సిరియా: ఐసిస్ నాయకుడు ఖురేషీని అంతమొందించామని ప్రకటించిన అమెరికా

ఫొటో సోర్స్, EPA
వాయువ్య సిరియాలో తమ దళాలు రాత్రిపూట జరిపిన దాడుల సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ నాయకుడు హతమయ్యారని అమెరికా సీనియర్ అధికారులు వెల్లడించారు.
''అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ అనే ఐఎస్ నాయకుడిని లేకుండా చేశాం. మా సాయుధ దళాల నైపుణ్యం, ధైర్యసాహసాలకు నా వందనాలు''అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
దాడుల సందర్భంగా ఖురేషీ తనను తాను పేల్చుకున్నాడని, ఈ విస్ఫోటనం వల్ల అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారని అధికారులు మీడియాకు వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత 13 మంది మృతదేహాలను కనుగొన్నామని సిరియా అధికారులు తెలిపారు.
ఉత్తర ఇడ్లిబ్ ప్రావిన్స్, టర్కీ సరిహద్దుకు దగ్గరలో ప్రత్యర్ధి దళాల ఆధీనంలో ఉన్న అట్మెహ్ పట్టణ శివార్లలో అమెరికా హెలికాప్టర్లు అర్ధరాత్రి దాడికి దిగినట్లు మీడియా రిపోర్టులు తెలిపాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అమెరికా దళాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌తో యూఎస్ సైన్యంపై ప్రత్యర్ధులు దాడి చేశారని స్థానికులు తెలిపారు.
హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లడానికి ముందు రెండు గంటలపాటు తీవ్రమైన కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
అక్కడికి చేరుకున్న అమెరికా హెలికాప్టర్లలో ఒకటి సాంకేతిక సమస్యతో నిలిచిపోయిందని, అయితే, దానిని అమెరికా యుద్ధ విమానాలు పేల్చేశాయని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక పేర్కొంది.
ఈ ఘటన తర్వాత హెలికాప్టర్ శిథిలాల ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
ఈ దాడిలో పాల్గొన్న తమ సైనికులందరూ క్షేమంగా తిరిగొచ్చారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ అమెరికా ప్రజలను, తమ సైనిక కూటమిని రక్షించడంతోపాటు, ప్రపంచ శాంతిని కాపాడటం కోసం చేసినదిగా ఆయన అభివర్ణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ దాడికి టార్గెట్‌గా కనిపించిన రెండంతస్తుల భవనం గురించి ఏఎఫ్‌పీ వార్త సంస్థ ప్రతినిధి వర్ణించారు. అక్కడి గోడల నిండా రక్తం ఉందని, కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయని, పైకప్పు పాక్షికంగా దెబ్బతిన్నదని, ఎటు చూసినా ఇంటికి బుల్లెట్ దెబ్బలు కనిపించాయని తెలిపారు.
ఈ దాడి తర్వాత ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు సహా 13మంది మృతదేహాలు ఇక్కడ లభ్యమయ్యాయని సిరియా సివిల్ డిఫెన్స్ గ్రూప్‌గా చెప్పే వైట్ హెల్మెట్స్ అనే విభాగం వెల్లడించింది.
యూకేకు చెందిన మానిటరింగ్ గ్రూప్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా ఈ ఘటనలో 13 మంది మరణించారని తెలిపింది.
''ఆపరేషన్ ప్రారంభం కాగానే మా టార్గెట్‌లో ఒకరైన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. అతనితోపాటు, అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారు'' అని అమెరికా సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, EPA
2019లో అల్-బాగ్దాదీని అంతమొందించినప్పటి ఘటనలాగే ఇది కూడా కనిపించిందని ఆ అధికారి పేర్కొన్నారు.
అబూ బకర్ అల్-బాగ్దాదీ 2019 అక్టోబర్‌లో అట్మెహ్ పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉన్న ఒక రహస్య స్థావరంలో ఉండగా అమెరికా దళాలు ఆ స్థావరంపై దాడి చేశాయి.
అయితే, సైన్యం తనపై దాడి చేయక ముందే బాగ్దాదీ తనను తాను పేల్చుకోవడంతో, అతనితోపాటు ముగ్గురు పిల్లలు కూడా మరణించారు.
వాయువ్య సిరియా జిహాదీ గ్రూపులు, టర్కీ-మద్దతుగల తిరుగుబాటు వర్గాల బలమైన కోట. టర్కీ మద్దతు పొందుతున్న తిరుగుబాటుదారులు ఐఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
ఇవి కూడా చదవండి:
- పీఆర్సీకి వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి పెన్‌డౌన్, 7 నుంచి సమ్మె.. ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన
- అసదుద్దీన్ ఒవైసీ: ‘యూపీ నుంచి దిల్లీ వెళ్తుంటే నా కారుపై కాల్పులు జరిపారు’
- టర్కీ - గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు.. గ్యాస్ కోసమేనా? వేరే వివాదాలున్నాయా?
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- ఈ ఇస్లామిక్ స్టేట్ ఖైదీలు పశ్చిమ దేశాలకు టైం బాంబుల్లా కనిపిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












