కామన్వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా, అసలు కామన్వెల్త్ కూటమి ఇప్పుడు అవసరమా

ఫొటో సోర్స్, Bethany Clarke/Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ తెలుగు
కామన్వెల్త్ కూటమి ఎంతో మందికి అర్థంకాని ఓ మిస్టరీగా కొనసాగుతోంది.
నేటి ప్రపంచంలో కామన్వెల్త్ పాత్ర ఏమిటి? అసలు దాని అవసరమేమిటి? అనే దానిపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ మరోసారి ముందుకొచ్చింది.
కామన్వెల్త్.. ప్రపంచంలోని మూడో వంతు జనాభా గల దేశాల కూటమి. ఎన్నో మతాలు, జాతులు, భాషలు, సంస్కృతుల వారు ఇందులో భాగంగా ఉన్నారు. ఈ భిన్నత్వాన్ని నాలుగేళ్లకోసారి కామన్వెల్త్ క్రీడల ద్వారా ప్రదర్శిస్తుంటారు.
నాటి బ్రిటన్ సామ్రాజ్యంలోని వలస దేశాలు.. ఆ బానిస సంస్కృతిని నెత్తికెత్తుకుని కొనసాగించటమే కామన్వెల్త్ మనుగడకు మూలమా?
లేక ఆయా దేశాల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వాలను పెంపొందించుకోవటం కామన్వెల్త్ మనుగడ లక్ష్యమా? అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తుంటాయి.
కామన్వెల్త్ అనేది ''బ్రిటిష్ వలసవాద అవశేషం'' అనే విమర్శలున్నాయి. ఇది చూపగల ప్రభావం చాలా పరిమితమనే విమర్శ కూడా ఉంది. నిజానికి.. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇతర దేశాల మీద ఈ కూటమి చూపే ప్రభావం ఏదీ లేదనే చెప్పొచ్చు. అయితే.. హెచ్చరికలు, బెదిరింపుల ద్వారా కాకుండా చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించటానికి కామన్వెల్త్ కూటమి చూపే మార్గమే ఉత్తమమని విశ్లేషించే వారూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Leonard Burt/Central Press/Getty Images
‘ఇండియా వంటి దేశాలు కామన్వెల్త్‌ను నడిపించాలి...’
''ఇతర అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే.. కామన్వెల్త్ పెద్దగా ప్రభావశీలమైన కూటమి కాదన్న భావన హేతుబద్ధమైనది కాదు'' అంటారు లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామన్వెల్త్ స్టడీస్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ టిమ్ షా.
''ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, నాటో, ఈయూ వంటి శక్తివంతమైన సంస్థలు చాలా ఉన్నాయి. కానీ.. ఒక ఆమోదనీయమైన ప్రజాస్వామిక ప్రభుత్వం లేని దేశాన్ని బహిష్కరించగల అంతర్జాతీయ సంస్థలు చాలా తక్కువ. ఉదాహరణకు జింబాబ్వేను కామన్వెల్త్ అలాంటి కారణంతోనే బహిష్కరించింది. కానీ ఆ దేశం ఐరాస సభ్య దేశంగానే కొనసాగుతోంది. ఒక దేశాన్ని బహిష్కరించటం కన్నా శక్తివంతమైన ప్రకటన ఏముంటుంది?'' అని ఆయన వ్యాఖ్యానిస్తారు.
''కామన్వెల్త్ మూలాలు వలస పాలనలో ఉన్నప్పటికీ.. అది ఇప్పటికి చాలా రూపాంతరం చెందింది. అయితే.. దానికి అవసరమైన నాయకత్వాన్ని.. చారిత్రక లోపాలున్న బ్రిటన్ అందించలేకపోవచ్చు. ఇండియా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి దేశాలు కామన్వెల్త్‌ను భవిష్యత్తులోకి నడిపించాలి'' అని ప్రొఫెసర్ టిమ్ అభిప్రాయపడతారు.

ఫొటో సోర్స్, Matt Cardy-Pool/Getty Images
‘కామన్వెల్త్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది’
అయితే.. కామన్వెల్త్ నేటి ప్రపంచంలో ఎందుకూ ఉపయోగపడదని జింబాబ్వే విదేశాంగ మంత్రి డిడ్మస్ మ్యుటాసా వ్యాఖ్యానించారు. ''మేం 1980లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటన్ మీద గౌరవంతో అందులో చేరాం. కానీ.. అది తెల్లవారి ప్రయోజనాల కోసం మాత్రమే ఏర్పాటైందని ఇన్నేళ్లలో స్పష్టమైంది. శ్వేత జాతి రైతుల ప్రయోజనాలను కాపాడటానికి జింబాబ్వే మీద చర్యలు చేపట్టారు'' అని ఆయన ఆ వివాదం సమయంలో ఆరోపించారు.
