ఒసామా బిన్ లాదెన్ స్థాపించిన అల్-ఖైదా ఏమయ్యింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మీనా అల్ లామీ
- హోదా, బీబీసీ మానిటరింగ్
అమెరికాలో 2001 సెప్టెంబరు సెప్టెంబర్ 11న ఉగ్ర దాడి జరిగి 19 ఏళ్లు దాటింది. ఆ దాడులు జరిపిన అఫ్గానిస్థాన్‌కు చెందిన జిహాదిస్ట్ గ్రూపు అల్-ఖైదా ఇప్పుడు పూర్తిగా బలహీనపడింది.
ఈ ఏడాది జూన్‌లో సిరియాలో అల్-ఖైదా శాఖల్లో ఒకదాన్ని ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టింది. యెమెన్‌లో ఉన్న ఆ శాఖ నాయకుడిని యూఎస్ డ్రోన్ దాడిలో చంపేసిన కొద్ది రోజులకే యెమెన్‌లో ప్రత్యర్థులు మొత్తం దెబ్బతీశారు.
అదే జూన్‌లో ఉత్తర ఆఫ్రికా శాఖ నాయకుడిని ఫ్రెంచ్ దాడిలో హతమార్చారు. ఈ శాఖకు కొత్త నాయకత్వాన్ని ఇంకా ప్రకటించలేదు.
మరో పక్క అల్-ఖైదా నాయకుడు అయమాన్ అల్-జవహిరీ కొన్ని నెలలుగా కనిపించడం లేదు. ఇతను అసాధారణ రీతిలో అదృశ్యమవడం చూస్తుంటే ఆయనా హతమై ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, అల్-ఖైదా ఆఫ్రికా శాఖలు సోమాలియా, మాలిలలో ఇప్పటికీ ఇంకా బలంగా ఉన్నాయి.
అన్ని జిహాదిస్ట్ సంస్థల్లాగే అల్-ఖైదా కూడా సైద్ధాంతికపరమైన గందరగోళాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దాని ముందు రెండు సవాళ్లున్నాయి.
ఒకటి ఏదో ఒక విధంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం. రెండోది...కఠినమైన జిహాదీ సూత్రాలకు కట్టుబడి ఉంటూ మిగతా ప్రపంచంనుంచీ ముస్లింలను మరింత దూరం చేయడం.
రెండూ సులువు కాదు. ఈ రెండు మార్గాల్లోనూ కష్టనష్టాలున్నాయి.
మొదటిది జిహాదీల సొంత గుర్తింపు ప్రమాదంలో పడిపోతుంది. సంస్థలో చీలికలు రావొచ్చు. రెండో దాన్లో దాని కార్యాచరణ పరిథి, సామర్థ్యం తగ్గిపోతాయి. దాని ఉనికికే ప్రమాదం రావొచ్చు.

ఫొటో సోర్స్, Aqap propaganda
ఇటీవల కాలంలో తగిలిన ఎదురుదెబ్బలు
సిరియాలో ఇంకా పేరు బయటపెట్టని అల్-ఖైదా శాఖ హుర్రాస్ అల్-దిన్ తన అడుగు సరిగ్గా మోపలేకపోయింది. దీనికి ఒక కారణం జిహాదీ ప్రత్యర్థి వర్గాలు కాగా మరొకటి వీళ్లపై డేగ కళ్లతో నిఘా ఉంచిన అమెరికా కూటమి.
స్థానికంగా, కింది స్థాయిలో కూడా ఈ గ్రూపు ముందుకెళ్లలేకపోతోంది. సిరియా ప్రజలు అల్-ఖైదా శాఖను ముప్పుగా భావించడమే అందుకు కారణం. అల్-ఖైదా పేరెత్తితేనే స్థానిక ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కూడా సిరియా మీద దృష్టి పెడతాయి. అది అక్కడి ప్రజల పరిస్థితులను మరింత దిగజారుస్తుంది.
గత రెండు నెలలుగా హుర్రాస్ అల్-దిన్ క్రియారహితమైపోయింది. ఈ శాఖ నాయకులంతా అమెరికా వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం అక్కడి బలమైన ప్రత్యర్థి వర్గం దాన్ని అణిచివేస్తోంది.
యెమెన్‌లో ఒకప్పుడు అత్యంత భయంకరమైన అల్-ఖైదా శాఖగా గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖైదా ఇన్ ది అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) ఈ ఏడాది అనేక ఎదురుదెబ్బలు తింది. ప్రస్తుతం పూర్తిగా అచేతనమైపోయింది. ఏక్యూఏపీ నాయకుడు ఈ ఏడాది జనవరిలో అమెరికా డ్రోన్ దాడులలో మరణించాడు. యెమెన్‌లోని బయదా ప్రాంతంలో వారి బలమైన కోటను హూథీ ఉగ్రవాదులు లాక్కున్నారు.
కొన్నేళ్లుగా గూఢచారులు ఈ శాఖలోకి చేరి వారి ప్రముఖ నాయకులందరిని లక్ష్యాలుగా చేసుకుని మట్టుబెట్టడానికి మార్గం సులభం చేశారు.

