ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల రాజకీయాలను కులాలు ఎలా మలుపులు తిప్పాయి: అభిప్రాయం

యూపీ రాజకీయాల్లో కులం

ఫొటో సోర్స్, Getty Images/BBC

    • రచయిత, నాంచారయ్య మెరుగుమాల
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో 55 సంవత్సరాల సామాజిక సమీకరణాలకు సంబంధించిన మార్పులు మొదలయ్యాయి. కులం పాత్ర కొత్త మలుపు తీసుకుంది.

హిందీ రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతులు (ఓబీసీ) గణనీయ సంఖ్యలో ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావడంలో కీలక పాత్ర పోషించారు సోషలిస్ట్‌ దిగ్గజం డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా. ఆయన నేతృత్వంలో ఈ మార్పులు వచ్చాయి. ఇవి రాష్ట్ర రాజకీయాల దిశాదశా మార్చాయి.

1937 నుంచి 1967 వరకూ అంటే మూడు దశాబ్దాలుగా యూపీ రాజకీయ క్షేత్రంలో ఆధిపత్యం సాగించిన అగ్రవర్ణాల జోరు నాలుగో సార్వత్రిక ఎన్నికల నుంచి తగ్గడం మొదలైంది.

శతాబ్దాలుగా అధికార చట్రానికి దూరంగా ఉన్న సామాజికవర్గాలను ఎన్నికల్లో విజేతలను నిర్ణయించే దశకు తీసుకొచ్చే రాజకీయ ప్రక్రియ వేగం పుంజుకుంది 1967లోనే.

ఈ మార్పులు నిర్ణీత రూపం దాల్చడానికి ఉత్తర్‌ ప్రదేశ్‌ శూద్రులు, ఓబీసీలు, దళితులు మరో 22 ఏళ్లు ఎదురుచూడాల్సివచ్చింది. 1989 డిసెంబర్‌ ఆరంభానికి గాని యూపీ రాజకీయ చిత్రంలో స్పష్టమైన మార్పులు రాలేదు.

యూపీలో మొదట్నించీ అగ్రవర్ణాల నేతలే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మొదటిసారి 1967 ఏప్రిల్‌లో ఈ ఆనవాయితీకి తెరపడింది.

మళ్లీ పదేళ్లకు 1977లో రాష్ట్రంలో తొలి ఓబీసీ సీఎం అధికారంలోకి వచ్చారు. పన్నెండేళ్ల తర్వాత 1989లో చివరి బ్రాహ్మణ ముఖ్యమంత్రి నారాయణ్‌ దత్‌ తివారీ(ఎన్‌డీ తివారీ) పదవి నుంచి వైదొలిగారు.

అప్పుడు మొదలైన బ్రాహ్మణేతర ముఖ్యమంత్రుల శకం 32 ఏళ్లు దాటినా ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సామాజిక మార్పులు ఆలస్యంగా వచ్చిన యూపీలో కులంతో మతం కలిసి ప్రయాణించడం కూడా 1990ల్లోనే ఊపందుకుంది.

యూపీ అనగానే కులాల కురుక్షేత్రం అని ముద్రవేసి, అక్కడి రాజకీయాల్లో కులం లోతుపాతులు చూడకుండా మాట్లాడడం తేలిక.

అయితే, భారతదేశంలో జనాభారీత్యా అతి పెద్దదైన యూపీ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కోల్పోయాక మాత్రమే బిహార్‌లో మాదిరిగా అన్ని సామాజికవర్గాలకు తగిన గుర్తింపు దక్కడం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి-మార్చిలో 18వ యూపీ శాసనసభకు జరిగే ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలు గుర్తుచేసుకోవాల్సిన అవససరం కనిపిస్తోంది.

అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, Reuters

2022 అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర ఓబీసీలపై పెరిగిన 'ఫోకస్‌'

కొత్త సహస్రాబ్దిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోదైన 2007లో కులం కీలకపాత్ర పోషించిందని పోలింగ్‌ అనంతర సర్వేల్లో తేలింది.

రాష్ట్ర జనాభాలో దాదాపు పదిశాతం ఉన్న బ్రాహ్మణులు యూపీలో బీఎస్పీ తొలిసారి మెజారిటీ సాధించడంలో కీలకపాత్ర పోషించారని ప్రచారం జరిగిన ఎన్నికలవి.

