చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ సోనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూమిపై ఎక్కువ ప్రాంతంలో వాతావరణం మారుతోంది. చలికాలం వచ్చేస్తోంది.. ఇదే సీజన్‌లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వ సాధారణం.
కానీ, ఈసారీ చలికాలం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచుతోంది.
చలి వాతావరణంలో కరోనావైరస్ మరింత ఉద్ధృతరూపం దాల్చే ప్రమాదం ఉందని.. వేగంగా వ్యాపించవచ్చని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
శీతాకాలంలో ప్రపంచం కరోనావైరస్ ‘సెకెండ్ వేవ్’ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వైరస్ ఇంతకు ముందుకంటే ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఉత్తరార్ధ గోళంలోని దేశాలకు ఇది ఆందోళన కలిగించే అంశం కాబోతోందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరోనా అడవిలో కార్చిచ్చు
“కరోనావైరస్ తన కుటుంబంలోని మిగతా వైరస్‌లలాగే ఉంటే చలికాలంలో దాని వ్యాప్తి పెరుగుతుంద”ని కొలంబియా యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ డిపార్టుమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మికేలా మార్టినేజ్ అంటున్నారు.
మారుతున్న కాలంతోపాటూ వైరస్ స్వరూపంలో వచ్చే మార్పులపై ఈమె పరిశోధనలు చేస్తున్నారు.
అంటువ్యాధుల గ్రాఫ్‌లో ఏడాదంతా హెచ్చుతగ్గులు వస్తుంటాయని మార్టినెజ్ భావిస్తున్నారు.
“మనుషులకు వచ్చే ప్రతి అంటువ్యాధికి ఒక నిర్దిష్ట సీజన్ ఉంటుంది. అంటే చలికాలంలో ఫ్లూ, జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే.. మిగతా సీజన్లలో పోలియో, మీజిల్స్, చికెన్ పాక్స్ వంటివి వ్యాపిస్తుంటాయి. ఫ్లూ లక్షణాలుండే కరోనా కూడా చలికాలంలో ఉద్ధృతం కావొచ్చని అనుకుంటున్నారు”
దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
కరోనావైరస్‌పై ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలను బట్టి, తేమ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా వ్యాపించడం కష్టంగా ఉంటుంది.
“ఫ్లూ కేసుల్లో ఉష్ణోగ్రత, గాలిలో ఉన్న తేమ ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. అది కచ్చితంగా ఒక సమస్యే. వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుందా, లేదా అనేదానికి తేమ కీలక పాత్ర పోషిస్తుంది”
అంటే, చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల గాలిలో తేమ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఈ వైరస్ గాలిలో ఎక్కువ కాలం ఉండగలదు
మూసివున్న ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తుందని మనకు తెలుసు. చలికాలంలో జనం ఎక్కువగా తలుపులు మూసుకుని నివసిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
“ఈ రెండు వాస్తవాలను మనం మనుషుల ప్రవర్తనకు కలిపి చూసినప్పుడు చలికాలంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందనే అనిపిస్తుంది” అంటారు మికెలా మార్టినెజ్ చెప్పారు.
శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో సీజన్ మారడంతోపాటూ వైరస్‌లో వచ్చే మార్పులను చూపించే ఎన్నో అధ్యయనాలు చేశారు.
కానీ ప్రయోగశాలల్లో వచ్చే ఫలితాలకు ఒక పరిధి ఉంటుంది. బయట కూడా అవే ఫలితాలు రావాల్సిన అవసరం లేదు. కానీ, ఒక అంటువ్యాధి పరిధిలోకి లక్షలమంది వచ్చినపుడు, అది అడవిలో కార్చిచ్చులా మారవచ్చు.
“ఒక అంటువ్యాధిని మనం అడవిలో కార్చిచ్చులా అనుకోవచ్చు. చిన్న వర్షం పడినా కార్చిచ్చు కాసేపు తగ్గుతుంది. కానీ పూర్తిగా ఆరిపోదు. కరోనా రోగులు కూడా అడవిలో కార్చిచ్చులాగే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. ఈ కార్చిచ్చు ఈ ఏడాది ఆరిపోవడమనేది జరగదు” అన్నారు మికెలా.
“కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో ముందు కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోవచ్చు” అని బ్రిటన్ ఒక నివేదికలో హెచ్చరించడానికి కూడా బహుశా ఇదే కారణం.

ఫొటో సోర్స్, Hetero
మందులకోసం అల్లాడుతున్న రోగులు
న్యూయార్క్ టైమ్స్ హెల్త్ అండ్ సైన్స్ జర్నలిస్ట్ కాథరీన్ చలికాలంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండండపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న చికిత్సా పద్ధతులు, దానికి అవసరమయ్యే మందులపై దృష్టి పెట్టాలని చెప్పారు.
పరిశోధకులు కరోనాకు చాలా పద్ధతులు ఉపయోగిస్తున్నారు. మొదట, రోగులకు శరీరంలో కరోనా పెరగకుండా, ఇన్ఫెక్షన్ పెరగకుండా అడ్డుకునేలా మందులు ఇవ్వాలి. రెండోది రోగుల రోగనిరోధక శక్తి బలహీనంగా లేకుండా చూసుకోవాలి. దానికోసం రెమెడెసివీర్, డెక్సామెథాసోన్ ఉపయోగిస్తున్నారు అన్నారు.
ట్రయల్స్ లో ఈ రెండు మందుల వల్ల మంచి ఫలితాలు లభించాయి. డెక్సామెథాసోన్ లభ్యత గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు. మూడు నెలలకు సరిపోయే రెమెడెసివీర్ స్టాకును అమెరికా కొనుగోలు చేసింది.
ఎప్పుడూ ఇదే జరుగుతూ వస్తోంది. మహమ్మారి వ్యాపించినపుడు ఏ మందు పనిచేస్తుందని నిరూపితమవుతుందో.. ఆ మందు వెనక పరుగులు తీస్తారు. తర్వాత ఆ మందు దొరకడం కష్టం అవుతుంది. రోగులు రెమెడెసివీర్ కోసం అల్లాడుతున్నారని నాకు చాలమంది డాక్టర్లు చెప్పారు అని ఆమె తెలిపారు.
కరోనావైరస్ చికిత్స కోసం మూడో పద్ధతి ఉపయోగిస్తున్నారు. అదే బ్లడ్ ప్లాస్మా థెరపీ.
ఇన్ఫెక్షన్ రోగుల చికిత్స కోసం ఈ విధానాన్ని వందేళ్లకు ముందు నుంచే ఉపయోగిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ప్లాస్మా మరో వ్యక్తిపై ప్రభావం చూపిస్తుందా, అనే దానికి ఎలాంటి గ్యారంటీ లేకపోవడమే సమస్య. బ్లడ్ ప్లాస్మా థెరపీ గాంబ్లింగ్ లాంటిది అని కేథరీన్ వూ అన్నారు.
కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత సమయానికి చికిత్స అందడంతో కోలుకున్నవారు లక్షలమంది ఉన్నారు.
కానీ చలికాలంలో కరోనావైరస్ వీరిని మళ్లీ టార్గెట్ చేస్తుందా?
“ఇప్పటివరకూ కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తికి, మళ్లీ కరోనా రావడం లాంటి కేసులు బయటపడలేదు,. మళ్లీ కరోనా రావడం చాలా పెద్ద సమస్య కావచ్చు. ఒకసారి కరోనా వచ్చినవారికి, మళ్లీ అది రాదని ప్రస్తుతానికి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేం” అంటారు కేథరీన్.
అయినా, రోగనిరోధక శక్తి కవచం వైరస్ నుంచి ఎప్పటివరకూ కాపాడుతుంది. ఈ ప్రశ్న చాలా కీలకం. దానివల్ల కరోనాను కంట్రోల్ చేయడానిక సాయం లభించడమే కాదు, ప్రభావవంతమైన వాక్సిన్ తయారీ గుట్టు కూడా ఆ ప్రశ్నలోనే దాగుంది.
