బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని ఒకప్పుడు హిందూ రాజులు పాలించారా

- రచయిత, రియాజ్ సొహైల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, కరాచీ
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం మధ్యలో ఉన్న బ్రాహ్మణాబాద్ వద్ద తవ్వకాలలో అరబ్ పాలకుడు మొహమ్మద్ బిన్ కాసిం అక్కడకు రావడానికి ముందు కాలం నాటి పురాతన అవశేషాలు లభించాయి.
చరిత్రలో వివిధ సందర్భాలలో ఈ బ్రాహ్మణాబాద్ ప్రస్తావన ఉంది.
కానీ షా అబ్దుల్ లతీఫ్ విశ్వవిద్యాలయంలోని పురాతత్వ విభాగం ఇటీవల జరిపిన ఒక శాస్త్రీయ పరిశోధనలో ఇక్కడ మూడో శతాబ్దం నాటి జనాభాకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ధ్రువీకరించారు.

బ్రాహ్మణాబాద్ ఎక్కడుంది
కరాచీ నుంచి రైల్లో లాహోర్ వైపు వెళ్తుంటే.. ఠండో ఆదమ్ రైల్వే స్టేషన్ తర్వాత షాహదాద్‌పూర్ స్టేషన్ వస్తుంది.
దానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణాబాద్ లేదా మంసూరా అనే ఒక పురాతన నగరానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి.
ఇక్కడ ఒక స్తూపం కూడా ఉంది. కొంతమంది చరిత్రకారులు దీనిని బౌద్ధ స్తూపంగా, ఆరాధనా స్థలంగా చెబుతున్నారు.
దాని చుట్టుపక్కల భారీ ఇటుకల కుప్పలు కనిపిస్తాయి. అవి నాలుగు కిలోమీటర్లకు పైగా వ్యాపించి ఉన్నాయి.
ఉపఖండంలో ముస్లింల మొదటి బలమైన కోట ఇక్కడే ఉండేదని స్థానిక పురాతత్వ విభాగం చెబుతోంది.
బ్రాహ్మణాబాద్ నగరం నది మధ్య ఒక ద్వీపంలా ఉండేదని అంటోంది.

బ్రాహ్మణాబాద్ తవ్వకాలు ఎప్పుడు జరిగాయి
1854లో బెలారస్, రిచర్డ్‌సన్ ఈ పురాతన నగరంలో మొదటిసారి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత హెన్రీ కెజిన్ వాటిని కొనసాగించారు.
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 1962లో జాతీయ పురాతత్వ మంత్రిత్వ శాఖ తరఫున ఇక్కడ తవ్వకాలు జరిగాయి. దాని ప్రాథమిక రిపోర్టును ప్రచురించినా, పూర్తి వివరాలతో ఉన్న నివేదిక మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు.
"ఇవి మంసురా నగరం శిథిలాలు. ఇక్కడ మసీదు అవశేషాలు కూడా దొరికాయి. కానీ, అక్కడ ఇస్లాం కాలం కంటే ముందు నాటి అవశేషాలు ఏవీ లేవు" అని ఆ రిపోర్టులో డాక్టర్ ఎఫ్ఏ ఖాన్ చెప్పారు.
ఆ రిపోర్టులో భవనాల శైలి, వాటి కాలం గురించి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని షా అబ్దుల్ లతీఫ్ విశ్వవిద్యాలయం పురాతత్వ విభాగం చీఫ్ డాక్టర్ గులాం మొహియుద్దీన్ వీసర్ అన్నారు.

