గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
- రచయిత, జయ్ మక్వానా
- హోదా, బీబీసీ గుజరాతీ
సోమనాథ్ ఆలయంపైకి గజనీ మహ్మద్ దండయాత్ర చేసి అక్కడి విలువైన సంపదను దోచుకెళ్లారనీ, ఆ సమయంలో జరిగిన పోరాటంలో వేలాదిమంది హిందువులు చనిపోయారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి.
గుజరాత్‌లో సోలంకీ రాజులకు కష్టాలు మొదలైన సమయమది. ఆ సమయంలో అంటే వెయ్యేళ్ల కిందట సోమనాథ్‌ను గుర్జర్ల రాజ్యానికి మత రాజధాని (రిలిజియస్ క్యాపిటల్)గా పరిణించేవారు.
సౌరాష్ట్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయం కారణంగా ఈ ప్రాంతాన్ని ఇలా భావించేవారు.
సౌరాష్ట్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం గోడలు సముద్రపు అలల వల్ల కొట్టుకుపోయాయి. భారీ రాతి పలకల మీద ఈ ఆలయాన్ని కట్టారు. ఈ మందిరం పైకప్పు ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న 56 స్థంభాలపై ఉంటుంది.
ఆలయ శిఖరం మీద 14 బంగారపు గోళాలు ఉండేవి. సూర్యరశ్మి పడి అవి మెరుస్తూ చాలా దూరం వరకు కనిపించేవి.
ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఏడు మూరల ఎత్తు ఉండేది. దానిపై అనేక రకాల జంతువుల చిత్రాలు చెక్కి ఉండేవి. వజ్రాలతో పొదిగిన కిరీటం శివలింగం మీద అలంకరించి ఉండేది.
శివుని సేవకులకు ప్రతీకగా గర్భగుడి సమీపంలో, పైకప్పు మీద బంగారం, వెండితో చేసిన అనేక మూర్తులు ఉండేవి.
గర్భగుడి అంతా రత్నాల షాండ్లియర్లతో శోభాయామానంగా కనిపించేది. దాని ముందు భారీ బంగారు గొలుసు వేలాడి ఉండేది. ఆలయం పక్కనే రత్నాలు, బంగారం, వెండి మూర్తులతో నిండిన భాండాగారం ఉండేది.
డాక్టర్ ముహమ్మద్ నజీమ్ రాసిన గజ్నా సుల్తాన్ మహ్మద్ జీవిత కథ ‘‘ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజ్నా’’లో ఈ విషయాలు ఉన్నాయి.
దోపిడీకి ముందు సోమనాథ్ ఆలయం ఎలా ఉందనే విషయాలపై ఇస్లామిక్ స్కాలర్స్ అల్ బరూని, ఇబ్న్ జాఫిర్ల కథనాలను ఇందులో ఉదహరించారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
సోమనాథ్ ఆలయం
సోమనాథ్ ఆలయం గురించి 'ప్రభాస్ యానే సోమనాథ్' అనే పుస్తకంలో శంభుప్రసాద్ హరిప్రసాద్ దేశాయ్ వివరించారు.
‘‘సోమనాథ్ ఆలయం సీసంతో కూడిన 56 చెక్క స్తంభాలపై నిర్మించారు. లోపలి గదిలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహం ఐదు మూరల ఎత్తులో గోళాకారంగా, రెండు మూరల లోతు భూగర్భంలో ఉంది. గది రత్నదీప కాంతులతో ప్రకాశించేది.
విగ్రహానికి ఒక బంగారు గొలుసు, గంటలను అలంకరించారు. రాత్రి ఒక నిర్ధిష్ట సమయంలో ఈ గొలుసు కదిలేది, ఘంటారావం వినిపించేది. ఆలయంలో అనేక బంగారు విగ్రహాలు ఉండేవి. వాటి మీద అత్యంత విలువైన రాళ్లు పొదిగిన జవనిక ఉండేది. భారతీయ విగ్రహాలన్నింటిలోకెల్లా సోమనాథుని విగ్రహం అత్యుత్తమమైనది.
'శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ' సోమనాథుని వద్దకు వచ్చి పూజిస్తుందని పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే హిందువులు నమ్ముతారు. భక్తులు తమ విలువైన వస్తువులను ఇక్కడ సమర్పిస్తారు. ఆలయ భరణం, పోషణ కోసం కోసం పదివేల గ్రామాలను కేటాయించారు.