ప్రస్తుతానికి వాక్సిన్ గురించి నెలకొన్న అనిశ్చితి, చలికాలంలో కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనలు, భయాలను మరింత పెంచుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సరైన వ్యూహం
“ఫ్లూ సీజన్ వచ్చినపుడు, మనం కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కోవాల్సి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ వేవ్‌ను మనం ఎలా ఎదుర్కొంటాం? వ్యాధి వ్యాపించకుండా ఎలా అడ్డుకుంటాం? కరోనా రోగులకు ఎలాంటి చికిత్స అందించగలం? అనేదే ఇప్పుడు ప్రశ్న” అని బార్సిలోనా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ లేబర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జుడిథ్ వాల్ అంటున్నారు.
“2020 మొదటి 8 నెలల్లో ఎదురైన అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం అవసరం” అని జూడిథ్ చెబుతున్నారు.
చలికాలంలో కరోనా ముప్పు పెరిగే అవకాశాలపై మాట్లాడిన ఆమె “వ్యవస్థలో సమన్వయం పెంచాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పెద్ద ఆస్పత్రుల సమన్వయం అవసరం. కానీ స్థాయి కంటే ఎక్కువ పరీక్షలు చేయాలి. సీరియస్‌గా ఉన్న రోగులనే పెద్ద ఆస్పత్రుల్లో చేర్పించాలి. అప్పుడే సెకండ్ వేవ్ పరిస్థితి ఎదురైనా వ్యవస్థ సమర్థంగా పనిచేయగలుగుతుంది” అన్నారు.
“అంతేకాదు, చలికాలంలో కరోనా కేసులు పెరగకుండా అదుపు చేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ మరింత సమర్థంగా చేయాలి. ఇంతకు ముందు 8 నెలలు కాంటాక్ట్ ట్రేసింగ్ సరిగా జరగలేదు. దాని ఫలితాన్ని ప్రపంచమంతా అనుభవిస్తోంది” అని జుడిథ్ చెప్పారు.
“ఇప్పుడు ప్రజలు, ఆరోగ్య వ్యవస్థ, రాజకీయ నాయకత్వం ఇంతకు ముందుకంటే ఎక్కువ సన్నద్ధంగా ఉన్నారు. అందుకే మనం సెకండ్ వేవ్ నుంచి బయటపడగలమని నాకు అనిపిస్తోంది. ఇంతకు ముందుతోపోలిస్తే తక్కువ ప్రాణనష్టం ఉంటుంది. గతంలో కంటే తక్కువ ఆంక్షలు ఉంటాయి” అంటారు జుడిథ్
ప్రొఫెసర్ జుడిథ్ ఇచ్చిన నమ్మకం, మనలో ధైర్యం పెంచుతోంది. కానీ, వివిధ దేశాల్లో రకరకాల పరిస్థితులు ఉండడం వల్ల ఇది అన్నిచోట్లా అమలుకాదు.
చలికాలంలో పరిస్థితులు అదుపు తప్పితే ఒక్క బ్రిటన్‌లోనే 2,51,000 మంది చనిపోవచ్చని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనావైరస్ చలికాలంలో ఇబ్బంది కలిగించే మిగతా వైరస్‌తో కాంటాక్టులోకి వస్తుందా, అదే జరిగితే, అప్పుడు వాటిలో ఎలాంటి పోటీ ఉంటుందో శాస్త్రవేత్తలకు ఇంకా అంతుపట్టడం లేదు.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో రాజకీయ నాయకత్వం కరోనావైరస్ సెకండ్ వేవ్‌ను తట్టుకునేందుకు, తమ దేశాన్ని పూర్తి సన్నద్ధంగా ఉంచినట్లు అనిపించడం లేదని జియో-పాలిటిక్స్ ఆఫ్ ఎమోషన్ రచయిత డొమినిక్ మోజీ అన్నారు.
“మీకు ఏ భయం లేకపోవచ్చు, కానీ నేను కచ్చితంగా భయపడుతున్నా. మనం చాలా వింత పరిస్థితుల్లో ఉన్నాం. దాని వెనుక చాలా విచిత్రమైన వారు ఉన్నారు” అని చెప్పారు.
మనమంతా ఒక దానికి భయపడచ్చు. కానీ, ఆ భయం పట్ల మన వైఖరి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఆసియాలో సివిక్ సెన్స్ భిన్నంగా ఉంటుంది. జనం అక్కడ మాస్క్ వేసుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికి, సామూహిక జీవనం ఎంత ముఖ్యమో వారికి తెలుసు. కానీ పశ్చిమ దేశాల్లో సామాజిక బాధ్యత, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పుగా మారడం మనం చూస్తున్నాం” అన్నారు.
