అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’

గర్భిణులు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లలకు సంతానోత్పత్తి సమస్యలొస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది.
గర్భిణులు డ్రగ్స్ వాడితే.. దాని ప్రభావం డీఎన్ఏపై ఉంటుందని, భవిష్యత్ తరాల సంతానోత్పత్తిపై వీటి ప్రభావం ఎక్కుగా ఉంటుందని ఎడిన్‌బరో యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు.. 'పారాసిటమోల్' లాంటి మందులను తరచూ వాడకూడదంటారు. తాజా అధ్యయనం ఈ వాదనలను బలపరుస్తోంది.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. పారాసిటమోల్‌ను గర్భిణులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అది కూడా వీలయినంత తక్కువ కాలం వాడాలి. కానీ 'ఐబ్యుప్రోఫెన్'ను వాడటం పూర్తిగా మానేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నవయసులోనే మెనోపాజ్!
ప్రయోగశాలల్లో మానవ కణజాలాలపై పలు రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో దాదాపు ఒకేరకమైన ఫలితాలను గుర్తించారు.
మనుషులపై డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి.. మానవ కణజాలంపై ఓ వారం రోజులపాటు డ్రగ్స్‌ను ప్రయోగించారు. ఈ పరిశోధనల్లో.. వీర్యం, పిండం, శరీర కణాల అభివృద్ధికి తోడ్పడే బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఓవరీస్‌పై వారం రోజులపాటు పారాసిటమోల్‌ను ప్రయోగించగా.. పిండోత్పత్తి కణాల సంఖ్య 40% పడిపోయింది. ఇక ఓవరీస్‌పై ఐబ్యుప్రోఫెన్‌ను ప్రయోగించాక, ఆ కణాల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఈ కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడం వల్ల మహిళల్లో మెనోపాజ్ దశ ముందుగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మగపిల్లలపై కూడా ప్రభావం!
పిండం అభివృద్ధి చెందుతున్న దశలో పెయిన్ కిల్లర్స్ వాడకం.. మగ సంతానంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.
పురుషుల వృషణ సంబంధమైన కణజాలంపై కూడా ఇలాంటి పరిశోధనలే చేశారు. ఈ కణజాలంపై పారాసిటమోల్, ఐబ్యుప్రోఫెన్‌లను విడివిడిగా ప్రయోగించారు. ఈ రెండు సందర్భాల్లోనూ.. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్య 25 శాతానికి పడిపోవడం శాస్త్రజ్ఞులు గుర్తించారు.
పెయిన్ కిల్లర్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి.. ఎలుకలపై అధ్యయనం చేశారు.
వృషణ కణజాలం కలిగిన ఎలుకలపై సగటు మనిషి వాడే పారాసిటమోల్ డోసును ఒక రోజుపాటు ప్రయోగించారు. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్య 17 శాతానికి పడిపోయింది. అలా వారం రోజులపాటు ప్రయోగించాక.. ఆ కణాల సంఖ్య మూడోవంతు తగ్గిపోయింది.
ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో.. పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, ఆ కారణంగా పుట్టబోయే ఆడపిల్లల్లో సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తుతాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Pekic
అయితే.. పారాసిటమోల్ లేదా ఐబ్యుప్రోఫెన్ వాడకం వల్ల డీఎన్ఏ వ్యవస్థలో మార్పులు జరుగుతాయన్న అంశం వెలుగులోకి వచ్చింది. దీన్ని 'ఎపిజెనెటిక్ మార్క్స్'అని అంటారు.
ఓవరీస్, వృషణాల పనితీరులో కీలకమైన ప్రొస్టాగ్లాండిన్స్ పై పెయిన్ కిల్లర్స్ ప్రభావం చూపుతాయని అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనాన్ని 'ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్'లో ముద్రించారు. ఈ అధ్యయనం కోసం మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్, వెల్‌కం అండ్ బ్రిటీష్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ ఎన్డోక్రినాలజీ అండ్ డయాబెటిస్' నిధులు సమకూర్చింది.
ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన డా.రాడ్ మిషెల్ మాట్లాడుతూ..
''గర్భం దాల్చిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకునే విషయంలో మహిళలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఒకవేళ తప్పనిసరైతే.. అతి తక్కువ డోసు ఉన్న మందులను, పరిమిత కాలం వాడాలన్న మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి'' అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








