కాంతార: అసలేమిటీ భూతకోల, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?

భూత కోల
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంతార సినిమా నేపథ్యంలో భూతకోల ప్రక్రియపై చాలా ఆసక్తి నెలకొంది.

ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధులలో కొందరు భూతకోలను పోలిన వేషం వేసుకు తిరగడం వివాదాస్పదమైంది.

ఇంతకీ భూతకోల అంటే ఏంటి? అది దైవారాధనా లేక ఆత్మల ఆరాధనా? ఈ ఆరాధనను ఎవరు, ఎక్కడ, ఎందుకు చేస్తారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్కడ చేస్తారీ భూత కోల?

భూత కోల లేదా దైవ కోల ప్రధానంగా తుళునాడు ప్రాంత లేదా తుళు మాట్లాడే ప్రజల ఆచారం.

దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.

పశ్చిమ కనుమలు, అరేబియా సముద్ర తీర ప్రాంతాలైన కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కసర్గోడ్ జిల్లాలో ఇది బాగా కనిపిస్తుంది.

తుళు ప్రజలతో పాటు, కొందరు మలయాళీలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

కేరళ తెయ్యం కళారూపానికి భూత కోలతో దగ్గర సంబంధం ఉంది.

కర్ణాటక యక్షగానంపై దీని ప్రభావం ఉంది.

భూత కోల
ఫొటో క్యాప్షన్, రక్తేశ్వరి రూపంలో దైవ కోల నిర్వహిస్తోన్న దయానంద

భూత కోల అంటే ఏంటి?

కోల అంటే ప్రదర్శన, పండుగ, రూపం అనే అర్థాలు ఉండగా.. భూత అంటే తెలుగు, హిందీల్లో వాడే దెయ్యం అనే అర్థమే కాకుండా, సంస్కృతంలో ఆత్మ, పురాతన, దైవం, పంచ భూతాలు, శుద్ధమైనది, నిజమైన.. ఇలా ఎన్నో అర్థాలున్నాయి.

పూర్వీకుల ఆరాధన లేదా ప్రకృతి శక్తుల ఆరాధన లేదా దేవతల ఆరాధన.. ఇలా మూడు రకాలుగానూ దీన్ని చూడాలి.

తుళు సంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచం మూడు భాగాలు.

  • గ్రామ్యం అంటే సాగుభూములు.
  • అరణ్యం అంటే అడవులు..
  • భూతం అంటే ఆరాధనీయంతోపాటు గ్రామాన్ని, అరణ్యాన్ని సమన్వయం చేసేది.

అంతేకాదు స్థానిక గ్రామ పెద్ద లేదా పాలకుడి అధికారాన్ని కూడా ఈ భూతాలు, దైవాలు నిర్ధరిస్తాయి. గ్రామ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు కూడా ఈ దేవుళ్లకు చెప్పుకుంటారు భక్తులు. భూత కోలలో వివాదాలపై తీర్పులు కూడా ఇస్తుండేవారు. ఈ ప్రక్రియ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని వారి విశ్వాసం.

మిగిలిన వారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.

''ఒక్కో లక్ష్యానికి ఒక్కో దైవ ఆరాధన ఉంది. ప్రకృతి దేవతలు, దేవతలుగా మారిన పూర్వీకులు (దైవత్వాన్ని పొందిన వారు).. ఇలా చాలా మంది ఉంటారు. మానసిక, శారరీక ఆరోగ్యం కోసం తుళునాడులో ఈ దైవారాధన జరుగుతుంది'' అని బీబీసీతో చెప్పారు భూత కోల చేసే దయానంద జి కట్టల్సార్.

భూత అనే శబ్దం చాలా మందికి భిన్న అర్థాలు కలిగిస్తున్నా, దైవారాధన అనే పదాన్నే వీరు ఎక్కువగా వాడుతున్నారు.

సాధారణంగా నవంబరు నుంచి మే వరకూ భూతకోల జరుగుతుంది.

