‘‘వర్షంలో తడవకూడదని వినాయకుడిని మసీదులోకి తీసుకెళ్లారు, అదే సంప్రదాయంగా మారింది’’

ఫొటో సోర్స్, Sarfaraj Sanadi/Yogesh Jiwaje
- రచయిత, సంపత్ మోరే
- హోదా, బీబీసీ కోసం
గణేశ్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కొన్ని కనిపిస్తాయి.
ఇక్కడి కొన్ని మసీదుల్లో 40 ఏళ్లకుపైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతోంది.
సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలో గోట్‌ఖిండీ అనే గ్రామం ఉంది. ఇక్కడి జుజర్ చౌక్‌లో ఉన్న మసీదులో ప్రతీ ఏడాది పది రోజుల పాటు న్యూ గణేశ్ మండలి వారు గణపతిని ప్రతిష్టిస్తారు. 44 ఏళ్లుగా ఇలా జరుగుతోంది.
గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో హిందూ, ముస్లింలు ఇక్కడికి వస్తుంటారు.

‘వర్షంలో గణపతి తడుస్తున్నాడని...’
ఈ సంప్రదాయం ఎలా మొదలైందనే దాని వెనక ఆసక్తికరమైన అంశాలున్నాయి. మసీదులో వినాయకుడి ప్రతిష్టాపన వెనకున్న కథను గోట్‌ఖిండీ గ్రామానికి చెందిన అశోక్ పాటిల్ బీబీసీకి వివరించారు.
ఒకసారి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద, చాలా సాదాసీదా ఏర్పాట్లతో వినాయకుడిని ఏర్పాటు చేశారని, అప్పట్లో మండపం కూడా వేయలేదని ఆయన తెలిపారు.
‘‘వర్షాకాలంలోనే గణేశ్ ఉత్సవాలు జరుగుతాయి. వినాయకుడిని ఏర్పాటు చేసిన తర్వాత ఒకరోజు భారీ వర్షం కురిసింది. మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుడి విగ్రహం అంతా తడిచిపోయింది. గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి దీన్ని చూశారు. గణేశ్ మండల్‌కు చెందిన వ్యక్తులకు ఈ విషయం చెప్పారు. వెంటనే అందరూ అక్కడికి చేరుకొని, ఏం చేయాలనే అంశంపై చర్చించారు. అప్పుడే నిజామ్ పఠాన్, ఆయన బంధువులు వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీదులో ఉంచాలని కోరారు. అక్కడున్న వారంతా ఆలోచించి, గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు. నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు’’ అని అశోక్ పాటిల్ తెలిపారు. ఇది 1961లో జరిగింది.
అయితే, ఆ తర్వాతి ఏడాది గణపతిని మళ్లీ ప్రతిష్టించలేదని అశోక్ పాటిల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Sarfaraj Sanadi
మసీదులో ఇవి మూడో తరం గణేశ్ ఉత్సవాలు
1961లో గోట్‌ఖిండీ గణేశ్ ఉత్సవాలను మొదలుపెట్టిన బృందంలో అశోక్ పాటిల్ తండ్రి కూడా ఒక సభ్యుడు. కాబట్టి, 1961నాటి ఈ సంగతులను బీబీసీకి వివరించారు అశోక్.
‘‘1986లో ఇదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పొరుగున ఉన్న బావ్చీ గ్రామంలో గణేశ్ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందినవారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు. వారు కూడా ఆలోచనలో పడ్డారు. మనం కూడా గ్రామంలో ఇదే విధంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ఆ యువకులు అనుకున్నారు.’’ అని అశోక్ తెలిపారు.
1961 నాటి ఘటనను కూడా గుర్తుకు తెచ్చుకున్న వారంతా గ్రామంలోని మసీదులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం మొదలుపెట్టారని అశోక్ వెల్లడించారు.
ఈ గణపతి మండలికి ఇలాహి పటేల్ అధ్యక్షునిగా వ్యవహరించారు. సుభాష్ థోరాట్, అశోక్ షేజ్వాలే, విజయ్ కాశీద్, అర్జున్ కోకాటే అనే వ్యక్తులు చొరవ తీసుకొని గణేశ్ ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్నారు.
