భారత్, చైనా, రష్యా: ఈ మూడుదేశాలు ఏకతాటిపైకి రావడం అమెరికాకు ఎలాంటి సందేశం?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఓస్మాండ్ చియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తియాంజిన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం మూడు దేశాల మధ్య అరుదైన ఐక్యతను ప్రదర్శించింది. పుతిన్‌కు తన ప్రధాన చమురు కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడే అవకాశం లభించింది.
యుక్రెయిన్‌పై 2022లో దాడి తర్వాత పశ్చిమ దేశాలు మాస్కోతో వాణిజ్యాన్ని నిలిపివేసినప్పటి నుంచి భారత్, చైనా రష్యా చమురును తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు, ఈ మూడు దేశాలు తమ రాజకీయ సంబంధాలను మరింతగా పెంచుకున్నాయి.
వారికిప్పుడు ఉన్న ఏకైక ప్రత్యర్థి అమెరికా. రష్యాపై వాషింగ్టన్ ఆంక్షలు విధించింది. దాని వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలను విధించింది.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఇప్పటికే అదనపు సుంకాలు విధించింది. ఇక, చైనా తన చమురు కొనుగోళ్లకు మరిన్ని సుంకాలు, ఆంక్షలను నివారించడానికి అమెరికాతో ఇప్పటికీ చర్చలు జరుపుతోంది.
పశ్చిమ దేశాల వైఖరికి భిన్నంగా ప్రపంచ దృష్టికోణాన్ని ప్రోత్సహించే ప్రాంతీయ వేదిక అయిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ఈ నాయకులు సమావేశమయ్యారు.
ఈ ఫోరమ్ అమెరికా ప్రభావానికి సవాలుగా పరిగణించవచ్చని, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలో సంబంధాలను బలోపేతం చేయడానికి ముగ్గురు నాయకులకు అవకాశం ఇస్తుందని విశ్లేషకులు బీబీసీతో అంటున్నారు.


ఫొటో సోర్స్, Reuters
రష్యాకు జీవనాధారం
రష్యా ఇప్పుడు దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనాలతో వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. యుక్రెయిన్ యుద్ధంతో పాశ్చాత్య మార్కెట్ల నుంచి దూరమైన తర్వాత ఈ రెండు దేశాలు మాస్కో ఆర్థిక వ్యవస్థ మనుగడకు సహాయపడ్డాయి.
చైనా10 కోట్ల టన్నులకు పైగా రష్యన్ ముడి చమురును 2023లో కొనుగోలు చేసింది. ఇది దాని మొత్తం ఇంధన దిగుమతుల్లో దాదాపు 20 శాతం. గతంలో చాలా తక్కువగా కొనుగోలు చేసిన భారత్, 2022 నుంచి దాదాపు రూ. 12.3 లక్షల కోట్ల విలువైన రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. నేడు, చైనా, భారత్ కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
చమురు, గ్యాస్ అమ్మకాలు రష్యా బడ్జెట్‌లో నాలుగింట ఒక వంతు ఉన్నాయి. ఇది దాని యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికి సహాయపడుతుంది. వాణిజ్యాన్ని పెంచుకునేందుకు భారత్, చైనాలకు మాస్కో మరిన్ని తగ్గింపులు ఇవ్వవచ్చని పబ్లిక్ పాలసీ ఎక్స్‌పర్ట్ మందర్ ఓక్ బీబీసీతో చెప్పారు.
రష్యన్ దిగుమతులను తగ్గించాలని అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతదేశానికి ఇది చాలా ముఖ్యమైనది కావొచ్చని అడిలైడ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన ఓక్ అన్నారు.
పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురుకు మార్గాలు తగ్గిన సమయంలో, ఆ సరఫరా దాదాపు అంతా భారత్‌కి మళ్లింది. దీని వల్ల రష్యాకు ఆదాయం లభించగా, భారత్‌కు చౌక ధరలకు ఇంధనం లభించి లాభం చేకూరింది. ఈ మార్పిడి రష్యాకు ఒక విధంగా ప్రాణదానంగా మారింది. ఇప్పుడు, అమెరికా విమర్శలను ఎదుర్కొంటూ దిల్లీ తన కొనుగోళ్లను పెంచవచ్చు.
