కోవిడ్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాముకి (అసలు పేరు కాదు) ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చిన ఆరోగ్య బీమా ఉంది. ఏ అనారోగ్యం సోకినా బీమా ఉందనే ధీమాతో ఉన్నారు. అనుకోకుండా ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ, పూర్తిగా హోమ్ ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకునే పరిస్థితి లేదు.
ఆయన ఆరోగ్య బీమా సంస్థకు ఫోన్ చేసి నెట్ వర్క్ హాస్పిటల్లో చేరేందుకు వెళ్లారు.
కానీ, హాస్పిటల్ వారు క్యాష్‌లెస్ వైద్యం చేసేందుకు అంగీకరించలేదు. అతనిని ముందుగా 25,000 రూపాయిలు కట్టమని డిమాండ్ చేశారు. కానీ, అతను ఇన్సూరెన్స్ లభిస్తేనే హాస్పిటల్లో చేరతానని పదే పదే చెప్పినప్పటికీ, ముందు వైద్యం కోసం 25,000 కడితే మిగిలిన విషయాలు ఇన్సూరెన్స్ సంస్థతో చూసుకుంటామని చెప్పడంతో అతను హాస్పిటల్లో చేరేందుకు అంగీకరించినట్లు బీబీసీ న్యూస్ తెలుగుకి తెలిపారు.
కానీ, ఆగస్టు 25వ తేదీ నాటికి హాస్పిటల్ వారు 4,23,000 రూపాయిల బిల్లు వేసి అది కడితేనే డిశ్చార్జి ఇస్తామని చెప్పారు.
“అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్ధం కాలేదు. నాకు అన్న దమ్ములు కూడా ఎవరూ లేరు” అని ఆయన పేర్కొన్నారు.
ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటళ్ల బాధితుల సంఘానికి సమాచారం అందించానని.. వారు హాస్పిటల్ వర్గాలతో మాట్లాడిన తర్వాత చెక్కుల రూపంలో బిల్లుని గ్యారంటీగా తీసుకుని తనను సెప్టెంబరు రెండో తేదీ రాత్రి డిశ్చార్జి చేశారని రాము తెలిపారు.
ఇప్పుడు ఆ బిల్లుల రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోబోతున్నానన్నారు. అయితే, ఆ బిల్లులో ఎంత భాగం ఇన్సూరెన్స్ సంస్థ ఇస్తుందోననే ఆందోళన వ్యక్తంచేశారు.
కానీ, చెక్కులు కూడా ఇవ్వలేని వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ సమయంలో సాధారణంగా చెల్లిస్తున్నఆరోగ్య బీమా పని చేస్తుందా?
వివిధ రకాల బీమా పాలసీలు పని చేసే విధానాలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్ కేఈఎస్ఎన్ మూర్తి బీబీసీ న్యూస్ తెలుగుకి వివరించారు.
బీమాలలో జీవిత బీమా, వాహన, ఆస్థి, భవన, వ్యాపార, గృహ బీమా మొదలయిన పలు రకాల బీమాలు ఉంటాయి. ఆరోగ్య బీమా మిగిలిన అన్నిటి కంటే ఎక్కువ ప్రాముఖ్యం పొందింది.
‘‘కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు ఆరోగ్య బీమాను సాధారణంగా ఆ యా కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగికి అందిస్తాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ప్రీమియం కట్టించుకుని దానికి తగిన విధంగా ఆరోగ్య బీమాను అందిస్తాయి. ఈ బీమాను కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు కూడా అందిస్తాయి. అయితే అది వారి హాస్పిటల్లో చేరేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది’’ అని ఆయన చెప్పారు.
ప్రతి బీమా సంస్థ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో అనుసంధానమై ఉంటుందని.. అయితే, ఆరోగ్య బీమా పని చేసే విధానం బీమాదారు బీమా కంపెనీతో ఒప్పందం చేసుకున్న పాలసీ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించారు.
కుటుంబం అంతటికీ కలిపి పని చేసే విధంగా కొన్ని రకాల బీమాలు ఉంటే, కొన్ని రకాల బీమాలు వ్యక్తిగతంగా మాత్రమే పని చేస్తాయి. ప్రీమియం, ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించే విధానం, పాలసీలో ఉన్న నియమ నిబంధనల అనుగుణంగా ఆరోగ్య బీమా పని చేస్తుందని ఆయన చెప్పారు.
