'కఠువా' కేసు: ఎవరీ బకర్వాల్ ప్రజలు? ఎక్కడి వారు?

ఫొటో సోర్స్, KANDHARI / BBC
- రచయిత, మోహిత్ కంధారి
- హోదా, బీబీసీ కోసం, జమ్మూ నుంచి
కఠువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసు రగులుతుండటంతో జమ్మూకశ్మీర్ మైదానాల్లో నివసించే బకర్వాల్ సముదాయానికి చెందిన ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారు.
ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. దీంతో బకర్వాల్‌లు ఈ ఏడాది కొంత ముందుగానే జమ్మూను వదిలి పోవాలని నిర్ణయించుకున్నారు.
వర్షాభావం వల్ల తమ పశువులకు నీరు, మేత దొరకకపోవటం కూడా వారు త్వరగా తిరిగి వెళ్లాలనుకోవటానికి మరో ముఖ్య కారణం.
హతురాలైన ఎనిమిదేళ్ల బాలిక కుటుంబం కూడా కఠువాలోని రసానా గ్రామంలో తమ ఇంటికి తాళం వేసి.. తమ పశువులతో పాటు సంచార యాత్ర ప్రారంభించారు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
వారితో పాటు వందలాది గుజ్జర్, బకర్వాల్ కుటుంబాలు జమ్మూలోని మైదానాల నుంచి కశ్మీర్‌లోని ఇతర కొండ ప్రాంతాల వైపు బయలుదేరాయి.
ఆ ప్రాంతాల్లో వేసవి రోజులు గడిపిన తర్వాత వీరంతా నవంబర్‌లో మైదానాలకు తిరిగివస్తారు. ఎగువ ప్రాంతాల్లో మంచు కురవటం మొదలవటంతోనే వీరు తమ శిబిరాలను వేరే ప్రాంతాలకు మారుస్తారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద వీరు తమ పశువులతో ప్రయాణించటం కనిపిస్తుంది. కొందరు ప్రధాన రహదారులకు బదులుగా నేరుగా కొండ దారుల నుంచే వెళతారు.
ఎక్కడ కాస్త అనువైన ప్రదేశం కనిపిస్తే అక్కడ ఆగుతారు. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని, తమ పశువులను మేపుకున్న తర్వాత మరో ప్రాంతానికి బయలుదేరి వెళతారు.
ఇది వారి జీవితచక్రం. ఎప్పుడూ ఇలాగే తిరుగుతుంటుంది. ఎన్నడూ ఆగదు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
బకర్వాల్‌లు గొర్రెల కాపరులు
నిజానికి.. గుజ్జర్ సమాజంలోని ఒక పెద్ద సమూహానికి చెందిన వారినే 'బకర్వాల్'లుగా వ్యవహరిస్తారు.
మరో మాటలో చెప్పాలంటే.. గుజ్జర్ సమాజానికి మరో పేరే బకర్వాల్.
ఈ బకర్వాల్ సముదాయానికి చెందిన వారిలో చాలా మంది గొర్రెల కాపరులు. అయితే.. తమను బకర్వాల్ అని కాకుండా గుజ్జర్లనే పిలవాలని కోరే నాయకులు చాలా మంది ఉన్నారు.
వారిలో కొందరు కాస్త చదువుకున్న వారున్నారు. తమ కమ్యూనిటీలో మిగతా వాళ్లు కూడా చదువుకుని, ప్రపంచం గురించి తెలుసుకునేలా చేయటానికి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
కానీ.. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా.. ఈ జనం ఇంకా స్థిరనివాసం లేకుండా పర్వతాలు, మైదానాల్లో పశువులతో పాటు సంచరిస్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.
గుజ్జర్, బకర్వాల్‌లను మూడు వర్గాలుగా విభజించవచ్చునని.. వారి జీవితాల మీద పరిశోధన చేస్తున్న జావేద్ రాహి బీబీసీతో చెప్పారు. ఆయన ట్రైబల్ రీసెర్చ్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
జావేద్ చెప్తున్నదాని ప్రకారం.. కొందరు గుజ్జర్లు, బకర్వాల్‌లు పూర్తి స్థాయి సంచారులు. వారు అడవుల్లో ఉంటారు. వారికంటూ సొంతమైన చిరునామాలేవీ ఉండవు.
ఇక రెండో వర్గం వారు పాక్షిక సంచారులు. వీరికి ఒక నివాస ప్రాంతం ఉంటుంది. వీరు పశువులను మేపటానికి సమీపంలోని అడవులకు వెళుతుంటారు. కొంత కాలం తర్వాత తమ ప్రాంతాలకు తిరిగొచ్చి నివసిస్తుంటారు.
మూడో వర్గం వారు.. వలస సంచారులు. వారికి పర్వత ప్రాంతాల్లోనూ, మైదానాల్లోనూ నివాసాలుంటాయి.