భూత కోల దైవం
ఫొటో క్యాప్షన్, తుళునాడులోని కొన్ని కులాల్లో వారసత్వం కొడుక్కి కాకుండా మేనల్లుడికి వెళ్తుంది. దయానందతో కలిసి దైవకోల చేస్తోన్న ఆయన మేనల్లుడు

ఎవరిని పూజిస్తారు?

ఈ ఆరాధనా ప్రక్రియలో పదుల సంఖ్యలో దైవాలున్నాయి. గ్రామాలకు, కొన్ని గ్రామాలను కలిపిన ప్రాంతాలకు, కులాలకు, కుటుంబాలకు కూడా ప్రత్యేక దైవాలు ఉంటాయి.

ఇందులో పితృ దేవతలున్నారు. జంతు దైవాలున్నాయి. గ్రామ దేవతల తరహా దైవాలూ ఉన్నాయి. వీరులు, చరిత్ర పురుషుల దైవాలున్నాయి.

జైనులకు కూడా ఈ దైవారాధన ఉంది. అలాగే ప్రత్యేక రూపాలు అంటే మగవారి తల, ఆడవారి శరీరం, వరాహ రూపంలో తల, స్త్రీ శరీరం ఉండే దైవాలూ ఉంటాయి. పంటలు రక్షించే దైవాలు, సముద్ర దైవాలు, అరణ్య దైవాలు కూడా ఉంటాయి.

ఈ దైవాలకు ఇళ్లల్లో నిత్య పూజలు వంటివి ఉండవు. ఏడాదికోసారి జరిగే ఉత్సవాల్లో అందరూ కలసి ఆరాధిస్తారు. కాకపోతే ఆయా దైవాల వస్తువులు, ఆభరణాలు వంటి వాటికి మాత్రం నిత్య పూజ జరుగుతుంది.

భూత కోల ఆచారం
ఫొటో క్యాప్షన్, దైవ కోల చేసే వ్యక్తులకు సహాయం చేస్తూ చుట్టూ పాత్రి అనే వ్యక్తులు ఉంటారు.

ఈ దైవాలు మొత్తం మూడు రకాలు

ప్రకృతి శక్తులు, జంతు దేవతలు: ఉదా: పంజుర్లి, గుళిగ, మల్లరాయ, జుమాది

చారిత్రక, వీర పురుషులు, గిరిజన రక్ష దేవతలు: ఒకప్పుడు భూమిపై నివసించి అతీంద్రియ శక్తులు సంపాదించిన మనుషులు. శక్తిమంతులు, వీరులైన మనుషులు: ఉదా: కొరగజ్జ, కొరడబ్బు, అణ్ణప్ప

పూర్వీకులు: చనిపోయిన పూర్వీకులు

నేరుగా హిందూ వైదిక, పురాణ సంప్రదాయాలకు సంబంధం లేకపోయినా, పలు దైవాల కథలు హిందూ పురాణాలతో మిళితమై ఉన్నాయి.

ఉదాహరణకు పంజుర్లి అనే దైవాన్ని శివుడే భూమి మీదకు పంపాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. పంజుర్లిది వరాహరూపం. అయితే, అది దశావతారాల్లోని వరాహ రూపం కాదు. దీని వెనక ఓ కథనం ఉంది.

శివుని కైలాసంలోని తోటలో ఉండే అడవి పంది చనిపోతే దాని పిల్లను పార్వతీ దేవి పెంచుతుంది. కానీ, ఆ పిల్ల పెరిగి, శివుని తోటలోని చెట్లు, మొక్కలను ధ్వంసం చేస్తుంది. దీంతో దాన్ని చంపేయాలని శివుడు నిర్ణయిస్తాడు.

పార్వతి ఆపి, క్షమించమని కోరుతుంది. దీంతో శివుడు ఆ అడవి పందిని తన గణాల కింద భూమి మీదకు పంపి, మనుషుల చేత కొలిచే, రక్షక దైవం హోదా ఇస్తాడు. అదే పంజుర్లి. ఈ పంజుర్లినే శివ సంభూత అని పిలుస్తారు.

అడవి పందుల నుంచి పంటలను రక్షించేందుకు పంజుర్లిని ఆరాధిస్తారు.