ఆలయంలో అత్యంత ఆకర్షణీయ, విలువైన రత్నాలను పొందుపరిచారు. ఆలయంలోని విగ్రహాలకు పూజలు చేయడానికి, తీర్థ యాత్రికుల కోసం వెయ్యి మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉండేవారు. యాత్రికుల తలనీలాలు తీయడానికి 300 మంది క్షురకులు ఉండేవారు’’ అని పుస్తకంలో వివరించారు.
సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ సమయంలో ప్రాథమిక పరిశోధన చేసిన చరిత్రకారుడు రత్నమణిరావు భీంరావు కూడా తన పుస్తకంలో చాలా విషయాలు రాశారు.
పదకొండో శతాబ్దం ఆరంభంలో భారత్‌లో సోమ్‌నాథ్ కీర్తి చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా సోమనాథుని కీర్తి పాకింది. సోమనాథుని సంపద కూడా భారీగా ఉంది. కాబట్టి సోమనాథుని కీర్తి, సంపదపై మహ్మద్ దృష్టి పడింది.
సుల్తాన్ రాజ్యం విస్తరణ
ప్రపంచ సరిహద్దులను కత్తి బలంతో నిర్ణయిస్తున్న సమయమది. 998 AD మార్చిలో ఇద్దరు సోదరులు అఫ్గాన్ నేలలోని గజ్నీ మైదానంలో తమ సైన్యాలతో ఘర్షణ పడ్డారు.
పగటిపూట జరిగిన యుద్ధంలో గజనీ మహ్మద్ గెలిచారు, సాయంత్రం సింహాసనాన్ని అధిష్టించారు.
మహ్మద్ సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, సుల్తాన్ బిరుదును స్వీకరించారు.
ప్రపంచంలో ఈ బిరుదు ఉన్న మొట్టమొదటి చక్రవర్తి ఆయనే. దాన్ని ముస్లిం ఖలీఫాతో సమానంగా పరిగణిస్తారు.
గజనీ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత , సుల్తాన్ తన రాజ్య (సుల్తానేట్) సరిహద్దులను విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాన మధ్య ఆసియా నుంచి దక్షిణాన సింధు వరకు, సుల్తానేట్ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది.
మహ్మద్ హిందుస్థాన్‌లోని అనేక ప్రాంతాలను జయించారు. అక్కడి దేవాలయాలను ధ్వంసం చేశారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
సోమనాథ్‌కు పయనం
మహ్మద్ జీవిత చరిత్ర ప్రకారం...యామిన్-ఉద్-దవ్లా (మహ్మద్ పేరులో ఒకటి) రాజ్యాలను గెలుస్తూ, దేవాలయాలను ధ్వంసం చేస్తుండటంతో సోమనాథ్‌పై కోపంగా ఉన్నారని హిందువులలో వదంతులు వ్యాపించాయి.
అనంతరం మహ్మద్ సోమనాథ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1025 అక్టోబర్ 18న 30,000 మంది సైన్యంతో గుర్రాలపై సోమనాథ్ వైపు సాగారు.
అయితే, చరిత్ర పుస్తకాల్లో ఈ సైనికుల సంఖ్య భిన్నంగా ఉంది. జీతానికి వచ్చినవాళ్లు 54 వేల మంది, మత సైనికులు 30 వేల మంది సోమనాథ్ వైపు కవాతు ప్రారంభించారని తన పుస్తకంలో రత్నమణి పేర్కొన్నారు.
అరబ్ చరిత్రకారుడు అలీ ఇబ్న్ అల్-అతిర్ ప్రకారం గజనీ నుంచి సౌరాష్ట్ర తీరం వరకు 1,420 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మహ్మద్ 1026 జనవరి 6న గుజరాత్‌లోని సోమనాథ్ వద్దకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోమనాథ్‌లో ఎదురుగాలులు
గజనీ నుంచి సోమనాథ్ వరకు మహ్మద్ పెద్దగా అడ్డంకులు లేకుండానే చేరుకున్నారు. అనంతరం ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను 'ప్రభాస్ యానే సోమనాథ్' పుస్తకంలో శంభుప్రసాద్ దేశాయ్ వివరించారు.
మాళవపతి ముంజ్, భోజ్ పర్మార్, చేదిరాజ కర్ణ, సింధ్ రాజులతో యుద్ధం చేసిన అన్హిల్వాడ్ పటాన్ రాజ్యానికి చెందిన రాజు భీమ్ దేవ్...మహ్మద్ భారీ సైన్యాన్ని చూసి భయపడ్డారు.
కచ్‌కు భీమ్‌దేవ్ వెళ్లిపోవడం మహ్మద్ కు మార్గం సుగమం అయ్యింది. మొధేరా చేరుకున్న మహ్మద్ అక్కడ తొలి పెద్ద సవాలును ఎదుర్కొన్నారు.
