డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్: అమెరికా రక్షణరంగం పేరు మార్చుతున్న ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్డ్ డెబూస్‌మన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రక్షణ విభాగం పేరును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మార్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ పేరును డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌గా మారుస్తూ ఆదేశాలిచ్చారు.
దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయనున్నారు. రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌ను ఇక నుంచి సెక్రటరీ ఆఫ్ వార్‌గా పిలుస్తారు.
అమెరికా భద్రత విభాగాన్ని పర్యవేక్షించే పెంటగాన్.. వార్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకివస్తుంది. 1789లో మొదట వార్ డిపార్ట్‌మెంట్‌ను కేబినెట్ స్థాయి ఏజెన్సీలా స్థాపించారు. 1947 వరకు ఇది ఉనికిలో ఉంది.
ఎగ్జిక్యూటివ్ డిపార్ట్‌మెంట్‌లను ఏర్పాటుచేసే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌కే ఉంటుంది. అంటే డిపార్ట్‌మెంట్ పేరు లీగల్‌గా మార్చడానికి సవరణ అవసరం.


ఫొటో సోర్స్, Getty Images
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏముందంటే...
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఉన్న విషయాన్ని బీబీసీ పరిశీలించింది.
''డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌తో పోలిస్తే డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్.. 'సంసిద్ధంగా ఉన్నాం, సంకల్పంతో ఉన్నామనే బలమైన సందేశాన్ని పంపిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ రంగ సామర్థ్యాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది.
శక్తిని, సంకల్పాన్ని తెలియజేసేలా డిఫెన్స్ సెక్రటరీ, ఆయన విభాగం, ఇతర అధికారులు కొత్త పేర్లు ఉపయోగించాలి'' అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఉంది.
శాశ్వతంగా పేరు మార్చడానికి అవసరమైన పరిపాలన, న్యాయపరమైన చర్యలు సూచించాలని కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో హెగ్సెత్‌ను ఆదేశించారు. ఎందుకంటే కాంగ్రెస్ ఆమోదముద్ర లేకుండా డిపార్ట్‌మెంట్ పేరును ట్రంప్ మార్చలేరు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను జార్జి వాషింగ్టన్ స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాని పేరు మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు మార్పుకు ఎంత ఖర్చవుతుందంటే...
పేరు మార్చడం వల్ల జాతీయ అవసరాలపై మరింతగా దృష్టిపెట్టామని, దేశ ప్రయోజనాల కోసం యుద్ధం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్న సంకేతాలు వెళ్తాయని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఉంది.
శాశ్వతంగా కొత్త పేరును మార్చడానికి ఎంత వ్యయం అవుతుందో ఇంకా వైట్‌హౌస్ వెల్లడించలేదు. అయితే వందలాది సంస్థలు, ఎంబ్లమ్‌లు, ఈ మెయిల్ అడ్రస్‌లు, యూనిఫారమ్‌లను మార్చానికి బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని అమెరికా మీడియా అంచనావేస్తోంది. ఖర్చులను, వృథాను తగ్గించాలన్న పెంటగాన్ ప్రయత్నాలపై ఇది ప్రభావం చూపే అవకాశముంది.
రక్షణ విభాగం పేరు మార్పు ఆలోచనను ట్రంప్ పదే పదే చెప్తున్నారు. ఆ పేరుతో రెండు ప్రపంచయుద్ధాల్లో అమెరికా అద్వితీయ విజయాలు సాధించిన చరిత్ర ఉందని వాదిస్తున్నారు.
ఈ మార్పుకు కాంగ్రెస్ సభ్యులు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
''మనకు అవసరమైతే కాంగ్రెస్ అందుకు ఒప్పుకుంటుందని నేను చెప్పగలను. దాని అవసరముంటుందనుకోను. కానీ మనకు అవసరమైతే కాంగ్రెస్ అది చేస్తుంది'' అని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా మిలటరీ పరేడ్‌కు బదులిచ్చేలా...
''యుద్దం, యుద్ధ తత్వంపై డిపార్ట్‌మెంట్ మళ్లీ దృష్టిపెట్టేలా చేయాలని ట్రంప్, హెగ్సెత్ భావిస్తున్నారు.
కాగా.. నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నారన్న వాదనను గురువారం(సెప్టెంబరు 4) ట్రంప్ తోసిపుచ్చారు.
''నేను చేయగలిగిందంతా యుద్ధాలను ఆపివేయడం'' అని బీబీసీ అమెరికా పార్ట్‌నర్ సీబీఎస్ న్యూస్‌తో ట్రంప్ చెప్పారు. ''నేనందరి దృష్టినీ ఆకర్షించాలనుకోవడం లేదు. ప్రాణాలను కాపాడాలని మాత్రమే అనుకుంటున్నా'' అని ట్రంప్ చెప్పారు.
పేరు మార్చుతూ ట్రంప్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 200వ పరిపాలక ఉత్తర్వు.
ఈ పేరు మార్పు ఊహించిందయినప్పటికీ చైనా భారీ పరేడ్ జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. పరేడ్‌లో చైనా కొత్త ఆయుధాలను, డ్రోన్లను, ఇతర యుద్ధపరికరాలను ప్రదర్శించడం అమెరికాకు, దాని మిత్రదేశాలకు స్పష్టమైన సందేశంగా భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














