ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం.. ఎందుకంత రిస్క్ చేశారో తెలుసా

ధనుంజయ్ హంస్దా, సోనీ హేంబ్రమ్

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఫొటో క్యాప్షన్, ధనుంజయ్ హంస్దా, సోనీ హేంబ్రమ్
    • రచయిత, రవి ప్రకాశ్‌
    • హోదా, రాంచీ నుంచి బీబీసీ కోసం

ధనుంజయ్‌ హాన్‌సదా, సోనీ హేంబ్రమ్‌ల జంట ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నారు.

ఝార్ఖండ్‌లోని గొడ్డా నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు దాదాపు 1200 కిలోమీటర్లు స్కూటీ మీద ప్రయాణించాక ఈ గిరిజన జంట మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచారు.

తన భార్య సోనీతో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.El.Ed) పరీక్ష రాయించడానికి ధనుంజయ్‌ ఈ సుదూర స్కూటీ ప్రయాణాన్ని ఎంచుకున్నారు.

మామూలు రోజులైతే గొడ్డా దగ్గర్లో ఉన్న జాసిది రైల్వే స్టేషన్‌ నుంచి దిల్లీకి, అక్కడి నుంచి గ్వాలియర్‌కు రైలులో తన భార్యను పరీక్షకు తీసుకొచ్చేవారు ధనుంజయ్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇది సాధ్యం కాలేదు.

వారంలో ఒక రైలు మాత్రమే ఈ మార్గంలో నడుస్తోంది. అలాంటి పరిస్థితిలో, గ్వాలియర్ చేరుకోవడానికి ఏకైక మార్గం రోడ్డే.

గొడ్డా నుంచి గ్వాలియర్‌కు ప్రైవేట్‌ కారులో తీసుకెళ్లాలంటే అది ఖరీదైన వ్యవహారం. అందుకే ధనుంజయ్‌, సోనీలు స్కూటీ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టి రూ.10,000 అప్పు తీసుకుని ప్రయాణం ప్రారంభించారు.

పగటి పూట ప్రయాణంలో అక్కడక్కడా కొద్ది నిమిషాలే విరామం తీసుకున్నారు ధనుంజయ్, సోనీ

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, పగటి పూట ప్రయాణంలో అక్కడక్కడా కొద్ది నిమిషాలే విరామం తీసుకున్నారు ధనుంజయ్, సోనీ

అప్పటికే సోనీ ఏడు నెలల గర్భవతి. ఈ ప్రయాణం ఆమెకు అత్యంత ప్రమాదకరం కూడా.

ఎట్టి పరిస్థితుల్లో తన భార్యతో పరీక్ష రాయించాలని ధనుంజయ్‌ పట్టుదలగా ఉన్నారు. "ఈ మొండితనం మాకు బలాన్నిచ్చింది. అందుకే రోడ్డెక్కాం. జీవితంలో మొదటిసారిగా నేను రెండు రోజుల్లో రూ. 3500 విలువైన పెట్రోల్‌ కొన్నాను. మాట్లాడుకుంటూ స్కూటీ మీద ప్రయాణం సాగించాం" అన్నారాయన.

" ఇప్పుడు సోనీ పరీక్షలు రాస్తోంది. సెప్టెంబర్ 1 నుండి 11వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. తర్వాత మేం తిరిగి గొడ్డాకు వస్తాం. కానీ ఈ ప్రయాణం మాకు జీవితాంతం గుర్తుంటుంది" అని ధనుంజయ్‌ అన్నారు.

“నేను ఉదయం 8 గంటలకు గొడ్డా నుండి బయలుదేరాను. భాగల్పూర్‌ వెళ్లే రోడ్డు అస్సలు బాగా లేదు. సోనీకి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాను. రోడ్డు మీద నీళ్లు నిండిన గుంటలు ఎంత లోతు ఉన్నాయో కూడా తెలియదు. స్కూటీ ఎగిరెగిరి పడింది" అని ధనుంజయ్‌ తన అనుభవాలను వివరించారు.

"మేము ఎలాగోలా భాగల్పూర్ చేరుకున్నాము. అక్కడి నుంచి బస్సులో వెళదామనుకున్నాం. కానీ లక్నో వెళ్లాల్సిన ఓ వ్యక్తిని కండక్టర్‌ రూ. 5 వేలు అడగటం విన్నా. మా దగ్గర అంత డబ్బు లేదు. గ్వాలియర్‌ వెళ్లక తప్పదు. స్కూటీ తప్ప మరో మార్గంలేదని నిర్ణయించుకున్నా’’ అని ధనుంజయ్‌ చెప్పారు.