ఫొటో సోర్స్, AL-QAEDA PROPAGANDA
అంతర్గత కలహాలు
అయితే ఈ ఏడాది పశ్చిమ దేశాల్లో జరిగిన కొన్ని 'లోన్ వోల్ఫ్' దాడుల వలన ఏక్యూఏపీ ఇంకా తన భయంకరమైన కార్యకలాపాలు కొనసాగిస్తోందని అర్థమవుతోంది.
లోన్ వోల్ఫ్ దాడి అంటే సంస్థ ప్రాబల్యం, సహాయం లేకుండా ఒంటరిగా ఒక్కరే వెళ్లి హింసకు పాల్పడడం. ఇందుకు ఉగ్రవాద సంస్థలు తమ సిద్ధాంతాల ద్వారా, విశ్వాసాల ద్వారా వ్యక్తులను ప్రేరేపిస్తాయి.
గత ఏడాది డిసంబర్‌లో ఫ్లోరిడాకు చెందిన పెన్సకోలా నౌకాస్థావరంలో జరిగిన కాల్పుల వెనకాల తమ హస్తం ఉందని ఈ సంస్థ ఫిబ్రవరిలో ప్రకటించింది. సౌదీ మిలటరీ వద్ద శిక్షణ పొందిన మొహమద్ అల్షమ్రానీ ఈ కాల్పులు జరిపాడని అమెరికా ప్రకటించింది.
అల్-ఖైదా శాఖల్లో అంత చురుగ్గాలేని శాఖ అల్-ఖైదా ఇన్ ఇస్లామిక్ మగ్రిబ్ (ఏక్యూఐఎం) నాయకుడు జూన్‌లో ఫ్రెంచ్ దాడిలో చనిపోయాడు. తరువాత నాయకుడి పేరు ఇంకా ప్రకటించలేదు. నాయకుడి స్థానం ఇంకా భర్తీ చేయలేకపోవడం దాని బలహీన స్థితిని సూచిస్తోంది.
అల్జీరియా, ఉత్తర ఆఫ్రికాల్లో ఇప్పుడు అల్-ఖైదాకు కష్టమే. 1990లలో ప్రాబల్యం పెంచుకున్న ఉగ్రవాద సంస్థ ఆర్మ్డ్ ఇస్లామిక్ గ్రూప్ (జీఐఏ) జరిపిన మారణకాండల్లో ఎంతోమంది అల్జీరియా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో అల్-ఖైదా శాఖలకు అక్కడ విస్తరించడం గగనమే.
2017లో మాలిలో స్థానం బలపరచుకోవడానికి ఏర్పాటు చేసిన శాఖ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం), ఇస్లామిక్ గ్రూప్ (ఐఎస్) తో గొడవలు పడుతూ దెబ్బతింది. ఇటీవలే మాలి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అని ప్రకటించింది. అయితే ఆగస్ట్‌లో అక్కడ వచ్చిన తిరుగుబాటులో ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు జేఎన్ఐఎం భవిష్యత్తు అస్పష్టమే.

ఫొటో సోర్స్, AL-QAEDA PROPAGANDA
జెరూసలెంపై దృష్టి
ప్రస్తుతం అల్-ఖైదా శాఖ అల్-షబాబ్ నిస్సందేహంగా అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన గ్రూప్.
సోమాలియాలో చాలా ప్రాంతాలు దీని అధీనంలో ఉన్నాయి. సోమాలియాలోనూ, కెన్యాలోనూ దీని ఉగ్రవాద కార్యకలాపాలు తరచుగా, జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కెన్యాలో ఈ శాఖ జరిపిన పెద్ద పెద్ద దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
అల్-షబాబ్, జేఎన్ఐఎంల అండతో అల్-ఖైదా 2019 నుంచీ జెరూసలం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పాలస్తీన విమోచనం తమ లక్ష్యమని, అమెరికా తమ ప్రథమ శత్రువు అని ప్రకటించింది.

ఫొటో సోర్స్, AL-QAEDA PROPAGANDA
మే తరువాత మళ్లీ కనిపించని జవహరీ
అల్-ఖైదా నాయకుడు అయమాన్ అల్-జవహిరీ ఈ ఏడాది మేలో ఒకే ఒక్కసారి వీడియోలో కనిపించారు. తరువాత అతను అదృశ్యమవ్వడానికి కారణం చనిపోవడమో లేదా చంపేయడమో అయ్యుండొచ్చని ఇస్లామిక్ గ్రూప్ మద్దతుదారులు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లల్లో చాలామంది అల్-ఖైదా ప్రముఖులు అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. అమెరికా డ్రోన్ దాడుల్లో మరణించారు.
ఫిబ్రవరిలో జరిగిన అమెరికా-తాలిబాన్ శాంతి ఒప్పందం ప్రకారం తాలిబాన్ ఏ అంతర్జాతీయ జిహాదీ సంస్థకు ఆశ్రయం ఇవ్వదని ప్రకటించింది. దీని తరువాత అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలోనూ అల్ ఖైదాకు కష్టమే.
అయితే, అమెరికాలో ప్రస్తుత కరోనావైరస్ సంక్షోభం, జాత్యహంకార సమస్యలను ఆసరాగా చేసుకుని అమెరికాకు వ్యతిరేకంగా సందేశాలివ్వడానికి అల్-ఖైదా ప్రయత్నిస్తోంది. సాయుధ పోరాటంతోనే జాత్యహంకార ధోరణులు నశిస్తాయని సందేశాలిస్తోంది.
కానీ అనేక దారుణాలకు ఒడిగట్టి, ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాద సంస్థ మాటలను ఎవరైనా లెక్క చేస్తారా అనేది సందేహమే.
ఇవి కూడా చదవండి:
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- కోవిడ్ చికిత్సకు ఆరోగ్య బీమా పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- శరీరంలో కరోనావైరస్ చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని తప్పుగా వస్తోందా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- హైపర్సోనిక్ స్క్రామ్‌జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