భూత కోలకు సిద్ధమవ్వడం
ఫొటో క్యాప్షన్, సహజ సిద్ధ రంగులతో చేసే ఈ అలంకరణకు గంటల సమయం పడుతుంది.

పూర్వీకుల ఆరాధన అంటే దెయ్యాలు, ఆత్మల ఆరాధనా?

ఇక్కడ పూర్వీకులను ఆరాధించడం వెనుక కూడా చాలా పెద్ద ప్రక్రియ ఉంది. కోరికలు తీరకుండా చనిపోయిన పూర్వీకుల కర్మకాండల తరువాత కొన్ని ప్రత్యేక ప్రక్రియలు చేస్తారు.

దాదాపు 12 ఏళ్ల తరువాత ఆ పూర్వీకులు భూతగా మారతారు. తరువాత ప్రాచీన ధర్మ దేవతల సరసన చేరతారు. ఆ క్రమంలో కాలె, కులె ఇలా పేర్లుంటాయి.

''భూత అంటే దెయ్యం కాదు, అన్ని సంస్కారాలు పూర్తయి దైవత్వం సంపాదించుకున్న పూర్వీకులు. అది భూతారాధన. అయితే, ప్రకృతి శక్తులైన పంజుర్లి, గుళిగ, మైసందయ వంటివి భూతారాధన కాదు, అది దైవారాధన అవుతుంది. ఇలా దైవ – ప్రకృతి, పూర్వీకులు, చారిత్రక-వీర పురుషుల దేవతలు ఉంటారు. భూతకోల మొత్తం ఒక దేవునికి కాదు'' అన్నారు దయానంద.

మంగళూరులో నివాసం ఉండే పంబద కులానికి చెందిన దయానంద.. పోస్టల్‌ శాఖలో చిన్న ఉద్యోగి. 50 ఏళ్ల వయసున్న ఆయన అనువంశికంగా ఈ భూత కోల చేస్తున్నారు.

ఒక మాటలో చెప్పాలంటే ఇది తుళునాడు చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సంక్లిష్టతలన్నీ కలగలిసిన ప్రక్రియ.

భూత కోల ఏ కాలం నాటిది?

ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైందో స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే, 14వ శతాబ్ది అంటే సుమారు 700 ఏళ్ల నాటి శాసనంలో ఈ ప్రక్రియ ఆనవాలు దొరికింది.

భూత కోల
ఫొటో క్యాప్షన్, దైవ కోలకు సిద్ధమయ్యే విధానం..

ఈ రూపం ఎవరు ధరిస్తారు?

నలికె, పంబద, పరవ వంటి దళిత (ఎస్సీ) కులాల వారు ఈ ప్రక్రియలో ఉంటారు. ఆ ప్రాంతంలోని మిగిలిన అన్ని కులాల వారూ ఆ సమయంలో ఈ దైవాలను ఆరాధిస్తారు.

గ్రామాల్లో, స్థానిక గ్రామ దేవతల ఆలయాల్లో సాధారణంగా ఏడాదికోసారి ఈ ప్రక్రియ చేస్తారు.

వీరు రకరకాల వృత్తులు చేసుకుంటూనే ఈ పనిచేస్తారు ఇందులో . కూలీలు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులూ ఉన్నారు. అలాగే స్థానిక జమీందార్లు వీటికి ఖర్చు భరించే సంప్రదాయమూ ఉంది.

ఈ ప్రదర్శనకారులు తయారు అవుతుండగా ఆ కుటుంబం లేదా కులానికి చెందిన యువత వారికి సాయం చేస్తూ, చూసి నేర్చుకుంటారు.

''ఈ దైవారాధన చేసే మేమంతా దళితులమే. దైవారాధనలో ఇక్కడున్న 16 కులాలకీ భాగస్వామ్యం, గౌరవం ఉంటాయి. ఎవరైనా మాకు నమస్కరిస్తుంటే అది వ్యక్తిగా నాకు చేసే నమస్కారం కాదు, దైవానికి చేసే నమస్కారం'' అన్నారు దయానంద.