మళ్లీ పదేళ్లకు 2017లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కులం పాత్రపై విస్తృత చర్చ జరిగింది.

యాదవేతర వెనుకబడిన కులాలు.. జాటవేతర అనుసూచిత కులాలు (ఎస్సీలు) అత్యధిక సంఖ్యలో బీజేపీకి ఓటేయడంతో ఈ పార్టీ మొదటిసారి 312 సీట్లు కైవసం చేసుకుందని అంచనా.

మాయావతి జాటవ్‌ (దీన్నే చమార్‌ అని కూడా పిలుస్తారు) కుటుంబంలో జన్మించడం వల్ల యూపీ జనాభాలో 11 శాతం వరకూ ఉన్న ఈ దళితవర్గం బీఎస్పీకే అధిక సంఖ్యలో మొగ్గుచూపుతుందని, ఎస్పీ స్థాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్, ఆయన వారసుడు అఖిలేశ్‌ యాదవ్‌కు తమ వర్గమైన యాదవుల్లో తిరుగులేని పట్టు ఉందనేది సాధారణ అంచనా.

ఎస్పీ అధికారంలో ఉంటే యాదవులు, మాయావతి సీఎంగా ఉన్నప్పుడు జాటవులు ఎక్కువ ప్రయోజనం పొందారని జనంలో ఉన్న అభిప్రాయానికి అనుగుణంగా బీజేపీ 2014, 2017, 2019 ఎన్నికల్లో యాదవేతర ఓబీసీలు, జాటవేతర ఎస్సీలను పెద్ద సంఖ్యంలో సమీకరించి ఇదివరికెన్నడూ లేని విజయాలు సాధించింది.

మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇదే ఎన్నికల ఫార్ములా అనుసరించడంలో పాలకపక్షం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి కారణం-గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని సంపూర్ణ అధికారంతో పరిపాలించిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ విధానాలే అని చెప్పక తప్పదు.

జనవరి ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించాక బీజేపీ ప్రభుత్వంలోని ముగ్గురు యాదవేతర ఓబీసీ మంత్రులు-స్వామి ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్, దర్శన్‌సింగ్‌ సైనీ రాజీనామా చేసి పన్నెండు మంది పార్టీ శాసనసభ్యులతో కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

అంతకు మూడు నెలల ముందు అంటే 2021 అక్టోబర్‌లో ఓబీసీ కులాల మద్దతు ఉన్న ఉప ప్రాంతీయపక్షం సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్బీఎస్పీ) మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఎస్పీ కూటమిలో చేరడం, మరి కొన్ని బాగా వెనుకబడిన ఓబీసీ పార్టీలు (కొన్ని బీసీ కులాల మద్దతుతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చిన్న పార్టీలు) చూడా ఎస్బీఎస్పీ నేత ఓం ప్రకాశ్‌ రాజభర్‌ దారిలో సైకిల్‌ పార్టీ (ఎస్పీ) శిబిరంలో చోటు సంపాదించడంతో మళ్లీ ఎంబీసీలు లేదా యాదవేతర బీసీల కీలక పాత్రపై ప్రధానపక్షాలు, రాజకీయ పరిశీలకుల దృష్టి కేంద్రీకృతమైంది.

2014, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2022 యూపీ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ బాగా వెనుకబడిన ఓబీసీలదే నిర్ణాయక పాత్ర అని రాజకీయ పండితులు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకూ విస్తరించిన ఈ ఓబీసీల జనాభా పశ్చిమ యూపీతో పోల్చితే మధ్య, తూర్పు (పూర్వాంచల్‌)లో ఎక్కువ.

పూర్వాంచల్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న యాదవులకు సరితూగే సంఖ్యలో ఉన్న ఈ యాదవేతర ఓబీసీలు ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీజేపీకి గతంలో మాదిరిగా ఓటేస్తారా? లేదా అనేదే రేపు మార్చి 10న వెలువడే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది.

ఈ అంశం పైనే పాలకపక్షమైన బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తున్న ఎస్పీలు దృష్టిపెట్టాయి. ఈ వర్గాలకు చెందిన బడా నేతల ఫిరాయింపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

బ్రాహ్మణ లేదా అగ్రవర్ణాల ఆధిపత్యం మందగించే విషయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే యూపీ ఎలా, ఎంత వెనుకబడిందో పరిశీలిద్దాం.

