కరోనావైరస్: బ్రెజిల్‌లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?

మాస్కు ధరించిన బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

లక్ష వరకూ లెక్కించడానికి ఎంతసేపు పడుతుంది. కరోనా మహమ్మారి విషయానికి వస్తే బ్రెజిల్‌లో మొదటి కోవిడ్ మృతి నుంచి లక్ష మరణాలకు చేరుకోడానికి 164 రోజులు పట్టింది.

అక్కడ మొదట్లో మరణాల రేటు అంత వేగంగా లేదు. మార్చి 12న దేశంలో మొదటి మృతి నమోదైంది. ఆ తర్వాత మే 9 వరకూ కరోనా వల్ల 10 వేల మంది చనిపోయారు.

ఆ తర్వాత మహమ్మారి గ్రాఫ్ పెరుగుతూ వెళ్లింది. నెల తర్వాత దేశంలో కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 50 వేలు దాటింది.

బ్రెజిల్‌లో గురువారం నాటికి 1,04,201 మంది కరోనా వల్ల చనిపోయారు. భారత్‌లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఎన్నడూ లేనంతగా 66,999 కొత్త కేసులు నమదయ్యాయి. మృతుల సంఖ్య 47 వేలు దాటింది. చిన్న పట్టణాల్లో కూడా కరోనా విలయం మొదలైంది. మరోవైపు దేశంలో లాక్‌డౌన్ దాదాపు ఎత్తివేశారు. ఇలాంటి సమయంలో, కరోనాను అడ్డుకోడానికి భారత్ ఏం చేస్తోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బ్రెజిల్‌, సావ్ పాలోలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో 199 మంది చనిపోయారు. ఈ దేశంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదం ఇదే. దీనిని కరోనా మహమ్మారితో పోల్చిచూస్తే, ఫిబ్రవరి 26 తర్వాత ఇలాంటి ప్రమాదం 505 సార్లు జరిగిందని అనుకోవాలి.

బ్రెజిల్‌లో కరోనా మొదటి కేసును ఫిబ్రవరి 26న ధ్రువీకరించారు. గత ఐదు నెలలుగా ప్రతి రోజూ ఈ విమాన ప్రమాదంలో మరణించినవారి కంటే మూడు రెట్లు ఎక్కువగా కోవిడ్-19 వల్ల చనిపోతున్నారు.

कोरोना

ఫొటో సోర్స్, Getty Images

బ్రెజిల్‌లోని చాలా పట్టణాల జనాభా లక్షకు లోపే ఉంటుంది. అంటే ఎన్నో పట్టణాల మొత్తం జనాభా కంటే ఎక్కువమంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు.

అమెరికా తర్వాత ప్రపంచంలో లక్షకు పైగా కరోనా మరణాలు బ్రెజిల్లోనే నమోదయ్యాయి. అమెరికాలో ఈ సంఖ్య లక్షా 61 వేలు దాటింది.

ఇక, మొత్తం కేసుల సంఖ్యతో మరణాలను పోలిస్తే బ్రెజిల్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. తక్కువ జనాభా ఉన్న శాన్ మారియో, ఎండోరాలో మరణాల శాతం దీనికంటే ఎక్కువ. అయితే ఈ దేశాల్లో కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి.

అటు ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, బెల్జియం, స్వీడన్ మరణాల శాతం కూడా బ్రెజిల్ కంటే ఎక్కువగానే ఉంది. అయితే ఈ దేశాల్లో ఇటీవల కరోనా మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని దేశాల్లో ఈ సంఖ్య రోజుకు పది కంటే తక్కువే ఉంది.

కానీ ప్రపంచంలోని పది అత్యధిక జనాభా ఉన్న దేశాల విషయానికి వస్తే బ్రెజిల్‌లో ప్రతి పది లక్షల మందిలో మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ‘అవర్ వరల్డ్ ఇన్ డేటా’ ప్రకారం బ్రెజిల్‌లో ప్రతి పది లక్షల మందిలో 473 మంది కరోనా వల్ల చనిపోయారు. అమెరికాలో ఇది 487గా ఉంది.

కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వల్ల సంభవించే రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతోంది. బ్రెజిల్‌లో కరోనా రోజువారీ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఆగస్టు 2న దేశంలో 1437 మృతులు నమోదయ్యాయి. జులై 29న 1595 మంది చనిపోయారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

బ్రెజిల్‌లో మరణాల సంఖ్య లక్ష దాటినా, అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు సంకేతాలు కనిపించడం లేదు. ఈ అనూహ్య మహమ్మారిని అదుపుచేయడంలో బ్రెజిల్ ఎంత విఫలమైందో ఇది స్పష్టం చేస్తోంది.

