తెలంగాణ: 'నేరస్థుల్లో మొదటిసారి నేరం చేస్తున్న వారే ఎక్కువ', ఎందుకిలా జరుగుతోంది?

హైదరాబాద్, కూకట్‌పల్లి హత్య కేసు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు)

నిరుడు ఆగస్టులో బోడుప్పల్ బాలాజీహిల్స్‌లో ఉండే మహేందర్ రెడ్డి తన భార్య జ్యోతి అలియాస్ స్వాతిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లుగా మల్కాజిగిరి డీసీపీ పద్మజ చెప్పారు.

అప్పటికే స్వాతి ఏడు నెలల గర్భిణి. ఈ కేసులో మహేందర్ రెడ్డిని అరెస్టు చేశామని, నేరాన్ని అంగీకరించారని డీసీపీ తెలిపారు.

ఇప్పుడు మరో ఘటన చూద్దాం..

హైదరాబాద్ కుషాయిగూడలోని నాగార్జున నగర్‌లో ఓ ఇంటి నుంచి జనవరి 18న తీవ్ర దుర్వాసన వస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుషాయిగూడ పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.

లోపలకు వెళ్లి చూసిన పోలీసులు ఓ గర్బిణి హత్యకు గురైనట్టు గుర్తించారు. దీంతో, కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి పేరు స్నేహ. ఆమె భర్త సచిన్ సత్యనారాయణ అని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో సచిన్ సత్యనారాయణపై అనుమానం వచ్చి, అతనిని అదుపులోకి తీసుకున్నట్టు కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ అంజయ్య బీబీసీతో చెప్పారు.

నిందితుడి వాంగ్మూలం, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా స్నేహను భర్త సత్యనారాయణే చంపినట్టుగా గుర్తించామని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రెండు ఘటనలే కాదు, కూకట్‌పల్లిలో జరిగిన మరో హత్య కేసు పరిశీలిద్దాం..

నిరుడు ఆగస్టులో కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను పక్కింట్లో ఉండే పద్నాలుగేళ్ల బాలుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలనుకున్న బాలుడిని, ఇంట్లోని బాలిక చూసి అరవడంతో ఆమెను చంపేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఒళ్లు గగుర్పొడిచే ఘటనలివి. ఈ తరహా ఘటనలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అత్యంత క్రూరమైన పాశవిక ఘటనలు జరిగాయి.

ఇందులో ఘటనలు జరిగిన తీరే కాదు.. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తెలంగాణ పోలీసులు

ఫొటో సోర్స్, Telangana police

గతంలో నేరచరిత్ర లేదు..

నిరుడు జనవరిలో హైదరాబాద్ మీర్ పేటలో భార్యను హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. భార్య వెంకట మాధవి శరీర భాగాలను వేరుచేసి భర్త గురుమూర్తి చెరువులో పడేసినట్లుగా అప్పటి రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.

ఈ ఘటనలన్నింటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ గతంలో నేరాలకు పాల్పడినట్లుగా కేసులు నమోదు కాలేదని, వీరంతా మొదటిసారి నేరం చేసినట్లుగా పోలీసులు చెప్పారు.

''గురుమూర్తిపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు'' అని సుధీర్ బాబు వివరించారు.

అదే విధంగా బోడుప్పల్ మర్డర్ కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డిపైనా అంతకుముందు కూడా ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని డీసీపీ పద్మజ అప్పట్లో వివరించారు.

నేరారోపణ ఎదుర్కొంటున్న వారిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా, ప్రస్తుతం వారంతా జైలులో ఉండటంతో వారి వివరణ, నేరానికి గల ఉద్దేశాలు రాయలేకపోతున్నాం.

అయితే, నేరమనస్తత్వం పెరగడానికి సమాజంలో ఉండే అనేక అంశాలు కారణమవుతున్నాయని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్టు ఆరె అనిత.

నేరాలు, తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

94 శాతం మంది మొదటిసారి నేరాలకు పాల్పడేవారు..

తెలంగాణ జైళ్ల శాఖ 2025 నివేదిక ప్రకారం, నిరుడు జనవరి నుంచి డిసెంబరు వరకు నేరారోపణ ఎదుర్కొంటున్న 41,772 మందిని రాష్ట్రంలో వివిధ జైళ్లకు తరలించారు.

