కఠువా రేప్ కేసు: సీబీఐ ఇప్పుడొచ్చి ఏం చేస్తుంది?
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కఠువా రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు విచారణ జమ్మూకశ్మీర్ బయట జరగాలని అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
‘ఆ బాలికతో పాటు అందరికీ న్యాయం జరగాలి. జమ్మూకశ్మీర్‌లో పారదర్శకంగా విచారణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నిందితులకు అక్కడ లభిస్తున్న మద్దతును చూస్తుంటే, కేసు విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు’ అని బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్ బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు.
కఠువా రేప్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.
ఏప్రిల్ 9న క్రైం బ్రాంచి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కఠువా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లినప్పుడు కొందరు న్యాయవాదులు గొడవకు దిగి అడ్డుకున్నారు.
అందుకే దీపిక ఈ కేసు విచారణ రాష్ట్రానికి వెలుపల జరగాలని కోరుతున్నారు.
కానీ అలా కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయడం సాంకేతికంగా కుదురుతుందా? బాధిత కుటుంబం కోర్టులో విచారణ జరిగినప్పుడల్లా వచ్చిన ప్రతిసారీ అక్కడి వెళ్లగలుగుతుందా?
అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఈ విషయంలో దేశమంతా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుంది. వాళ్లు అధైర్య పడాల్సిన పనిలేదు’ అని దీపిక చెప్పారు.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
"నన్ను కూడా బెదిరిస్తున్నారు"
ఈ కేసును స్వీకరించాక తనకు కూడా బెదిరింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడే తనను కోర్టు మెట్ల మీద బెదిరించారని, అందుకే తనకు కూడా రక్షణ కావాలని కోరినట్లు ఆమె చెప్పారు.
దీపిక 2013లోనే బార్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
మరోపక్క బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భుపిందర్ సింగ్ మాత్రం దీపిక ఆరోపణలు అర్థం లేనివని చెబుతున్నారు.
దీపిక బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న విషయం కూడా తనకు తెలీదని, ఈ మొత్తం విషయంపై సీబీఐ విచారణ జరగాలని ఆయన అన్నారు.
క్రైం బ్రాంచి ఈ కేసుకు మతం రంగు పులిమే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.
కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం క్రైం బ్రాంచి విచారణతో సంతృప్తిగానే ఉన్నారనీ, వాళ్లు సీబీఐ విచారణ కోరుకోవట్లేదని దీపిక చెప్పారు.
‘ఆ పాప దుస్తుల్ని కడిగేశారు. ఆధారాల్ని మాయం చేశారు. ఇప్పుడు సీబీఐ మాత్రం ఏం చేస్తుంది?’ అని దీపిక ప్రశ్నించారు.
"మతం రంగు పలుముతున్నారు"
ఈ కేసుకు హిందూ - ముస్లిం అన్న మతం రంగు పులమడం తనను చాలా బాధించిందని ఆమె పేర్కొన్నారు. ఏ దారీ లేనప్పుడే కొందరు ఇలా మార్గాలు వెతుకుతారని ఆమె అన్నారు.
‘నేను కశ్మీరీ పండిట్‌ని. నేనిక్కడే పుట్టాను. జమ్మూలో పనిచేస్తున్నాను. నేనూ హిందువునే. అందుకే కొన్నిసార్లు సిగ్గుపడతాను’ అని చిన్నారిపై అత్యాచారాన్ని గుర్తుచేసుకుంటూ అన్నారు.

ఫొటో సోర్స్, SAMEER YASIR
ఈ కేసు దీపికా వద్దకు ఎలా చేరింది?
ఈ ప్రశ్నకు సమాధానం దీపికా ఇలా చెప్పారు.. "నేను చాలా కాలంగా బాలల హక్కులు కోసం పనిచేస్తున్నాను. ప్రారంభం నుంచీ నేను ఈ కేసును గమనిస్తూనే ఉన్నాను. నాకూ ఐదేళ్ల కూతురు ఉంది. ఈ చిన్నారి కేసు నన్ను ఎంతగానో కలచివేసింది. దాంతో నేనే బాధిత కుటుంబాన్ని సంప్రదించాను."
వారిని ఫిబ్రవరిలో కలిశాను. కోర్టు పర్యవేక్షణలో క్రైం బ్రాంచి దర్యాప్తు జరిపించేలా పట్టుబట్టాం. అందులో విజయవంతం అయ్యామని ఆమె వివరించారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ ఆ చిన్నారిపై అత్యాచారం చేసినట్టు తేలితే అతనికి కూడా ఉరిశిక్ష పడుతుందా? అన్న చర్చ మొదలైంది.
అందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా అనుకూలంగా ఉన్నారు.
న్యాయవాది దీపికా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషులందరినీ ఉరిశిక్ష తీయాలన్నదే తన కోరిక అని ఆమె అన్నారు.
ఇవి కూడా చూడండి:
- జమ్మూ కశ్మీర్లో ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామా
- సియాచిన్: అక్కడ నిద్రలో కూడా సైనికుల ప్రాణాలు పోతుంటాయ్!
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణం సాధించిన ‘గురి’తప్పని భారత సైనికుడు జీతూ రాయ్
- తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