20 వేల మంది సైనికులు మోధేరాలో సుల్తాన్‌పై దాడిచేశారు. ఆ యుద్ధంలో సుల్తాన్ గెలిచారని డాక్టర్ నజీమ్ ‘‘ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజ్నా’’లో రాశారు.
సైనికులు జనరల్ లేకుండా మహ్మద్ తో పోరాడారని అరబ్ చరిత్రకారుడు అల్-ఇబ్న్ అల్-అతిర్‌ను ఉటంకిస్తూ శంభుప్రసాద్ దేశాయ్ రాశారు.
మోధేరా యుద్ధం కూడా ముగియడంతో మహ్మద్ కు సోమనాథ్‌పై దండయాత్ర సులభమైంది.
'ప్రభాస్-సోమ్‌నాథ్' పుస్తకం ప్రకారం.. సోమనాథ్ చాలా గొప్పది కాబట్టి సోమనాథుడు అన్యమతస్తుల నుంచి తమను కాపాడతారని, శత్రువులను నాశనం చేస్తారని ప్రజలు అనుకున్నారు.
ఏకమైన హిందువులు
డా. నాజీమ్ ప్రకారం తీరంలో భారీ కోట ఉంది, ఆ కోట గోడపై పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు సమావేశమయ్యారు.
ఆ గ్రూపు మహ్మద్‌పై విమర్శలు చేసింది, భారతీయ దేవతలను అవమానించిన సుల్తాన్‌ను నాశనం చేయడానికి 'సోమేశ్వరుడు' అతన్ని సోమనాథ్‌కు తీసుకొచ్చారని విశ్వసించారు.
రత్నమణి రావు ప్రకారం, మొదటి రోజు పోరాటంలో చాలామంది మహ్మద్ సైనికులు మరణించారు, రెండో రోజు కూడా అదే తీరు. వారు కోట ఎక్కే ప్రయత్నంలో విజయం దక్కలేదు.
డాక్టర్ నజీమ్ ప్రకారం 'జనవరి 7వ తేదీ ఉదయం మహ్మద్ సేనల ధాటికి తట్టుకోలేక జనం వెనుదిరిగారు. ఆ తరువాత మధ్యాహ్నం, మహ్మద్ సైనికులు కోటకు చేరుకున్నారు.
'కోటను సైన్యం స్వాధీనం చేసుకోవడంతో, సోమనాథ్ నివాసితులు ఆలయానికి చేరుకుని సోమనాథుని విగ్రహాన్ని ప్రార్థించారు.'
అనంతరం హిందువులు మహ్మద్ సైన్యంపై దాడికి దిగారు. సాయంత్రానికి మహ్మద్ సేనలను వారు చెదరగొట్టారు, స్వాధీనం చేసుకున్న స్థానాల నుంచి వారిని తరిమికొట్టారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
ఎంత ధనం దోచుకున్నారు?
మూడో రోజున మహ్మద్ సైన్యం రెండుసార్లు దాడి చేసి కోటను స్వాధీనం చేసుకుంది.
ఇబ్న్ అల్-అతిర్ ప్రకారం కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత, స్థానిక గ్రూపులు సోమనాథ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
అక్కడ మహ్మద్ సైనికులపై మళ్లీ దాడులు చేశారు. అయితే, మహ్మద్ సేనలను ఎక్కువసేపు ప్రతిఘటించలేకపోయారు.
రత్నమణి రావు 'ప్రభాస్-సోమ్‌నాథ్'లో.. 'ఇక్కడ ఎలాంటి సహాయం లభించదని మహ్మద్ కు తెలుసు. ఆయనను ఎదుర్కోవడానికి సాయం కోసం 'సోమనాథ్ సైనికులు' ఎదురుచూస్తున్నారు. అలాగే భీమ్‌దేవ్ చాలా ఆలస్యంగా రాజ్యాన్ని, ఇష్టదేవుడిని రక్షించుకోవడానికి సన్నాహాలు చేశారు. మంగ్రోల్ పాలకుడైన ఆయన కుమారుడు జైపాల్ కూడా భీమ్‌దేవ్ సహాయం కోసం ఎదురు చూశారు.' అని రాశారు.
ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించి గజనీకి తిరిగి చేరుకోవాలని మహ్మద్ అనుకున్నారని రత్నమణి రావు రాశారు.
మహ్మద్ తన సైన్యంలో ఒక చిన్న దళాలను ఏర్పాటు చేసి, వాటిలో ఒకటి కోట వద్ద ఉంచారని 'ప్రభాస్-సోమ్‌నాథ్' పుస్తకంలో రత్నమణి రావు తెలిపారు.
