యను శంకించలేదు నెహ్రూ.

పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య స్మారక సేవా సంస్థ
ఫొటో క్యాప్షన్, పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య స్మారక సేవా సంస్థ

ఆ వ్యక్తిని సంజీవయ్య తల్లి కొన్ని ప్రశ్నలు అడిగారు. దిల్లీ నుంచి కారులో వచ్చి ఆరా తీస్తున్నారంటే, తన కుమారుడికి ‘‘ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తున్నారా?’’, ‘‘మా అబ్బాయి జీతం పెరుగుతుందా?’’ అని ఆశతో అడిగారామె.

దామోదరం సంజీవయ్య నిజాయితీని వివరిస్తూ చాలా మంది తరచూ చెప్పే సంఘటన ఇది.

తన కుమారుడికి జీతం పెరిగితే, కట్టెల పొయ్యి బదులు కిరోసిన్ పొయ్యి కొనుక్కోవచ్చని ఆ తల్లి ఆశగా అడిగినట్టు ఇంకొందరు చరిత్రకారులు చెబుతారు.

ఆ విచారణ కోసం కర్నూలు వచ్చిన వ్యక్తి, ఒకప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, నెహ్రూకి సన్నిహుతుడైన యశ్వంత్ సింగ్ పర్మర్ అని కొందరు అధ్యయనకారులు చెబుతారు. కాదు, వేరే వ్యక్తి అని కొందరు అంటారు. మొత్తానికి రహస్య విచారణ జరిగింది అనేది వాస్తవమేనని అందరూ అంగీకరిస్తారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఒక దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం అది. 1960 నుంచి 62 వరకూ ఆయన సీఎంగా ఉన్నారు.

సంజీవయ్య ఇల్లు
ఫొటో క్యాప్షన్, సంజీవయ్య ఇల్లు

అయిష్టంగా రాజకీయాల్లోకి

1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో మునెయ్య, సుంకులమ్మలకు ఐదవ సంతానంగా సంజీవయ్య జన్మించారు. ఆయన పుట్టిన మూడు రోజులకే తండ్రి మునెయ్య చనిపోయారు.

మేనమామల సంరక్షణలో చదువుకున్నారు. కర్నూలు మునిసిపల్ హైస్కూల్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు.

రెండవ ప్రపంచం యుద్ధం సందర్భంగా బ్రిటిష్ వారు ఆహార ధాన్య సేకరణ విస్తృతంగా చేస్తున్న రోజుల్లో కర్నూలు సివిల్ సప్లయిస్‌లో గుమస్తాగా, బళ్లారి సివిల్ సప్లయి విభాగంలో ఇనస్పెక్టర్‌గా పనిచేశారు.

అక్కడ పరిచయమైన ఒక జడ్జి సలహాతో మద్రాస్ వెళ్లి లా చదివారు. అక్కడ డబ్బుల కోసం ట్యూషన్లు చెప్పేవారు. లా పూర్తయ్యాక పిలకా గణపతి శాస్త్రి, జాస్తి సీతామహాలక్ష్మిల దగ్గర జూనియర్ అప్రెంటిస్‌గా చేరారు.

1950లలో భారతదేశం రిపబ్లిక్ అయింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన వచ్చింది. అప్పటికి కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీ రెండు పదవుల్లోనూ ఎస్.నాగప్ప ఉండేవారు.

‘‘తాజా నిబంధనతో నాగప్ప ఎమ్మెల్యే పదవి ఉంచుకుని ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అభ్యర్థిని వెతికే పనిని ఎన్జీ రంగాకు అప్పగించారు చక్రవర్తుల రాజగోపాలాచారి. అదే సమయంలో జాస్తి సీతామహాలక్ష్మి దగ్గరకు వేరే పనిపై ఎన్జీ రంగా వెళ్లారు. మాటల సందర్భంలో ఈ విషయం చెప్పినప్పుడు తన దగ్గర జూనియర్‌గా ఉన్న దామోదరం సంజీవయ్యను పరిచయం చేశారామె.