క్యాష్‌లెస్ ఇన్సూరెన్సు అయితే మెడికల్ కార్డు చూపించి వైద్యం తీసుకోవచ్చు. ఈ తరహాలో హాస్పిటల్‌కి ద్రవ్య రూపంలో డబ్బులు చెల్లించే పని ఉండదు. వైద్యానికయ్యే ఖర్చును పూర్తిగా ఇన్సూరెన్సు సంస్థలే పాలసీ నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తాయి.
“కొన్ని సంస్థలు క్యాష్‌లెస్ ఇన్సూరెన్సు ఇవ్వవు. అలాంటి సందర్భాలలో ముందు వైద్యానికయ్యే ఖర్చును భరించి తర్వాత బిల్లులతో సహా బీమా సంస్థ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు” అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీమా ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏమిటి?
గడువు తేదీ దాటకుండా ప్రీమియం చెల్లించినప్పుడే బీమా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయిదు సంవత్సరాలు వరసగా ప్రీమియం చెల్లించి ఆరో సంవత్సరంలో గడువు తేదీ లోగా ప్రీమియం చెల్లించకపోయినా బీమా వర్తించదని చెప్పారు.
హాస్పిటల్లో చేరగానే హెల్త్ కార్డు నెంబర్, హాస్పిటల్లో చేరిన కారణంతో సహా బీమా సంస్థకు సమాచారం అందించడం చాలా ముఖ్యం. సాధారణంగా హాస్పిటల్లో ఉండే ఇన్సూరెన్స్ డెస్క్ సిబ్బంది వైద్యానికయ్యే ఖర్చును అంచనాగా వేసి సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు తెలియచేయాలి.
ఇన్సూరెన్స్ సంస్థలో ఉండే వైద్య సిబ్బంది ఆ వివరాలను పరిశీలించి ఆమోదం పంపాలి. ఇదంతా సత్వరమే జరగాలని కేఈఎస్ఎన్ మూర్తి చెప్పారు.
“వైద్యం పూర్తయిన తర్వాత ఇన్సూరెన్స్ సంస్థలు వైద్యానికయ్యే ఖర్చుని ఇస్తాయి కానీ, డిస్పోసబుల్ వస్తువులకు ఇవ్వవు. ఉదాహరణకు కోవిడ్ విషయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలకు ఇన్సూరెన్సు లభించదు” అని తెలిపారు.
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్సు పాలసీలను ఇన్సూరెన్స్ సంస్థకు, బీమాదారునికి మధ్యన ఉండే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు పర్యవేక్షిస్తారు. వీరు ఇన్సూరెన్స్ పాలసీలో మోసాలు జరగకుండా, పాలసీ క్లయింలు సకాలంలో వచ్చేటట్లు చూస్తారని ఆయన చెప్పారు.
‘‘కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా ప్రైవేటు బీమా సంస్థలు కోవిడ్ చికిత్సకు ప్రత్యేక బీమా పాలసీలను ప్రకటించాయి. అయితే, పాలసీ పరిధిలో కోవిడ్ లేదనే నెపంతో ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్యం అందించబోమని చెబుతూ ఉండవచ్చు కానీ, కోవిడ్ అనేదే మొదటిసారి తలెత్తిన సమయంలో దానికి ప్రత్యేకంగా వైద్యం అందించబోమని చెప్పడం సరైనది కాదు’’ అని మూర్తి అన్నారు.
ఎల్ఐసీలో జీవన్ ఆరోగ్య, కాన్సర్ కవర్ ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో ఆరోగ్య బీమా పాలసీలు చాలా కీలక పాత్ర వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ లేకపోయినా ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం అందటం లేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య బీమా కార్డు కోవిడ్ సమయంలో పని చేయలేదని హైదరాబాద్‌కి చెందిన ఒక రెవిన్యూ ఉద్యోగి కొడుకు బీబీసీ న్యూస్‌కి చెప్పారు.
చంద్రశేఖర్ తండ్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య బీమా పథకం ఉంది. గత నెలలో ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది.