1961లో గణపతి ఉత్సవాలను జరిపిన వారి రెండో తరం వారు 1986లో గణేశ్ ఉత్సవాలను నిర్వహించారు. ఇప్పుడు మూడో తరం వారు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అశోక్ పాటిల్ వివరించారు.
1961లో బాపూసాహెబ్ పాటిల్, శ్యామ్‌రావు థోరాట్, వసంత్‌రావు థోరాట్, నిజామ్ పఠాన్, ఖుద్‌బుద్న్ జమాదార్, రంజాన్ ములానీ ధోండీ పఠాన్‌లు గోట్‌ఖిండీలో గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు.
1986లో ఇలాహీ పఠాన్, అశోక్ పాటిల్, సుభాశ్ థోరాట్, అశోక్ షేజ్వాలే, విజయ్ కాశీద్, అర్జున్ కోకాటే ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు.
మూడో తరంలో గణేశ్ థోరాట్, సాగర్ షేజ్వాలే, రాహుల్ కోకాటే, లఖన్ పఠాన్, సదానంద్ మహాజన్‌లు ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Yogesh Jiwaje
ఒకేరోజున మొహర్రం, గణేశ్ ఉత్సవాలు
తమ గ్రామంలో అన్ని కులాలు, మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారని లఖన్ పఠాన్ చెప్పారు.
‘‘మొదట మా తాత నిజామ్ పఠాన్, తర్వాత మా నాన్న ఇలాహీ పఠాన్ ఈ గణపతి ఉత్సావాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నా. మేమంతా హిందూ-ముస్లింల పండుగలను కలిసి జరుపుకుంటాం. రెండుసార్లు మొహర్రం, గణపతి పండుగలు ఒకే రోజున వచ్చాయి. అప్పుడు గణపతి, పీర్లను కలిపి ఉమ్మడిగా ఊరేగింపుకు తీసుకెళ్లాం’’ అని లఖన్ పఠాన్ తెలిపారు.
పఠాన్, అశోక్ పాటిల్ ఇద్దరూ మంచి స్నేహితులు.
‘‘అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలోనే బక్రీద్ పండుగ కూడా వస్తుండేది. ఆ సమయంలో ముస్లింలు మేకలను కోయడం, ఖుర్బానీ చేయడంవంటివి నిలిపివేసేవారు. ఏకాదశి రోజున మా గ్రామంలో ఎవరూ మాంసం తినరు’’ అని ఆయన వివరించారు.
చాలాకాలంగా ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇదంతా ఎలాంటి బలవంతం లేకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తుంటారు. గ్రామస్థులు సోదరభావంతో ఉంటారని అశోక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Yogesh Jiwaje
‘మా మధ్య చిచ్చు పెట్టకండి’
గణేశ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి పాటిల్, పఠాన్ బీబీసీకి వివరించారు.
‘‘ఒకసారి ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మా గ్రామానికి వచ్చారు. గణేశ్ ఉత్సవంలో పాల్గొనవద్దని మా ముస్లిం సోదరులకు చెప్పారు. ఈ పండుగ గురించి లేనిపోనివి కల్పించి చెప్పారు. కానీ, మా గ్రామానికి చెందిన ముస్లింలంతా, ఇక్కడ చాలా ఏళ్లుగా హిందూ-ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి బతుకుతున్నామని వారికి స్పష్టంగా చెప్పారు. ఈ పండుగ వల్ల మాకు శక్తి లభిస్తుందని అన్నారు. మా మధ్య మీరు చిచ్చు పెట్టకండి అని చెప్పి వారిని మర్యాదపూర్వకంగానే గ్రామంలో నుంచి బయటకు వెళ్లమన్నారు’’ అని వారిద్దరూ నాటి ఘటనను చెప్పారు.
గతంలో ఎడ్ల బండ్ల మీద గణపతి ఊరేగింపు చేసేవాళ్లమని లఖన్ తెలిపారు. ఇప్పుడు ట్రాక్టర్ల మీద అదే ఉత్సాహంతో గణేశ్ ఊరేగింపు జరుపుతున్నామని చెప్పారు.