అయితే ఆయనకు కుటుంబ బాధ్యతలు ఉన్నందున రాజకీయాల్లో చేరడానికి ఒప్పుకోలేదు. కానీ నరసప్ప అనే స్నేహితుడు సంజీవయ్యను ఒప్పించారు. అప్పటి తన క్లాస్ మేట్, తరువాత చాలాకాలం మిత్రునిగా కొనసాగిన మరో ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కూడా సంజీవయ్యను ప్రోత్సహించారు.

అలా 29 ఏళ్ల వయసులో ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి, 1950 సంవత్సరంలో భారత ప్రొవిజినల్ పార్లమెంటులో కర్నూలు సభ్యునిగా అడుగుపెట్టారు సంజీవయ్య’’ అంటూ ఆయన రాజకీయ ప్రవేశాన్ని బీబీసీకి వివరించారు సంజీవయ్య అన్న కొడుకు, ప్రస్తుత కాంగ్రెస్ నేత దామోదరం రాధాకృష్ణమూర్తి.

1952లో భారతదేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు, కర్నూలు నుంచి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికై చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రభుత్వంలో హౌసింగ్, కోపరేటివ్ మంత్రిగా చేశారు సంజీవయ్య.

ఆంధ్ర, తమిళనాడు కలసిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ, ఆ తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆపై తెలంగాణ, ఆంధ్ర కలసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేశారు. మద్రాస్ రాష్ట్ర మొదటి కేబినెట్‌లో అతి చిన్న వయసు వ్యక్తి సంజీవయ్యే అని చెబుతారు.

1952లో తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 1960లో సీఎం అయ్యే వరకూ మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర రాష్ట్రంలో 1953లో ప్రకాశం కాబినెట్‌లో సాంఘిక సంక్షేమ, ఆరోగ్య శాఖలు, 1955 బెజవాడ గోపాల రెడ్డి కాబినెట్‌లో రవాణా, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థల పాలన శాఖలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో నీలం సంజీవ రెడ్డి కాబినెట్‌లో కార్మిక, స్థానిక సంస్థల శాఖ నిర్వహించారు.

పెద్దపాడులో స్కూలు

అనుకోకుండా ముఖ్యమంత్రిగా..

1956 నుంచి 1960 ప్రారంభం వరకూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల పదవి దిగిపోయినప్పుడు, ఆ స్థానంలో సంజీవయ్య నియమితులయ్యారు.

1960-62 మధ్య 27 నెలల పాటూ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం వెనుక పశ్చిమ గోదావరికి చెందిన కాంగ్రెస్ నాయకులు అల్లూరి సత్యనారాయణ రాజు పాత్ర ఉంది.

‘‘అల్లూరి సత్యనారాయణ రాజు, సంజీవయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు. అవసరమైతే ఒకరి కోసం ఒకరు పదవులు వదులుకునేట్టుగా ఉండేవారు’’ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి మురళీ మనోహర్ బీబీసీతో చెప్పారు.

‘‘అప్పుడు సంజీవ రెడ్డికి, సత్యనారాయణ రాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో అనూహ్యంగా సంజీవయ్య పేరు తెరపైకి తెచ్చారు సత్యనారాయణ రాజు" అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.వెంకట రాజం బీబీసీకి చెప్పారు .

అధిష్ఠానం మధ్యేమార్గంగా, రెండు పెద్ద వర్గాల మధ్య రాజీకోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు అంత చురుగ్గా కనిపించరు. కానీ సంజీవయ్య దానికి మినహాయింపు.

ముఖ్యమంత్రిగా చాలా పథకాలు ప్రారంభించారు. పరిపాలనలో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుత అవినీతి నిరోధక శాఖ 'ఏసీబీ' ఆయన హయాంలోనే ప్రారంభం అయింది.

