మహిళలు శరీరంలోనే వీర్యాన్ని నిల్వ చేసుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచల్ నుయిర్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఆధునిక యుగంలో అనేక రకాల గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మూడు వంతుల గర్భాలు అనుకోకుండా సంభవించినవే. మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
కొన్ని తరాలుగా ఈ సమాజం స్త్రీలను పురుషుల కన్నా మానసికంగా, శారీరకంగా తక్కువ స్థాయి వారిగానే చూస్తూ వస్తోంది. జంతు పునరుత్పత్తిపై పరిశోధన చేసే పరిశోధకులు కూడా తమ అధ్యయనాలను మగ జంతువుల పైనే దృష్టి పెడుతూ వచ్చారు.
ఆడ సాల్మన్ చేపలు తమ అండాశయ ద్రవాలను తమ అధీనంలో ఉంచుకుంటాయి. వీర్యం అండాలతో కలిసే ప్రక్రియను అవి నియంత్రించగలరు. అంటే వీర్యం త్వరగా అండంతో కలవాలంటే కలిసేలాగా, ఆలస్యంగా కలవాలంటే ఆపేలాగా దానిని నియంత్రిస్తాయి. తమకు నచ్చిన మగ సాల్మన్ చేప వీర్యం లభిస్తే వాటి వీర్యానికి ప్రాధాన్యం ఇస్తాయి. ఆడ ఎలుకలు, కొన్ని రకాల అడవి కోళ్లు (రెడ్ జంగిల్‌ఫోల్) వంటివి తమకు నచ్చిన జన్యువులు ఉన్న వారి వీర్యాన్ని మాత్రమే వాడుకుంటాయి. అలాలేని వీర్యాన్ని అవి అండాలతో కలవకుండా నివారించగలవు. డ్రొసోఫిలా జాతికి చెందిన ఈగలు వీర్యాన్ని దాచుకునే ప్రత్యేక అవయవాలు కూడా వాటి శరీరంలో ఉంటాయి. అలా వీర్యాన్ని ఒక పక్కన దాచుకుని, తమకు నచ్చినప్పుడు దానిని అవి వాడుకుంటాయి. మగ బాతులు ఆడ బాతులపై సుదీర్ఘ సమయంపాటు అత్యాచారం చేస్తుంటాయి. పైగా, తమ లైంగిక అవయవాలను అపసవ్యదిశలో ఉపయోగిస్తుంటాయి. దీంతో ఆడబాతులు కేవలం సవ్య దిశలో మాత్రమే సంభోగం జరిగేలా తమ లైంగిక అవయవాలను మార్చుకుంటాయి. తద్వారా బలవంతంగా మగబాతులు సంభోగం చేయకుండా అడ్డుకుంటాయి.
అయితే, మనుషుల్లో ఇలాంటి స్వీయ నియంత్రణ విధానాలు లేనప్పటికీ, గర్భ నిరోధక సాధనాల ద్వారా గర్భధారణను నిరోధించుకోగలిగే అవకాశం చాలా మంది మహిళలకి ఉంది. కానీ, ఈ సాధనాలు మతపరమైన, సామాజిక కారణాల రీత్యా అందరికీ అందుబాటులో ఉండవు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలలో గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవడం, లేదా కొన్ని దేశాలలో అబార్షన్లు చేయించుకోవడం నేరం కావడంతో గర్భ నియంత్రణ అన్ని దేశాల్లో, అందరికీ సాధ్యం కాని పని.

ఫొటో సోర్స్, Alamy
అమెరికాలో కొన్ని వర్గాలు అబార్షన్‌కి వ్యతిరేకంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తుంటే, నార్తర్న్ ఐర్లండ్‌లో అబార్షన్ చట్టపరమైన పరిమితులకు లోబడే ఉంది.
గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం వలన గర్భాన్ని నిరోధించడం అన్ని వేళలా సాధ్యమయ్యే పని కాదు. ఒక్కొక్కసారి గర్భ నిరోధక సాధనాలు విఫలం కావచ్చు, సెక్స్ వర్కర్లు నిరోధక సాధనాలు వాడకుండా ఉండటానికి ఒత్తిడి రావచ్చు, మానభంగాలు జరిగినప్పుడు మహిళలు తమని తాము రక్షించుకోగలిగే పరిస్థితుల్లో ఉండలేకపోవచ్చు.
ఒకవేళ కొన్ని రకాల జంతువులలో ఉండే గర్భ నియంత్రణ శక్తిలాగే మహిళలు కూడా తాము ఏ వయసులో ఎవరి ద్వారా గర్భం ధరించాలో లాంటి అంశాలను నియంత్రించుకోగలిగే శక్తిని సంపాదిస్తే ఏమవుతుంది?
ఇది కేవలం ఊహాత్మక ప్రశ్న మాత్రమే. ఇలా జరిగితే మహిళలకు, సమాజానికి ఎంత లాభదాయకంగా ఉండవచ్చు? మహిళలకు తమ శరీరంపై సంపూర్ణాధికారాలు దక్కితే ఏమి జరగవచ్చు?
ఇదే జరిగితే అవాంఛిత గర్భాలు దాల్చడం ఆగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటున చోటు చేసుకునే 8.5 కోట్ల గర్భాలలో 40 శాతం అవాంఛిత గర్భాలేనని 2012లో లభించిన ఒక సమాచారం పేర్కొంది.
అమెరికాలాంటి దేశాలలో ఇది మరీ ఎక్కువ. ఏటా అమెరికాలో సగటున 60 లక్షల గర్భాలు దాలిస్తే అందులో 45 శాతం అవాంఛిత గర్భాలే.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే జరిగితే, మహిళలకి అనుకోకుండా గర్భం దాల్చే ఒత్తిడి తగ్గిపోతుందని లండన్‌కి చెందిన పునరుత్పత్తి హక్కుల మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కరెన్ న్యూ మన్ అన్నారు.