"భాగల్పూర్‌లో రోడ్లన్నీ నీళ్లమయంగా ఉన్నాయి. వర్షం పడుతోంది. ఎక్కువసేపు ప్రయాణించడం వల్ల సోనీకి కడుపునొప్పి వచ్చింది. నేను భయపడ్డాను. ఆగస్టు 28 రాత్రి ముజఫర్‌పూర్‌లో ఒక లాడ్జిలో ఉన్నాం. ఆమె పొట్ట మీద మసాజ్‌ చేశాను. అది ఉపశమనాన్ని ఇచ్చింది’’ అని ధనుంజయ్‌ వెల్లడించారు.

"మరుసటి రోజు ఉదయం 4 గంటలకు బయలుదేరాం. వర్షానికి మా దుస్తులు తడిచి పోయాయి. లక్నో వచ్చేసరికి అలసిపోయాం. లాడ్జి, హోటల్‌ కోసం వెతికాను. కానీ హైవే మీద ఏమీ కనపడలేదు. లక్నో-ఆగ్రా హైవే మీద ప్రయాణించి ఓ టోల్‌ప్లాజా దగ్గర వేప చెట్టు కింద రెయిన్‌ కోట్లు పరుచుకుని పడుకున్నాం. వర్షం పడకపోవడంతో ఆ రాత్రి మాకు ఇబ్బంది కాలేదు. మాతోపాటు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు’’ అని ధనుంజయ్‌ తన ప్రయాణం సాగిన తీరును వివరించారు.

"మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. ఆ రోజు వేడి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు హోటల్‌లో ఆగి, భోజనం చేసి గ్వాలియర్ చేరుకున్నాం. అప్పటికి మేము చాలా అలసిపోయాం. గ్వాలియర్ చేరుకున్న వెంటనే సోనీకి కొంచెం జ్వరం వచ్చింది" అని ధనుంజయ్‌ వెల్లడించారు.

"దగ్గు ఉందంటే కరోనా అనుమానంతో పరీక్ష హాల్లోకి రానివ్వరు. అందుకే నేను భయపడి మందుల షాపుల నుంచి కొన్ని మందులు, వేడి వేడి ఆహారం, నీరు అందించాను. తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. విజయ్‌ సింగ్ రాథోడ్ అనే జర్నలిస్ట్ మాకు సాయం చేశారు. ఇప్పుడు మా శ్రమ ఫలించింది. సోని పరీక్షలు రాస్తోంది" అన్నారు ధనుంజయ్‌.

సుశీల

కుటుంబ సభ్యులు అంగీకరించారా ?

వాస్తవానికి బొకారోకు చెందిన ధనుంజయ్‌, గొడ్డాలో తన అత్తగారి ఇంట్లో ఉంటున్నారు. " సోనీని స్కూటీ మీద తీసుకెళ్తానంటే మేం ఒప్పుకోలేదు. కానీ అతను మా మాట వినలేదు’’ అని ధనుంజయ్‌ అత్త సుశీలా బీబీసీతో అన్నారు.

"కారులో గ్వాలియర్ వెళ్లడానికి తన వద్ద డబ్బు లేదని ధనంజయ్ వాదించారు. వద్దన్నా స్కూటీ మీదనే తీసుకెళ్లారు. వాళ్లు సురక్షితంగా ఇంటికి వచ్చినప్పుడే మాకు మనశ్శాంతి" అని సుశీల అన్నారు.

ఈ స్కూటీ మీదే సోనీ,ధనుంజయ్ 1200 కిలోమీటర్లు ప్రయాణించారు

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, ఈ స్కూటీ మీదే సోనీ,ధనుంజయ్ 1200 కిలోమీటర్లు ప్రయాణించారు

పరీక్ష రాయకపోతే ఏమవుతుంది?

"ఈ పరీక్షను వదులుకునే ప్రశ్న లేదు. నేను మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నా. నాన్న ఉద్యోగం కోల్పోయారు. ఐదుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. సంపాదన కోసం 14ఏళ్ల వయసులోనే ఇల్లు వదలాల్సి వచ్చింది. అందుకే చదువుకోలేక పోయా’’ అని ధనుంజయ్‌ తన గతాన్ని వివరించారు.

" గత ఏడాదే పెళ్లి చేసుకున్నా. నేనెలాగూ చదువుకోలేదు. నా భార్యనైనా చదివించాలని నిర్ణయించుకున్నాను. సోని టీచర్ కావాలని కోరుకుంటోంది. కాబట్టి ఈ పరీక్ష చాలా ముఖ్యం. ఆలస్యమైనా ఆమె ఈ పరీక్ష పాసవుతుంది. ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధిస్తుంది. నాలాగా సోనీ కూడా ఎందుకు చదువు ఆపేయాలి? ఆమె కూడా తన కలను నెరవేర్చుకోవాలి’’ అని ధనుంజయ్‌ అన్నారు.