ఇటీవలి తవ్వకాల ఉద్దేశం ఏంటి
షా అబ్దుల్ లతీఫ్ విశ్వవిద్లాయం అధ్యక్షుడు డాక్టర్ గులాం మొహియుద్దీన్ వీసర్ నేతృత్వంలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో కూడిన ఒక 20 మంది బృందం, బ్రాహ్మణాబాద్ పురాతన ప్రాంతాల్లో ఇటీవల పరిశోధనలు చేసింది.
మొదటి దశలో ఈ బృందం ఆరు చోట్ల తవ్వకాలు జరిపారు. తర్వాత దశలో వీటిని మరింత విస్తరించనున్నారు.
"అక్కడ దొరికిన అవశేషాలు మొహమ్మద్ బిన్ కాసిమ్ కాలం నాటివేనా, కాదా..అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ భవనాల శైలి ఏంటి, అక్కడ ఎలాంటి మట్టి పాత్రలు దొరుకుతున్నాయి. అవి ఏ శతాబ్దం నాటివి, ఏ కాలం గురించి చెబుతున్నాయనేది చూడాలనుకుంటున్నాం" అని వీసర్ చెప్పారు
మొహమ్మద్ బిన్ కాసిమ్ బగ్దాద్ పాలకుడు హజాజ్ బిన్ యూసుఫ్ ఆదేశాలతో 712 హిజరీ(ఇస్లామిక్ సంవత్సరం)లో సింధ్ మీద దాడి చేశాడు. ఆ సమయంలో దానిని రాజా దాహిర్ పాలిస్తున్నాడు.

ఫొటో సోర్స్, EPA
మసీదు కింద ప్రాచీన అవశేషాలు
ఇక్కడ జరిగిన మొదటి పరిశోధనల్లో ఒక మసీదు ప్రస్తావన ఉందని డాక్టర్ గులామ్ మొహియుద్దీన్ వీసర్ చెప్పారు.
దాంతో, ఆయన ఆ మసీదు ఉన్న ప్రాంతంలో 15 అడుగుల లోతున 4 గుంతలు తవ్వారు. వాటిలో తవ్వకాలు జరిపిన తర్వాత, ఆ నగరం ఏర్పడడానికి ముందు కూడా అక్కడ ప్రజలు నివసించారని తేల్చారు.
"తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను బట్టి అక్కడి భవనాల శైలి తెలుస్తోంది. మాకు దొరుకుతున్న మట్టి పాత్రల్లో తేడా కూడా ఉంది. వాటి ద్వారా ఇస్లామిక్ కాలానికి ముందు అక్కడ కొందరు జీవించారనే సంకేతాలు లభించాయి".
"ఇక్కడ దొరికిన మట్టి పాత్రలు మూడో శతాబ్దం నాటి పాత్రల్లాగే ఉన్నాయి. అవి ససానిద్ కాలానికి(ఇస్లాం ముందు ఇరాన్ చివరి చక్రవర్తి కాలం) సంబంధించినవి. ఇలాంటి మట్టి పాత్రలే భాంభూర్ పురాతత్వ తవ్వకాల్లో కూడా బయటపడ్డాయి" అన్నారు.
ఈ పురాతన అవశేషాలను బట్టి ఈ నగరం మూడో దశాబ్దం నాటిదని చెప్పవచ్చు. అవి వ్యాపించి ఉండడాన్ని బట్టి మొహమ్మద్ బిన్ కాసిం ఈ నగరంపై విజయం సాధించినా, అంతకు ముందు నుంచే ఇక్కడ జన జీవితం ఉందని చెప్పవచ్చు

విలువైన రాళ్లతో ఆభరణాలు
బ్రాహ్మణాబాద్ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేదని కూడా అక్కడ జరిగిన తవ్వకాలను బట్టి తెలుస్తోంది.
ఇంతకు ముందు ఇక్కడ జరిగిన పరిశోధనల్లో నాణేలు, కొన్ని కళాకృతులు దొరికాయి.
పాకిస్తాన్ ఏర్పడడానికి ముందు దొరికిన వాటిని బ్రిటిష్ మ్యూజియం, బొంబాయి పంపించారు.
ఇటీవల తమ తవ్వకాల్లో మట్టి పాత్రలతోపాటూ నీలాలు, కెంపులు, పచ్చలు లాంటి విలువైన రాళ్లు కూడా దొరికాయని డాక్టర్ వీసర్ చెప్పారు.
"వాటితోపాటూ పాలిష్ చేసే పరికరాలు, అచ్చులు కూడా లభించాయి. వీటిని బట్టి అక్కడ ఆ పరిశ్రమ ఉన్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు అక్కడ ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు. షోల్( పలకలా ఉండే ఒక సున్నితమైన రాయి) నాణేలు కూడా దొరికాయి. అవి ఏ కాలానికి చెందినవో వాటిని శుభ్రం చేశాక తెలుస్తుంది" అన్నారు.

