CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా?

సీఏఏ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ తమిళ్

దేశంలోని కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని ప్రకటించాయి. అయితే, పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ ​అధికార పరిధిలోకి వస్తుంది కదా, మరి అది సాధ్యమేనా?

పౌరసత్వ సవరణ చట్టం-2019ను భారత పార్లమెంట్ ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధించిన నిబంధనలు నోటిఫై చేసింది.

ఈ చట్టం ప్రకారం 2014కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ, జైన మతాలకు చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వారు భారత్‌లోకి ప్రవేశించినట్లుగా నిరూపించే ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అందించాల్సిన పత్రాలను సెక్షన్ 1ఏ, సెక్షన్ 1బీ విభాగాల్లో పొందుపరిచారు.

1ఏ పత్రాలలో జనన ధ్రువీకరణ, అద్దె ఒప్పంద పత్రం, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు జారీ చేసిన విద్య సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

1బీ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన వీసా, పాన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, సెన్సస్ ఎన్‌రోల్‌మెంట్ అడ్మిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్డులు పేర్కొన్నారు.

ఈ పత్రాలు 2014కి ముందే తీసుకొని ఉండాలి.

ఈ పత్రాలు అందుబాటులో ఉంటే, ఈ మూడు దేశాల ప్రజలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనికోసం https://indiancitizenshiponline.nic.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్‌లను కూడా అప్‌లోడ్ చేయాలి.

స్టాలిన్

ఫొటో సోర్స్, MK STALIN / FACEBOOK

తమిళనాడులో అమలు చేయం: స్టాలిన్

కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, సెక్యులర్ జనతాదళ్‌లు కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఈ చట్టానికి మద్దతిచ్చిన అన్నాడీఎంకే, ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.

కొన్ని వారాల క్రితం కేంద్రమంత్రి శంతను ఠాకూర్ పౌరసత్వ సవరణ చట్టం కొన్ని వారాల్లో అమలులోకి వస్తుందని చెప్పినప్పుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ వారి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయబోమని తెలిపారు.

పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

కేరళ సీఎం ఏమంటున్నారు?

పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నిబంధనలు సోమవారం నోటిఫై చేసిన తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం చాలాసార్లు పేర్కొంది. మేం ఆ వైఖరిని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ మతతత్వ, వేర్పాటువాద చట్టాన్ని వ్యతిరేకించడానికి కేరళ ఐక్యంగా వ్యవహరిస్తుంది" అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పినరయి విజయన్ ప్రకటించారు.

అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని చెప్పారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, NURPHOTO

హక్కులు కోల్పోతారంటున్న బెంగాల్ సీఎం

బెంగాల్‌ను విభజించడానికి ఆడే మరొక ఆటే ఈ సీఏఏ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

''దీనిని మేం జరగనివ్వం. అందరం పౌరులమే" అని ఆమె అన్నారు.

ఇది "పౌరసత్వ హక్కులను హరించే" కుట్ర అని తృణమూల్ అధినేత్రి ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై అనుమానం ఉందన్నారు.

చట్టంలో స్పష్టత లేదని, ఇది తప్పుదోవ పట్టించే విధానమని మమత ఆరోపించారు.

"సీఏఏ మీకు హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మరుక్షణం మీరు అక్రమ వలసదారులుగా మారుతారు, మీ హక్కులను కోల్పోతారు. మిమ్మల్ని నిర్బంధ శిబిరాలకు తీసుకువెళతారు. మీరు దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి ఆలోచించండి" అని ఆమె అన్నారు.

సీఏఏ

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?

పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయకుండా ఉండటం సాధ్యమవుతుందా? ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత రాజ్యాంగంలోని VII భాగం సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కామన్ లిస్ట్ పరిధిలోకి వచ్చే విషయాలను నిర్వచిస్తుంది.

కేంద్ర జాబితాలో మొత్తం 97 అంశాలు ఉన్నాయి. 17వ అంశంగా 'సిటిజన్‌షిప్, నాచురలైజేషన్, అలియన్స్'లను ప్రస్తావించారు.