యూపీ రాజకీయాల్లో కులం

ఫొటో సోర్స్, Getty Images

1950ల్లో తెలుగునాట వచ్చిన మార్పులు యూపీలో పదేళ్లు ఆలస్యం

విద్య, ప్రజారోగ్యం, పారిశ్రామిక రంగాల్లో దేశంలో ముందున్న దక్షిణాదితో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పోల్చితే పెద్ద హిందీ రాష్ట్రాలు యూపీ, బీహార్‌ రాజకీయాల్లో కులం ప్రభావం ఎక్కువనే అభిప్రాయం బాగా విస్తరించింది.

నిజానికి బ్రాహ్మణ వర్గం నుంచి చాలా వరకు రాజ్యాధికారం శూద్ర కులాలకు బదిలీకావడం తెలుగునాట 1950ల్లోనే పూర్తయింది. రెండు ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఈ తరహా మార్పు ఆలస్యంగా వచ్చింది.

1967 ఎన్నికల నుంచీ ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయాధారిత జాట్లు, వారితో సన్నిహిత సంబంధాలున్న బీసీ కులాల ప్రతినిధుల సంఖ్య చెప్పుకోదగ్గ రీతిలో పెరగడం మొదలైంది. బ్రాహ్మణులు దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ 3 శాతం మించి లేరు. చట్టసభల్లో అయితే, ఒక్క కర్ణాటక మినహాయిస్తే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ జనాభా నిష్పత్తి కన్నా తక్కువే.

యూపీలో అందుకు భిన్నమైన స్థితి. ఇక్కడ బ్రాహ్మణుల జనాభా దాదాపు పది శాతం మధ్య ఉంది. హిందూ సమాజంలో వారి తర్వాత మెట్టులో కనిపించే క్షత్రియులు (ఠాకూర్లు లేదా రాజపూత్‌లు) ఏడు శాతం, వైశ్యులు (బనియాలు) ఐదు శాతం, మరో కీలక అగ్రకులం కాయస్థలు రెండు శాతం, శూద్రులైన జాట్లు మరో రెండు శాతం వరకూ ఉన్నారు.

వెనుకబడినవర్గాల్లో ఈ మధ్యకాలంలో బాగా పైకొచ్చిన యాదవులు (అహీర్‌ లేదా గోలా) దాదాపు 8 ఎనిమిది శాతానికి పైగా ఉన్నారు.

యాదవులతోపాటు మంచి ప్రగతి సాధించిన బీసీలైన కుర్మీలు 4 శాతం, గుజ్జర్లు 2 శాతం, మౌర్య-కాచీ-కుష్వాహా సముదాయం ఐదారు శాతం వరకూ ఉంటే, ఈ బీసీలందరూ కలిసి రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉంటారని అంచనా. ఓసీలు, ఓబీసీలను కులాలవారీగా లెక్కించకపోవడంతో ఇవన్నీ అంచనాలే. అంచనాలకు సంబంధించి వివిధ లెక్కల్లో తేడాలు కూడా కనిపిస్తాయి.

యోగీ ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

స్వాతంత్య్రం వచ్చే నాటికి అగ్రవర్ణాలదే ఆధిపత్యం

స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇండియాలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే యూపీలోనూ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల స్థానం అన్ని రంగాల్లోనూ మొదటి వరుసలోనే ఉంది.

తరతరాలుగా తమకున్న సామాజిక ప్రగతితో ఈ వర్గాలు రాజకీయాలు, చట్టసభలు, న్యాయవ్యవస్థ, ఇతర అధికార వ్యవస్థల్లో తమ జనాభా నిష్పత్తికి మించి ఎక్కువ వాటా కైవసం చేసుకోగలిగాయి.

1946-1954 మధ్య ఉత్తర్‌ ప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న పండిత గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ ఉత్తరాఖండీ బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజకీయ దురంధరుడు. ఆయన తర్వాత సీఎం పదవి చేపట్టిన డాక్టర్‌ సంపూర్ణానంద్‌ కాయస్థ కుటుంబంలో పుట్టారు.

సంపూర్ణానంద్‌ వారసునిగా వచ్చిన మూడో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి చంద్రభాను (సీబీ) గుప్తా వైశ్యుడు. కాంగ్రెస్‌ కుర్చీల ఆటలో సీబీ గుప్తా తర్వాత తొలి మహిళా ముఖ్యమంత్రిగా లక్నో పీఠమెక్కిన సుచేతా కృపలానీ యూపీ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజనీతి కోవిదుడు జేబీ కృపలానీని పెళ్లాడక ముందు ఆమె ఇంటి పేరు మజుందార్‌. ఇలా 1947 నుంచి 1967 వరకూ మొదటి రెండు దశాబ్దాలు అగ్రవర్ణాల కాంగ్రెస్‌ నాయకులే యూపీ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు.

సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ (ఎసెస్పీ) నేత డా.లోహియా విశేష కృషి, ప్రజాందోళనల ఫలితంగా వెనుకబడినకులాలు ఆయన వెంట నడిచాయి. దేశంలో దాదాపు పది రాష్ట్రాల్లో మాదిరిగానే యూపీలోనూ 1967 మార్చి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. మెజారిటీ రాకున్నా అతిపెద్ద పార్టీగా అవతరించింది.

చౌధరి చరణ్ సింగ్

ఫొటో సోర్స్, charan singh

ఫొటో క్యాప్షన్, చౌధరి చరణ్ సింగ్

పెద్ద సంఖ్యలో గెలిచిన ఇండిపెండెంట్ల సాయంతో సీబీ గుప్తా నాయకత్వాన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అది మూడు వారాలైనా నిండకుండానే కూలిపోయింది. సీనియర్‌ కాంగ్రెస్‌ మంత్రి, రైతు నేత చౌధరీ చరణ్‌సింగ్‌ 18 మంది పార్టీ ఎమ్మెల్యేలతో బయటికొచ్చి ప్రతిపక్షాలతో చేతులు కలిపారు.

సీబీ గుప్తా దిగిపోయాక చరణ్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెసేతర పక్షాల సంయుక్త విధాయకదళ్‌ (ఎస్వీడీ) ప్రభుత్వం ఏప్రిల్‌ నెలలో అధికారం చేపట్టింది. యూపీ తొలి శూద్ర ముఖ్యమంత్రిగా ఈ జాట్‌ నేత (చరణ్‌) రికార్డుకెక్కారు.

జాట్‌లను సామాజికంగా శూద్రఅగ్రకులంగా పరిగణస్తారు. ఒక రకంగా తెలుగునాట కమ్మవారితో పోల్చవచ్చు. ఆయన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులైన ఐదుగురు నాయకుల్లో ముగ్గురు: కమలాపతి త్రిపాఠీ, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డీ తివారీ బ్రాహ్మణులు.

మిగిలిన ఇద్దరూ (సీబీ గుప్తా-వైశ్య, టీఎన్‌ సింగ్‌-ఠాకూర్‌) కూడా అగ్రవర్ణాలకు చెందిన నేతలే. ఈ నేపథ్యంలో 1977లో ఏడో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం అయిన జనతా పార్టీ నేత రాంనరేష్‌ యాదవ్‌ యూపీ మొదటి బీసీ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.

పూర్వపు లోహియా సోషలిస్టు అయిన రాంనరేష్‌ ఈ పదవిలో ఏడాది 8 నెలలే ఉన్నాగాని ఈ ప్రత్యేకత దక్కించుకున్నారు. ఆ తర్వాత పన్నేండేళ్లకు 1989 డిసెంబర్‌ 5న జనతాదళ్‌ తరఫున మాజీ లోహియా సోషలిస్టు ములాయంసింగ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అయ్యేవరకూ బీసీలెవరికీ ఈ పదవి దక్కలేదు.

1946 నుంచి 1989 వరకూ కాంగ్రెస్‌ తరఫున ఏడుగురు సీఎంలు అయినా వారంతా అగ్రవర్ణాల నేతలే. ములాయం తర్వాత 1991 మేలో బీజేపీ తరఫున గద్దెనెక్కిన కల్యాణ్‌సింగ్‌ బీసీ వర్గానికి చెందిన లోధా కులస్తుడు.

1993 డిసెంబర్‌లో రెండోసారి సీఎం అయిన (సొంత పార్టీ ఎస్పీ తరఫున) ములాయం సర్కారును సంకీర్ణ పక్షం బీఎస్పీ కూల్చివేశాక ఆ పార్టీ నాయకురాలు మాయావతి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఆమె తొలి దళిత సీఎంగా చరిత్ర సృష్టించారు.