వీరిలో 39,320 మంది మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్లినట్లుగా నివేదిక స్పష్టం చేస్తోంది. అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వారిలో 94 శాతం మంది మొదటిసారి నేరానికి పాల్పడిన వారే.

వీరికి ముందుస్తుగా ఎలాంటి క్రైం హిస్టరీ లేదని పోలీసులు చెబుతున్నారు.

జైళ్ల శాఖ గణాంకాల ప్రకారం, రెండు, మూడుసార్లు నేరం చేసి జైలుకు వస్తున్న వారు ఆరు శాతం మంది ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

కూకట్‌పల్లి బాలిక హత్య కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కూకట్‌పల్లి బాలిక హత్యలో సాంకేతిక ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు పాత పద్ధతుల్లో విచారణ చేపట్టారు, కేసును ఛేదించారు. (ఫైల్ ఫోటో)

మొదటిసారి నేరం చేసి జైలుకు వస్తున్నవారే ఎక్కువగా ఉన్నారని జైలు శాఖాధికారులు చెబుతున్నారు.

''మొదటిసారి నేరం చేసి జైలుకు వస్తున్న వారిలో అన్ని రకాల నేరాలకు పాల్పడుతున్న వారూ ఉంటున్నారు. కొన్ని కేసులు తీవ్రమైనవిగా ఉంటున్నాయి. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం.. ఈ తరహా నేర ఘటనలు కనిపిస్తున్నాయి. నేర తీవ్రత కారణంగా ఎక్కువగా హైలైట్ అయ్యాయి'' అని జైళ్ల శాఖకు చెందిన అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

''నేరం చేయడానికి ముందస్తుగా నేరచరిత్ర ఉండక్కర్లేదు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడేవారే ఎక్కువగా ఉంటున్నారు'' అని తెలంగాణ నేరాల పరిశోధన విభాగం అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

క్షణికావేశం, ఆలోచనలోపం, వివాహేతర సంబంధాలు, చిన్న విషయాలకు గొడవలు పడి పెద్దగా చేసుకోవడం.. ఇలాంటి కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తమ విచారణలో తేలిందని సదరు అధికారి వివరించారు.

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో నేరాలు పెరిగాయా..?

తెలంగాణలో నేరాలు పెరిగాయా.. అంటే అంతకుమందు ఏడాది(2024)తో పోల్చితే తగ్గాయని అంటున్నారు తెలంగాణ పోలీసులు.

అయితే, మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్లినవారు మాత్రం ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణ వార్షిక క్రైం రిపోర్టు ప్రకారం, 2024లో 2,34,158 కేసులు నమోదు కాగా, 2025లో 2,28,695 కేసులు నమోదైనట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.

''గతంతో పోల్చితే 2.33శాతం నేరాలు తగ్గాయి'' అన్నారు డీజీపీ.

అయితే, నివేదిక ప్రకారం మాత్రం మహిళలపై జరిగిన నేరాలు పెరిగినట్లుగా స్పష్టమవుతోంది. 2024లో 241 మంది మహిళలు హత్యకు గురికాగా, 2025లో 248 మంది హత్యకు గురైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.

''తెలంగాణలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నేరాలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని రిమాండుకు పంపిస్తున్నాం'' అని చెప్పారు.

జైలు, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

భావోద్వేగాలు నియంత్రించుకోలేకనే…

భావోద్వేగాల నియంత్రించుకోలేని మనస్తత్వం కారణంగా నేరాలకు పాల్పడుతున్నారని సైకాలజిస్టు ఆరె అనిత బీబీసీతో చెప్పారు.

''చుట్టూ ఉండే పరిస్థితులు, స్క్రీన్ పరిస్థితులు కారణమవుతున్నాయి. నేరాలకు పాల్పడుతున్న వారు భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోతున్నారు'' అని చెప్పారు.

చాలా సందర్భాల్లో నేరాలకు పాల్పడిన వారు తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారని చెప్పారు.

చిన్నపిల్లల దశలోనే భావోద్వేగాలు నియంత్రించుకునేలా చేయడం, కోరుకున్నవి దక్కించుకునేందుకు ఏదైనా చేసే మనస్తత్వం వైపు మళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనిత సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)