గవర్నమెంటు ఎంప్లాయిస్ తరహాలో, గవర్నమెంటు టీచర్లకు కూడా పెన్షన్ ప్రారంభించారు సంజీవయ్య. అంతుకు ముందు టీచర్లకు పెన్షన్ లేదు.

ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో కరచాలనం చేస్తూ..

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

రిజర్వేషన్లు

రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారు. కోస్తా ప్రాంత కాపు (తెలగ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటూ, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లో ఉత్తర్వులు ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, గనుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు (ఇప్పుడు సంజీవయ్య సాగర్), ఆత్మకూర్ అటవీ ప్రాంతంలో వరదరాజుల ప్రాజెక్టు మొదలుపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టుల శంకుస్థాపన చేశారు.

‘‘ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం సాగుతోంది. దాచేపల్లి నుంచి సిమెంట్ తొందరగా వచ్చేలా మానిటర్ చేశారు. నాగార్జున సాగర్ త్వరగా పూర్తయ్యేందుకు చాలా కృషి చేశారాయన’’ అన్నారు ప్రొఫెసర్ వెంకట రాజం.

‘‘వ్యవసాయంతో పాటూ పరిశ్రమలపైనా శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు సంజీవయ్య కృషి వల్ల వచ్చినవే. దిల్లీలో లాబీ చేసి అవి హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు. జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు ప్రారంభించారు’’ అని వివరించారు రాధాకృష్ణమూర్తి.

ప్రస్తుత ప్రభుత్వాలు పోటాపటీగా అమలు చేస్తోన్న వృద్ధాప్య పింఛన్లు ప్రారంభించింది ఈయనే.

‘‘ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో సొంతూరు వచ్చి, తిరిగి వెళుతూ తల్లికి వంద రూపాయలు ఇచ్చారు. ప్రతి నెలా, ప్రతి ఒక్కరికీ ఇలా ఎవరు డబ్బు ఇస్తారు అన్న తల్లి ప్రశ్నకు సమాధానంగా వృద్ధాప్య పింఛన్ ప్రారంభించారు. అప్పట్లో నెలకు 25 రూపాయల పింఛన్ ఇచ్చేవారు’’ అని రాధాకృష్ణ మూర్తి వివరించారు.

ఆంధ్ర, తెలంగాణల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేశారు సంజీవయ్య.

ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

ముఖ్యమంత్రికీ కుల వివక్ష తప్పలేదు

సంజీవయ్య మాల దాసరి కులానికి చెందిన వ్యక్తి.

అగ్ర కులాల వారిగా చెప్పుకొనే కేబినెట్ సహచరులు ఆయనకు తగినంత గౌరవం ఇచ్చేవారు కాదని అనేక సాక్ష్యాలు చెబుతున్నాయి.

‘‘ఆయన వస్తే నిల్చునే వారు కాదు. కనీసం మర్యాదకు కూడా నమస్కారం పెట్టేవారు కాదు. కానీ ఇవన్నీ సంజీవయ్య పెద్దగా పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి వర్గానికి చెందిన, నెల్లూరుకు చెందిన ప్రముఖ నాయకులు ఆనం చెంచు సుబ్బారెడ్డి, సంజీవయ్యను బాగా అవమానకరంగా చూశారు. అదను కోసం వేచి చూసిన సంజీవయ్య, సుబ్బారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించారు. ఏసీ సుబ్బారెడ్డి ఒకసారి సంజీవయ్యకు రాజీనామా పత్రం పంపించారు. రాజకీయ పరిణామాలు ఆలోచించకుండా, తక్షణం ఆ లేఖను గవర్నర్‌కు పంపి, ఆమోదించేలా చేసి సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు సంజీవయ్య’’ అని వివరించారు ప్రొఫెసర్ వెంకట రాజం.

అయితే ఏసీ సుబ్బారెడ్డి సంజీవయ్యను, కేబినెట్ సమావేశంలోనే కులం పేరుతో దూషించినట్టు కొందరు చరిత్ర పరిశోధకులు చెబుతారు.