వివిధ దేశాల్లో రకరకాల మూడ్ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ, చలికాలంలో కరోనా కేసులు పెరగడం అన్ని ప్రభుత్వాలకు ప్రమాదకరం కావచ్చు.
“కరోనా వల్ల తలెత్తిన ఆరోగ్య సంబంధిత కోణం ప్రముఖ నేతలకు, వారి ప్రభుత్వాలకు ఇబ్బంది తెచ్చిపెట్టవచ్చు. బ్రెజిల్‌లో బోల్సొనారో, అమెరికాలో డోనల్డ్ ట్రంప్‌ను దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలకు చాలా ప్రమాదకరమని నిరూపితం కాగలద”ని డోమినిక్ మోజీ అన్నారు.
సామాన్యుల ఆరోగ్యం, దేశ ఆర్థికవ్యవస్థలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిపై ప్రపంచ నేతల అభిప్రాయాలు, వైఖరి వేరువేరుగా ఉంది.
కరోనా ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ప్రభుత్వాల అసలు నిజాన్ని బయటపెట్టింది. కరోనా వ్యాపించిన తర్వాత ఏర్పడిన దారుణమైన పరిస్థితుల వల్ల ప్రజాగ్రహం ముందెప్పుడూ లేని స్థాయికి చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా సంక్షోభం వివిధ దేశాల మధ్య విభేదాలను మరింత పెంచింది. అందుకే ఆయా దేశాల నేతలు కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి కలిసి పోరాడలేకపోతున్నారు.
“అమెరికా, చైనా మధ్య కోల్డ్-వార్ కరోనా సంక్షోభంతో చాలా పెరిగింది. అమెరికా బయట డోనల్డ్ ట్రంప్‌కు ఒక శత్రువు దొరికాడు. అలాగే కరోనాతో అమెరికాకు కంటిమీద కునుకు లేకపోవడంతో చైనా కూడా సంతోషించింది” అంటారు డొమినిక్ మోజీ
ఈ ఒత్తిడి ప్రభావం కరోనా వైద్య పరిశోధనలపై కూడా పడింది. వాక్సిన్ మొదట ఎవరు తయారుచేస్తారు, ఎవరు ఆలస్యంగా తయారు చేస్తారు అనేది కూడా ఈ ఒత్తిడే నిర్ణయిస్తుందా?
“మొదట వాక్సిన్ తయారుచేసే దేశం, ఒక విధంగా తన బలాన్ని ప్రదర్శిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వాక్సిన్ తయారీలో వివిధ దేశాలు ఒకేసారి విజయవంతం అయితే, అప్పుడు వాక్సిన్‌ను బ్లాక్‌మెయిల్ చేసే ఒక ఆయుధంలా ఉపయోగించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది” అంటారు మోజీ
చలికాలంలో కరోనావైరస్ మరింత వినాశనం సృష్టిస్తుందా. ఇంతకు ముందు కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారా. ఈ ప్రశ్నకు సమాధానంలో చాలా కోణాలు ఉన్నాయి.
చలికాలంలో కరోనావైరస్ ఎక్కువ ఇబ్బంది పెడుతుందని చాలామంది నిపుణులు అంగీకరిస్తున్నారు. కరోనావైరస్ మొదట్లో ప్రపంచం దానికి సిద్ధంగా లేదు. ఎవరికీ ఎలాంటి అనుభవం లేదు. చాలా మంది దానిని నిర్లక్ష్యం కూడా చేశారు.
కానీ ఇప్పుడు ప్రపంచానికి కరోనావైరస్ గురించి ఇంతకు ముందు కంటే ఎక్కువే తెలుసు. ప్రజలకు కరోనావైరస్‌తో పోరాడిన అనుభవం కూడా ఉంది. అందుకే సమస్యలు ఎదురైనప్పటికీ, చలికాలంలో కూడా కరోనా నుంచి బయటపడవచ్చు. అవసరమైతే పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








