కరోనావైరస్: భారత్‌లో కేసులు ఎలా పెరుగుతాయి? దేశవ్యాప్త 'లాక్‌డౌన్' ఎంతవరకూ ఫలిస్తుంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

కరోనావైరస్, రైలు ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచమంతా పంజా విసురుతోంది. దేశదేశాలు స్తంభించిపోయాయి. దాని వ్యాప్తిని అడ్డుకోవటానికి జనం ఇళ్లకే పరిమితమైపోయారు.

భారతదేశంలో ఇప్పటివరకూ దాదాపు 700 కేసులు నమోదయ్యాయని, 17 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో 45 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సంఖ్యలను చూస్తే.. చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికా తరహాలో దేశంలో కరోనావైరస్ విజృంభించకుండా నియంత్రించగలుగుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే, దేశంలో కరోనావైరస్ సునామీలా వ్యాపించబోతోందని, అందుకు దేశం సిద్దంగా ఉండాలని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ డైరెక్టర్ డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. మార్చి 23వ తేదీ నుంచి ఈ లాక్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ కొనసాగుతుందని చెప్పింది.

మెట్రోలో రద్దీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రయాణాల నిషేధం, సోషల్ క్వారంటైన్, లాక్‌డౌన్ అమలు చేయడం ద్వారా కరోనా కేసులను భారీగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

''నిజంగా ప్రభావితమైన కేసుల సంఖ్య తెలియదు...''

దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన 22వ తేదీన ప్రముఖ పరిశోధన సంస్థలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా భారతదేశంలో కరోనావైరస్ విస్తరించే తీరుతెన్నులను అంచనా వేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది.

ఇతర దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో నిర్ధరించిన కరోనావైరస్ కేసుల సంఖ్యను నియంత్రించటంలో భారత్ బాగానే పనిచేసినప్పటికీ, పరిస్థితిని అంచనా వేయటంలో ఒక కీలకమైన అంశం లోపించిందని 'కోవ్-ఇండ్-19 స్టడీ గ్రూప్' అనే ఆ బృందం పేర్కొంది.

అది ''నిజంగా ప్రభావితమైన కేసుల సంఖ్య''గా అభివర్ణించింది. కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలను ఎంత విస్తృతంగా నిర్వహిస్తున్నారు, వైరస్ లక్షణాలు కనిపించని వారికి ఎంత ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే వివరాల ఆధారంగా ఉండే ఈ 'నిజంగా ప్రభావితమైన కేసుల సంఖ్య' తెలియకపోవటం ఒక సమస్య అని చెప్పింది.

దేశంలో కరోనావైరస్ పరీక్షల విస్తృతి చాలా తక్కువగా ఉందని, మార్చి 18 నాటికి కేవలం 11,500 మందికి మాత్రమే ఈ పరీక్షలు చేశారని ఆ బృందం ఉటంకించింది.

''కోవిడ్-19కి చికిత్స చేయటానికి ఆమోదించిన వ్యాక్సిన్ కానీ, మందులు కానీ ఏదీ లేదు. ఈ పరిస్థితిలో మహమ్మారి వ్యాప్తి రెండో దశలోకి లేదా మూడో దశలోకి ప్రవేశిస్తే భారత ఆరోగ్య వ్యవస్థ మీద విధ్వంసకరమైన ప్రభావం పడుతుంది'' అని చెప్పింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

''రెండు నెలల్లో 10 లక్షల కేసులు...''

''ఇటలీ, అమెరికా తదితర దేశాల్లో చూస్తున్నట్లుగా కోవిడ్-19 క్రమక్రమంగా ప్రవేశించి అకస్మాత్తుగా విస్ఫోటనం చెందుతుందని అర్థమవుతోంది'' అని ఈ నిపుణుల బృందం నివేదిక హెచ్చరించింది.

''భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి పటిష్ట చర్యలు చేపట్టకపోతే, ఈ కేసుల సంఖ్య కొన్ని వారాల్లోనే విపరీతంగా పెరిగిపోవచ్చు. దేశంలో మొత్తంగా మార్చి 31 నాటికి 379 కేసులు, ఏప్రిల్ 15వ తేదీ నాటికి 4,836 కేసులు, మే 15వ తేదీ నాటికి 58,643 కేసులకు పెరగవచ్చు'' అని అంచనా వేసింది.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రూపొందించి నిర్వహిస్తున్న విజువల్ డాష్‌బోర్డులో భారతదేశంలో కొత్త కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి మార్చి 16వ తేదీ వరకూ ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుని ఈ అంచనాలను రూపొందించినట్లు ఆ బృందం వివరించింది.

అయితే, ఇవి తొలి దశ గణాంకాల ఆధారంగా రూపొందించిన అంచనాలని, దేశంలో నిర్వహిస్తున్న కరోనావైరస్ పరీక్షల విస్తృతి, సంఖ్య తక్కువగా ఉన్నాయి కాబట్టి, భవిష్యత్తులో పెరగబోయే కేసుల సంఖ్య అంచనాలు కూడా తక్కువగా ఉండొచ్చునని ఆ బృందం పేర్కొంది.

