లాక్‌డౌన్‌లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?

డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో పురుషులు ఇంటి పనుల కోసం గంట ఎక్కువగా వెచ్చించారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో పురుషులు ఇంటి పనుల కోసం గంట ఎక్కువగా వెచ్చించారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పురుషులు ఇంటిపని ఇదివరకటి కంటే ఎక్కువగానే చేశారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చేసిన ఓ అధ్యయనం సూచిస్తోంది. మరి, లింగ సమానత్వం విషయంలో దేశం పురోగతి సాధిస్తోందని చెప్పుకునేంతగా, కోవిడ్-19 సంక్షోభం పరిస్థితిని మార్చిందా?

డాక్టర్ రాహుల్ నాగర్ దిల్లీలో చర్మ వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు.

ఇంటి పనుల విషయంలో తమ ఇంట్లో ఎప్పుడూ ఓ విభజన రేఖ ఉండేదని ఆయన అంటున్నారు.

రాహుల్ భార్య కూడా వైద్యురాలే. వారి బాబు లాలనాపాలన చూసుకోవడం, వంట చేయడం వంటి బాధ్యతలు ఆమెవే. ఇంట్లో పాత్రలు తోమేందుకు మాత్రం ఓ మనిషిని పెట్టుకున్నారు.

రాహుల్ ఇంట్లో చిన్న చితకా పనులు మాత్రమే చేసేవారు.

కానీ, కోవిడ్-19 సంక్షోభం వచ్చాక పరిస్థితి మారింది. దేశంలో కఠినమైన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. పాత్రలు తోమేందుకు పెట్టుకున్న మనిషి రావడం మానేశారు.

‘‘లాక్‌డౌన్‌కు ముందు ఇంట్లో నా భార్య ఐదు గంటలు పనిచేస్తే, నేను ఒక గంట చేసేవాడిని. లాక్‌డౌన్ తొలి రెండు నెలలు మేం ఇద్దరం ఇంటి పనులు పంచుకున్నాం. నా భార్య ప్రభుత్వ వైద్యురాలు. ఆమెకు ఇంట్లో ఉండే వీలులేదు. ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో నేనూ పనులు పంచుకునేవాడిని’’ అని అన్నారు రాహుల్.

‘‘మా బాబును చూసుకున్నా. వాడికి తినిపించడం, స్నానం చేయించడం. ఆన్‌లైన్ క్లాసులు వినిపించడం... ఇవన్నీ నేను చేశా. లాక్‌డౌన్ సమయంలో ఇల్లు తుడవడం కూడా నా పనే. వంట కూడా ప్రయత్నించా’’ అని చెప్పారు.

ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో, వారంలో కొన్ని రోజులు తాను క్లినిక్‌కు వెళ్తున్నానని రాహుల్ చెప్పారు. సాయంగా పెట్టుకున్న మనిషి కూడా తిరిగి వస్తున్నారని వివరించారు.

‘‘కానీ, ఇంకా మా బాబు ఆన్‌లైన్ క్లాసులు వినిపించే పని నేనే చేస్తున్నారు. ఇప్పుడు నా భార్య, నేను... పనుల్లో, బాబు లాలనాపాలనలో సగం సగం బాధ్యతలు పంచుకుంటున్నాం’’ అని రాహుల్ చెప్పారు.

ఒక్క రాహుల్ మాత్రమే కాదు. భారత్ వ్యాప్తంగా ఇలా లాక్‌డౌన్ తొలి నెల (ఏప్రిల్)లో పురుషులు ఇంటి పనుల్లో ఇదివరకటి కన్నా ఎక్కువగా పాలుపంచుకున్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) అధ్యయనం సూచిస్తోంది.

అశ్వినీ దేశ్‌పాండే
ఫొటో క్యాప్షన్, అశ్వినీ దేశ్‌పాండే

ఈ అధ్యయన సమాచారాన్ని అశోకా యూనివర్సిటీలోని ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అశ్వినీ దేశ్‌పాండే విశ్లేషించారు.

2019 డిసెంబర్, 2020 ఏప్రిల్ మాసాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె పోల్చి చూశారు.

లాక్‌డౌన్ సమయంలో అటు పురుషులకూ, ఇటు మహిళలకూ ఇంటి పనులు చేసే సమయం పెరిగిందని అశ్వినీ అంటున్నారు. ఈ పెరుగుదల పురుషుల విషయంలో ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. కానీ, ఇప్పటికీ మహిళలే ఎక్కువ సమయం పనిచేస్తున్నారని వివరించారు.