సోమవారం పుతిన్‌తో నరేంద్ర మోదీ తన సంబంధాలను పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు 'భుజం భుజం కలిపి నడిచాయి' అన్నారు. 'ఉత్తమ ఒప్పందం' ఎక్కడ లభిస్తుందో అక్కడి నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని భారత అధికారులు తెలిపారు.
రష్యా చమురు కొనుగోలు చేసినందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం 25 శాతం సుంకాన్ని విధించిన తర్వాత భారత్, అమెరికాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా తగ్గాయి. భారత్, శ్వేతసౌధం చర్యను "అన్యాయమైనది"గా అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Reuters
మోదీ ఇమేజీ పెరుగుతుందా?
అమెరికా ఒత్తిడికి తలొగ్గకపోవడమనేది దిల్లీలో ప్రధాని మోదీ ఇమేజ్ పెంచుతుంది.
'అమెరికాను ధిక్కరించడం మోదీకి రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది' అని ప్రొఫెసర్ ఓక్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, వాషింగ్టన్‌కు భారత్ తలొగ్గదని ఇది సంకేతాన్ని పంపుతుందని స్పష్టంచేశారు.
విదేశీ ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడటం కంటే రష్యా నుంచి కొనడం భారత్‌కు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
చమురు కోసం ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలపై భారత్ ఆధారపడింది. కానీ, 2022లో యుక్రెయిన్ యుద్ధం, మాస్కోపై పశ్చిమ దేశాల ఆంక్షల తర్వాత, భారత్ చౌకైన రష్యన్ చమురు వైపు మళ్లింది.
ఇది భారత శుద్ధి కర్మాగారాలకు ఖర్చులను తగ్గించుకోవడానికి వీలు కల్పించింది. ఎందుకంటే రష్యన్ సరఫరాలు మిడిల్ ఈస్ట్ దేశాల కంటే తక్కువ ధరకు ఉంటాయి.
చైనా కూడా రష్యా చమురు కొనుగోళ్లను పెంచిందని, తన ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవాలని కోరుకుంటుందని ట్రేడ్ పాలసీ ఎక్స్‌పర్ట్ పీటర్ డ్రేపర్ చెప్పారు.
చైనాకు సరఫరాలను పెంచడానికి రష్యన్, చైనా గ్యాస్ కంపెనీలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, భారత్‌కు మరిన్ని అమ్మకాలు వెళితే చైనాకు రష్యా అదే తగ్గింపులను ఇవ్వకపోవచ్చని డ్రేపర్ అభిప్రాయపడ్డారు.
అమెరికాకు ప్రత్యామ్నాయమని చాటిచెప్పడమేనా?
వాణిజ్యాన్ని మించి, చైనా ప్రధాన లక్ష్యం అమెరికాకు బలమైన ప్రత్యామ్నాయంగా ఉండగలదని ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో చాటిచెప్పడమేనని ప్రొఫెసర్ డ్రేపర్ అభిప్రాయపడ్డారు.
ఈ ఫోరమ్‌లో పాకిస్తాన్, మియన్మార్, శ్రీలంక వంటి దేశాలతో చైనా నిలబడుతుంది. ఇవన్నీ ట్రంప్ సుంకాలను ఎదుర్కొన్నాయి.
చైనా చాలాకాలంగా 'మల్టీ పోలార్' వరల్డ్ ఆర్డర్ కోసం ప్రయత్నం చేస్తోందని ప్రొఫెసర్ అంటున్నారు. ఈ విధానంలో అనేక ప్రధాన దేశాల మధ్య అధికార పంపిణీ ఉంటుందని డ్రేపర్ వివరించారు.
భారత్, రష్యా, చైనా ఆర్థిక సంబంధాలు రాజకీయాల కారణంగా తరచుగా సంక్లిష్టంగా మారాయని కానీ, ఈ శిఖరాగ్ర సమావేశం వారిని ఒక్కచోటికి చేర్చిందని ప్రొఫెసర్ ఓక్ అన్నారు.
అమెరికా సుంకాలతో బెదిరిస్తుండటంతో మూడు దేశాలు ఇప్పుడు "కలిసి పనిచేయడానికి బలమైన ఆర్థిక కారణాలు" ఉన్నాయని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














