అస్సాంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది ఎవరిని? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమా హసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అస్సాంలో ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలనే ప్రచారం కొంతకాలంగా వార్తల్లో ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జూన్ నుంచి దీనిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు.

ఎగువ అస్సాంలోని గోలాఘాట్ జిల్లా దీనికి కేంద్రంగా ఉంది. ఈ జిల్లాలో దాదాపు 1,500 కుటుంబాలను ఖాళీ చేయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

దీనికి అస్సాం ప్రభుత్వం రెండు కారణాలను చెబుతోంది. మొదటిది- అక్రమ ఆక్రమణదారుల తొలగింపు, రెండోది- తూర్పు అస్సాం జనాభాలో జరుగుతున్న మార్పులు.

అయితే, అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బెంగాలీ మాట్లాడే ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటోందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింల సంఖ్య పెరుగుదలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం చెబుతోంది.

జూన్ నెల నుంచే, రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో చాలా కుటుంబాలకు ఖాళీ చేయాలంటూ నోటీసులిస్తోంది.

ఇళ్లు ఖాళీ చేయడానికి వారికి 7 రోజుల సమయం ఇస్తున్నారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం బుల్డోజర్‌తో వారి ఇళ్లను కూల్చివేస్తోంది.

2021వ సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.2 లక్షలకు పైగా బిఘాల(భూమిని బిఘాలలో కొలుస్తారు) భూమిని ఇలా తిరిగి తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అయితే, ప్రభుత్వం చేస్తున్న ఈ వాదనలో ఎంత నిజముందో, దీనివల్ల ఎన్ని కుటుంబాలు ప్రభావితమయ్యాయో బీబీసీకి కచ్చితమైన సమాచారం లభించలేదు.

దశాబ్దాల నాటి ఇళ్ల నుంచి కుటుంబాలతో సహా బలవంతంగా వెళ్లిపోతున్న వారు తమ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయని అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Rubaiyat Biswa

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ నోటీసులతో ఇల్లు ఖాళీ చేసి బంధువుల ఇంటికి వచ్చామని అమీనా చెప్పారు.

నిరాశ్రయ కుటుంబాల పరిస్థితి ఏంటంటే..

18 ఏళ్ల అమీనా ఖాతూన్.. ఉరియమ్‌ఘాట్‌లోని రెంగ్మా ఫారెస్ట్ రిజర్వ్‌లో పెరిగారు. ఖాళీ చేయాలంటూ ఆమె కుటుంబానికి జూన్ 21న నోటీసు అందింది.

బుల్డోజర్ రావడానికి ముందు రోజు, ఆమె కుటుంబం తమ ఇంటిని వదిలి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

''ముస్లిం కావడమే మా తప్పు. ఇంకేముంది? మేం మనుషులం కాదా'' అని ఆమె ప్రశ్నించారు.

అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను సాధారణంగా 'మియా ముస్లింలు' అని పిలుస్తారు. దీనిని ఓ రకమైన అవమానంగా కూడా భావిస్తారు.

అస్సాం స్థానిక ముస్లింలను తమ కార్యక్రమంలో లక్ష్యంగా చేసుకోలేదని, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లింల సంఖ్య పెరుగుతుండడాన్ని ఆపడమే తమ ఉద్దేశమని హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే చెబుతోంది.

అయితే, జనాభా లెక్కల డేటా లేకపోవడంతో, బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వచ్చే ముస్లింల సంఖ్య పెరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

"నాకు చాలా బాధగా ఉంది. నాన్న అక్కడే పెరిగారు. నేను కూడా అక్కడే పుట్టాను. ఈ భూమి మా నాన్నదని నేను అనుకున్నా" అని అమీనా బీబీసీతో చెప్పారు.

"ఇది ప్రభుత్వ భూమి అని మాకు తరువాత తెలిసింది. మా నాన్న అక్కడ వ్యవసాయం చేసేవారు. నేను ఎప్పుడు డబ్బులడిగినా నాన్న ఇచ్చేవారు. ఇప్పుడు నేను అడగను. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇక ఎలా అడగగలను?'' అని ఆమె అన్నారు.

