"నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - కోవిడ్-19 సోకి మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ

మెహపార అక్టోబరు 05 న 1.5 కేజీల బరువున్న బిడ్డకు జన్మనిచ్చారు.
ఫొటో క్యాప్షన్, మెహపార అక్టోబరు 5వ తేదీన 1.5 కేజీల బరువున్న బిడ్డకు జన్మనిచ్చారు
    • రచయిత, డాక్టర్ జాన్ రైట్
    • హోదా, బీబీసీ కోసం

22 ఏళ్ల మెహపార నఖ్వీ బ్రాడ్ఫర్డ్ షైర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆమె భర్తతో కలిసి నివసించేందుకు బ్రాడ్ఫర్డ్ వచ్చారు. కోవిడ్ మహమ్మారి తలెత్తిన తర్వాత నుంచి అలీ, అతని కుటుంబం నిత్యావసర సరుకులకు తప్ప మరే పనికీ బయటకు వెళ్లడం లేదు. మెహపార గర్భవతి కూడా... ఆమె డిసెంబరులో బిడ్డను కనాల్సి ఉంది.

కానీ, ఆక్టోబరు మొదటి వారంలో ఆమెకు తలనొప్పి, దగ్గు మొదలయ్యాయి. నెమ్మదిగా రుచి, వాసన కోల్పోవడం మొదలయింది. దాంతో కోవిడ్ సోకిందేమోననే అనుమానంతో ఆమె, భర్తతో కలిసి ఇంటి మేడపై ఉన్న గదిలో ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. అలీ తల్లి వారికి గది బయటే భోజనం వదిలి పెట్టి వెళ్లేవారు.

కానీ, రెండు మూడు రోజుల్లోనే మెహపార ఆరోగ్యం విషమించడం మొదలయింది. ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దాంతో అలీ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను వెంటనే ఐసియుకి తరలించారు.

కోవిడ్ తలెత్తిన మొదట్లో హాస్పిటల్లో కోవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన గర్భవతులెవరూ లేరు. ఈ ఆసుపత్రిలో అలా చేరిన వారిలో మెహపార మొదటి రోగి. ఆమె వైద్యం గురించి హాస్పిటల్ మెటర్నల్ క్రిటికల్ కేర్ లీడ్ డెబీ హార్నర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

మెహపార కడుపులో ఉన్న బిడ్డ గుండె కొట్టుకునే వేగాన్ని ఆసుపత్రిలో ఉండే నర్సులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు.

ఆ సమయంలో ఆమె బిడ్డ ఆమె కడుపులో ఉండటమే మేలని డెబీ ఆమెకు చెబుతూ ఉండేవారు.

కానీ, అవసరం అయితే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయడం కూడా మెహపార ఆరోగ్యానికి మంచిదని కూడా సూచించారు. అప్పటికి ఆమెకు 7వ నెల నడుస్తోంది. ఇదే విషయాన్ని అలీకి కూడా ఫోనులో తెలియ చేశారు.

మెహపారకి మాత్రం విచారం ఎక్కువవుతూ ఉంది.

"నాకెందుకో నేను బ్రతకనని అనిపించింది. నా బిడ్డను ఎలా అయినా కాపాడుకోవాలని అనుకున్నాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీయమని డెబీని అడిగాను. డెబీ చాలా ధైర్యాన్ని ఇచ్చారు" అని మెహపార చెప్పారు.

"మేము నీకు ఏమి అవ్వనివ్వం. నిన్నూ, నీ బిడ్డను కూడా మేము రక్షిస్తాం" అని ఆమె చెప్పిన మాటలను మెహపార గుర్తు చేసుకున్నారు. కానీ, మెహపారకి మాత్రం నమ్మకం కుదరలేదు.

రోజులు గడుస్తున్న కొద్దీ మెహపార పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది.

పీపీఈ కిట్‌లో డాక్టర్ డెబ్బీ హార్నర్
ఫొటో క్యాప్షన్, పీపీఈ కిట్‌లో డాక్టర్ డెబీ హార్నర్

దాంతో, కడుపులో ఉన్న బిడ్డకు కావల్సిన ఆక్సిజన్ సరిపోయేంత స్థాయిలో అందేది కాదు. ఇది మెహపార ఊపిరితిత్తులపై అదనపు భారం మోపేది. దీంతో, డెబీ ఐసియు డాక్టర్ తో మెహపార పరిస్థితిని చర్చించారు.

ఆమె జీవితం, బిడ్డ జీవితం మధ్య సమతుల్యం పాటించాల్సి వచ్చింది. ఇక బిడ్డను బ్రతికించడం ముఖ్యమని నిర్ణయించారు.

