గండికోట: ఇంటర్ విద్యార్ధిని మృతి కేసు ఇంకా మిస్టరీయే, అసలేం జరిగింది?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

గండికోట
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

కడప జిల్లాలోని గండికోటలో ఇటీవల ఓ ఇంటర్ చదువుతున్న బాలిక మృతి చెందిన ఘటన జరిగి నెలన్నర దాటింది. ఇప్పటికీ ఈ కేసు మిస్టరీ వీడలేదు.

కేసు దర్యాప్తులో ఉందని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతుండగా, మీడియాలో తమపై వచ్చిన తప్పుడు ఆరోపణల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని మృతురాలి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోడానికి బీబీసీ సంఘటనా స్థలానికి వెళ్లింది. మృతురాలి సోదరుడితో, ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న వ్యక్తి బంధువులతో, కడప జిల్లా ఎస్పీతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గండికోట, బాలిక మృతి

కుటుంబం ఏం చెబుతోంది?

బాయ్‌ఫ్రెండ్‌ లోకేశ్‌తో కలిసి గండికోటకు వెళ్లిందని తెలిసి తాము జులై 14న అక్కడకు వెళ్లి వెతికామని, మరుసటి రోజే ఆమె శవమై కనిపించిందని బీబీసీతో చెప్పారు మృతురాలికి సోదరుడి వరసయ్యే కొండయ్య.

మృతురాలి తండ్రికి ముగ్గురు సోదరులు ఉన్నారు. అందులో మొదటి సోదరుడి కుమారుడు కొండయ్య, రెండో సోదరుడి కుమారుడు సురేంద్ర. వీరే ఆమెను చంపించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

వీరిద్దరితో పాటు ప్రియుడు లోకేశ్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు.

‘‘మా తమ్ముడు సురేంద్ర గండికోటకు వెళ్లి చూశాడు. తర్వాత అక్కడ అమ్మాయి కనిపించకపోతే తిరిగొచ్చాడు. అయిదు గంటలకు ప్రొద్దుటూరులో మిస్సింగ్ కేసు పెట్టి, తర్వాత రాత్రి మళ్లీ గండికోటకు వెళ్లి అర్ధరాత్రి ఒంటి గంట వరకు వెతికాం. లోకేశ్ ఉదయం 8 గంటలకు లోపలికి తీసుకెళ్లాడనీ, 10 గంటలకు బయటికి వచ్చాడనీ సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఆ కొండల చుట్టూ వెతికాం. అక్కడ బాడీ కనిపించింది'' అని కొండయ్య వివరించారు.

గండికోట, బాలిక మృతిపై వీడని మిస్టరీ

లై డిటెక్టర్ పరీక్షలకూ సిద్ధం

మీడియా తప్పుడు ప్రచారాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మృతురాలి సోదరుడు కొండయ్య చెప్పారు.

''లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమే అని కోర్టులో కూడా చెప్పాం. పోలీసులను అడిగి మీడియా వాళ్లు ఏమైనా ప్రచురించాలి. కానీ మా వెర్షన్ వేయకుండా ఆధారాలు ఏవీ లేకుండా అన్నలే చంపారు అని ప్రచారం చేయడంతో మేం ఇబ్బంది పడుతున్నాం'' అని ఆయన అన్నారు.

గండికోట, సీసీటీవీ ఫుటేజీ

''మాకు ఎవరి సపోర్ట్ లేదు''

చెల్లెలిని గండికోటకు తీసుకెళ్లిన లోకేశ్‌ను పోలీసులు వెనకేసుకు వస్తున్నారని కొండయ్య ఆరోపించారు.

''అతని పాత్ర కచ్చితంగా ఉంది. అతను గంజాయి తాగుతాడు, మందు తాగేవాడు. అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అతని వెనక ఎవరున్నారో ఏమో తెలియదు. పోలీసులు అతని తప్పేమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మాకు ఎటువంటి రాజకీయ మద్దతు లేదు''అని అన్నారు.

లోకేశ్ బలవంతం వల్లే తమ చెల్లెలు అతని ప్రేమలో పడిందని కొండయ్య ఆరోపించారు.