భూమి అడుగు నుంచి నీటిని తోడే వ్యవస్థ
మొహంజదారో, భాంభూర్ లాగే బ్రాహ్మణాబాద్‌లో కూడా మంచి నీటి బావులు కనిపించాయి. కానీ ఇవి వాటికంటే భిన్నంగా ఉన్నాయి.
"మట్టి పాత్రల్లాగే, బట్టీలో కాల్చిన రంగుతో ఒక పైప్ లైన్ 15 అడుగుల కంటే లోపలికి వెళ్తోంది. ఆ పైప్‌ను ఆ రంగులన్నీ కలిపి చేసినట్టు ఉంది.
నేల అడుగున నీళ్ల కోసం ఈ పైపు పొడవుగా ఉంది, ఇది మనలాగే ఒక వింత పద్ధతి. మొదట పరిశోధనలు జరిగినపుడు దీన్ని డ్రైనేజీ లైన్ అని చెప్పారు" అన్నారు వీసర్.

నాలుగు ద్వారాల నగరం
బ్రాహ్మణాబాద్‌లో అరబ్, పార్సీ సహా ఎన్నో భాషలకు సంబంధించి ఆధారాలు దొరికాయి. వీటి ద్వారా ఆ నగరం ఉనికి గురించి తెలుస్తోంది.
సింధీ భాష చరిత్రకారుడు, నాటక రచయిత మీర్జా కలీచ్ బేగ్ తన 'ప్రాచీన్ సింధ్' పుస్తకంలో హిందూ రాజుల పాలనా కాలంలో ఏడు పెద్ద కోటలు ఉన్న నగరాల్లో బ్రాహ్మణాబాద్ ఒకటి అని రాశారు.
బ్రాహ్మణ రాజు చచ్ సమయంలో ఈ ప్రాంతానికి అఘం లోహానా పాలకుడుగా ఉన్నారు. ఇక్కడ లాఖా, సమా, సహతా జాతులు ఉండేవి. ఈయన ఆదేశాలు సముద్రం వరకూ అంటే దెబల్ రేవు వరకూ చెల్లేవి.
రాజు చచ్ అఘమ్‌తో యుద్ధం చేశాడు. అఘమ్‌ను ఓడించి నగరాన్ని ఆక్రమించిన చచ్ అతడి భార్యను పెళ్లి చేసుకున్నాడు.
చచ్ కొడుకు రాజా దాహిర్ పాలకుడు అయినపుడు తన సోదరుడు దాహిర్ సింగ్‌ను ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు.
ఆయన చనిపోయాక, దాహిర్ సింగ్ కొడుకు బ్రాహ్మణాబాద్‌ను పాలించాడు.
"ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ఆరాధనా స్థలం ఉండేది. జ్యోతిష విజ్ఞానంలో పండితులు ఇక్కడ ఉండేవారు.
ఒక సంప్రదాయ బ్రాహ్మణ రాజు అయినప్పటికీ, చచ్ ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన స్థలంగా కొనసాగనిచ్చారు" అని మౌలాయీ షైదాహీ తన జన్నత్-ఉల్-సింధ్‌లో అనే పుస్తకంలో చెప్పారు.
"మొదటి పరిశోధనల్లో ఇక్కడ బౌద్ధ స్తూపం కూడా ఉందని చెప్పారు. కానీ అది ఎలా ఉండేది, దానిపై ఎలాంటి చిహన్లు ఉన్నాయి అనేది చెప్పలేదు.
బౌద్ధ స్తూపానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అక్కడ బుద్ధుడి ప్రతిమ లేదా విగ్రహాలు లాంటివి ఏవీ దొరకలేదు" అని డాక్టర్ వీసర్ అన్నారు.