గర్భ నిరోధక సాధనాల మీద ఆధారపడకపోవడం వలన డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా, వాటి వలన కలిగే ఇతర వ్యతిరేక ప్రభావాలను నియంత్రించవచ్చు. ఉదాహరణకి జీవితంలో ఏదో ఒక సమయంలో సుమారు 50 కోట్ల మంది మహిళలు గర్భ నిరోధక సాధనాలు వాడే ఉంటారు. వీటి వలన మానసిక ఒత్తిడి, రక్తం గడ్డ కట్టడం, మైగ్రైన్ లాంటి లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొన్ని రకాల పద్ధతులు వాడటం వలన మరణానికి కూడా దారి తీసే పరిస్థితి ఏర్పడవచ్చు.
మహిళలు శరీరంపై పూర్తి అధికారం కలిగి ఉండటం వలన లైంగిక పరమైన వ్యాధులు పెరిగే అవకాశం ఉందా?
గర్భ నిరోధక సాధనాలు వాడిన తర్వాత లైంగిక స్వేచ్ఛ పెరిగిన సందర్భాలు గమనించలేదని కొలంబియా యూనివర్సిటీకి చెందిన గైనకాలజి ప్రొఫెసర్ వెండి చావ్కిన్ అన్నారు.
అవాంఛిత గర్భాలు దాల్చడం తగ్గిపోతే అబార్షన్ల సంఖ్య కూడా తగ్గి పోతుందని అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం పేర్కొంది.
ఇదే జరిగితే అబార్షన్‌కి వ్యతిరేకంగా పోరాడే వారికి ఒక సానుకూల వార్తగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల 50 లక్షల మంది మహిళలు ప్రమాదకరమైన అబార్షన్ల బారిన పడుతూ ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సురక్షిత పద్దతులలో అబార్షన్లు నిర్వహించకపోవడం వలన అనేక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవించే ప్రసూతి మరణాల్లో 13 శాతం ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
లాటిన్ అమెరికా, సబ్ సహారా ఆఫ్రికా లాంటి దేశాల్లో శిక్షణ లేని వారితో అబార్షన్లు చేయించుకోవడం వలన అవి ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే పరిస్థితి ఏర్పడొచ్చని చావ్కిన్ అన్నారు.
గర్భం దాల్చడం పట్ల మహిళలకు పూర్తి అధికారం, నియంత్రణ ఉన్నప్పటికీ, సురక్షిత అబార్షన్లు చేయించుకోగలిగే అవకాశం అందుబాటులో ఉండటం కూడా ఒక అవసరం. గర్భం దాల్చాలని అనుకోవడం మొత్తం ప్రక్రియలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ మొత్తం ప్రక్రియలో మరో తొమ్మిది నెలల పాటు మహిళలకి వైద్య పరమైన పర్యవేక్షణ అవసరం ఉంటుంది. మహిళలు ఏ సమయంలోనైనా గర్భం వద్దనుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని న్యూ మన్ అన్నారు.
ఈ అంశాలన్నిటినీ కలిపి చూస్తే అవాంఛిత గర్భాల సంఖ్య తగ్గడం, తక్కువ మంది పిల్లలు, ప్రమాదకరమైన అబార్షన్లు తగ్గడం జరుగుతాయి. ఇది మహిళలకి, సమాజానికి కూడా మేలు చేస్తుంది.
అధిక సంఖ్యలో మహిళలు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆర్ధిక రంగానికి ఊతం ఇస్తుందని, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్‌కి చెందిన ప్రొఫెసర్ సుసన్న మేహ్యూ అన్నారు.
ప్రభుత్వంలోని కీలక పదవుల్లో మహిళలు పని చేస్తే ప్రపంచ స్వరూపమే మారిపోయే అవకాశం ఉందని ఆమె అన్నారు.
నిర్ణయాత్మక పదవుల్లో మహిళలు ఉండటం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సమాజ స్థాపనకు వీలవుతుందని ఆమె అభిప్రాయ పడ్డారు.
టీనేజ్‌లో గర్భం దాల్చడం ఎంత ప్రమాదకరమో, 40 సంవత్సరాలు పైబడిన తర్వాత గర్భం దాల్చడం కూడా అంతే ప్రమాదకరమని మే హ్యూ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే, గర్భాలని నియంత్రించగలిగే శక్తి వస్తే తెలివైన వారి వీర్యం కోసం పోటీ పడే ప్రమాదం ఉందని వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో బయాలజిస్ట్‌గా పని చేస్తున్న రెనీ ఫర్మన్ అన్నారు.
పురుషులకి తమ భాగస్వాములు వేరే వ్యక్తుల వీర్యంతో గర్భం దాలుస్తున్నారేమో అనే అనుమానంతో భాగస్వాముల మధ్య వైషమ్యాలు తలెత్తే అవకాశం ఉంది.
మహిళలకి తమ శరీరంపై అధికారం, నియంత్రణ ఉండటాన్ని కొంత మంది పురుషులు భరించలేక పోవచ్చు.
ఈ ఊహాత్మక పరిశీలనను పక్కన పెడితే ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల స్త్రీలను పురుషులతో సమానంగా చూసే పరిస్థితి లేదు.
వీటన్నిటి కంటే ముఖ్యంగా సమాజం ఆలోచించే తీరులో మార్పు రావాలని న్యూమన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులు
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
- ‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