ఇందులో కులాల వారీగా కొన్ని నియమాలు ఉన్నాయి.

''మా కులంలో అయితే, ఇది చేసే వారు చేతికి ముద్ర, కాలికి రింగ్ (మెట్టె వంటిది), తలపై జుట్టు, చేతికి కంకణం వంటివి ధరిస్తారు. అన్నం తింటుండగా దీపం ఆరిపోతే, మరునాడు అభ్యంగన స్నానం చేసి పూజ చేసే వరకూ అన్నం తినం. మైల ఉన్నవారిని ముట్టుకోం. ఆవు, పంది మాంసం తినకూడదు. ఇతర మాంసాలు తినవచ్చు. నేను వ్యక్తిగతంగా మాంసం మానేశాను. మద్యంపై నిషేధం లేదు కానీ నేను తీసుకోను'' అని వివరించారు దయానంద.

''సాధారణంగా వీరికి అనువంశికంగా కొన్ని గ్రామాలు ఉంటాయి. అక్కడ ఆ కుటుంబీకులే చేస్తారు. తుళునాడులో మాత్రమే దీన్ని ప్రదర్శించాలి. కొందరు బయట చేస్తారేమో. నేనైతే చేయను. మా నాన్న నాకు ఈ విషయం చెప్పారు'' అన్నారాయన.

భూత కోల
ఫొటో క్యాప్షన్, దైవ కోలలో నమస్కరిస్తోన్న భక్తులు

మరికొన్ని కులాల విషయంలో ఈ నిబంధనలు కొంత మారవచ్చు. ఈ ప్రాంతంలోని కొన్ని కులాల్లో ప్రాచీన మాతృస్వామ్య వ్యవస్థ ఆనవాళ్లు కనిపిస్తాయి. కొన్ని అనువంశికాలు తండ్రి నుంచి కాకుండా మేనమామ నుంచి వస్తాయి.

ఈ భూత కోల చేసే వ్యక్తికి ఖర్చు వేల రూపాయల్లో ఉంటుంది. గగ్గరల కొనుగోలు, వస్త్రాలు, అలంకరణ ఖర్చు ఉంటుంది. కొన్నిచోట్ల తగినంత వస్తుంది, కొన్నిచోట్ల రాకపోయినా.. అంటే దారి ఖర్చులకు రాకపోయినా చేస్తారు.

''మేం ప్రాపంచిక కళాకారులం కాదు. మేం ఆధ్యాత్మిక కళాకారులం. మా తండ్రి దీనిపై ఆధారపడి గుడిసెలోనే బతికాడు. భూతకోల లేని రోజు కూలీకి వెళ్లేవారు. గొప్ప ఆదాయం వచ్చేది కాదు. నేను చదువుకుని ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ, సంప్రదాయాన్ని వదల్లేదు'' అని దయానంద వివరించారు.

దయానంద
ఫొటో క్యాప్షన్, దైవకోల ప్రారంభించే ముందు తుళు భాషలో పాద్దన చేస్తారు.

భూతకోలలో ఏం చేస్తారు?

రూపం ధరించే వ్యక్తి ముందుగా ఏ దైవారాధన చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి లేదా గుడి దగ్గరకు వెళ్తారు. అక్కడ తుళు భాషలో ఆ దైవం లేదా భూత చరిత్ర గానం చేస్తారు. దాన్ని పాద్దన అంటారు.

సాధారణంగా ఇవి చరిత్ర లేదా ఆ కథను చెప్పేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భూతకోల వ్యక్తే స్వయంగా చిన్న డప్పు కొడుతూ కాసేపు దీన్ని పాడి తరువాత రూపం ధరించడానికి వెళ్తాడు.

ఏ దైవ రూపం ధరిస్తున్నారో ఆ తరహా ముఖ కవచం లేదా అలంకరణ కోసం ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు రక్తేశ్వరి రూపం ధరించే వ్యక్తి మగవారైనా శరీరానికి చాలా చీరలు చుడతారు. తరువాత ఆ రూపం ధరిస్తారు.