యూపీలో మొత్తం 21 మంది ముఖ్యమంత్రుల్లో 16 మంది అగ్రవర్ణాలవారే. మిగిలిన ఆరుగురిలో (ఒక ఎస్సీ, ఒక లోధా, ఒక శూద్ర జాట్‌. ముగ్గురు యాదవులు). మొత్తంమీద నలుగురు బీసీలు కాంగ్రెసేతర పార్టీల తరఫున ముఖ్యమంత్రులయ్యారు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

అగ్రవర్ణాల ఆధిపత్యానికి లోహియా, చరణ్, కాన్షీరామ్‌ గండి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దళితుల, బీసీల అభ్యన్నతికి తోడ్పడిన నాయకులు జగమెరిగిన సోషలిస్టు రామ్‌మనోహర్‌ లోహియా, రైతు నేత చరణ్‌సింగ్, బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్‌.

ఈ ముగ్గురు నేతలూ బీసీలు, ఎస్సీల ప్రాతినిధ్యం పెంచడమేగాక అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి కొట్టారు. మొదటి సాధారణ ఎన్నికల్లో (1952) సోషలిస్టుల ఘోర పరాజయం తర్వాత డా. లోహియాకు అసలు విషయం బోధపడింది.

ఉత్తరాదిన కుల సమీకరణల్లో మార్పుల ద్వారా మాత్రమే కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలమనే అవగాహన ఆయనకు కలిగింది. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులు, ముస్లింలను తన వైపు తిప్పుకుని కాంగ్రెస్‌ తిరుగులేని విజయాలు సాధించింది.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో దళితుల్లో కొంత రాజకీయ చైతన్యం వచ్చింది. దక్షిణాదిన శూద్రులు, బీసీలకు జస్టిస్‌ పార్టీ ఆవిర్భావం, కాంగ్రెస్‌ పంథాలో మార్పులు, ఇతర ఉద్యమాల ప్రభావంతో రాజ్యాధికారంలో తగినంత వాటా దక్కింది.

ఉత్తరాదిన ఉద్యమాల ఊసు, ఉనికి లేనందు వల్ల 1960ల నాటికి కూడా ఈ వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న అగ్రవర్ణాలు-ఎస్సీలు-ముస్లింల సమీకరణ సూత్రానికి విరుగుడు వెనుకబడిన తరగతులను చైతన్యపరిచి ఈ ఆధిపత్య పార్టీకి వ్యతిరేకంగా కూడగట్టడమేనని లోహియా గుర్తించారు.

వారిని కులాలవారీగా గాకుండా వెనకబడినవర్గాల పేరుతోనే ఆయన చైతన్యపరిచారు. రెండో వైపు పశ్చిమ యూపీకి చెందిన రైతు నేతగా ప్రసిద్ధికెక్కిన చరణ్‌సింగ్‌ కృషి తోడ్పడింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో రెవిన్యూ, వ్యవసాయ శాఖల మంత్రిగా జమీందారీ వ్యవస్థ రద్దు, బీసీ రైతులకు భూమి పట్టాలు (దస్తావేజులు) ఇప్పించడం, పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా సంపాదించిన పేరుతో ఆయన 1967 తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చారు.

ఆయన తోటి జాట్లతోపాటు గుజ్జర్లు, కుర్మీలు, యాదవులు వంటి వ్యవసాయాధారిత బీసీ కులాలకు ఎన్నికల్లో అధిక సంఖ్యలో టికెట్లు ఇప్పించారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్: 'నా బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు'

1967 అక్టోబర్‌లో డా.లోహియా మరణం తర్వాత ఆయన లేని లోటును చరణ్‌సింగ్‌ పూడ్చారు. చెల్లాచెదురైన సోషలిస్టుల్లో ములాయం, రాజ్‌నారాయణ్, కర్పూరీ ఠాకూర్‌ సహా పలువురు నాయకులు కొన్నేళ్లకు చరణ్‌ నాయక్వంలోని భారతీయ లోక్‌దళ్‌ (బీఎల్డీ)లో చేరారు.

లోహియా తర్వాత ఆయన హిందీ ప్రాంతాల్లో బీసీలను కూడగట్టి కాంగ్రెస్‌ను దెబ్బదీయడానికి కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో బీసీ కులాలు మంచి చదువులతో ఆర్థికంగా కూడా కొంత మేర బలపడడంతో పదేళ్లలో రెండు పెద్ద రాష్ట్రాలైన యూపీ, బిహార్‌కు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలు (రాంనరేష్‌ యాదవ్, కర్పూరి ఠాకూర్‌) ముఖ్యమంత్రులు కాగలిగారు.