''‘నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చచ్చిపోతాను. దాంతో మీ అన్నలపైన కేసులు పెడతారు' అని అతడు బెదిరించాడు. మరో అమ్మాయితో కూడా ఆ అబ్బాయికి ప్రేమ వ్యవహారం ఉంది. మేం రెండుసార్లు అబ్బాయిని మందలించాం. అతని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మా ఫ్యామిలీని కూడా ప్రొద్దుటూరుకి మార్చాం'' అని కొండయ్య వివరించారు.

మృతురాలిది కడప జిల్లా జమ్మలమడుగు మండలం హనుమనగుత్తి. కొంతకాలం కిందట వీరి కుటుంబం ప్రొద్దుటూరికి మకాం మార్చింది. విద్యార్థిని చనిపోయే ముందు అక్కడి నుంచే వెళ్లింది.

ప్రొద్దుటూరులోని వీరు నివాసం ఉండే ప్రాంతానికి కూడా బీబీసీ వెళ్లింది. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మృతురాలి అన్న కొండయ్య ఫోన్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఆయనను కలిసే ప్రయత్నం చేసినా వారు కలవడానికి అంగీకరించలేదు.

గండికోట, బాలిక మృతి

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ కేసులో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, అసలు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''ఆ రోజు వచ్చిన టూరిస్టులందరినీ విచారించాం. పోస్టుమార్టం రిపోర్టులోనూ, ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టు ప్రకారం చూస్తూ, లైంగిక దాడి జరిగిన దాఖలాలు లేవు. ఎంక్వైరీ చేస్తున్నాం'' అని బీబీసీకి వివరించారు ఎస్పీ అశోక్ కుమార్.

ప్రాథమిక దర్యాప్తులో విద్యార్ధిని మృతితో లోకేశ్‌కు సంబంధం ఉన్నట్లుగా ఇంకా తేలలేదని, మరోవైపు యువతి సోదరుడు సురేంద్ర, అమ్మాయిని వెతకడానికి వెళ్లి 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చినట్లుగా తమకు సీసీటీవీ ఫుటేజీ లభించిందని అశోక్ కుమార్ చెప్పారు.

''లోకేశ్‌ను ప్రశ్నించాం. వాళ్లిద్దరూ కలిసి గండికోటకు వెళ్లారు. అతను తిరిగి వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డయింది. ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక దర్యాప్తులో అతను నేరం చేసినట్లుగా బలమైన ఆధారాలు దొరకలేదు. అతను బయటికి వచ్చిన తర్వాత వాళ్ల కజిన్ ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్లినట్లుగా సీసీటీవీలో కనిపించింది. 20 నిమిషాల తర్వాత అతను బయటకు వచ్చారు. ఎందుకు వెళ్లాడు? ఆ టైంలో ఏం చేశాడు? అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది'' అని ఎస్పీ వివరించారు.

గండికోట

ఫొటో సోర్స్, UGC

కుటుంబ సభ్యులపై అనుమానం

ఈ కేసులో బాలిక కుటుంబ సభ్యులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వివరించారు. లివర్‌కు తీవ్ర గాయం కావడం వల్లే బాలిక మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు.

''లై డిటెక్టర్ పరీక్ష కోసం బాలిక కుటుంబీకులకు నోటీసులు పంపించాం. అందులో ఏమైనా తెలిస్తే ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల అమ్మాయి చనిపోయింది. లివర్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎవరు చేసి ఉండొచ్చు? అనేదానిపై ఎంక్వైరీ జరుగుతోంది. రెండేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. అమ్మాయి కుటుంబానికి ఈ విషయం తెలుసు. కుటుంబంలో జరిగిన సంఘటనలు ఏమైనా దీనికి దారితీశాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నాం. మాపై రాజకీయ, ఇతర ఒత్తిళ్లు ఏమీ లేవు'' అని ఎస్పీ తెలిపారు.

లోకేశ్ చిన్నాన్న రాజశేఖర్‌తో కూడా బీబీసీ మాట్లాడింది.

‘‘లై డిటెక్టర్ టెస్ట్ కోసం మమ్మల్ని పిలిచారు. మేం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. లోకేశ్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. చట్టాన్ని మేం నమ్ముతున్నాం. మా వాడు ఏ తప్పూ చేయలేదు’’ అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)