తెలంగాణ - కరోనావైరస్: దేశంలో ఇంకెక్కడా లేనంత స్థాయిలో తెలంగాణలో వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారెందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 18 శాతం మంది వైద్య సిబ్బంది కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ఇది దేశంలోనే అత్యధికమని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందులో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్లు, కేర్ ప్రొవైడర్లు కూడా ఉన్నారు.
గత ఆరు నెలలుగా సుమారు 80,000 నుంచి లక్ష మంది వైద్య సిబ్బంది తెలంగాణాలో కోవిడ్ విధుల్లో ఉన్నారు.
సాధారణ ప్రజల కంటే కోవిడ్ రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడే అవకాశం 33 శాతం ఎక్కువగా ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే పేర్కొంది.
ఇటీవల ఖమ్మం జిల్లా మణుగూరు కోవిడ్ కేంద్రంలో వైద్యునిగా సేవలు అందించిన 35 ఏళ్ల నరేష్ కుమార్ కోవిడ్ బారిన పడి మరణించారు.
వైద్య సిబ్బందిలో పెరుగుతున్న పాజిటివ్ రేటుకు గల కారణాలపై ‘బీబీసీ న్యూస్ తెలుగు’ కొందరు డాక్టర్లతో మాట్లాడింది.

కోవిడ్ చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, శానిటైజర్లు కానీ లేవని యాదాద్రి జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యాధికారి ఒకరు చెప్పారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికే పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నారు తప్ప కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది వెళ్లేటప్పుడు మాత్రం ఎలాంటి రక్షణ పరికరాలు లభించడం లేదని ఆమె చెప్పారు.
వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎన్-95 మాస్కులు అవసరమైన స్థాయిలో లభించకపోవడమే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడడానికి కారణమని చెప్పొచ్చని ఆమె అన్నారు.
ఇవన్నీసరిపడా అందుబాటులో ఉంటే సిబ్బందిలో పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.
“కోవిడ్ సమయంలో ఒక కాన్పు చేయాలంటే పీపీఈ కిట్ తప్పనిసరిగా ధరించాలి. కానీ, మాకు తగినన్ని కిట్లు లేవు. ఈ ముప్పు భరించలేక సొంత డబ్బులతో పీపీఈ కిట్లు కొనుక్కుని వేసుకుంటున్నాను.
కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఆశ వర్కర్ కానీ వారికి వచ్చే జీతాలతో సొంతంగా ఎలా కొనుక్కోగలరు”? అని ఆమె ప్రశ్నించారు.
గొంతెత్తి ప్రశ్నిస్తే వెంటనే అధికారులు తనిఖీలకు వచ్చి లోపాలు వెతికి మరీ మెమో ఇస్తారనే భయంతో ఎవరూ నోరు విప్పి మాట్లాడరని ఆమె అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక 30 మంది సిబ్బంది ఉంటే 10 పీపీఈ కిట్లు మాత్రమే సరఫరా చేస్తే అవి ఎవరికి ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు.
తనకు 9 నెలల వయసున్న కవల పిల్లలు, 80 ఏళ్ల తల్లి ఉన్నారని.. ప్రతి రోజు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విధులకు హాజరవుతున్నామని చెప్పారు.
ఎన్ని నిధులైనా విడుదల చేస్తామని కలెక్టరు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, పరికరాల సరఫరా మాత్రం జరగడం లేదని ఆరోపించారు.
ఇదే తరహా అభిప్రాయాన్ని దిల్లీకి చెందిన డాక్టర్ ఆనంద్ కుమార్ వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం, రోగుల సంఖ్యకు తగినంత సిబ్బంది లేకపోవడం.. సిబ్బందికి సరైన అవగాహన ఇవ్వలేకపోవడం లాంటివి వైద్య సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడటానికి గల కారణాలని ఆనంద్ కుమార్ ‘‘బీబీసీ న్యూస్ తెలుగు’’కు వివరించారు.
సిబ్బందికి ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు తగినన్ని అందించలేకపోవడం, సిబ్బందిపై ఎక్కువగా పని భారం మోపడం వల్ల కోవిడ్ సోకే ప్రమాదం ఉందన్నారు.
హాస్పిటళ్లలోనే కాకుండా బయటకు వెళ్లినప్పుడు కూడా కొందరు సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కొంత వరకు కారణమని అన్నారు.
హాస్పిటళ్లలో కరోనా రోగులకు బెడ్లు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమర్చకపోవడం, కోవిడ్ విధుల తర్వాత కొంత మంది వైద్య సిబ్బంది క్వారంటైన్ నిబంధనలు సరిగా పాటించక పోవడంకూడా పాజిటివ్ శాతం పెరగడానికి కారణం కావొచ్చన్నారు.
అయితే, దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఫిజీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ మధు చిత్తర్వు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో వైద్య సిబ్బందితో పోల్చితే సాధారణ ప్రజలకు చేస్తున్న టెస్టులు తక్కువ కావడం వల్ల సాపేక్షంగా ఆరోగ్య సిబ్బందిలో పాజిటివ్ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు.