1980-89 మధ్య పదేళ్లు ఈ రెండు కీలక రాష్ట్రాల్లో రాజ్యాధికారంలో తగిన వాటా బీసీలకు దక్కలేదు గాని దాదాపు మిగిన అన్ని రంగాల్లో బీసీల ప్రగతి ఊపందుకుంది. ఈ సామాజిక మార్పుల ఫలితంగా 1990 మార్చి నుంచి ఇప్పటి వరకూ బిహార్‌లో అగ్రవర్ణాల నేతలెవరూ సీఎం పదవి చేపట్టలేకపోయారు.

యూపీలో 1989 డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకూ బ్రాహ్మణ నేత ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ 32 ఏళ్లలో కేవలం ముగ్గురే ముగ్గురు అగ్రవర్ణాల నేతలు రాంప్రకాశ్‌ గుప్తా (ఏడాది), రాజ్‌నాథ్‌సింగ్‌ (ఏడాదిన్నర), యోగీ ఆదిత్యనాథ్‌ (ఐదేళ్లు) లక్నోలో అధికారపీఠంపై కూర్చోగలిగారు.

వీరిలో మొదటి నేత వైశ్యుడు కాగా, మిగిలిన ఇద్దరూ ఠాకూర్ లన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

కాన్షీరామ్‌ దళితులతోపాటు బీసీలను సమీకరించి, చైతన్యపరిచారు

పంజాబ్‌ దళిత సిక్కు కుటుంబంలో పుట్టిన కాన్షీరామ్‌ ఎస్సీ, బీసీ, మైనారిటీలను సమీకరించి బీఎస్పీని బలీయశక్తిగా రూపుదిద్దారు. తన రాజకీయ ప్రయోగానికి దాదాపు 21 శాతం ఉన్న దళితులు (వారిలో 50 శాతానికి పైగా ఉన్న చమార్లు లేదా జాటవులు. కాన్షీ, మాయాల కులస్తులు), 52 శాతానికి పైగా ఉన్న బీసీలున్న యూపీని ప్రధాన రాజకీయక్షేత్రంగా ఆయన ఎంచుకున్నారు.

పదేళ్లకే గణనీయ ఫలితాలు సాధించారు. అగ్రవర్ణాల నేతల నాయకత్వంలోని పార్టీలను మనువాదీ పార్టీలుగా అభిర్ణించడంతోపాటు బీఎస్పీకి అగ్రకులాల ఓట్లు అవసరం లేదని కూడా ఆయన తేల్చిచెప్పిన సందర్భాలున్నాయి.

1980ల చివరి వరకూ యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టని బాగా వెనుకబడిన కులాల జాబితా రూపొందించారు కాన్షీరామ్‌.

ఈ బడుగుకులాల నేతలను చట్టసభలకు పంపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత జరిగిన 1993 యూపీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ములాయం నేతృత్వంలోని ఎస్పీతో బీఎస్పీ పొత్తు కాన్షీ ఆలోచనే.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL LIBRARY

కాంగ్రెస్‌లో ఠాకూర్ల పెత్తనం

హిందీ రాష్ట్రాల్లో మొదటి ఐదు సాధారణ ఎన్నికల వరకూ కాంగ్రెస్‌కు క్షత్రియులు అంత దగ్గర కాలేదు. ఠాకూర్ల ఓట్లు కాంగ్రెస్, జనసంఘ్‌ (బీజేపీ పూర్వ రూపం), స్వతంత్రపార్టీ, కమ్యూనిస్టు పార్టీల మధ్య చీలిపోయేవి.

యూపీ, ఇంకా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో 1980 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షత్రియులు కాంగ్రెస్‌ గూటికి చెప్పుకోదగ్గ సంఖ్యలో చేరుకున్నారు.

ప్రధాని ఇందిరాగాంధీ చిన్నకొడుకు సంజయ్‌గాంధీ పెత్తనం వచ్చాక అప్పటి దాకా కాంగ్రెస్‌లో సింహభాగం పదవులు అనుభవించిన బ్రాహ్మణులను పక్కనబెట్టి ఠాకూర్లకు ప్రాధాన్యమిచ్చారు. తనను యూపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపే తీర్మానం చేసి పంపగానే సంజయ్‌ అందుకు తిరస్కరించారు.