చుట్టుపక్కల నుంచి 'సోమనాథ్ సైనికులకు' వచ్చే సహాయాన్ని అడ్డుకోవడానికి ఇతర దళాలను పంపారు.
ఇంతలో భీమ్‌దేవ్ సైనిక బలాన్ని సేకరించి దాడికి వస్తున్నారని మహ్మద్ కు తెలిసి, స్వయంగా ఆ మార్గంలోనే వెళ్లారు.
భీమ్ దేవ్, మహ్మద్ మధ్య భీకర పోరు జరిగింది. అనంతరం భీమ్‌దేవ్ మళ్లీ పారిపోయారు.
ఆ యుద్ధం తర్వాత మహ్మద్ సోమనాథ్‌కు తిరిగి వచ్చారు, కోటను నాశనం చేశారు.
ఇబ్న్ జాఫిర్ ప్రకారం.. సోమనాథ్‌ను రక్షించే ప్రయత్నంలో కనీసం 50 వేల మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమనాథుని ఆలయ నిధిని కొల్లగొట్టిన తర్వాత, మిగతావన్నీ తగలబెట్టమని మహ్మద్ ఆదేశించారు.
అలీ ఇబ్న్ అల్-అతిర్ ప్రకారం.. ఆలయం దోపిడీతో సుల్తాన్‌కు రెండు మిలియన్ దినార్ల సొత్తు దొరికింది.
'ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజ్నా' ప్రకారం.. మహ్మద్ అందుకున్న దినార్లు మొత్తం దోపిడీలో ఐదో వంతు మాత్రమే.
ఈ దినార్ల సగటు బరువు 64.8 గ్రేన్స్. ఆ ధనం విలువ లెక్కించినట్లయితే, మొత్తం సుమారుగా 1,05,00,000 పౌండ్లు అవుతుంది.
కొల్లగొట్టిన నిధి విలువను అంచనా వేసిన ఈ పుస్తకాన్ని 1931 సంవత్సరంలో రాశారని ఇక్కడ గమనించాలి.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
నిధి దోచుకున్నాక ఎలా తప్పించుకున్నారు?
'సోమ్‌నాథ్‌లో లేదా సౌరాష్ట్రలో మహ్మద్ తో పోరాడిన మరో రాజు లేరు. మోధేరాలో ఇరవై వేల మంది 'యోధులు' మరణించారు. అయితే, సోమనాథ్‌లోని నిధిని పొందిన తరువాత, మహ్మద్ సమయాన్ని వృథా చేయకూడదనుకున్నారు.
సర్ హెరాల్డ్ విల్బర్‌ఫోర్స్-బాల్ రాసిన 'హిస్టరీ ఆఫ్ కటియవార్ ఫ్రమ్ ది ఎర్లీయెస్ట్ టైమ్స్' ప్రకారం.. నిధి దొరికిన వెంటనే, మహ్మద్ సౌరాష్ట్ర నుంచి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా భీమ్‌దేవ్‌పై దాడి చేయడానికి కచ్‌కు వెళ్లారు'. అయితే, దాడిలో మహ్మద్ గెలిచారో లేదో స్పష్టంగా తెలియలేదు.
'ప్రభాస్ యానే సోమనాథ్' పుస్తకం ప్రకారం.. సోమనాథ్‌పై దాడి చేసి హిందూ రాజులకు షాక్ ఇచ్చారు మహ్మద్ . మాల్వా రాజు భోజ్ పర్మార్, సంభర్వానికి చెందిన విశాల్‌దేవ్ చౌహాన్, పటాన్‌కు చెందిన భీమ్ సోలంకిలు మహ్మద్ పై యుద్ధానికి వ్యూహం పన్నారు.
ఆ సమయంలో మహ్మద్ కి గజనీ రాజ్యానికి తిరిగి వెళ్లడానికి మూడు మార్గాలే ఉన్నాయి.
మాల్వానా మార్గంలో రాజభోజుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, అబూకు వెళితే విశాల్దేవ్ చౌహాన్ సిద్ధంగా ఉన్నారు. కచ్‌కు వెళితే మహ్మద్ దారిని అడ్డుకోవడానికి భీమ్ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.
అయితే మహ్మద్ ఆ ముగ్గురి కంటే చాకచక్యంగా వ్యవహరించారు. ఎడారి మార్గాన్ని ఎంచుకున్నారు. వేగుల నుంచి రాజుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం పొందారు.