అమీనాలానే ఉరియమ్‌ఘాట్ గ్రామం నుంచే 20 ఏళ్ల కరీముల్ హక్ కూడా జూలైలో తన తల్లిదండ్రులతో వచ్చేశారు.

మిగిలిన డబ్బుతో కరీముల్ కుటుంబం ఇప్పుడు కొత్త ఇంటిని కట్టుకుంటోంది. ఇది ఒక గది ఉండే ఇల్లు.

ఖాళీ చేయించిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

"నాన్న అక్కడ వ్యవసాయం చేసేవారు, డబ్బులు సంపాదించేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ మంచి ఆహారం, నీళ్లు ఉండేవి. ఇక్కడ అవి సాధ్యం కావు'' అని కరీముల్ చెప్పారు.

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇల్లు విడిచి వెళ్లడానికి వారం రోజులు గడువిస్తున్నారు.

"మేం ఉరియమ్‌ఘాట్‌లో వ్యవసాయం చేసేవాళ్లం. మాకు పండ్ల తోటలుండేవి. నేను అక్కడ 36 సంవత్సరాలు ఉన్నాను. ఆ ప్రాంతమంటే నాకు చాలా ఇష్టం. ఆ స్థలం కోసం నా మనసు ఘోషిస్తోంది. నేను చనిపోయే దశలో ఉన్నాను" అని కరీముల్ తండ్రి హష్మత్ అలీ అన్నారు.

అవసరమైన అన్ని పత్రాలు ఉన్న వారిని ఇలా నిరాశ్రయులను చేయడంపై ప్రభుత్వం ఆలోచించాలని కరీముల్ తల్లి జుబైదా ఖాతూన్ అంటున్నారు.

"మా ఓటరు కార్డు ఉంది. ఆధార్ కార్డు చిరునామా, జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ) కూడా ఒకే చోట ఉంది. మొత్తం ఒకే చోట ఉన్నాయి. ప్రభుత్వానికి మేం నచ్చకపోతే మాకు ఇల్లు ఇచ్చి ఉండకూడదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఇచ్చి ఉండకూడదు" అని ఆమె అన్నారు.

"ఇదే ప్రాంతంలో బోడోలు, గిరిజనులు, నేపాలీలు, అస్సామీలు కూడా ఉన్నారు. ముస్లింలు మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ముస్లింలను మాత్రమే ఎంపిక చేసి బహిష్కరించారు" అని అమీనా ఆరోపించారు.

ప్రభావిత ప్రాంతాల్లో బీబీసీ బృందం పరిశీలనకు అనుమతించని ప్రభుత్వం

ఖాళీ చేయించడం వల్ల ప్రభావితమైన వారి పరిస్థితిని తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది, కానీ గోలాఘాట్ జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాల్లోకి (ఇవి రక్షిత అటవీ ప్రాంతాలు కూడా) ప్రవేశించడానికి మమ్మల్ని అనుమతించలేదు.

బీబీసీ బృందం ఉరియమ్‌ఘాట్‌లోని 'ఎవిక్షన్ డ్రైవ్' (తొలగింపు ) చేపట్టిన ప్రాంతాలను సందర్శించడానికి ప్రయత్నించిందని ఆగస్ట్ 18న జరిగిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి బీబీసీ బృందాన్ని తాను అనుమతించలేదని శర్మ చెప్పారు.

''ఈ సమస్యలను ఏ వ్యక్తి లేదా గ్రూప్ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అనుమతించబోం'' అని ఆయన అన్నారు.

దీంతో ఒక కమ్యూనిటీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారనే అమీనా ఆరోపణలను బీబీసీ నిర్ధరించలేకపోయింది.

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూల్చివేసిన ఇంటి బయట కూర్చున్న మహిళ

నెరవేరని యువత కలలు

తొలగింపు కార్యక్రమానికి ముందు అమీనా, కరీముల్ గోలాఘాట్ జిల్లాలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. తాను డాక్టర్ కావాలని, కరీముల్ టీచర్ కావాలని భావించామని అమీనా చెప్పారు. కానీ, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిరావడంతో వారు తమ చదువు ఆపేశారు.