మొహమ్మద్ బిన్ కాసిం దాడి
మౌలాయీ షైదాహీ తన జన్నత్-ఉల్-సింధ్‌లో మొహమ్మద్ బిన్ కాసిం దాడి గురించి చెప్పారు.
"రాజా దాహిర్ హత్య తర్వాత ఆయన కొడుకు జయ సింగ్ దగ్గర మొహమ్మద్ అలాఫీ(మొహమ్మద్ అలాఫీ ఒమన్ ఖలీఫాపై తిరుగుబాటు చేసి, అది విఫలమవడంతో రాజా దాహిర్ దగ్గర ఆశ్రయం పొందాడు)తోపాటూ 15 వేల మంది సైనికులు ఉండేవారు.
బ్రాహ్మణాబాద్ వైపు వెళ్లమని వారికి మంత్రి సియాసగర్ సలహా ఇచ్చాడు. అక్కడ చాలా ఖజానా పూడ్చి పెట్టి ఉందని వారికి చెప్పాడు" అని రాశారు.
"బ్రాహ్మణాబాద్ కోట నాలుగు వైపులా తలుపులు ఉండేవి. వాటికి జర్ బేడీ, సాహతియా, మహ్డో, సాల్బాహ్ అనే పేర్లు ఉండేవి. జయ సింగ్ వాటిపై నలుగురు సేనాధిపతులతో సైన్యాన్ని మోహరించాడు"

ఈ పుస్తకంలో వివరాల ప్రకారం అది మొహమ్మద్ బిన్ కాసింపై సింధీలు చేసిన చివరి యుద్ధం.
రజబ్(ఇస్లాం నెల) నెలలో అరబ్ సైన్యం బ్రాహ్మణాబాద్ చేరుకుంది. మొహమ్మద్ బిన్ కాసిం ఆదేశాలతో అక్కడ తవ్వకాలు జరిగాయి.
జయ్ సింగ్ వారిపై గెరిల్లా యుద్ధం చేశాడు. ఇస్లాం సైన్యానికి నిత్యావసరాలు, జంతువులకు గడ్డి కూడా దొరకకుండా ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం చేశాడు.
ఆరు నెలల ముట్టడి తర్వాత జయ్ సింగ్ ఓడిపోయాడు. నగరంలో పౌరులు కోట తలుపులు తెరిచారు. ముహమ్మద్ బిన్ కాసిం వారిపై పన్నులు విధించాడు. ఈ విజయం 94వ హిజరీ సంవత్సరం మొహర్రం నెలలో జరిగింది.