బీమా ఉందనే ధైర్యంతో మలక్‌పేట లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌కి వారి నాన్నని తీసుకు వెళ్లినట్లు శివప్రసాద్ తెలిపారు.
కానీ, హాస్పిటల్ వారు కార్డు తీసుకోవడానికి అంగీకరించకుండా రెండు లక్షల రూపాయిలు అడ్వాన్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో వైద్యం అందించటం ముఖ్యం కావడంతో లక్ష రూపాయిలు అడ్వాన్స్ కట్టి వైద్యం చేయించినట్లు చెప్పారు.
“ఆ మరుసటి రోజున, కార్డియో విభాగంలో ఎయిర్ కండిషనింగ్ పని చేయడం లేదని చెప్పి మా నాన్నని న్యూరో విభాగంలోకి మార్చారు. తీరా చూస్తే అది కోవిడ్ పేషెంట్లను పెట్టిన వార్డుగా తెలిసింది” అని ఆయన వివరించారు.
‘‘మా నాన్నగారికి కోవిడ్ పాజిటివ్ లేకుండా కోవిడ్ వార్డులో ఎలా పెడతారని ప్రశ్నించాను’’ అని చెప్పారు. వెంటనే డిశ్చార్జి ఇమ్మని అడిగామన్నారు.
“మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్న 36 గంటలకు 5 లక్షల బిల్లు వేసి, ఆ మొత్తం చెల్లిస్తేనే డిశ్చార్జి ఇస్తామని చెప్పారు. అందులో 40,000 డిస్కౌంట్ తీసుకుని ఆ డబ్బులు చెల్లించి మా నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చాం” అని ఆయన తెలిపారు.
“కోవిడ్ పాజిటివ్ సోకిన వారితో మా నాన్నగారిని ఎలా ఉంచాలో మాకు అర్ధం కాలేదు” అని ఆయన అన్నారు.
ఇప్పుడు హాస్పిటల్ వారితో, ఆ బిల్లులకు వివరణ ఇవ్వమని అడిగినప్పటికీ వారు సరైన వివరణ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అని ఆయన చెప్పారు.
బీమా ఉందనే ధీమాతో డబ్బులు లేకుండా వెళ్లే మధ్య తరగతి మనుషుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల కరోనావైరస్ బారిన పడిన వ్యక్తి బీమా కాదు కదా డెబిట్ కానీ, క్రెడిట్ కార్డు కానీ తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదని, రాజమండ్రికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు. ఆఖరికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒప్పుకోలేదన్నారు.
హాస్పిటల్ వాళ్ళు తెలిసిన వారవ్వడంతో తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి కానీ, ప్లాస్టిక్ మనీ కానీ, బీమా కార్డు కానీ కుదరదని చెప్పారని బీబీసీకి తెలిపారు.
వైద్యుల కొరత, హాస్పిటళ్లు భరించాల్సిన ఖర్చులు, వ్యవస్థాగత కారణాలు కొంత వరకు ఈ పరిస్థితికి కారణం కావచ్చని విశాఖపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమణి అభిప్రాయపడ్డారు.
ఈ అంశం పై తెలంగాణ ప్రైవేటు హాస్పిటళ్ల బాధితుల సంఘం అధ్యక్షుడు యు.జగన్ ఇన్సూరెన్సు రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదుని కూడా చేశారు. ఆయన బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు.
గత 15 రోజులుగా బీమా సదుపాయం పని చేయడం లేదంటూ అనేక మంది తనకి ఫిర్యాదులు చేస్తున్నారని వివరిస్తూ.. చాలా హాస్పిటళ్లు కొన్నిసార్లు బీమా మొత్తానికి అదనంగా బిల్లు వేసి మొత్తం 10 లక్షల వరకు కట్టించుకుంటున్నాయని ఆరోపించారు.
ఈ అంశం పై హాస్పిటళ్ల యాజమాన్యాలను ప్రశ్నించినప్పుడు బీమా ద్వారా వైద్యం అందిస్తే బిల్లులు వచ్చేసరికి 40 రోజులకు పైగా పడుతుందని.. ఇటువంటి పరిస్థితుల్లో బీమాపై వైద్యం అందించడం కష్టమని చెబుతున్నారని తెలిపారు.