సోనీ, ధనంజయ్

నా భర్త సూపర్ స్టార్‌: సోనీ

సోనీ, ధనుంజయ్‌ల జీవితాలలో కొన్ని సంఘటలు ఒకేలా ఉన్నాయి. ఇద్దరి తండ్రులు వీరి చిన్నతనంలోనే చనిపోయారు. ఇప్పుడు తన భర్త తనను ఉపాధ్యాయురాలిగా మార్చడానికి రిస్క్‌ తీసుకోవడంపై సోనీ చాలా సంతోషంగా ఉన్నారు. “అందరూ ఇలా చేయలేరు’’ అన్నారామె.

"చిన్నప్పటి నుండి నాకు ఉపాధ్యాయురాలిని కావాలని కోరిక. పెళ్లయ్యాక నా కోరిక విని నా భర్త సంతోషించారు. నన్ను పట్టుదలగా చదివిస్తున్నారు’’ అని సోనీ అన్నారు.

“ నా భర్తను చూసి గర్వపడుతున్నాను. అందుకే అతను స్కూటీ మీద వెళదామన్నా నేను భయపడలేదు. ఆయన మీదున్న నమ్మకం, ప్రేమతోనే ప్రమాదకరమైనా ఈ సుదీర్ఘ ప్రయాణానికి అంగీకరించాను’’ అని ఆమె చెప్పారు.

ధనుంజయ్ ఎక్కడ ఉంటున్నారు?

పరిచయస్తుల సాయంతో గ్వాలియర్‌లోని డీడీ నగర్‌ ప్రాంతంలో రూ.1500 అద్దె చెల్లించి, 15 రోజులకు గదిని అద్దెకు తీసుకున్నారు ధనుంజయ్‌, సోనీ. తిరిగి వెళ్లేటప్పుడు భార్యను కారులో లేదా రైలులో తీసుకెళ్లాలని అనుకున్నారు. దీనివల్ల ఆమె మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని ఉండదు. దీనికోసం ఝార్ఖండ్‌ ప్రభుత్వం సాయం కోరారు. అయితే, అదానీ గ్రూప్‌ తమకు విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసినట్లు ధనుంజయ్‌ బీబీసీకి తెలిపారు.

గ్వాలియర్ కలెక్టర్ విక్రమ్ సింగ్
ఫొటో క్యాప్షన్, గ్వాలియర్ కలెక్టర్ విక్రమ్ సింగ్

గ్వాలియర్‌ కలెక్టర్‌ సాయం

స్కూటీ మీద 1200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారన్న విషయం తెలియగానే, గ్వాలియర్‌ కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌ సింగ్‌ ధనుంజయ్‌కు రూ.5000 సాయం చేశారు. ఆహారం కోసం ఏర్పాట్లు చేశారు. "ఆదివారం సోనీకి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష చేయిస్తున్నాం. ఆమెకు అన్నిరకాల వైద్య సహాయం అందిస్తాం. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని మా అధికారులను ఆదేశించాం. గ్వాలియర్‌లో వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం’’ అని కలెక్టర్‌ చెప్పారు.

కలెక్టర్‌ సహాయం చేసినట్లు ధనుంజయ్‌ హాన్‌సదా బీబీసీకి చెప్పారు. “ఇప్పటి వరకు అందిన ఏకైక ఆర్థిక సహాయం ఇదే. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఇవి లేకపోతే ఇబ్బంది అయ్యేది’’ అని ధనుంజయ్‌ తెలిపారు.

ధనంజయ్‌ ఏం చేస్తారు?

లాక్‌డౌన్‌కు ముందు ధనుంజయ్‌ అహ్మదాబాద్‌లో షెఫ్‌గా పని చేసేవారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోయింది. భార్యతోపాటు గొడ్డాకు తిరిగి వచ్చారు.

చాలామంది జర్నలిస్టులు తనను కలవడానికి వస్తున్నారని, ప్రతి ఒక్కరు తమ ప్రేమ కథ తెలుసుకోవాలనుకుంటున్నారని ధనుంజయ్‌ చెప్పారు. ఇంతలోనే అతని ఫోన్‌ మోగింది. ‘’మిలే హో తుమ్‌ హమ్‌కో బడే నసీబోం సే చురాయా’’( అదృష్టం కొద్దీ నవ్వు నన్ను కలిశావు) అంటూ కాలర్‌ ట్యూన్‌ వినిపిస్తోంది’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)