వైద్య సిబ్బంది వైరల్ లోడ్‌కు ఎక్కువగా ఎక్సపోజ్ కావడం వల్ల కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారాయన.
మొదట్లో కేవలం ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కోవిడ్‌కు చికిత్స ఇవ్వడం వలన కూడా పూర్తి భారమంతా ప్రభుత్వ వైద్య సిబ్బందిపై పడిందని, కానీ, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా చికిత్స లభిస్తుండటం వలన పరిస్థితి మెరుగు పడిందని చెప్పవచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇదే అంశం పై బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. ప్రస్తుతం డాక్టర్లు ధరిస్తున్న ఎన్ 95 మాస్కులు పూర్తిగా సురక్షితం కాదని, అవి గట్టిగా బంధించి ధరిస్తే కేవలం 95 శాతం సురక్షితమని చెప్పారు. లేదంటే ముక్కు పక్క భాగం నుంచి వైరస్ దాడి చేస్తుందని ఆయన అన్నారు.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో పని చేసే వైద్య సిబ్బందికి ఒక ఎన్ 95 మాస్క్ వైరస్ నుంచి రక్షణ ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు.
చాలా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదని అన్నారు.
పవర్డ్ ఎయిర్ ప్యూరిఫయింగ్ రెస్పిరేటర్ (పీఏపీఆర్) అయితే 99.97 శాతం సురక్షితంగా పని చేస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబరు 4న తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులెటిన్ ప్రకారం తెలంగాణలో 1,35,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,02,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 866 మంది మరణించారు.
భారతదేశంలో మరణాల రేటు 1. 75 శాతం ఉండగా తెలంగాణాలో 0. 63 శాతం ఉన్నట్లు ఆ బులెటిన్ తెలిపింది.
తెలంగాణలో 17 ప్రభుత్వ కేంద్రాలలో, 35 ప్రైవేటు కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి.
తెలంగాణ లో వైద్య సిబ్బందిలో పాజిటివ్ రేటు 18 శాతం ఉండగా , మహారాష్ట్రలో 16, దిల్లీలో 14, కర్ణాటక లో 13, పుదుచ్చేరి లో 12, పంజాబ్ లో 11 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల ప్రకటనలో తెలిపారు.
వైద్య సిబ్బంది తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రామాణిక విధానాలను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వ్యక్తిగత రక్షణ పరికరాలు సరిగ్గా ధరించారో లేదో పరిశీలించడానికి ఇద్దరు డాక్టర్ల మధ్య బడ్డీ విధానాన్ని కూడా పాటించమని సూచించినట్లు చెప్పారు.
గత ఆరు నెలలుగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రధానంగా కోవిడ్ రోగులకు చికిత్స జరుగుతోంది. ఇక్కడ తేలికపాటి లక్షణాలున్నవారి నుంచి తీవ్రమైన లక్షణాలున్న రోగులు చికిత్స నిమిత్తం వచ్చి చేరుతున్నారు. గాంధీ లో సుమారు 2500 మంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారు.
గాంధీ హాస్పిటల్‌కు చెందిన 38 మంది వైద్య సిబ్బంది పాజిటివ్ బారిన పడినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.
రాష్ట్రంలో సుమారు 2000 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడినట్లు, అందులో 14 మంది మరణించినట్లు గత వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినట్లు కూడా ఆ కథనం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే కోవిడ్ బారిన పడిన వైద్య సిబ్బంది శాతం కేంద్రం ప్రకటించిన కంటే బాగా తక్కువగానే కనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 7000 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు ఆమ్నెస్టీ మానవ హక్కుల సంస్థ పేర్కొంది. అందులో 573 మంది భారతదేశం నుంచి ఉన్నారు. మెక్సికో, అమెరికాలోనే 1000 కి పైగా వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడి మరణించినట్లు ఆమ్నెస్టీ అంచనా వేసింది.

‘మాస్కులు, పీపీఈ కిట్లు తగినన్ని అందిస్తున్నాం’
ఈ అంశం పై తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వ ఇఎన్ టి హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య సిబ్బందికి కావల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు సరఫరా చేస్తోందని చెప్పారు. డాక్టర్లు ప్రతి నిత్యం రోగులకు చికిత్స చేయడం వలన ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుందని, అంతే కాకుండా వైద్య సిబ్బందిలో టెస్టింగ్ అధిక స్థాయిలో జరగడం వలన కూడా పాజిటివ్ కేసులు బయటపడతాయని అన్నారు. ఎన్ని సురక్షిత చర్యలు తీసుకున్నా వైరస్ బారిన పడకుండా ఉండటమనేది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ఆఖరికి ఎన్ 95 మాస్కులు కూడా 95 శాతమే మాత్రమే సురక్షితమని ఆయన చెప్పారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా పీపీఈ కిట్లు, మాస్కుల కొరత లేదనే చెబుతూ వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