ఇరాన్ చక్రవర్తి నగరం
బ్రాహ్మణాబాద్ నగరం ఇరాన్ రాజు కాలంలో ఏర్పడిందని కొందరు చరిత్రకారులు చెబుతారు.
సింధ్ పండితుడు, చరిత్రకారుడు గులామ్ అలీ అలానా దీనిపై ఒక ఆర్టికల్ రాశారు
అది 'మెహరాన్ మాగజీన్'లో 'మంసూరా ఇస్మాయిలీ శాసన్' అనే శీర్షికతో ప్రచురితమైంది.
ససానిద్ కుటుంబం పాలకుడు గుష్తస్ప్ సింధు లోయలో పాలనను తన మనుమడు బహమన్‌కు అప్పగించాడు. ఆయన ఇరాన్ చరిత్రలో 'బహమన్ అర్దేశిర్ దర్జ్ దాస్త్' పేరుతో ప్రముఖులయ్యారు.
బహమన్ సింధ్‌లో ఒక నగరం నిర్మించాడు. దాని పేరు బహమనో. ఆ తర్వాత అది బ్రహ్మబాద్ పేరుతో ప్రసిద్ధి చెందింది. కొంతమంది అరబ్ పర్యటకులు బ్రహ్మబాద్, మంసూరాను ఒకే నగరంగా చెప్పేవారు.
యాకూత్ లహూమీ, హమ్జాను ఉటంకించిన వారందరూ అల్-మంసూరా బ్రాహ్మణాబాద్‌కు మరో పేరు అన్నారు. అరబ్ పర్యటకుడు అల్-బెరూనీ వివరాల ప్రకారం బ్రాహ్మణాబాద్ పేరు బహమనవా. ముస్లింల పాలనకు ముందు ఈ నగరాన్ని బ్రాహ్మణాబాద్ అనేవారు.
సింధ్ పరిశోధకుడు, చరిత్రారుడు డాక్టర్ నబీ బక్ష్ బలోచ్ కూడా డాక్టర్ అలానా చెప్పిన దాన్ని సమర్థించారు.
"బ్రాహ్మణాబాద్‌ను 'బహమన్ అర్ధేశిర్' ఆదేశాలతో నిర్మించారు. సుదీర్ఘ కాలం తర్వాత సింధ్‌లో బహుశా బ్రాహ్మణుల ప్రభావం పెరిగినపుడు బహమనాబాద్‌ను బ్రాహ్మణాబాద్ అని పిలవడం మొదలుపెట్టారు. బ్రాహ్మణుల ఆధిపత్యం లేదా సింధీ భాష స్థానిక మాండలికం వల్ల అలా జరిగుండచ్చు" అన్నారు.