"డాక్టర్ కావాలనేది నా కల. కానీ, ఇప్పుడు నాకు డాక్టర్ ఎలా అవ్వాలో తెలియదు. నా దగ్గర తిండికి కూడా డబ్బులు లేవు, ఇక కాలేజీలో ఎలా చేరాలి? అమ్మాయిని చదివించాలి, ఆమె పెద్దవుతోంది, ఆమె ఏదో ఒకటి చేస్తుందని నాన్న అనుకునేవారు" అని అమీనా చెప్పారు.

కరీముల్ అస్సామీ భాష చదువుతున్నారు. ఆయన కాలేజ్ చదువు పూర్తి కావొచ్చింది. తొలగింపు డ్రైవ్ కారణంతో ఆయన చదువు మానేయాల్సి వచ్చింది.

ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి రావడంతో, తన హాస్టల్, పుస్తకాలు, తిండి ఖర్చులను భరించడం తన తల్లిదండ్రుల వల్ల కాదని, అందుకే తాను చదువు మానేయాల్సి వచ్చిందని కరీముల్ చెప్పారు.

" అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే, హాస్టల్‌లో ఉండటానికి డబ్బు కావాలి" అమ్మ ఒక్కటే చెప్పింది, అప్పుడు మన పరిస్థితి బాగుంది. ఇప్పుడు దారుణంగా ఉంది" అని కరీముల్ అన్నారు.

"తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకోవద్దని ఎప్పటికీ చెప్పరు. తమ పిల్లలు బాగా రాణించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. చదువుకుని నా తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలనేది నా కల."

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

ఫొటో క్యాప్షన్, అవసరమైన అన్ని పత్రాలున్నప్పటికీ తమను ఖాళీ చేయించారని బాధితులు అంటున్నారు.

ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు

అస్సాంలో తొలగింపు కార్యక్రమం వల్ల ప్రభావితమైన కుటుంబాల తరఫున గౌహతి హైకోర్టులో వాదిస్తున్న మానవ హక్కుల న్యాయవాది ఏఆర్ భూయియాన్, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

"వీళ్లు 50 నుంచి 70 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం అప్పుడు నిద్రపోతోంది, ఇప్పుడు ఎందుకు మేల్కొంది?'' అని ఆయన అడుగుతున్నారు.

బంగ్లాదేశ్ నుంచి ఎవరు, ఎప్పుడు వచ్చారో నిరూపించడానికి కచ్చితమైన విధానం లేదని ఆయన అంటున్నారు.

"ఎలాంటి రికార్డులూ లేవు. ప్రతిదీ ఊహాగానాలపై ఆధారపడి ఉంటుంది. దుస్తులు, రంగు లేదా మతం ఆధారంగా బలవంతంగా ఖాళీ చేయించడం జనాభాను నియంత్రించే మార్గం కాదు. మనం భావోద్వేగాల ప్రకారం కాదు, చట్టపరమైన పాలన కింద జీవిస్తున్నాం" అని ఏఆర్ భూయియాన్ అన్నారు.

అదే సమయంలో, బయటి నుంచి వచ్చి వ్యక్తులు స్థిరపడడం వల్ల అస్సామీ హిందువుల జనాభా తగ్గుతోందని అస్సాం ప్రభుత్వం వాదిస్తోంది.

"అస్సామీ ముస్లింలు ఎప్పుడూ ఏ స్థలాన్నీ ఆక్రమించరు. కానీ, ఇక్కడికి వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు భూమిని ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు" అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నసింగ్ బీబీసీతో చెప్పారు.

"వీరు బంగ్లాదేశ్‌తో కలిసి గ్రేటర్ మియన్మార్‌ కావాలని కలలు కన్నారు. ఇది ప్రణాళికాబద్దంగా సాగుతున్న ఉద్యమం, వలస. జనాభా సమతుల్యత దెబ్బతింటోంది. ఒక నియోజకవర్గ ఓటు బ్యాంక్ పెరుగుతోంది."

అయితే, బంగ్లాదేశ్ మూలాలు కలిగిన వారు రాష్ట్రంలోకి ఎంతమంది వస్తున్నారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. కానీ ఈ సమస్య కారణంగా స్థానిక అస్సామీలు, చాలా కాలం క్రితం వచ్చిన బెంగాలీ మాట్లాడే వలసదారుల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది.