‘‘లాక్‌డౌన్ మొదటి నెలలో ఇంటి పనులకు వెచ్చిస్తున్న సమయం విషయంలో మహిళలకు, పురుషులకు మధ్య వ్యత్యాసం చాలా రాష్ట్రాల్లో, జాతీయవ్యాప్తంగా తగ్గింది. డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో పురుషులు ఇంటి పనుల కోసం గంట ఎక్కువగా వెచ్చించారు. డిసెంబర్‌లో వాళ్లు గంటన్నర ఇంటి పనులు చేసేవారు. ఏప్రిల్‌లో రెండున్నర గంటలు చేశారు. మహిళలు డిసెంబర్‌లో నాలుగు గంటలు పని చేసేవారు. ఏప్రిల్‌లో నాలుగు గంటల 36 నిమిషాలు పనిచేశారు’’ అని అశ్వినీ వివరించారు.

ఇంటి పనులకు వెచ్చించే సమయం విషయంలో పురుషులకు, మహిళలకు వ్యత్యాసం బాగా తగ్గిన రాష్ట్రాల జాబితాలో దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు ముందున్నాయి.

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అట్టడుగున ఉన్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం 2018లో భారత్‌లోని పట్టణాల్లో ఇంటి పనుల కోసం రోజూ మహిళలు 312 నిమిషాలు వెచ్చించగా, పురుషులు 29 నిమిషాలు వెచ్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 291 నిమిషాలు వెచ్చించగా, పురుషులు 32 నిమిషాలు వెచ్చించారు.

లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా కుటుంబాలు ఇళ్లకే పరిమతమవ్వాల్సి రావడంతో ఇంటి పనుల విషయంలో ఉన్న లింగ అసమానతలపై దృష్టి పెరిగింది.

ఇంటి పనుల కోసం పురుషులు వెచ్చించిన సమయం పెరగడానికి నిరుద్యోగ రేటు వృద్ధి ప్రధాన కారణమని అశ్వినీ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో దేశంలో 10.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఆమె అన్నారు.

ఇంట్లో సాయం కోసం నియమించుకున్న మనుషులు రాకపోవడంతో... నగరాల్లో కాస్త ఉన్న కుటుంబాల్లోని పురుషులు కూడా ఒళ్లు వంచాల్సి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.

‘ఇప్పటికీ మహిళలే ఇంటి పనుల కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు’
ఫొటో క్యాప్షన్, ‘ఇప్పటికీ మహిళలే ఇంటి పనుల కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు’

43,600 మందిపై గత ఏడాది డిసెంబర్‌లో, మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో సర్వే చేసి సీఎంఐఈ ఈ సమాచారం వెల్లడించింది.

‘‘ఇది ప్రాథమిక సమాచారమే. రాబోయే నెలల్లోనూ సమాచారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మార్పు తాత్కాలికమా, శాశ్వతమా అన్నది తెలుస్తుంది. మళ్లీ, సెప్టెంబర్‌లోనే మనకు సీఎంఐఈ సమాచారం ఎప్పుడు వస్తుందనేది తెలుస్తుంది’’ అని అశ్వినీ దేశ్‌పాండే అన్నారు.

అయితే, ఏప్రిల్‌లో మొదలైన ఈ మార్పు ఆ తర్వాత కూడా కొంత కొనసాగుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది.

ఇంటిపనులను ఎలా పంచుకుంటారనే విషయమై గత నెల నేను నా స్నేహితులను, సహోద్యోగులను ఆరా తీశా.

‘‘నా భాగస్వామి ఇంటి పనులు పంచుకోవడంతో... మా ఇద్దరికీ పరిస్థితి సులువైంది. లేకపోతే, ఈ లాక్‌డౌన్‌ను‌ తట్టుకుని నేను నిలబడేదాన్ని కాదు’’ అని సారా హసన్ అనే ఆవిడ చెప్పారు.

‘‘చిన్నప్పుడు నేను ఇంటి పనులు, వంట పనుల్లో అమ్మకు సాయం చేస్తుండేదాన్ని. నా సోదరుడు సొంతంగా అన్నం కూడా వడ్డించుకునేవాడు కాదు. కానీ, ఈ లాక్‌డౌన్ అతడిని ఓ షెఫ్‌ను చేసేసింది. ఇప్పుడు ఎక్కువ సమయం వంట గదిలోనే గడుపుతున్నాడు’’ అని పల్లవి సరీన్ అనే మహిళ తన అనుభవాన్ని వివరించారు.

కోవిడ్-19 సంక్షోభం లాంటి కొన్ని చారిత్రక ఘటనలు సమాజంలో శాశ్వత మార్పులు కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ఇంటిపనులు మహిళలు చేయాలనే దశ నుంచి సమానత్వం వైపు ఆ దేశాలు మారిన సమయం అదే’’ అని అశ్వినీ దేశ్‌పాండే అన్నారు.

మరి, భారత సమాజంలోనూ ఈ కరోనా సంక్షోభం లింగ సమానత్వం దిశగా మంచి మార్పుకు దారి తీస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఇంకా కొన్ని నెలలు వేచిచూడాలని అంటున్నారు అశ్వినీ దేశ్‌పాండే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)