బ్రాహ్మణాబాద్ లేదా మంసూరా
సైనిక, రాజకీయ అవసరాల కోసం అరబ్బులు సింధ్‌లో తమకంటూ ఒక నగరం నిర్మించుకోల్సి వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి నగరాల్లో మహఫూజా, బైజా, మంసూరా ప్రసిద్ధి చెందాయి. కొందరు బ్రాహ్మణాబాద్, మంసూరా కంటే దూరంగా ఉంది అన్నారు, బ్రాహ్మణాబాద్‌లోని ఒక పెద్ద భాగం మంసూరాలో కలిసిపోయిందని చెప్పారు. మహఫూజా నగరం దాని పక్కనే ఏర్పడింది.
బ్రాహ్మణాబాద్, మంసూరా అనేవి ఒకే నగరానికి ఉన్న రెండు పేర్లు అని చారిత్రక సాక్ష్యాల ద్వారా తెలుస్తోందని సింధ్ చరిత్రకారుడు ఎంహెచ్ పన్హూర్ రాశారు. యజీద్ అల్-కల్బీ కాలంలో సింధ్ రాజధానిని అల్వర్ నుంచి మంసూరాకు మార్చారన తెలిపారు.
961లో సింధ్‌లో పర్యటించిన బషారీ అల్ ముకద్దసీ తన 'ఎహ్సన్ అల్-తక్సీమ్ మారిఫ్ అల్-కలీమ్'లో మంసూరాను ఒక కిలోమీటర్ పొడవు, రెండు కిలోమీటర్ల వెడల్పున్న నగరంగా వర్ణించారు. దానికి, నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయని చెప్పారు.
ఆయన వివరాల ప్రకారం మంసరాలోని ఇళ్లను మట్టి, కలపతో నిర్మించారు. కానీ అక్కడ జామా మసీదును మాత్రం రాళ్లు, ఇటుకలతో కట్టారు. నగరం మధ్యలో ఒక పెద్ద భవనం కూడా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
మహమ్మద్ గజనీ దాడి
బ్రాహ్మణాబాద్ మీద మహమ్మద్ గజనీ దాడి కూడా చేశాడు.
"సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన తర్వాత మహమ్మద్ గజనీ మంసూరాపై కూడా దాడి చేశాడు. అక్కడ అప్పుడు ఖఫీఫ్ సుమరూ పాలన ఉండేది. గజనీ దాడి చేయడానికి ముందే అతడు పారిపోయాడు. ఆ సమయంలో నగరంలో దారుణ ఊచకోత జరిగింది. కొన్ని ప్రాంతాలకు నిప్పుపెట్టారు" అని ఎంహెచ్ పన్హూర్ రాశారు.
"మహమ్మద్ గజనీ సభలోని కవి ఫర్ఖీ రచనల ద్వారా.. అప్పుడు ఖఫీఫ్ ఖర్జూరం తోటల్లో పారిపోయారని, ప్రాణాలు కాపాడుకోడానికి చాలా మంది నదిలో దూకారని తెలుస్తోంది.
వీధుల్లో నాణాలు పడి ఉన్నాయని ఆయన రాయడం వల్ల, అక్కడ లూటీలు జరిగాయని కూడా అనుకోవచ్చు" అని పన్హూర్ చెప్పారు.
కొంతమంది చరిత్రకారులు భారత్‌లో ప్రస్తుతం గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మీద దాడి చేసిన తర్వాత మహమ్మద్ గజనీ మంసూరా వచ్చాడని, అక్కడ ధ్వంసం చేసిన తర్వాత ముల్తాన్ మీద దాడి చేశాడని చెబుతారు.
అయితే ఎంహెచ్ పన్హూర్ దానితో ఏకీభవించడం లేదు.
"షియా ఉద్యమంలో ప్రముఖ బోధకుడు అల్-అష్తర్ మొట్టమొదట మంసూరాకు వచ్చారు. అప్పట్లో, అబూ జాఫర్ మంసూర్ అబ్బాసీ ఖిలాఫత్ కాలం నడుస్తోంది. ఉమర్ బిన్ హఫ్స్ మంసూరా పాలకుడుగా ఉండేవారు. ఆయన ఖిలాఫత్ ప్రకటించాలని నిర్ణయించారు. కానీ ఆ విషయం బగ్దాద్ వరకూ చేరడంతోఅల్-అష్తర్ పారిపోవాల్సి వచ్చింది" అని డాక్టర్ గులామ్ అలీ అలానా రాశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
బ్రాహ్మణాబాద్ ఎలా పతనమైంది
ఆ నగరం భూకంపం వల్ల ధ్వంసం అయ్యిందని, అక్కడ మొదట తవ్వకాలు జరిపిన బెలారస్, రిచర్డ్‌సన్ భావించారు.
షా అబ్దుల్ లతీఫ్ విశ్వవిద్యాలయ పురాతత్వ విభాగం చీఫ్ గులాం మొహియుద్దీన్ భూకంపం అనే వాదనను కొట్టిపారేశారు. అక్కడ గోడలు బాగానే ఉన్నాయి. ఎక్కడా వాలిపోయినట్లు లేవని చెప్పారు.
ఆ నగరంపై దాడి జరిగిందని, నిప్పు పెట్టారనే వాదనకు కూడా ఆయన అంగీకరించలేదు. మంటల గుర్తులు, కాలిన కట్టెలు లాంటివి తమకు ఎక్కడా దొరకలేదన్నారు.
"అక్కడ హాక్రా నది ఎండిపోయింది. సింధు నది కూడా దిశ మార్చుకుంది. 10వ శతాబ్దంలో అలాంటి మార్పులు వచ్చాయని చారిత్రక రికార్డుల ద్వారా తెలుస్తోంది" అని ఎంహెచ్ ఎన్హూర్ అన్నారు.
డాక్టర్ వీసర్ కూడా అదే భావిస్తున్నారు. సింధు నది తన దిశ మార్చుకోవడం వల్ల, నగరంలో ఉన్న వారిపై ఆ ప్రభావం పడి ఉండచ్చని అన్నారు.
"తర్వాత దొరికిన భవనాల నిర్మాణ శైలి, అంతకు ముందు కట్టినంత బాగా లేవు. తర్వాత కట్టిన ఇళ్లలో మొహంజదారోలో ఉన్నట్లే పాత ఇటుకలను మళ్లీ ఉపయోగించారు" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