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త ఆరోపిస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది?

అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు 1891 అస్సాం అటవీ నిబంధన, 1995 చట్ట సవరణ ప్రకారం జరుగుతున్నాయి.

అటవీ, ప్రభుత్వ భూమిని తిరిగి తీసుకునే అధికారం ఈ చట్టం ప్రభుత్వానికి ఇస్తుంది. అస్సాం ల్యాండ్ రికార్డ్స్ మాన్యువల్‌లోని రూల్ 18(2) ప్రకారం తొలగింపుకు నోటీసు, విచారణ అవసరం.

ఈ చట్టం, 2005 సంవత్సరానికి ముందు స్థిరపడిన వారికి, భూమిపై చెల్లుబాటయ్యే లీజు ఉన్నవారికి భూమి హక్కులను కల్పిస్తుంది.

ఆగస్టులో, గౌహతి హైకోర్టు అటవీప్రాంతం నుంచి నివాసితుల తొలగింపు కార్యక్రమాన్ని సమర్థించి, ఏడు రోజుల్లోగా ప్రజలు ఆ భూమిని ఖాళీ చేయాలని ఆదేశించింది.

కానీ దీనికి సంబంధించిన మరో కేసులో, గోలాఘాట్ జిల్లాలో 'యథాతథ స్థితి'ని కొనసాగించాలని ఆగస్టు 22న సుప్రీం కోర్టు ఆదేశించింది.

అక్రమ వలసదారుల నుంచి నిజమైన ప్రజల వనరులను కాపాడటమే ఈ డ్రైవ్ ఉద్దేశం అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ తొలగింపు కార్యక్రమాలు చట్టప్రకారం జరుగుతున్నాయని, ఎలాంటి మతపరమైన వివక్ష లేకుండా ప్రజల ఉపయోగం కోసం భూమిని తిరిగి తీసుకుంటామని తెలిపింది. అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం గిరిజనులకు రక్షణ ఉండడంతో వారిని ఖాళీ చేయించడం లేదు.

అస్సాం, బంగ్లాదేశ్, వలసలు, ఆక్రమణ

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

"ఇక్కడ మైనారిటీ ప్రజలు మాత్రమే కాదు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ మైనార్టీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2026 ఎన్నికల కోసమే బీజేపీ ఇప్పుడు ఇలా చేస్తోంది" అని గోలాఘాట్ జిల్లాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఆకాశ్ దావో బీబీసీతో అన్నారు.

"పదేళ్ల క్రితం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజలకిచ్చిన వాగ్దానాలకు బీజేపీ క్రెడిట్ తీసుకోదు (ఎందుకంటే ఆ హామీలు నెరవేరలేదు). ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మతతత్వ అంశాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలు మాత్రమే వారికి అవసరం" అని అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత్ సైకియా బీబీసీతో చెప్పారు.

"వారిలో ఒక రకమైన భయం ఉంది. అందుకే అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి పౌరసత్వాన్ని విచారించాలన్నది మా డిమాండ్. వారు విదేశీయులైతే వారిని దేశం నుంచి పంపించివేయాలి. కానీ, ప్రభుత్వం గణాంకాలను మాత్రమే ఇస్తుంది" అని దేబబ్రత్ అన్నారు.

"దురదృష్టవశాత్తూ ఇది మైనారిటీలను, కొన్ని గిరిజన వర్గాలను మాత్రమే ప్రభావితం చేస్తోంది. వారు ఎవరినీ నిర్బంధ శిబిరాలకు పంపడంలేదు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించడం లేదు. చాలా మంది భూమి లేనివారు... నిజానికి వారికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలి, కానీ వారికి ఈ హక్కు కూడా అమలు కావడం లేదు" అని తెలిపారు.

"వారిని ఖాళీచేయించిన వెంటనే, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసివేస్తాం" అని ముఖ్యమంత్రి ఆగస్టు 24న అన్నారు.

అయితే, అవసరమైన పత్రాలు ఉన్నప్పటికీ, అమీనా, కరీముల్ వంటి వందలాది కుటుంబాల జీవితాలు సుడిగుండంలో చిక్కుకున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)