ఆసుపత్రిలో ప్రసూతి వార్డులు మరొక భవనంలో ఉంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితి వలన ఆసుపత్రి ముఖ్య భవంతిలో ఉన్న ఆపరేషన్ థియేటర్లోనే ఈ ప్రసవం జరపడానికి డెబీ, ఆమె సిబ్బంది కలిసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

థియేటర్ లోకి తీసుకుని రాగానే మెహపార రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు భయంకరంగా పడిపోయాయి. డెబీ సిబ్బందితో కలిసి శాయశక్తులా ప్రయత్నించి ఆమెకు ఆక్సిజన్ స్థాయిలు పెంచేలా చేసి సాధారణ మత్తు ఇచ్చి ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

"ఈ ఆపరేషన్ తర్వాత ఆమెను నిద్ర లేపుతామని చెప్పాము. కానీ, ఆ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేదు. ఆమెను తెలివిలోకి తేవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని చెప్పాం" అని డెబీ తెలిపారు.

పుట్టిన బిడ్డను అంబులెన్సులో నియోనటల్ యూనిట్ కి తరలించారు. మెహపారని తిరిగి ఐసియుకి పంపించారు. ఆమెకు బలవంతపు కోమా ఇచ్చి ఐసియులో ఉంచారు.

"నేను తొమ్మిది రోజుల పాటు వెంటిలేటర్ పై ఉండి ఉండవచ్చని అనుకుంటున్నాను. నేను బిడ్డకు జన్మనిచ్చినట్లు నాకు తెలియదు. నాకేమి తెలియదు" అని మెహపార అన్నారు.

ఆమెకు మత్తు మందు ఇవ్వగానే, ఆక్సిజన్ స్థాయిలు మరింత పడిపోయాయి. ఎలాగో ఒకలా ప్రయత్నించి చివరకు బిడ్డను కడుపులోంచి బయటకు తీశారు. అక్టోబరు 5వ తేదీన 1.5 కేజీల బరువుతో నూర్ పుట్టింది.

మెహపారను కోమాలోంచి బయటకు తీసుకుని రాగానే ఆమె చాలా మత్తుగా ఉన్నారు. మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ, ఆమెకు అలీతో ఒక వీడియో కాల్ ని ఏర్పాటు చేశారు. అప్పటికి అలీ ఇసోలేషన్ సమయం కూడా పూర్తయ్యింది. ఆయన అప్పటికే వాళ్ళ బిడ్డ ఉన్న ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.

ఆ తర్వాత ఆ చిన్నారిని వీడియోలో మెహపారకి చూపించాం. ఆ పాపను చూడగానే ఆసుపత్రి సిబ్బందితో సహా అందరమూ భావోద్వేగాలకు గురయ్యాం. మెహపార మాట్లాడలేకపోయారు కానీ, పాపను చూసి ఏడవడం మొదలుపెట్టారు.

"వెంటనే నా బిడ్డ ఎక్కడ అని అడగాలని అనుకున్నాను కానీ, అడగలేకపోయాను" అని మెహపార చెప్పారు. కానీ, ఆమెకు మొదటి సారి ఆమె బిడ్డను చూసుకున్న జ్ఞాపకం అయితే ఉంది.

"పాప చాలా అందంగా ఉంది. అప్పుడే పాప సురక్షితంగా బ్రతికే ఉందని అర్ధమయింది" అని అన్నారు.

ఆ తర్వాత మెహపారను ప్రసూతి యూనిట్ కి తరలించాల్సి ఉంది. కానీ, ఆమె వెంటనే కోలుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు తల్లి బిడ్డ కలిశారు.

"నేను పాపను చూడగానే ఇది నిజమేనా అనిపించింది. నాకు ఓపిక లేక పాపను పట్టుకోలేకపోయాను, దాంతో నా గుండెల మీద పాపను పెట్టారు" అని మెహపార చెప్పారు.

"నేను పాపను ముట్టుకుని చూడగలిగాను. తను సజీవంగా ఉందంటే నిజానికి నేను నమ్మలేకపోయాను" అని అన్నారు.

మెహపార కోమాలో ఉన్నప్పుడు కూడా ఆమె ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి ఫిజియో థెరపిస్టులు పని చేశారు.

అలా ఆమెకు చికిత్స చేసిన కార్డి గౌబెర్ట్ మెహపారను బెడ్ మీద నుంచి మొదటి సారి లేపి కూర్చోబెట్టిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.

"మేము ఆమె మంచం మీద నుంచి లేపి కూర్చోబెట్టినప్పుడు ఆమె కిటికీ లోంచి బయట ప్రపంచాన్ని చూడగలిగారు. దాంతో, ఆమె కాస్త కుదుట పడ్డారు" అని చెప్పారు.

ఆ తర్వాత అలీకి ఫోన్ చేసాం. వారు ఆమెను చూసారు. అది చాలా భావోద్వేగానికి గురైన క్షణం అని అన్నారు.

"నేను వాళ్ళనెప్పటికీ మర్చిపోలేను. వారే గనక లేకపోతే నేను బ్రతికి ఉండేదానిని కాదు" అని మెహపార అంటారు.

కథ సుఖాంతం కావడంతో కార్డికి కూడా ఈ అనుభవం మర్చిపోలేనిదిగా మిగిలింది

మెహపార బ్రతుకుతారని అనుకోలేదు. చాలా మంది కోవిడ్ రోగుల కథలు విషాదాన్నే మిగిల్చాయి.