అది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ. ఆ రంగులను వారే స్వయంగా సిద్ధం చేసుకుంటారు. అవన్నీ సహజసిద్ధ పదార్థాలే. కొన్ని సందర్భాల్లో దైవానికి సంబంధించిన ఆభరణాలు వేసుకుంటారు.

సాధారణంగా ఎర్రటి బట్టలు వేసుకుని, పసుపు రంగు ముఖానికి పూసుకుంటారు. చివరగా కత్తి, కాగడా, గంట.. ఇలా అక్కడి సంప్రదాయాన్ని బట్టి చేతిలోకి అందిస్తారు.

వెండి అలంకరణలు, కొబ్బరి లేదా తాటి ఆకులతో చేసిన అలంకరణలు కూడా ఉంటాయి. పోక చెట్ల పూలు, వెదురు కూడా వాడతారు.

ఈ రూపం ధరించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ముఖాలంకరణకే గంటన్నర వరకూ పడుతుంది. దైవాన్ని బట్టి వస్త్రధారణ, అలంకరణ మారుతుంది.

కత్తి
ఫొటో క్యాప్షన్, దైవ కోల సమయంలో కత్తి వంటి ఆయుధాలను పట్టుకుంటారు.

దైవం ఆభరణాల్లో కాలికి పట్టీలా వేసుకునే గగ్గర అనేది చాలా ప్రదానమైనది. అది వేసుకున్న తరువాత ఆత్మ లేదా దైవం ఆవహిస్తుంది. రూప ధారణ అంతా పూర్తయ్యాక గగ్గర అతని చేతుల్లో పెడతారు. అప్పుడు తన కాలికి కట్టుకుంటారు.

ఆ ప్రదర్శనకారుడు నృత్యం చేయడం మొదలుపెట్టాక దైవం లేదా భూతం ఆవహిస్తుందని వారి విశ్వాసం.

రెండుపక్కలా ఇద్దరు సహాయకులు ఉంటారు. నృత్యం తీవ్రత పెరుగుతూ పోతుంది. కొన్ని గంటల పాటు ఈ నృత్యం, కొన్ని మాటలు గట్టిగా చెప్పడం.. ఇవన్నీ జరుగుతాయి. పూనకం వచ్చినట్టుగా ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో మాంసం, కొన్ని సందర్భాల్లో మరమరాలు, కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, తమల పాకులు, పూలు… ఇలా రకరకాల వాటిని ఆ దైవానికి భక్తులు నివేదిస్తారు.

ఒక్కోసారి కొన్ని సెకన్లే తమపై దైవం ఆవహించినా మిగిలిన సమయం అంతా ఆ భావనతోనే ఉంటారు.

ఆలయం
ఫొటో క్యాప్షన్, గుళిగ మొదట ఉద్భవించిన ప్రదేశంగా చెప్పే దేవాలయం

‘దేవుని ఆధీనంలో, అదనపు శక్తితో ఉంటాం..’

గ్రామస్తులను, గ్రామ పెద్దను పట్టుకుని దైవం మాట్లాడుతుంది. తరువాత భక్తులు ఒక్కొక్కరూ వెళ్లి తమ సమస్యలు, వివాదాలు దైవాలకు చెప్పుకుంటారు.

కొన్ని సందర్భాల్లో వివాదాలకు తీర్పులు కూడా దైవం ఇస్తుంది. సాయంత్రం మొదలై తెల్లవారుఝాము వరకూ ఇది కొనసాగుతుంది.

''భూత కోల ఆడే సమయంలో మేం ఏం చేస్తున్నామనేది కొంచెం గుర్తుంటుంది. కానీ, ఏదో శక్తి ఆవహిస్తుంది. నా బరువు 60 కేజీలు. నేను సుమారు 100 కేజీల బరువైన వస్తువులు, అలంకారాలు, ఆభరణాలు ధరించి దాదాపు 13 గంటల పాటు ఉంటాను. రాత్రి నుంచి ఉదయం వరకూ ఆహారం లేకుండా అలానే ఉంటాను. ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? మేం దేవుళ్లం కాదు. కానీ, మేం ఆ సమయంలో దేవుని ఆధీనంలో, అదనపు శక్తితో ఉంటాం... ప్రకృతిలో గాలి ఉన్నట్టుగా (కనిపించకపోయినా). ఆ శక్తి రావడం వల్లే ప్రజలకు న్యాయం అందించగలుగుతాం'' అన్నారు దయానంద.