“మృతుల సంఖ్య లక్ష దాటడం మా అసమర్థతకు సంకేతం. మేం దీనిని బాగా నియంత్రించి ఉండచ్చు” అని యూనివర్సిటీ ఆఫ్ సావ్ పాలో మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ డాక్టర్ నతాలియా పాస్టర్నేక్ చెప్పారు.

కరోనాను ఎదుర్కోవడంలో బ్రెజిల్ ఎలాంటి పొరపాట్లు చేసిందో తెలుసుకోడానికి బీబీసీ న్యూస్ బ్రెజిల్ నేతలు, పరిశోధకులు, వైద్య సిబ్బందితో మాట్లాడింది. వారందరి దీనికి రకరకాల కారణాలు చెప్పారు.

“ఈ గణాంకాలు ఒక దేశంగా మేం వైరస్‌ను అడ్డుకోవడంలో ఎంత విఫలమయ్యాం అనేది చెబుతున్నాయి” అని బ్రెజిల్‌లో కరోనా వైరస్ జెనెటిక్ మాపింగ్ చేసిన గ్రూప్‌కు చెందిన ఇస్టర్ సెబీనో చెప్పారు.

“బ్రెజిల్‌లో ఈ మహమ్మారి అంతమయ్యే సంకేతాలు ఇప్పటికీ కనిపించడం లేదు. పరిస్థితులు మారకపోతే, రోజుకు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతూ ఉంటే.. తర్వాత లక్ష మరణాలను మేం వంద రోజుల్లోనే చేరుకుంటాం” అని యూనివర్సిటీ ఆఫ్ సావోపావులో ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఇస్టర్ అన్నారు.

అలాంటప్పుడు, బ్రెజిల్ ఎలాంటి తప్పులు చేసింది, ఇప్పటివరకూ కరోనా నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

1.మహమ్మారికి పూర్తిగా సిద్ధంగా లేదు

బ్రెజిల్, ప్రపంచంలోని చాలా దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమవడానికి ఒక అతిపెద్ద కారణం, ఈ స్థాయి మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచం సిద్ధంగా లేకపోవడమే.

“ఇలాంటి మహమ్మారిని ఎవరూ ఊహించరు. చాలామంది ఇది కల్పితం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దానిని అడ్డుకోడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు సరిపోలేదు ఇంతకు ముందు వచ్చిన సార్స్, మర్స్, హెచ్1ఎన్1 లాంటి కరోనా వైరస్‌లు వాటి గురించి మొదట్లో అనుకున్నంత తీవ్రమైనవి కావని తేలింది” డాక్టర్ సెబీనో చెప్పారు.

ఉదాహరణకు హెచ్1ఎన్1 వైరస్‌ వల్ల 16 నెలల్లో 4,93,000 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18 వేల మరణాలు సంభవించాయి.

మరోవైపు, సార్స్ 8 వేలు, మర్స్ 2500 కేసులు నమోదయ్యాయి. వీటితో పోల్చిచూస్తే, ఇప్పటివరకూ కరోనా వైరస్‌ వల్ల కోటీ 95 లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. 7 లక్షల 23 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రభావం లేకపోవడంతో, తమ దగ్గర కొత్త వైరస్‌ను ఎదుర్కోడానికి తగిన వనరులు ఉన్నాయని అధికారులకు అనిపించింది.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

2.కరోనావైరస్‌కు వ్యతిరేకంగా జాతీయ విధానం ఏదీ లేదు

చైనా కొత్త వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చిన రెండు నెలల తర్వాత బ్రెజిల్‌లో మొదటి కరోనా కేసు నమోదైంది. అప్పటికే 38 దేశాల్లో 81 వేలకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ మహమ్మారి బ్రెజిల్ చేరుకునేవరకూ, ఆ తర్వాతా దానికి వ్యతిరేకంగా ఎలాంటి జాతీయ విధానాలు రూపొందించలేదు. కనీసం ప్రాంతీయ స్థాయిలో కూడా ఎలాంటి ప్రణాళికలూ లేవు.

రాష్ట్రాలు, ప్రాంతాలు, నగర కర్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య కరోనా వైరస్‌ను అడ్డుకోడానికి సంయుక్త వ్యూహం లేదా సమన్వయం ఏదీ లేకుండా పోయింది. బదులుగా అవి పరస్పరం విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి. బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మహమ్మారి పరిస్థితి మెరుగుపడడానికి, కొన్ని ప్రాంతాల్లో మరింత ఘోరంగా మారడానికి ఇదే కారణం.