''జింబాబ్వే తరహాలో దక్షిణాఫ్రికా కూడా 19961 - 1994 ల మధ్య కామన్వెల్త్ నుంచి వైదొలగింది. అలా వైదొలగటం.. దక్షిణాఫ్రికా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ దేశం తనకు కావాలనుకున్న దేశాలతో.. ముఖ్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియాలతో సంబంధాలు కొనసాగించింది'' అని విట్స్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నోల్ గార్సన్ వ్యాఖ్యానించారు. వర్ణవివక్ష వ్యతిరేక శకం ఆరంభమైనపుడు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించటం మాత్రమే దక్షిణాఫ్రికాపై ప్రభావం చూపిందని, ఆర్థికంగా దెబ్బతిన్నదని ఆయన విశ్లేషించారు.
కామన్వెల్త్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నైజీరియాలోని సెంటర్ ఫర్ డెమొక్రటిక్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాలా ఉస్మాన్ గతంలో విమర్శించారు. ''కొన్ని సభ్య దేశాలకు ఒక రూలు.. మరికొన్ని దేశాలకు ఇంకో రూలు. బ్రిటన్, ఆస్ట్రేలియాలు కామన్వెల్త్ డిక్లరేషన్లకు విరుద్ధంగా ఇరాక్ మీద అక్రమ యుద్ధం ప్రారంభించాయి. కానీ ఆ అంశం మీద ఈ రెండు దేశాలపై ఒత్తిడి చేయగల అవకాశమేదీ లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ నాయకత్వాన్ని బ్రిటిష్ రాణికి కట్టబెట్టటం కాకుండా.. సభ్య దేశాల మధ్య మారుతుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్నేహం, అవగాహనలే కామన్వెల్త్‌కు ఆధారం‘
''కామన్వెల్త్ అనేది.. ఆయా దేశాలు ఎలాంటి లాంఛనప్రాయమైన కట్టుబాట్లూ లేకుండా.. సుహృద్భావంతో స్నేహపూర్వకంగా చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూ కలిసివుండటానికి గల ఒక మార్గం. ఇందులో ఆలోచనలు, సంస్కృతులు స్వేచ్ఛగా కలుస్తూ ఉంటాయి’’ అని బ్రిటిష్ జర్నలిస్ట్ పీటర్ ఓబోర్న్ పేర్కొంటారు.
‘‘ఇది నాటో లాంటి కూటమి కాదు. కామన్వెల్త్ ఆంక్షలు చాలా తక్కువగా ఉంటాయి. అది మృదువుగా వ్యవహరిస్తుంది. హెచ్చరికలకు బదులుగా చర్చలు జరుపుతుంది. 2007లో పాకిస్తాన్‌లో సైనిక పాలన ముగియటంలో కామన్వెల్త్ కృషి ప్రధానంగా ఉంది. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష నిర్మూలనలోనూ కామన్వెల్త్‌దే కీలక పాత్ర’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కామన్వెల్త్‌కు బలమైన భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నా. ఇప్పుడు మనమున్న ప్రపంచం.. ఆధిపత్యం కోసం పరస్పరం పోరాడుకుంటున్న మహా సామ్రాజ్యాల ప్రపంచం కాదు. ఇది.. కామన్వెల్త్ ప్రోత్సహించే తరహా సంబంధాలకు అధిక ప్రాధాన్యం గల 'నెట్‌వర్క్ సిస్టమ్' ప్రపంచం. సైన్యం అనేది లేని కామన్వెల్త్.. స్నేహం, అవగాహనల మీద ఆధారపడుతుంది. 21వ శతాబ్దానికి ఇదే అనువైన వ్యవస్థ'' అని ఓబోర్న్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Screen/thecommonwealth.org
కామన్వెల్త్ అనేది ఒక విడ్డూరమైన కూటమి...
''కామన్వెల్త్‌కు ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి పాత్ర లేదు. ఇదో పెద్ద, అసంబద్ధమైన కూటమి. దాని శక్తిసామర్థ్యాలు చాలావరకూ దాని విడ్డూరమైన మనుగడ కోసమే వెచ్చించటం జరుగుతోంది’’ అని ద వాషింగ్టన్ కరెస్పాండెంట్ జేమ్స్ ఆస్టిల్ అంటారు.
‘‘మాజీ వలస రాజ్యాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చేయటానికి కామన్వెల్త్ ఏం చేస్తోంది? కామన్వెల్త్ దేశాల ప్రజలు చాలా మందికి అసలు ఈ సంస్థ ఏం చేస్తుందో తెలియదు. ఇందులో సభ్యదేశాలేవో తెలియదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కానీ కామన్వెల్త్‌కు సాంస్కతిక ప్రాధాన్యత చాలా ఉందంటారు ప్రొఫెసర్ గార్సన్. ప్రధానమంత్రులు, ఆర్థికమంత్రులు, విదేశాంగ మంత్రులు కలిసి చర్చించుకోవటం అప్రాధాన్యమైన అంశమేమీ కాదని.. ప్రత్యేకించి ప్రపంచ వేదిక మీద మాట్లాడే అవకాశం లేని చిన్న దేశాలకు కామన్వెల్త్ అవకాశాన్నిస్తుందని ఆయన పేర్కొంటారు.