''ఇది పరకాయ ప్రవేశం వంటిది. అప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. భారీ బరువుతో, చేతిలో అగ్నితో మేం అది చేస్తాం. అన్నీ పూర్తిగా మా అదుపులో ఉండవు. ఆభరణాలే కేజీల బరువు ఉంటాయి. పదుల దొంతర్ల వస్త్రాలు కడతారు. ముఖంపై పూత ఉంటుంది. రూపం ధరించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అదంతా ఎలా సాధ్యం అంటే ఆ సమయంలో మమ్మల్ని ప్రకృతి శక్తి, దైవ శక్తి నడిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుంతుందనేది కొంచెంగా, లీలగా గుర్తుంటుంది. భక్తి భయంతో వస్తుంది. భయం లేకుండా భక్తి రాదు. దైవ భయం జ్ఞానానికి తొలిమెట్టు. అయితే, ఆ భయం ఒక టీచర్ అంటే ఉండే భయం వంటిది. అంతేకానీ ఏదో దెబ్బతీస్తుంది, కొడుతుంది, నాశనం చేస్తుందని కాదు'' అన్నారు దయానంద.

కాంతార మూవీ

ఫొటో సోర్స్, X/Rishab Shetty

కాంతార సినిమా ప్రభావం వీరిపై ఎలా ఉంది?

మంగళూరు ప్రాంత ప్రజల్లో కాంతార గురించి మిశ్రమ అభిప్రాయం ఉంది. ఆ సినిమా ద్వారా తమ ప్రాంత సంస్కృతి ప్రపంచం అంతా తెలిసినందుకు వారికి చాలా సంతోషంగా ఉంది.

అదే సమయంలో టీవీ షోల్లో, ఇతర స్టేజీలపై భూతకోలను ఒక వేషంలా వేయడం, దానిపై రీల్స్ వంటివి చేయడంపై అక్కడి వారికి అసంతృప్తి ఉంది.

భూతకోల ప్రదర్శన సమయంలో అక్కడ ఉన్న యువతను కాంతార గురించి ప్రశ్నించినప్పుడు, వారి అభిప్రాయం కూడా అదే.. దైవికం కాని వేదికలపై దీన్ని ప్రదర్శించకూడదని వారంటున్నారు.

''దేశ విదేశాలకు వెళ్లిపోయిన ఈ ప్రాంత వాసులకు తమదైన ప్రక్రియ ఉందని కాంతార ద్వారా తెలిసింది. వారు దీన్ని ఇప్పుడు సొంతం చేసుకుంటున్నారు. అది పాజిటివ్. అయితే, దీన్ని బహిరంగ వేదికలపై ప్రదర్శించకూడదు. ఇదేదో యక్షగానం లాంటి కళారూపమో, డ్రామానో, సినిమానో కాదు. ఇది ఒక దైవారాధన ప్రక్రియ. దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇది ప్రదర్శన కళ కాదు, నిదర్శన కళ’’ అని అన్నారు దయానంద.

‘‘పిల్లలు కాలేజీ స్టేజీల మీద దీన్ని చేసి, రీల్స్ తీయడం బాధాకరం. భక్తికీ, ఆసక్తికీ మధ్య తేడా ఉంది. యువత ఆ తేడా తెలుసుకోవాలి. వారిది భక్తి కాదు, ఆసక్తి. కొందరు ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి వస్తుంటారు. కానీ రుషి, నది, దైవం మూలాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. వాటిని అంగీకరించాలి. ఫలితాలను అనుభవించాలి. ఇప్పుడు ఆసక్తితో వచ్చే యువత, భక్తితో వచ్చే వారు వేర్వేరు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీయడానికి మాత్రమే వస్తారు'' అని చెప్పారు దయానంద.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)