ఈ జాబితాలో ఉన్న విషయాలపై చట్టం చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్‌ది. భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి.

కపిల్ సిబల్

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగలవా?

కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడం, వ్యతిరేకించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.

2020లో కేరళలో జరిగిన 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌'లో పాల్గొన్న కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘సీఏఏను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఏ రాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు. కానీ, వ్యతిరేకించవచ్చు. అసెంబ్లీలో తీర్మానం చేయవచ్చు, చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు. కానీ దానిని అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగపరంగా సంక్లిష్టమైనది” అని ఆయన అన్నారు.

అంతేకాదు, పౌరసత్వం కోరేవారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అడ్డుకుంటుంది లేదా అమలు చేయకుండా ఉంటుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

సీఏఏ

ఫొటో సోర్స్, Getty Images

'ఇది రాజకీయ నిరసన'

ఈ వ్యతిరేకతను రాజకీయ నిరసనగా అర్థం చేసుకోవాలని మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హరి పరంధామన్ అన్నారు.

"రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంది. పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. భారత పౌరసత్వ చట్టం 1955లో ఆమోదం పొందింది. ఇప్పుడు దాన్ని సవరిస్తున్నారు. రాష్ట్రాలు ఏమీ చేయలేనప్పటికీ, అలా చెప్పడం ప్రజాస్వామ్యం, ఇది ఆరోగ్యకరమైనది, ఇది ప్రతిఘటనా రూపం'' అని తెలిపారు.

"కేంద్ర ప్రభుత్వ అధికార భాష విషయంలో కూడా ఇదే పరిస్థితి. కేంద్రం తన అధికారిక కార్యక్రమాలలో హిందీని పూర్తిగా ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రాల వ్యతిరేకతతో వెనకడగు వేస్తోంది. ఇది కూడా అలాంటిదే" అని హరి పరంధామన్ చెప్పారు.

విపక్షాల ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీఏఏను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి.

'పౌరుల రిజిస్టర్ తయారు చేయగలరా?'

సిటిజన్ షిప్స్, నాన్- సిటిజన్ షిప్స్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఏమీ చేయలేరని డీఎంకే అధికార ప్రతినిధి సీ రవీంద్రన్ అన్నారు.

"సీఏఏ, ఎన్ఆర్‌సీలు ఒకదానికొకటి అనుసంధానమైనవి. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండా పౌరుల రిజిస్టర్‌ తయారుచేయవచ్చా? ఉదాహరణకు, శ్రీలంక తమిళులు ఈ సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం పొందలేరు. వారు ఒకవేళ శ్రీలంక తమిళులని చెబితే వెళ్లగొడతారు, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా? మేం అంగీకరించం” అని రవీంద్రన్ అన్నారు.

రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.

"ఉత్తర భారతదేశంలో హిందూ శక్తులు బలంగా ఉన్న ప్రాంతాలలో, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని నటిస్తోంది. వాళ్లు దీన్ని పూర్తిగా అమలు చేయలేరు" అని రవీంద్రన్ ఆరోపించారు.

చట్టం ఆవశ్యకత చూడండి: సీనియర్ న్యాయవాది విజయన్

సీఏఏను లీగల్‌ కోణంలో కాకుండా, ఆ చట్టం ఆవశ్యకతను చూడాలని సీనియర్ న్యాయవాది కె.ఎం. విజయన్ సూచిస్తున్నారు.

"1947-48లో భారతదేశానికి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిని ఇప్పటికే భారత పౌరులుగా చూస్తున్నారు. ముస్లింలను ఈ పౌరసత్వం నుంచి మినహాయిస్తున్నామని చెప్పడమే ఈ చట్టం ఉద్దేశంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సాయంతోనే పౌరుల జాతీయ రిజిస్టర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా పని చేస్తుందో చూడాల్సి ఉంది ” అని విజయన్ అన్నారు.

చాలారోజులుగా భారత సరిహద్దులు మూసివేయలేదు కాబట్టి, అస్సాం వంటి రాష్ట్రాల్లో నిరసనలను భిన్నంగా చూడాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)