#CWG2018: అప్పుడు 48కేజీల ‘బంగారం’.. మరి ఇప్పుడు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారుల బృందం అడుగుపెట్టినప్పుడు ‘తొలి పతకం ఎవరు తెస్తారా’ అని అందరూ ఎదురు చూశారు. ఆ ఘనతను 20ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ సంజితా చాను సాధించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
ఆ సమయంలో స్టేడియంలో ఆమె గెలుపును చూసి ఉప్పొంగిపోయిన ప్రేక్షకుల్లో సంజిత కోచ్ కుంజురాణి దేవి కూడా ఉన్నారు. కుంజురాణి ఒకప్పుడు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్. సంజిత ఆమె స్ఫూర్తితోనే వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగుపెట్టింది.
తనను తీర్చిదిద్దిన కుంజురాణి దేవిని సంజిత గత కామన్వెల్త్ క్రీడల్లో ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఆ టోర్నీలో ఆమె స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ఈసారి కూడా స్వర్ణమే లక్ష్యంగా ఆమె గోల్డ్ కోస్ట్‌లో అడుగుపెట్టింది.
మీరాబాయి చాను, మేరీ కోమ్ లాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు పుట్టినిల్లయిన మణిపురే సంజిత స్వస్థలం.
వ్యక్తిగతంగా సంజిత చాలా సిగ్గరి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. కానీ వెయిట్‌లిఫ్టింగ్ ఎరీనాలో అడుగుపెట్టగానే ఆమెలోనే మరో రూపం బయటికొస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజిత 48కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడి 173కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
ఆ మెడల్ సాధించినప్పుడు అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సంజిత, గతేడాది మరోసారి వార్తల్లోకెక్కింది. కానీ ఈసారి కారణం వేరు.
అర్జున అవార్డుల జాబితాలో తన పేరును చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం దక్కలేదు. కానీ సంజిత నిరుత్సాహపడకుండా ఆటపైనే దృష్టిపెట్టింది.
తాను కోర్టు మెట్లెక్కిన కొన్ని రోజులకు జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 53కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని ఆ విజయంతో విమర్శకులకు బదులిచ్చింది.
మణిపుర్‌కే చెందిన మీరా బాయి చాను ఆటలో సంజితకు పోటీ. బయట మాత్రం వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. గత కామన్వెల్త్ గేమ్స్‌లో వాళ్లిద్దరూ ఒకే విభాగంలో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
సంజిత ఆ తరవాత 48కేజీల విభాగానికి దూరం జరిగి 53కేజీల విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె భారతీయ రైల్వేస్ ఉద్యోగి.
గత కామన్వెల్త్ గేమ్స్‌లో సంజిత మరో 2కేజీల బరువెత్తి ఉంటే కామన్వెల్త్ రికార్డు బద్దలయ్యుండేది. చూద్దాం.. ఈసారి ఆ రికార్డు సృష్టిస్తుందేమో..!
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