గుజ్జర్లు, బకర్వాల్‌లు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్నారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో కూడా వీరు పెద్ద సంఖ్యల్లోనే ఉన్నారు.
వారి భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలే వారి గుర్తింపులు. ఇంత కాలం గడిచినా వీటిలో ఏ మార్పూ లేదు.
వేగంగా మారిపోతున్న ప్రపంచంతో నేరుగా సంబంధం లేకపోవటమే దీనికి కారణమని జావేద్ అంటారు.
బకర్వాల్‌లు సుదీర్ఘ పోరాటం తర్వాత 1991లో ఎస్‌టీలుగా గుర్తింపు పొందిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో గుజ్జర్లు, బకర్వాల్‌లు సుమారు 12 లక్షల మంది ఉన్నారు. అది ఇక్కడి జనాభాలో 11 శాతం.
వారిలో 9.80 లక్షల మంది గుజ్జర్లు, 2.17 లక్షల మంది బకర్వాల్‌లు.
అయితే ఈ సంఖ్య ఖచ్చితమైనది కాదని జావేద్ అంటారు. దీనికి కారణం.. అధికారులు మైదానాల్లో జనాభా లెక్కలు సేకరించేటపుడు బకర్వాల్‌లు పర్వత ప్రాంతాల్లో ఉన్నారు. పైగా వారిలో కొందరు సంచార ప్రజలైనందున వారిని సరిగా లెక్కించటం సాధ్యంకాదు.
అటువంటి లెక్కలోకి రాని బకర్వాల్, గుజ్జర్ జనాభా ఐదారు లక్షల మంది ఉంటారని జావేద్ అంచనా.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
ఆర్థిక పరిస్థితి
బకర్వాల్‌లు గొర్రెలు, మేకలు, గుర్రాలు, కుక్కలను పెంచుతారు. తమ పశువులను అమ్మటం ద్వారా వచ్చే ఆదాయమే వారి జీవన భృతి.
అయితే.. జమ్మూకశ్మీర్‌లో మాంసం డిమాండ్‌ను రాజస్థాన్ నుంచి తెచ్చే పశువుల ద్వారా తీరుస్తున్నారు. ప్రత్యేకించి ఈద్ తదితర పండుగలు, సంప్రదాయ క్రతువుల సమయాల్లో గుజ్జర్లు, బకర్వాల్‌ల పశువులకు గిరాకీ లభిస్తుంది.
అయితే.. బకర్వాల్ సమాజ ప్రజలు ఇప్పటికీ వస్తుమార్పిడి పద్ధతిలోనే తమకు అవసరమైన వస్తువులు కొంటుంటారని జావేద్ తెలిపారు.
వీరికి బ్యాంకుల్లో అకౌంట్లు లేవు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకమూ లేదు.
వీరు తమ అవసరాల మేరకు తమకు ఆహార భద్రత భరోసా కల్పించాలని చాలా కాలంగా కోరుతున్నారు. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించలేకపోయింది.
''ఈ విషయమై నేను కూడా ప్రభుత్వానికి సిఫారసులు అందించాను. కానీ ఇంతవరకూ పట్టించుకోలేదు'' అని చెప్తారు జావేద్.
ఈ జనం ఇప్పటికీ ఒక ప్రాంతంలో స్థిరపడలేదన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఇంకా అర్థం చేసుకోలేదని ఆయన అంటారు.
ప్రభుత్వం వారికి సాయం చేయదలచుకుంటే.. అందుకు ఒక సృజనాత్మక ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. వారికి సాయం చేసే వారు కూడా సంచరిస్తుండాలి. కానీ ఇప్పటివరకూ ఇలాంటిదేదీ జరగలేదు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
సామాజిక భద్రత, ఆరోగ్యం
బకర్వాల్ ప్రజలు ఇంకా చదువుకు చాలా దూరంగానే ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో మొబైల్ స్కూళ్లు (సంచార పాఠశాలలు) కూడా ఏర్పాటు చేసింది.
వీరిలో చదువుకున్న కొందరు యువతకు ఈ మొబైల్ స్కూళ్లలోనే ఉద్యోగాలు కూడా ఇచ్చారు. కానీ ఈ పథకం ఎంతవరకు విజయవంతమయిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
ప్రభుత్వం స్కూళ్లు ఏర్పాటు చేసిందని, కానీ అక్కడ చదువుకోవటం సాధ్యం కాదని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన బషారత్ హుస్సేన్ బీబీసీతో చెప్పారు. ఆయన తన క్యాంపుతో కలిసి చందావరీ వెళుతూ బీబీసీకి తారసపడ్డారు.
''మేం మూడు నాలుగు నెలలు ఒక చోట ఉంటాం. ఆ తర్వాత మరో చోటుకు వెళ్లిపోతాం. అలాంటపుడు పిల్లలు ఎలా చదువుకుంటారు?'' అన్నది ఆయన ప్రశ్న.