అంతేగాదు, యూపీ సీఎం పదవికి అప్పటి కేంద్ర మంత్రి, కులీన ఠాకూర్‌ అయిన విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ఎంపికచేసి లక్నో పంపించారు.

మధ్యప్రదేశ్‌లో క్షత్రియుడైన మరో నేత అర్జున్‌సింగ్‌ను కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని చేశారు. వీపీ సింగ్‌ (1980-82), వీర్‌బహదూర్‌సింగ్‌ (1985-88) నాయకత్వాన యూపీలో వరుసగా దాదాపు ఆరేళ్లు ఠాకూర్ల పాలనసాగింది.

మళ్లీ 1989 డిసెంబర్‌లో వీపీ సింగ్‌ ప్రధాని అయ్యాక క్షత్రియులు యూపీలో కొంతకాలం జనతాదళ్, తర్వాత బీజేపీకి మద్దతు పలికారు. బ్రాహ్మణుల మాదిరిగానే యూపీలో అధికారం కోసం పోటీపడగలిగిన అన్ని పార్టీలను సమానంగా ఆదరించే స్థితికి పదేళ్ల క్రితం చేరుకున్నారు ఠాకూర్లు.

తర్వాత 2014 నుంచీ యూపీలో బీజేపీకి గట్టి మద్దతుదారులయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నంత కాలం బ్రాహ్మణులు ఆ పార్టీకే విధేయులుగా ఉన్నారు. తర్వాత ఈ సామాజికవర్గంలో అధికభాగం బీజేపీకి చేరువయ్యారు.

మధ్యలో కాషాయపక్షం కాస్త బలహీనమయ్యాక (2002-2007) ఇతర పార్టీలకూ బ్రాహ్మణులు తోచిన రీతిలో మద్దతు పలికారు. ఈ క్రమంలోనే వారు తమను రెండు చేతులతో ఆహ్వానించిన బీఎస్పీ నాయకురాలు మాయావతి మాటలు విని, 2007 యూపీ శాసనసభ ఎన్నికల్లో 'ఏనుగు' వెంట నడిచి రాజకీయ లబ్ధిపొందారు.

మాయావతి, అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

దళితులు-బీసీల ఐక్యతకు రెండు ప్రయత్నాలు విఫలం

బహుజనులుగా ఇప్పుడు అందరూ పిలుస్తున్న అనుసూచిత కులాలు (ఎస్సీలు), వెనుకబడిన వర్గాల(బీసీలు) ఐక్యతకు ఈ 30 ఏళ్లలో చేసిన యత్నాలు ఉత్తర్‌ ప్రదేశ్‌లో తాత్కాలిక విజయం సాధించడం తప్ప పూర్తి స్థాయిలో కింది లెవల్లో సఫలం కాలేదు.

ఈ రెండు ప్రయత్నాలూ బీఎస్పీ, ఎస్పీ చొరవతోనే పరోక్షంగా జరిగాయి. బాబరీ మసీదు కూల్చివేశాక 1993 నవంబర్‌-డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో మొదటి ప్రయత్నం చేశారు.

కాస్త పైకొచ్చిన బీసీ కులాలు, ముస్లింల ఆదరణ ఉన్న ఎస్పీ, దళితులు, ఎంబీసీల మద్దతు ఉన్న బీఎస్పీ మధ్య తొలిసారి కుదిరిన ఎన్నికల పొత్తు కొంత వరకు సఫలమైంది. మొత్తం 425 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో రెండు పార్టీలకూ (వరుసగా 109, 67 సీట్లు=176) కలిపి మెజారిటీకి అవసరమైన 213 స్థానాలు దక్కలేదు.

జనతాదళ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మద్దతుతో ఎస్పీ నేత ములాయం 1993 డిసెంబర్‌ మొదటివారం ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాన్షీరామ్, ములాయం మధ్య కుదిరిన రాజకీయ, సమాజిక ఒడంబడిక ఎక్కువ కాలం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

బీసీలు-దళితుల మధ్య ఐక్యతను కొన్ని దశాబ్దాలు నిలిపే చారిత్రక అవకాశాన్ని ఎస్పీ నేత జారవిడుచుకున్నారు. ఏడాదిన్నర లోపే పదవి కోల్పోయారు. ఈ ప్రయోగం వికటించాక మయావతి మూడుసార్లు బీజేపీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.

