కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణం సాధించిన ‘గురి’తప్పని భారత సైనికుడు జీతూ రాయ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్ జీతూ రాయ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.
ఈ పోటీల్లో జీతూ రాయ్ 235.1 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలవగా.. భారతదేశానికే చెందిన ఓం మిథర్వాల్ 214.3 పాయింట్లతో కాంస్య పతకం గెలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కార్రీ బెల్ రజత పతకం సాధించాడు.
ఇది జీతూరాయ్ కథ
జీతూ రాయ్.. షూటింగ్‌లో అనేక అంతర్జాతీయ పతకాలు ఒడిసి పట్టి 'పిస్టల్ కింగ్'గా పేరు తెచ్చుకున్నాడు.
ఇతని చేతిలోని తుపాకీ చాలా అరుదుగా మాత్రమే గురి తప్పుతుంది. అయితే ఒకప్పుడు అవే చేతులు మట్టి పిసికాయి.. పంట కోసాయి.. పశువులకు మేత వేశాయి.
పొలాల్లో పని చేస్తున్నప్పుడు అతను ఎన్నడూ తుపాకీ పట్టింది లేదు. పశువులు, గొర్రెలను కాపలా కాయడంతోనే సరిపోయేది.
నేపాల్‌లోని సంఖువాసభ జీతూ స్వస్థలం. వాళ్ల నాన్న భారత ఆర్మీలో పని చేశారు. చైనా, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో భారత్ తరఫున పోరాడారు.
బ్రిటీష్ ఆర్మీలో చేరాలనుకొని..
20 ఏళ్ల వయసులో జీతూ కూడా భారత ఆర్మీలో చేరాడు. బ్రిటిష్ ఆర్మీలో చేరాలనేది జీతూ కల. కానీ, విధి ఆయనను భారత ఆర్మీ వైపు నడిపించింది.
గుర్ఖాలు బ్రిటీష్ ఆర్మీలో చేరడం అనేది 200 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. నేపాల్‌లోని తమ గూర్ఖా రెజిమెంట్‌లో బ్రిటిష్ ఆర్మీ అక్కడి వారినే చేర్చుకుంటోంది.
2006 -2007లో జీతూ బ్రిటిష్ ఆర్మీలో చేరడానికి వచ్చాడు. కానీ, బ్రిటిష్ ఆర్మీ అప్పటికి అభ్యర్థుల ఎంపికను ఇంకా మొదలు పెట్టలేదు.
అదే సమయంలో భారత్ సైన్యం నేపాల్‌లో గూర్ఖా రెజిమెంట్‌లోకి నేపాలీ యువకులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. అలా జీతూ భారత ఆర్మీకి ఎంపికవడంతో అతని జీవితం మారిపోయింది.
షూటింగ్‌లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న జీతూకు లక్నో యూనిట్‌లో పని చేస్తున్నంత కాలం దానిపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే, ఉన్నతాధికారులు షూటింగ్‌లో అతని నైపుణ్యాన్ని గమనించి మహూలోని ఆర్మీ మార్క్స్‌మాన్‌షిప్ యూనిట్‌కు పంపించారు.
అయితే, అక్కడ జీతూ రెండు సార్లు విఫలమై తిరిగి లక్నో యూనిట్‌కు రావాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, PATRICK HAMILTON/GETTY
ఓటమి నుంచి విజయాల బాట
ఆ వైఫల్యమే జీతూ జీవితంలో పెద్ద మలుపు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని షూటింగ్‌లో మరింత కఠోరంగా శ్రమించాడు. 2013 నాటికి అనేక అంతర్జాతీయ పతకాలు సాధించాడు.
11 గూర్ఖా రైఫిల్స్‌లో నాయబ్ సుబేదార్‌గా పని చేస్తున్న జీతూ 50 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 2014 ఏషియన్ గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించి సత్తా చాటాడు.
2014 సంవత్సరం జీతూ క్రీడా జీవితంలో మరుపురాని ఘట్టం. ఆ ఏడాది 9 రోజుల వ్యవధిలోనే ఆయన మూడు వరల్డ్ కప్ మెడల్స్ సాధించాడు. అయితే, 2016 రియో ఒలంపిక్స్‌లో జీతూ నిరాశపరిచాడు.
కానీ, ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్‌లో జీతూ మళ్లీ సత్తా చాటాడు. కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబానికి అప్పుడే తెలిసింది
జీతూ రాయ్‌ని అర్జున అవార్డు వరించిన సమయంలో ఆయన తల్లి దిల్లీ వచ్చారు. జీతూ ఎంత పెద్ద స్థాయి క్రీడాకారుడో అతని కుటుంబానికి అప్పుడు కానీ తెలియలేదు.
స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలవడానికి జీతూకి పెద్దగా సమయం దొరకదు. భారత్ నుంచి నేపాల్‌లోని వారి గ్రామానికి వెళ్లడం చాలా ప్రయాసతో కూడుకున్నది.
లఖ్నో లేదా దిల్లీ నుంచి రైల్లో డార్జిలింగ్ జిల్లాలోని బాగ్ డోగ్రా వెళ్లాలి. అక్కడి నుంచి వాళ్ల ఊరు వెళ్లడానికి కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది.
కొన్నాళ్ల కిందటే జీతూ ఊరికి పూర్తి స్థాయిలో కరెంట్ వచ్చింది. అంతేకాదు, జీతూ విజయాలతో వారి గ్రామంలో కొత్త వెలుగులు వచ్చాయి.
షూటింగ్ మాత్రమే కాకుండా వాలీబాల్ అంటే జీతూకు చాలా ఇష్టం. ఇక సినిమాల విషయానికొస్తే అమీర్ ఖాన్‌కు అతను పెద్ద అభిమాని.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