ఒక మహమ్మారిని నియంత్రించడం కష్టమే, కానీ అది అసాధ్యం కాదు. దానికి ఒక సమర్థవంతమైన వ్యూహం సిద్ధం చేయాలంతే. కానీ, బ్రెజిల్‌లో ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టమైన విధానం లేదు. ఇప్పుడు బ్రెజిల్‌లో వాక్సిన్ తయారీ కోసం, కరోనా అంతం అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

“దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగించినా, వైరస్‌తో పోరాటం బలహీనంగానే ఉంది. అధ్యక్షుడు జాయిర్ బోల్సొనారోతో విబేధాల వల్ల లూయిస్ హెన్రిక్ మెన్‌డెటా, నెల్సన్ టైఫ్ రాజీనామా చేశారు. ఈ మంత్రి పదవిలో ఇప్పటికీ జూనియర్ మంత్రి జనరల్ ఎడ్వార్డ్ పెజూలియోనే ఉన్నారని” సెబీనో చెప్పారు.

“కరోనాపై మెన్‌డేటా ఒక ప్రణాళిక రూపొందించారు. అది సగానికే చేరింది. తర్వాత విఫలమైంది. దీంతో కరోనా నియంత్రణకు బ్రెజిల్ స్పందన బలహీనంగా మారింది. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన విధానాలు ఒక్క రాత్రిలో రూపొందించలేం” అంటారు సెబీనో.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

3.అధ్యక్షుడు బోల్సొనారో మహమ్మారిని తక్కువ అంచనా వేశారా?

వైరస్ గురించి మొదట ఒక ప్రకటన చేసిన అధ్యక్షుడు బోల్సొనారో “వైరస్ భయాన్ని చాలా పెద్దది చేసి చూపిస్తున్నారు. ఇది మామూలు జలుబు, దగ్గే” అన్నారు. ఆయన సోషల్ డిస్టెన్సింగ్‌ను కూడా విమర్శించారు.

“ఏదో ఒక రోజు మనమందరం చనిపోవాల్సిందే కదా, ఈ వ్యాధి గురించి జనాల్లో ఆందోళన ఉంది, ఇదంతా కల్పితమే” అని కూడా బోల్సినారో అన్నారు.

ఆయనను మృతుల గణాంకాల గురించి అడిగితే, “అయితే ఏంటి, నన్ను క్షమించండి. మీకు, ఏం కావాలి. నేనేం చేయాలి. నేను గొప్పవాడినే.. కానీ, అద్భుతాలు చూపించలేను” అన్నారు.

తాజాగా అధ్యక్షుడిని మరణాల సంఖ్య లక్ష దాటడం గురించి ప్రశ్నించినపుడు, “మేం జీవించే దిశగా ముందుకెళ్తున్నాం. మేమంతా ఈ సమస్య నుంచి బయటపడతాం” అన్నారు.

మహమ్మారి పట్ల అధ్యక్షుడి ఈ వైఖరి చాలా ప్రాణాంతకమని నిరూపితమైందని నతాలియా పాస్టర్నాక్ అన్నారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

4.భారీ స్థాయిలో కరోనా టెస్టులు జరగలేదు

“బ్రెజిల్ ఒక తప్పు చేసింది. అది ఇప్పటికీ జరుగుతోంది. ఆ తప్పు ప్రజలకు భారీ స్థాయిలో పరీక్షలు చేయకపోవడం” అని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ పరిశోధకులు మార్గరెట్ డాల్కోల్మో అంటున్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకూ 21 లక్షలకు పైగా కోవిడ్-19 పరీక్షలు చేశారు. ఈ గణాంకాల్లో ఆస్పత్రుల్లో, ప్రైవేటు క్లినిక్‌లలో జరిగిన టెస్టులు చేర్చలేదు.

ఈ పరీక్షలు బ్రెజిల్ జనాభాలో ఒక శాతం మాత్రమే. 12 శాతం జనాభాకు పరీక్షలు చేయాలనే లక్ష్యానికి ప్రభుత్వం చాలా దూరంలో ఉంది.

టెస్టులు చేయకుండా ఎవరెవరు పాజిటివ్ రోగులకు కాంటాక్టులోకి వచ్చారో తెలుసుకోవడం కష్టం. వైరస్ చెయిన్‌ను తెంచాలంటే పాజిటివ్ రోగులు, వారితో కాంటాక్టులోకి వచ్చినవారిని ఐసొలేట్ చేయడం చాలా ముఖ్యం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలాసార్లు చెప్పింది.