మెహపార చివరకు నవంబరు 3వ తేదీన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు.

ఆమె నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు.

తన సహచర ఫిజియో థెరపిస్టులతో కార్డీ (ఎడమ).. చిత్రంలో రోగులు మళ్లీ కూర్చునేందుకు శిక్షణ ఇచ్చే కుర్చీ
ఫొటో క్యాప్షన్, తన సహచర ఫిజియో థెరపిస్టులతో కార్డీ (ఎడమ).. చిత్రంలో రోగులు మళ్లీ కూర్చునేందుకు శిక్షణ ఇచ్చే కుర్చీ

మెహపార నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. ఆమె ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడూ ఆయాసం వస్తోంది.

"అన్నిటి కంటే ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది. మెదడు అంతా మసకబారినట్లుగా అవుతోంది. కానీ, నేను తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాను అనే ఆశ అయితే ఉంది" అని మెహపార అన్నారు.

"నాకు 22 సంవత్సరాలు. నాకు వేరే అనారోగ్యం ఏమి లేదు. కానీ, కోవిడ్ నా పై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించి దానికి వయసు తారతమ్యం లేదని నిరూపించింది" అని ఆమె అన్నారు.

కథ సుఖాంతం కావడంతో మెహపార, అలీ తో పాటు డెబీ హార్నర్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కేసు అందరినీ చాలా ఒత్తిడికి గురి చేసింది. ఇది చాలా కష్టమైన కేసు. కానీ, అన్నీ మంచిగా జరగడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది అని డెబీ అన్నారు.

ఈ వైరస్ గురించి మొదట్లో పెద్దగా పట్టించుకోలేదని మెహపార అంగీకరించారు. ఆమెకు తెలిసిన చుట్టు పక్కల సమాజంలో చాలా మంది తప్పుడు సమాచారానికి ప్రభావితమై ఆసుపత్రికి వెళ్లడాన్ని సమర్ధించలేదు.

"నేను ఆసుపత్రికి వెళ్లడం వల్లే బ్రతికాను. నేను ఇంట్లోనే ఉండి ఉంటే నేను నా బిడ్డ బ్రతికి ఉండే వాళ్ళం కాదు. నా జీవితం నిలబెట్టినందుకు నేను ఎన్‌హెచ్ఎస్ సిబ్బందికి రుణపడి ఉంటాను" అని ఆమె అన్నారు.

కోవిడ్ తలెత్తినప్పుడు మేము గర్భిణుల ఆరోగ్యం గురించి చాలా విచారించాం. 2009లో స్వైన్ ఫ్లూ తలెత్తినప్పుడు గర్భిణులకు సోకే ముప్పు చాలా ఎక్కువగా ఉంది. 2014లో సియర్రా లియోన్ లో ఎబోలాకి గురైన వారిలో 100 శాతం మరణాలు సంభవించాయి.

మహమ్మారి ప్రబలుతూ ఉండగా అత్యధిక శాతం గర్భిణులకు కోవిడ్ వలన అంతగా ముప్పు వాటిల్లదని అర్ధం అయింది. కానీ, సాధారణ మహిళలు కంటే వీరికున్న ముప్పు కాస్త ఎక్కువే ఉంది.

ఆ మహిళలు నల్ల జాతి వారు కానీ, ఆసియా దేశాల వారు కానీ అయితే, ఈ ముప్పు మరి కాస్త ఎక్కువ ఉంటుంది.

వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ లో గర్భిణులను మినహాయించారు. అయితే, వీరిని కూడా క్లినికల్ ట్రయల్స్ లో చేర్చాలని కొంత మంది పిలుపునిచ్చారు.

మార్చిలో కోవిడ్ మొదలయినప్పటి నుంచి ఆసుపత్రిలో సుమారు 3000 మంది కోవిడ్ రోగులు చేరారు. వైరస్ బారిన పడి సుమారు 500 మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు , ప్రాణాలను రక్షించిన రోగుల కథలను కూడా సంబరం చేసుకోవడానికి ఇది సరైన సమయం.

కొంత మంది రోగులు చాలా విచిత్రంగా కోలుకున్నారు. కొంత మంది మరణం అంచులను కూడా చూసి వచ్చి బ్రతికారు. కొంత మంది ఐసియులో కోమాలో కొన్ని వారాల పాటు ఉండి లేచి ఇంటికి వెళ్లారు.

వీళ్ళలో చాలా మంది దీర్ఘకాలిక మానసిక, శారీరక సమస్యలతో సతమతమవుతున్నారు. కానీ, వారి జీవితాలు తిరిగి యధా స్థితికి రావడానికి మా ఫిజియో థెరపిస్టులు సహాయం చేస్తున్నారు.

బ్రాడ్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ జాన్ రైట్ ఎపిడెమియాలజిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయన కలరా, హెచ్ఐవి, ఎబోలా వ్యాధుల చికిత్సలో నిపుణుడు. ఆయన బీబీసీ న్యూస్ కోసం హాస్పిటల్ నుంచి డైరీ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)