ప్రస్తుత పరిస్థితిలో ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒక్కటే.. ''మా శిబిరాలను ధ్వంసం చేయొద్దు.''
రోడ్ల ద్వారా తాము తమ క్యాంపులకు వెళుతున్నపుడు ట్రాఫిక్ వల్ల పెద్ద సమస్యలు ఎదురవుతుంటాయని హుస్సేన్ చెప్పారు.
''మేం మా పశువులతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలి. ప్రభుత్వం కావాలనుకుంటే మాకు సాయం చేయొచ్చు. హైవేల మీద ట్రాఫిక్‌ను నియంత్రించినట్లుగానే.. మా రాకపోకల కోసం కూడా కొంత సేపు ట్రాఫిక్‌ను ఆపివేయొచ్చు'' అని ఆయన వాదిస్తున్నారు.
చాలా ప్రభుత్వ స్కూళ్లు మౌలిక సదుపాయాల కొరత వల్ల కేవలం కాగితాల్లోనే నడుస్తున్నాయని జావేద్ తెలిపారు.
ఈ స్కూళ్లకు ఒక నీడ లేదని, పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం లేదని, పుస్తకాలు కూడా అందించరని ఆయన చెప్పారు.
''స్వయంగా అరకొరగానే చదువుకున్న ఓ యువకుడు ఇంకో తరానికి ఎలా విద్యా బోధన చేయగలడు?'' అని జావేద్ ప్రశ్నించారు.
ఇక బకర్వాల్ మహిళలు, పిల్లల మరణాల గురించి మాట్లాడుతూ.. పిల్లలకు వ్యాక్సిన్లు (టీకాలు) వేయించిన కుటుంబాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
''ఈ జనం తమ పిల్లలకు కానీ, తమ పశువులకు కానీ టీకాలు వేయించరు. 90 శాతం మంది పిల్లలకు వారి కుటుంబాలు ఎలాంటి టీకాలూ ఇప్పించలేదని మా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది'' అని తెలిపారు.
ఈ జనం అడవుల్లో సంచరిస్తూ వనమూలికలను సేకరిస్తుంటారని, తమ వ్యాధులకు తమ అనుభవాల ప్రకారం ఆయా వనమూలికలతో వైద్యం చేసుకుంటుంటారని వివరించారు.
ఈ ప్రజలు కాలుష్యం లేని పర్వతాల్లో, స్వచ్ఛమైన గాలిలో సంచరిస్తుండటం వల్ల వారికి మామూలు వ్యాధులు సోకవని జావేద్ అభిప్రాయపడ్డారు. అందువల్లే ఈ సమాజానికి చెందిన వాళ్లు ఇప్పటికీ ప్రభుత్వ సహాయం లేకుండా మనగలుగుతున్నారని చెప్తారు.
భారతదేశమంతటా ఈ ప్రజల హక్కుల కోసం చేసిన చట్టాలు జమ్మూకశ్మీర్‌లో ఇంతవరకూ అమలు కాలేదని ఆయన అంటారు.
''భారత ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసింది. కానీ జమ్మూకశ్మీర్‌లో దానిని ఇంకా అమలు చేయలేదు'' అని జావేద్ తెలిపారు.
అలాగే.. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు (అత్యాచారాల నిరోధక చట్టం) చట్టం కూడా రాష్ట్రంలో ఇంకా అమలుకాలేదు.
ఈ కమ్యూనిటీ వారికి రిజర్వేషన్లు లభిస్తే.. హక్కుల కోసం పోరాటం కొంత సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
సైన్యానికి సాయం
దేశ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న గుజ్జర్, బకర్వాల్ కమ్యూనిటీ ప్రజలు.. దేశ రక్షణకు ఎల్లప్పుడూ తోడ్పడుతూనే ఉన్నారు.
''చరిత్ర ఇందుకు సాక్ష్యం. సరిహద్దు ప్రాంతాల్లో సైన్యానికి ఎప్పుడు కొంత సాయం అవసరమైనా.. గుజ్జర్, బకర్వాల్ కుటుంబాలు ముందుకు వచ్చి సాయపడ్డాయి. సుదూర ప్రాంతాల్లోని సైనిక శిబిరాలకు సదుపాయాలను చేరవేయటంలో కీలక పాత్ర పోషించాయి'' అని జావేద్ తెలిపారు.
గుజ్జర్, బకర్వాల్ కమ్యూనిటీ ప్రజలు మైదానాల్లో కానీ, పర్వత ప్రాంతాల్లో కానీ ఎక్కడ నివసించినప్పటికీ వారికి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు.
శాంతి పునరుద్ధరణ కోసం ఈ సమాజ ప్రజలు ఎల్లప్పుడూ త్యాగం చేస్తూనే ఉన్నారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలోను, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాల్లో గుజ్జార్ కమ్యూనిటీ ప్రజలు సేవలు అందిస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