గణపతి నిమజ్జనం తర్వాత ఊరంతా కలిసి భోజనాలు చేస్తారు. ఊళ్లోని పురుషులు, మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతీ రోజూ ఒక్కో కుటుంబం హారతి సేవలో పాల్గొంటుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హారతి ఇస్తారని అశోక్ పాటిల్ చెప్పారు.
‘‘మా వెనకటి తరాల వాళ్లు ప్రారంభించిన ఈ ఆచారం వల్ల గోట్‌ఖిండీ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా మారింది. మా గ్రామం గురించి అందరూ చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుంది. రెండు వర్గాలకు చెందిన పూర్వీకులు తర్వాతి తరాలకు గొప్ప కీర్తిని వారసత్వంగా ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని స్థానికుడు గణేశ్ థోరాట్ అన్నారు.
అయిదు మసీదుల్లో వినాయక ఉత్సవాలు
కొల్హాపూర్ జిల్లాలోని కురుంద్‌వాడ్‌లో అయిదు మసీదుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దంలో పీష్వా కాలం నాటి ఒక సంస్థానమే కురుంద్‌వాడ్.
ఈ సంస్థానంలో అన్ని కులాలు, మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. గ్రామంలోని కుదేంఖా బడేనల్ సాహేబ్ మసీదు, ఢేపణ్‌పూర్ మసీదు, బైరాగ్దార్ మసీదు, శెల్కే మసీదు, కరకన్యా మసీదులలో వినాయకుడిని పెట్టారు.
కురుంద్‌వాడ్ సంస్థానం కథ కూడా గోట్‌ఖిండి తరహాలోనే ఉంటుంది. 1982 గణేశ్ ఉత్సవాల సమయంలో వానలు కురిశాయి. ఆ సమయంలో మసీదుకు సమీపంలో నెలకొల్పిన గణేశుడిని వర్షంలో తడవకుండా ఉండేందుకు మసీదులోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి ఏడాది నుంచి గ్రామంలోని 5 మసీదుల్లో గణపతి మండపాలను ఏర్పాటు చేయడం మొదలైంది.
స్థానిక జర్నలిస్ట్ జమీర్ పఠాన్ ఈ అంశం గురించి మాట్లాడారు.
గ్రామానికి చెందిన పాతతరం పెద్దలు ఈ ఆచారాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. సమాజంలో సామరస్యాన్ని కాపాడటమే ఈ ఆచారం వెనుక ఉద్దేశమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Yogesh Jiwaje
పట్వర్ధన్ సంస్థానం సంప్రదాయం
2009లో మిరాజ్ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో ఈ అల్లర్ల ప్రభావం సాంగ్లీ, కొల్హాపూర్‌లోని అనేక ప్రాంతాల్లో కనిపించింది.
అయితే, ఈ గ్రామాల్లోని రెండు మతాలకు చెందిన ప్రజలు ఏకమై శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు.
ప్రతీ ఏడాది గణేశ్ ఉత్సవాల రాక కోసం రఫీక్ దబాస్ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు.
మసీదులో గణపతిని ప్రతిష్టించేటప్పుడు, తమ ఇంటికి గణపతి అతిథిగా వచ్చినట్లుగా సంతోషంగా అనిపిస్తుందని ఆయన చెప్పారు.
ఈ సమయంలో కురుంద్‌వాడ్‌లో ప్రజల మధ్య స్నేహం మరింత బలపడుతుంది. జిల్లా అంతటా ఈ సోదరభావం కనిపిస్తుంది.
2018, 2019, 2020లలో గణపతి ఉత్సవాలు, మొహర్రం కలిసి వచ్చాయి. ఈ పండుగలను అక్కడి ప్రజలు కలిసిమెలిసి జరుపుకున్నారు. ఆ సమయంలో వినాయకుని మోదకాలు, పీరీలలో పంచే చోంగ్యా ప్రసాదం రెండూ కలిపి ప్రజలకు పంపిణీ చేసినట్లు జమీర్ పఠాన్ చెప్పారు.
1982లో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకెళ్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