ఫొటో సోర్స్, ROBERTO SCHMIDT/AFP/Getty Images
‘బ్రిటిష్ వలసవాద అవశేషం.. అలంకారప్రాయం’
‘‘కామన్వెల్త్ అనేది ఒక వలసవాద అవశేషం’’ అంటారు సీనియర్ జర్నలిస్ట్ పిళ్లా వెంకటేశ్వరరావు. ‘‘బ్రిటన్ తన వలస దేశాలతో సంబంధాలను కొనసాగించటానికి, వాటిని కలిపి ఒక అంబరిల్లా ఆర్గనైజేషన్‌గా దీనిని కొనసాగిస్తోంది. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ వంటి వారు బ్రిటన్ మీద గౌరవంతో ఆ సంబంధాన్ని కొనసాగించాలనుకుని ఇందులో చేరారు. ఇప్పటికీ బ్రిటిష్ రాణినే ఈ కూటమి అధినేతగా చూస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘సార్క్ కూటమికి ప్రాంతీయంగా కొంత ప్రయోజనముంది. కానీ కామన్వెల్త్ అలా కాదు. సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాల కోసం కామన్వెల్త్ చేస్తున్నదేమీ లేదు. ఇందుకోసం అన్ని దేశాలూ ఏదో ఒక ప్రాంతీయ కూటమిలోనో అంతర్జాతీయ కూటమిలోనో భాగస్వాములుగా ఉన్నాయి’’ అని వెంకటేశ్వరరావు విశ్లేషించారు.
కామన్వెల్త్ అనేది నాలుగేళ్లకోసారి కొన్ని పతకాలు తెచ్చుకునే క్రీడలను నిర్వహించే అలంకారప్రాయమైన సంస్థగా మిగిలిపోకుండా ఉండటానికి.. బ్రిటన్ ఏమైనా చేస్తుందా అనేది చూడాలంటారాయన.
‘‘ఈయూ నుంచి వైదొలగటం తదితర పరిణామాలతో బ్రిటన్ సాంస్కృతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. డార్కెస్ట్ అవర్, డన్‌కర్క్ వంటి సినిమాలు.. ఇతర చర్యల ద్వారా బ్రిటన్ గత చరిత్రను గ్లోరిఫై చేసే కృషి ఇప్పుడు జరుగుతున్నట్లు చెప్తున్నారు. మరి కామన్వెల్త్ ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది వేచిచూడాలి’’ అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
‘‘కామన్వెల్త్ సభ్య దేశాలకు రిన్యూవబుల్ ఎనర్జీ తదితర సాంకేతికతలను అందించటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఏమీ ఇవ్వకుండా, ఏమీ చేయకుండా ఆర్థికంగా, రాజకీయంగా ప్రాబల్యం పెంచుకోవటం ఎలా సాధ్యమవుతుంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, WPA Pool/Getty Images
ఇదీ కామన్వెల్త్ చరిత్ర...
ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస పాలనలోని పలు దేశాలు స్వాతంత్ర్యం పొందటం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయా దేశాలకు బ్రిటన్‌కు మధ్య.. ఆయా దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనేందుకు ఒక రాజ్యాంగ బద్ధమైన నిర్వచనం అవసరమైంది. అలా 1931లో 'బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్' ఏర్పడింది. 1949లో ఈ పేరు నుంచి బ్రిటిష్ పదాన్ని తొలగించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తమైన దేశాల కూటమిగా అది మారింది. అయితే.. బ్రిటన్ రాచరిక కుటుంబం ఈ కామన్వెల్త్ అధినేతగా కొనసాగుతోంది.
ఈ కూటమిలో చేరటమనేది ఆయా దేశాల ఇష్టాయిష్టాల మేరకే జరుగుతుంది. ఇప్పటివరకూ 53 దేశాలు ఇందులో సభ్యులుగా చేరాయి. చివరిగా చేరిన మొజాంబిక్, రువాండాలకు బ్రిటిష్ వలస రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదు.
కామన్వెల్త్ సూత్రాలను తరచుగా ఉల్లంఘించే దేశాలను కూటమి నుంచి బహిష్కరించవచ్చు. 2002లో జింబాబ్వే ఎన్నికలు రిగ్గయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశాన్ని సస్పెండ్ చేశారు.
ఇక సభ్య దేశాలు స్వచ్ఛందంగా కూటమి నుంచి వైదొలగవచ్చు. 2013లో కామన్వెల్త్ కూటమిని 'నయా వలసవాద సంస్థ'గా అభివర్ణిస్తూ గాంబియా బయటకు వెళ్లిపోయింది.
కామన్వెల్త్ దేశాల మధ్య సంబంధాలను.. రెండేళ్లకోసారి కామన్వెల్త్ దేశాల రాజకీయ అధినేతల సమావేశం (చోగమ్) ద్వారాను, ప్రతి నాలుగేళ్లకోసారి కామన్వెల్త్ క్రీడల నిర్వహణ ద్వారాను గుర్తిస్తున్నారు.
కామన్వెల్త్ సెక్రటేరియట్ లండన్‌లో ఉంది. విద్యా రంగం నుంచి పట్టణ ప్రణాళిక వరకూ అనేక రంగాల్లో కామన్వెల్త్ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా దేశాల్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసేందుకు పరిశీలకులు కూడా హాజరవుతుంటారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