'ప్రభాస్-సోమనాథ్' పుస్తకం ప్రకారం...మహ్మద్ తాను వచ్చిన దారిలోనే తిరిగి రాజ్యానికి వెళ్లలేదు. కచ్ ఎడారి గుండా సింధ్‌కు వెళ్లారు.
ముగ్గురు రాజులలో భీమ్‌దేవ్ తక్కువ శక్తిమంతుడని, అతని రాజ్యం ఉన్న మార్గంలో కదిలారు మహ్మద్ . దోచుకున్న సంపదతో గజనీకి వెళ్లడం సులువు కాదని తెలుసుకుని, భీమ్‌దేవ్ ఉన్న కోటపై దాడికి ప్రయత్నించారు మహ్మద్.
'ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజ్నా' ప్రకారం.. భీమ్‌దేవ్‌ను మహ్మద్ చంపిన తర్వాత, కచ్ నుంచి సింధ్‌కు వెళ్లారు. అక్కడి స్థానికుడైన భోమియా సాయం అడిగారు.
కానీ భోమియో సోమనాథుని భక్తుడు, మహ్మద్ సోమనాథ్‌కు చేసిన అవమానానికి ప్రతీకారంగా, అతను సుల్తాన్ సైన్యాన్ని ఎడారిలో దారి తప్పించాడు.
దోపిడీ సొమ్ము కోసం దాడులు
గజనీకి చెందిన పర్షియన్ కవి ఫరూఖ్ సిస్తానీ ప్రకారం, రోజుల తరబడి సంచరించిన తర్వాత సుల్తాన్ చివరకు సింధ్ చేరుకున్నారు.
అయితే, 'ప్రభాస్ యానే సోమనాథ్' పుస్తకం ప్రకారం భోమియో దారి తప్పించడం అనేది నిజం కాకపోవచ్చని తెలిపారు. ఇక్కడి నుంచి సుల్తాన్ నేరుగా మన్సూరా చేరుకున్నారు.
మన్సూరాలో సుల్తాన్ కు ఆశ్రయం, విశ్రాంతి దొరకలేదు. అక్కడా యుద్ధం చేయాల్సి వచ్చింది. దోపిడీ సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు అక్కడి ఖాఫీఫ్ దాడి చేశారు. మహ్మద్ వద్ద తగినంత బలగాలూ లేవు, కూలీలే ఎక్కువ. వారితోనే ఖాఫీఫ్‌ను ఎదుర్కొని, సుల్తాన్ విజయం సాధించారు, అనంతరం ముల్తాన్‌కు వెళ్లారు.
డాక్టర్ నజీమ్ తన పుస్తకంలో 'మహ్మద్ సింధు నదిని దాటి, గజనీకి యాత్రను కొనసాగించారు. అయితే, ఎడారి ప్రాంతం చుట్టుపక్కల నివసించే జాట్‌లు మహ్మద్ పై దాడి చేశారు. దీంతో చాలామంది సైనికులను కోల్పోయారు సుల్తాన్.
'ప్రభాస్ యానే సోమనాథ్' పుస్తకం ప్రకారం.. పంజాబ్‌లోని జాట్‌లు మహ్మద్ ను అడ్డుకున్నారు. మహ్మద్ తాను కొల్లగొట్టిన నిధినైతే కాపాడుకున్నారు, కానీ ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువులను జాట్‌లు తీసుకువెళ్లారు.
డాక్టర్ నజీమ్ ప్రకారం...మహ్మద్ చివరకు 1026 ఏప్రిల్ 2న గజనీ చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేడే ఆస్కార్ అవార్డుల ప్రకటన, ఈ ఏడాది వేడుక ప్రత్యేకతలివే...
- యుక్రెయిన్ యుద్ధం: రష్యాలో ‘లక్షన్నర జీతం’తో ఉద్యోగాలంటూ భారతీయులను ట్రాప్ చేస్తున్న ఏజెన్సీ.. పట్టుకున్న సీబీఐ
- రూపా వైరాప్రకాశ్: మరుగుజ్జువు నువ్వేం చేయగలవంటే.. ఏకంగా పారాలింపిక్స్‌లో బంగారు పతకంతో తిరిగొచ్చారు
- మహిళా దినోత్సవం: ‘స్టెమ్’లో మహిళలు మగవారిని మించిపోయారా?
- 'డ్రై-ఐస్' తిన్న తరువాత నోట్లోంచి రక్తం పడింది... గురుగ్రామ్ రెస్టారెంట్లో అసలేం జరిగింది?
- గవదబిళ్లలు: పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలేంటి? చికిత్స ఎలా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