పొత్తు సాగక ప్రతిసారీ ఏడాది- ఏడాదిన్నర లోపే బీజేపీతో పేచీపడి ఆమె పదవీచ్యుతులయ్యారు. ఈ అనుభవం మాయకు గొప్ప పాఠం నేర్పింది. బీసీలు మెజారిటీ సమాజ్ వాదీ పక్షాన ఉన్నపరిస్థితుల్లో అగ్రవర్ణాల ఓటర్ల మద్దతు లేకుండా బీఎస్పీకి సొంతంగా మెజారిటీ సీట్లు రావని ఆమెకు అర్ధమైంది.

దళితులు, ఎంబీసీలు, ముస్లింలకు తోడుగా తాను అప్పటి వరకూ వద్దనుకున బ్రాహ్మణులను ఆమె చేరదీశారు. మారిన పరిస్థితుల్లో రాజకీయంగా ఏకాకి అయ్యామనే దిగులుతో ఉన్న అగ్రవర్ణ ప్రజలకు ఊతం దొరికింది.

బ్రాహ్మణులు అందించిన అనూహ్య మద్దతుతో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లభించింది. అయితే, మాయావతి ఐదేళ్ల పాలన తర్వాత జరిగిన 2012 ఎన్నికలు, అఖిలేశ్‌ పూర్తి పదవీకాలం తర్వాత నిర్వహించిన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీస్పీకి బ్రాహ్మణుల ఓట్లు నామమాత్రంగానే లభించాయి.

ముందే చెప్పినట్టు 2014, 2017, 2019 ఎన్నికల్లో యూపీ వరకూ బ్రాహ్మణుల ఓట్లు మళ్లీ బీజేపీకే భారీగా పడ్డాయి. అంతేకాదు, హిందుత్వ వేడిలో బీఎస్పీకి సొంతమనుకునే జాటవులు, ఎస్పీకి విధేయులుగా భావించే యాదవుల ఓట్లు సైతం స్వల్స సంఖ్యలోనైనా కాషాయపక్షానికి దక్కాయని పోలింగు అనంతరం ఓటర్ల ఇళ్లకు వెళ్లి సీఎస్‌డీఎస్‌ చేసిన పోస్ట్‌ పోల్‌ సర్వేలో తేలింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి, అఖిలేశ్‌ చొరవతో కుదిరిన దళితులు, బీసీల (బీఎస్పీ-ఎస్పీ మైత్రి) పొత్తు కూడా ఎన్నికల ఫలితాలొచ్చాక అంతే వేగంగా ముగిసింది.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

2022 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్లు, ఎంబీసీలపైనే రెండు ప్రధాన కూటముల గురి

యూపీలో వరుసగా ఐదేళ్లు పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగిన తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌ చరిత్రకెక్కుతున్నారు. ఒక్క శాంతి, భద్రతల విషయంలో ఆయనకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు.

అఖిలేశ్‌ యాదవ్‌ ఐదేళ్ల ఎస్సీ పాలనలో యాదవులు, ముస్లింలలోని సంఘవ్యతిరేక శక్తుల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని, ఇప్పుడు ఈ వర్గాల నేరస్తులు అదుపులోకి వచ్చారని బీజేపీ ప్రచారం చేస్తోంది.

అయితే, యోగీ పాలనలో ఆయన కులస్తులైన ఠాకూర్ల పెత్తనం కనపడకుండా సాగిందని, ఠాకూర్‌వాద్‌ కూడా బీజేపీ నుంచి తమ నిష్క్రమణకు కారణమని తూర్పు యూపీకి చెందిన బీజేపీ మంత్రులు ముగ్గురు ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన 202 సీట్లు కైవసం చేసుకోవాలంటే పశ్చిమ యూపీలోని జాట్లు, పూర్వాంచల్‌లోని ఎంబీసీల ఓట్లు కీలకమని గుర్తించిన బీజేపీ, ఎస్పీ కూటములు ఈ రెండు వర్గాల ఓట్ల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి.

కిందటి మూడు ఎన్నికల్లో (2014, 2017, 2019) యాదవేతర బీసీలు, జాటవేతర ఎస్సీలను, పశ్చిమ యూపీలో ముస్లింలకు వ్యతిరేకంగా జాట్లను కూడగట్టి మెజారిటీ సీట్లు, అధికారం సంపాదించిన బీజేపీ 2022లో ఇదే అంశాల్లో తన పట్టు కోల్పోతున్నట్టు వివిధ సర్వేల్లో తేలుతోంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)