హాస్పిటళ్ల యాజమాన్యాలు ఈ తరహాలో ప్రవర్తించడం వలన రోగం కంటే కూడా చాలా మంది మానసిక ఆందోళనతో మరణిస్తున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వినియోగదారుల హక్కులు ఏమిటి?
బీమా సంస్థ పరిధిలో ఉన్న ఏ నెట్‌వర్క్ హాస్పిటల్లో అయినా బీమాను పొందే హక్కు వినియోగదారునికి ఉంటుందని దిల్లీ హైకోర్టు న్యాయవాది, ఇన్సూరెన్స్ సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు అంబికా రే బీబీసీ న్యూస్ తెలుగుకి వివరించారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం (కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆక్ట్) - 2019 లోని 10, 11, 12 సెక్షన్ల ప్రకారం బాధిత వ్యక్తి కన్స్యూమర్ కోర్టులో కేసు నమోదు చేయవచ్చు.
బీమా సంస్థలు ఇచ్చిన జాబితాలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటళ్ల పేర్లను తెలుసుకుని ఉండాలని, రోగిని హాస్పిటల్లో చేర్చిన వెంటనే బీమా సంస్థకి సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు.
“ఇన్సూరెన్సు పాలసీలో ఉన్న నియమ నిబంధనలు, పాలసీని అనుసరించి ఏయే సమస్యలకు వైద్యం అందుతుందో తెలుసుకుని ఉండటం అవసరం. ఒక వేళ నెట్‌వర్క్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇన్సూరెన్సు ద్వారా వైద్యం చేయడానికి అంగీకరించని పక్షంలో అది క్రిమినల్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది” అని ఆయన తెలిపారు.
“విద్య, వైద్యాన్ని వ్యాపార సంస్థల తరహాలో పరిగణించలేము. రోగి ప్రాణం నిలబెట్టడానికి ప్రాధమిక చికిత్స అందించడం వారి ప్రధమ కర్తవ్యం. ఒక వేళ వారు చికిత్స అందించలేని పక్షంలో ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత మాత్రమే వేరే ఆసుపత్రికి తరలించాలని చెప్పాలి కానీ, ప్రధమ చికిత్స అందించకుండా రోగికి చికిత్స అందించబోమని చెప్పడం నేరం కిందకే వస్తుంది” అని ఆయన తెలిపారు.
హాస్పిటల్ ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం అందించడానికి ఒప్పుకోకపోతే కన్స్యూమర్ కోర్టులో హాస్పిటల్ మీద, సదరు ఇన్సూరెన్స్ సంస్థ మీద కూడా కేసు ఫైల్ చేయవచ్చునని చెప్పారు.
కేసు వేయడం ద్వారా వైద్యానికి అయిన ఖర్చుతో పాటు నష్ట పరిహారం కూడా డిమాండ్ చేయవచ్చు. ఇన్సూరెన్స్ సంస్థ వైద్యానికి అయిన ఖర్చుని, హాస్పిటల్ నష్ట పరిహారాన్ని చెల్లిస్తుందని చెప్పారు.
కానీ, రోగి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ క్షణంలో వెంటనే చేయడానికి ఏమి ఉండదు. ముందు రోగిని హాస్పిటల్లో చేర్చి వైద్యం తీసుకున్న తర్వాత నష్ట పరిహారం కోసం కేసు వేయవచ్చని చెప్పారు.
కేసులో బలం వినియోగదారుని వైపు ఉంటే బీమాదారునికి జరిగిన ఆర్ధిక నష్టానికి, మానసిక ఒత్తిడికి కూడా పరిహారం లభిస్తుందని చెప్పారు.
ఒకవేళ హాస్పిటల్, బీమా సంస్థల నిర్లక్ష్యం వలన రోగికి ఏదైనా తీవ్రమైన ముప్పు ఏర్పడినా, లేదా మరణించినా సంబంధిత సంస్థలపై క్రిమినల్ కేసు కూడా వేయవచ్చు అని రే వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విని విని చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ బందీ అయిన భారత సైనికుడి కథ
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కరోనావైరస్ అంటించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