“వైరస్‌ను నియంత్రించడంలో విజయవంతమైన దేశాల్లో ఇదే మోడల్ అమలు చేస్తున్నారు. దక్షిణ కొరియా కూడా ఈ మోడల్ అమలుచేసింది. నా అంచనా ప్రకారం అత్యంత మెరుగైన మోడల్ కూడా ఇదే” అని ప్రొఫెసర్ డాల్కోమో చెప్పారు.

कोरोना

ఫొటో సోర్స్, Reuters

5. సామాజిక దూరం పాటించడం లేదు

“మరణాలు ఇంత భారీగా ఉండడానికి దేశంలో లాక్‌డౌన్ అమలు చేయకపోవడం కూడా ఒక కారణం. ఒక నగరం లేదా ప్రాంతం పూర్తిగా దిగ్బంధించడాన్ని లాక్‌డౌన్ అంటారు” అని డాల్కోమో అంటారు. ఉదాహరణకు కరోనాకు అత్యంత ప్రభావితమైన సావ్ పాలోలో లాక్‌డౌన్ అమలు చేయలేదు. వైద్య సేవలు కుప్పకూలిన అమెజోనాస్‌లో కూడా లాక్‌డౌన్ విధించలేదు.

కోర్టుల ఆదేశాల తర్వాత లాక్‌డౌన్ అమలు చేసిన పట్టణాలు, ప్రాంతాల్లో కూడా ప్రజల రాకపోకలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. దేశంలో 70 శాతం జనాభా రాకపోకలపై నిషేధం విధించాలని డబ్ల్యుహెచ్ఓ సలహా ఇచ్చింది.

రియోలోని కొన్ని కార్పొరేషన్లలో( రాజధాని కాదు) లాక్‌డౌన్ అమలు చేశారు. అక్కడ కూడా గరిష్టంగా 57 శాతం జనాభానే నియంత్రించగలిగారు. అయితే, అక్కడ కఠిన లాక్‌డౌన్ అమలుచేయాలనే ఆదేశాలు ఉన్నాయి.

“మహమ్మారి ప్రారంభంలో చైనా, స్పెయిన్‌లా కఠిన లాక్‌డౌన్ అమలు చేసుంటే, దేశంలో ప్రజల ప్రాణాలు కాపాడి ఉండచ్చు” అని పాస్టర్నాక్ అంటున్నారు.

कोरोना

ఫొటో సోర్స్, Getty Images

6. క్లోరోక్వీన్ ప్రకటనతో ముప్పు

క్లోరోక్వీన్, హైడ్రాక్సీక్లోరోక్వీన్‌పై ప్రభుత్వం, అధికారులు అతిగా ఆధారపడడం వల్ల కూడా దేశంలో ప్రజలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఇమ్యునాలజిస్ట్ బార్బరా బాటిస్టా చెప్పారు.

మలేరియా, లూపస్ లాంటి వ్యాధులకు ఉపయోగించే ఈ మందుల గురించి అధ్యక్షుడు బోల్సొనారో మొదటి నుంచీ ప్రచారం చేశారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మందులు ఉపయోగించాలని సలహా ఇచ్చింది. చాలా నగరాల్లో ఈ మందును ఉచితంగా కూడా పంచిపెట్టారు.

మొదట జరిగిన కొన్ని పరిశోధనల్లో ఈ మందులు వైరస్‌ను అడ్డుకోగలవని చెప్పారు. కానీ తర్వాత జరిగిన విస్తృత పరిశోధనల్లో దీనివల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం ఉండదని తేలింది.

బ్రెజిల్‌లో ఈ మందుతో కోవిడ్-19ను అడ్డుకోవచ్చని చాలా మంది భావించారని, ఈ మందు వాడితే వ్యాధి నుంచి బయటపడతామని అనుకున్నారని ఒక పరిశోధనలో తేలింది. ఆ ఆలోచనలు వారిలో నిర్లక్ష్యం పెంచాయి. దాంతో, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.

कोरोना

ఫొటో సోర్స్, Reuters

7. ఫీల్డ్ ఆస్పత్రులు సమస్యగా మారాయి

“చాలా రాష్ట్రాలు ఫీల్డ్ ఆస్పత్రుల కోసం కూడా పెట్టుబడులు పెట్టాయి. అది కూడా తప్పు. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో పడకలు ఉన్నప్పటికీ, స్టాఫ్ లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండాపోయాయి” అని మార్గరెట్ డాక్లోమో చెప్పారు.

ఇక, చాలా ప్రాంతాల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణం చాలా ఆలస్యం అయ్యింది. చాలా ప్రాంతాల్లో అవసరానికి మించి పడకలు ఏర్పాటుచేశారు. ఆ ఆస్పత్రులను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు.

ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణలో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. రియో డి-జెనీరోలో వీటిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.

చాలా కేసుల్లో, ఈ ఆస్పత్రులు పరిష్కారానికి బదులు, సమస్యగా మారాయి అని డాక్లోమో అంటారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

8. గిరిజనులకు రక్షణ కరవు

బ్రెజిల్‌లో వైరస్‌ వ్యాప్తి మొదట నగరాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే గిరిజన ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందినట్లయితే దాని పర్యవసానాలు విపరీతంగా ఉండేవి. ఎందుకంటే వారిలో ఈ తరహా వైరస్‌ల నుంచి కాపాడుకునే రోగ నిరోధక శక్తి లేదు.

ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వైరస్‌ గిరిజనులను చేరకుండా ఆపలేకపోయారు. ఇప్పటి వరకు 633మంది మరణించగా, 22 వేలమందికి పైగా ఈ వైరస్‌బారిన పడ్డారు.

ఈ వైరస్‌ బ్రెజిల్ గిరిజనుల సమస్యలను పెంచింది. వీరు నివసించే ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు.

చివరకు గిరిజనుల రక్షణ వ్యవహారం ఆ దేశ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. వారికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆరోగ్య కార్యకర్తల వల్ల కూడా గిరిజనులను ఈ వైరస్‌ సోకుతోందని వీరి సంక్షేమం కోసం పని చేసే సంస్థతో సంబంధం ఉన్న పాలో టుపిన్‌క్విమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు నరికే కూలీలు, భూముల యజమానుల ద్వారా కూడా ఈ వైరస్‌ రావచ్చని ఆయన అన్నారు. నగరాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తరచూ సిటీలకు వెళుతుండటం వల్ల వారి నుంచి కూడా ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది.

వైరస్‌ గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చేరినప్పుడు అతి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ సామాజిక దూరం పాటించేలా చూడటం పెద్ద సవాల్‌ అని టుపిన్‌క్విమ్‌ అన్నారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

9. పేదలను పట్టించుకునేవారు లేరు

వాస్తవానికి ఈ వైరస్ ధనవంతుల ద్వారా బ్రెజిల్‌కు చేరింది. ప్రపంచమంతా చుట్టి వచ్చిన వారు తమ దేశంలోకి వైరస్‌ను మోసుకొచ్చారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. ఇది పేదలను కూడా వదిలిపెట్టదు.

ఆరోగ్యసేవలు సరిగా అందుబాటులోలేని పట్టణ పేదలు నివసించే ప్రాంతాలతో ఈ వ్యాధి వ్యాప్తి వేగంగా ఉన్నట్లు ఓస్వాల్డో పౌండేషన్‌ పరిశోధన తేల్చింది.

రియో-డి-జెనీరోలోని మురికివాడల్లో మరణాల రేటు 19.47శాతానికి చేరుకోగా, మురికివాడల్లో ఇది 9.23 శాతంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పేద ప్రాంత ప్రజలు పాటించలేని పరిస్థితి. ఇక్కడ సామాజిక దూరం పాటించే పరిస్థితులు లేవు.

అప్పటికే జబ్బులున్నవారు కోవిడ్-19 వల్ల మొదట ఇబ్బంది పడతారని స్పష్టమైంది. అలాగే బలహీనవర్గాల వారు ఎక్కువగా కరోనా బారినపడ్డారు. వారికి సరైన వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు.

బ్రెజిల్ కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

వైరస్‌ నేర్పిన పాఠమేంటి?

బ్రెజిల్‌లో ఈ వైరస్ ప్రభుత్వం శాస్త్రీయ పరిశోధనలను తగ్గిస్తున్న తరుణంలో వచ్చింది పరిశోధనలకు కూడా నిధులు తగ్గించారని ఇస్టర్‌ సెబినో అన్నారు.

ఈ వైరస్‌ కారణంగా సైన్స్ ప్రాముఖ్యత ఏంటో తెలిసిందని,ప్రజలు నేతలను ఎన్నుకునే ముందు దీన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

పరిశోధన, విజ్ఞాన రంగంలో ఎక్కువ పెట్టుబడులు అవసరమని, లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని నటాలియా పాస్టర్నాక్ అన్నారు.

అయితే బ్రెజిల్‌లో ఇప్పుడున్న వ్యవస్థ ఈ పరిస్థితిని అధిగమిస్తుందని మార్గరెట్ డాల్కోమో అన్నారు.

అన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని, దేశంలో పేటెంట్లు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిశోధనలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)