సంజీవయ్య అన్న కుమారుడు కూడా ఆ విషయం చెప్పారు. అయితే, అలా నేరుగా కులం పేరుతో తిట్టలేదు కానీ, చాలా అవమానకరంగా వ్యవహరించే వారని ఇంకొందరు చరిత్రకారులు చెబుతారు.

దామోదరం సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

‘‘1962లో ఆంధ్ర, తెలంగాణలకు కలపి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఆంధ్రకు వేరుగా, తెలంగాణకు వేరుగా జరుగగా, ఉమ్మడిగా జరిగిన మొదటి ఎన్నికలు అవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంజీవయ్య గెలిపించారు. కానీ ఆ తరువాత ఆయనను సీఎం చేయకుండా పక్కన పెట్టారు. తిరిగి నీలం సంజీవ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు’’ అని ప్రముఖ పాత్రికేయులు ఎం.నాంచారయ్య బీబీసీతో చెప్పారు

ఆ ఎన్నికల్లో సంజీవయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చాయి.

‘‘సంజీవయ్యను తిరిగి ముఖ్యమంత్రి చేయకూడదంటూ తెలుగు రాష్ట్రాల్లోని అగ్ర కుల నాయకులంతా, మరీ ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి దిల్లీలో లాబీ చేశారు. ఒక దశలో నెహ్రూను.. మేం కావాలో అతను కావాలో తేల్చుకోమన్నారు. దాంతో నెహ్రూ వారి ఒత్తిడికి తలొగ్గారు’’ అన్నారు వెంకట రాజం.

‘‘నిజానికి సంజీవయ్య తెలుగునాట ఎదుర్కొన్నంత కులవివక్ష దిల్లీలో కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు’’ అని వివరించారు ప్రొఫెసర్ మురళీ మనోహర్.

‘‘సంజీవయ్యకు మొదట్లో కర్నూలు రెడ్లతో సఖ్యత ఉండేది. కానీ సంజీవయ్య ఎదిగే కొద్దీ శత్రుత్వంగా మారింది. ఆ క్రమంలో తనకంటూ కొందరు రెడ్లను చేరదీసి, ఒక వర్గం తయారు చేసుకున్నారు. అదే సమయంలో కర్నూలులో బీసీ నాయకత్వాన్నీ ప్రోత్సహించారు. కేఈ మాదన్నను (కేఈ కృష్ణమూర్తి తండ్రి) బీసీ నాయకుడిగా ప్రోత్సహించారు. ఆయన చివరి వరకూ సంజీవయ్యతో సఖ్యతతో ఉన్నారు. చివరకు 1967 ఎన్నికల్లో అగ్ర కులాల వారు పార్టీలకతీతంగా పనిచేసి, సంజీవయ్యను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు’’ అని వివరించారు రాధాకృష్ణమూర్తి.

దామోదరం సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా..

సంజీవయ్య నచ్చారో లేక ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనందుకు నష్టపరిహారంగానో కానీ సంజీవయ్యను దిల్లీ పిలిపించారు నెహ్రూ. అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిని చేశారు.

1962-1964 వరకూ నెహ్రూ హయాంలో, 1971-72 మధ్య ఇందిర హయాంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు సంజీవయ్య. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన తొలి దళితుడిగా కూడా రికార్డు సృష్టించారు.

‘‘మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు ప్రధాని నెహ్రూ లేచి సంజీవయ్యను పిలిచి, ‘‘సర్ మీ కుర్చీని అలంకరించండి అంటూ స్వాగతం చెప్పారు. నెహ్రూ అంతటి వారు లేచి తనను సర్ అని పిలిచి అధ్యక్ష స్థానం అలంకరించమనేసరికి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సంజీవయ్య’’ అన్నారు రాధాకృష్ణమూర్తి.

1964, 1970లలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారాయన. నెహ్రూ, నందా, శాస్త్రి, ఇందిర కాబినెట్లలో కేంద్ర మంత్రిగా పరిశ్రమలు, కార్మిక శాఖలకు పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా జెనీవాలో, ఐక్యారాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించారు.

కంపెనీలు, ఫాక్టరీలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే చట్టం తేవడం ద్వారా సంజీవయ్య పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

అదే సమయంలో దిల్లీ కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలపి ఉంచే ఒక రాజకీయ వేదికగా 'సేవా స్థంబ్' అనే సంస్థ ప్రారంభించారు.

‘‘తరువాత కాలంలో బీఎస్పీ ప్రారంభించిన కాన్షీరాం కూడా 'ఈ విషయంలో నాకు దామోదరం సంజీయవ్య స్ఫూర్తి' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు" అన్నారు రాధాకృష్ణమూర్తి.

ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

సంజీవయ్య సాహిత్యం

సంజీవయ్యలో చాలా మందికి తెలియని కోణం సాహిత్యం, సంగీతం. తన జన్మవృత్తాంతంపై స్వయంగా సీస పద్యం రాసుకున్నారాయన.

'కనకాంతులీను కర్నూలు సీమలో…' అంటూ సాగుతుందా పద్యం. తాను పూజలో పాడుకునేందుకు వినాయకుడు, సరస్వతీ దేవిలపై హంసధ్వని రాగంలో స్తోత్రం రాసుకుని, ట్యూన్ చేసుకున్నారు. భీష్మ జననం అనే హరికథ రాశారు.

ఆయన రాసిన మరికొన్ని సాహిత్య గ్రంథాలు అందుబాటులో లేవు. సీఎంగా మొదటిసారి 'అఖిల భారత తెలుగు రచయితల సంగీతి' నిర్వహించారు.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ సంజీవయ్య మిత్రులు. ఒక ప్రాచీన కావ్యంపై చర్చ మా ఇద్దరినీ మిత్రులుగా చేసిందని ఒక సందర్భంలో చెప్పారు భరధ్వాజ. 'సంజీవయ్యకు మొక్కెద' అంటూ ఆయనపై కవిత్వం రాశారు దాశరథి.

‘‘మాల దాసరి కులస్తులు స్వతహాగా వాద్యకారులు. పాటలు పాడతారు. అలా అనువంశికంగా వచ్చిన విద్య ఆయనకు రాజకీయంగా బాగా ఉపయోగపడింది. బహిరంగ సభల్లో భారత, భాగవత పద్యాలు పాడుతూ, ఛలోక్తులు విసురుతూ, పౌరాణిక, ఇతిహాస వృత్తాంతాలు చెబుతూ జనాన్ని తన వైపుకు తిప్పుకునేవారు. అందుకే ఆయన బహిరంగ సభలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. జనాన్ని కట్టిపడేసేవారు’’ అన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్.

రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలతో సంజీవయ్య

ఫొటో సోర్స్, SANJEEVAYYA TRUST

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలతో సంజీవయ్య

‘‘అందరికీ లెక్కల్లో వంద మార్కులు వస్తాయి. కానీ సంజీవయ్యకు అప్పట్లో తెలుగులో 99 మార్కులు వచ్చాయి’’ అని చెప్పారు రాధాకృష్ణమూర్తి.

సంజీవయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు పిల్లలు లేరు. సావిత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయన భార్య పేరు కృష్ణవేణి. మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి సంజీవయ్యకు తోడల్లుడు.

సంజీవయ్య షుగర్ వ్యాధితో బాధపడేవారు. 51 ఏళ్ల వయసులో 1972 మే 5 న మరణించారు. 2006లో పార్లమెంటు సెంట్రల్ హాలులో సంజీవయ్య ఫోటో ఆవిష్కరించారు. ఆయన పేరుతో స్టాంప్ కూడా ఆవిష్కరించారు.

వీడియో క్యాప్షన్, దామోదరం సంజీవయ్య: దేశంలోనే తొలి దళిత సీఎం.. భారీ మెజార్టీ సాధించినా మళ్లీ సీఎం కాలేదు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)