కరోనావైరస్

''ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే... దేశంలో గరిష్టంగా మార్చి 31 నాటికి 2,507 కేసులు, ఏప్రిల్ 15వ తేదీ నాటికి 28,925 కేసులు, మే 15వ తేదీ నాటికి 9.15 లక్షల కేసులు నమోదవుతాయనేది విశ్వసనీయ అంచనా'' అని వివరించింది.

''మహమ్మారి తొలి దశల్లో భారతదేశంలో మార్చి 19వ తేదీ వరకూ కోవిడ్-19 కేసుల పెరుగుదల రేటు... అమెరికా నమూనాను సుమారు 13 రోజుల వెనుకగా అనుసరించినట్లు కనిపించింది. అదే విధంగా అమెరికాలో కేసుల వ్యాప్తి ఇటలీ నమూనాను 11 రోజుల ఆలస్యంతో అనుసరించినట్లు కనిపించింది'' అని విశ్లేషించింది.

అయితే, ఇటలీ, అమెరికాలతో పోల్చినపుడు భారతదేశంలో కేసుల సంఖ్య పెరుగుదల రేటు తక్కువగా ఉంటుందని తమ అంచనా చెప్తోందని.. దీనికి ప్రధాన కారణం దేశంలో నిర్ధరిత కేసుల సంఖ్య తక్కువగా ఉండటమేనని నిపుణుల బృందం తెలిపింది.

కానీ.. పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే, వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతున్నట్లయితే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే అమాంతంగా పెరగవచ్చునని.. అపుడు భారతదేశంలో కేసుల సంఖ్య అమెరికా, ఇటలీ తరహాలోనే కనిపించటం మొదలుకావచ్చునని అంచనాగా వివరించింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ క్వారంటైన్, లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తే...

మార్చి 18వ తేదీ వరకూ పరిశీలించిన గణాంకాలను బట్టి ప్రభుత్వం తక్షణమే ప్రయాణాలపై నిషేధం, సోషల్ డిస్టెన్సింగ్, లాక్‌డౌన్ వంటి చర్యలను పటిష్టంగా అమలుచేస్తే... వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణుల బృందం నివేదిక చెప్తోంది.

ఈ చర్యలు చేపట్టినట్లయితే.. మే 15వ తేదీ నాటికి ప్రతి లక్ష మంది భారతీయుల్లో ఒకరికి మాత్రమే కరోనావైరస్ సోకుతుందని అంచనా వేసింది.

''ఆస్పత్రుల్లో పడకలు, ఐసీయూ సదుపాయాలు ఏమాత్రం చాలవు''

ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకపోతే, భారతదేశంలో ఆస్పత్రుల పడకల సామర్థ్యానికి మించిపోయి కేసులు నమోదవుతాయని, అంతమందికి వైద్య సేవలు అందించటం భారత వైద్య వ్యవస్థకు అసాధ్యంగా మారుతుందని ఈ బృందం చెప్తోంది.

''దేశంలో ప్రతి 1,000 మందికి కేవలం 0.7 శాతం మాత్రమే ఆస్పత్రుల్లో మంచాలు ఉన్నాయి. అదే ఫ్రాన్స్‌లో 6.5, దక్షిణ కొరియాలో 11.5, చైనాలో 4.2, ఇటలీలో 3.4, బ్రిటన్‌లో 2.9, అమెరికాలో 2.8, ఇరాన్‌లో 1.5 చొప్పున పడకలు ఉన్నాయి'' అంటూ ప్రపంచ బ్యాంకు గణాంకాలను ఉటంకించింది.

ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 70 పడకల చొప్పున సామర్థ్యం ఉందని.. ఇందులోనూ 75 శాతం అప్పటికే వినియోగంలో ఉంటాయి కనుక కేవలం నాలుగో వంతు పడకలు మాత్రమే కరోనావైరస్ రోగులకు అందుబాటులో ఉంటాయని విశ్లేషించింది.

పైగా, కోవిడ్-19 రోగుల్లో ఆరోగ్యం తీవ్రంగా విషమించిన వారికి (సుమారు 5 నుంచి 10 శాతం మందికి) ఐసీయూ పడకలు అవసరమని చెప్పింది. అయితే, దేశంలోని ఆస్పత్రుల్లో ఉన్న పడకల్లో మొత్తంగా 5 నుంచి 10 శాతం వరకూ ఐసీయూ పడకలు ఉన్నాయని, అవి కూడా చాలా వరకూ నిండిపోయి ఉంటాయని పేర్కొంది.

ఒంటరిగా కూర్చున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి ఎటువంటి చర్యలూ చేపట్టకపోయినట్లయితే... మే 15వ తేదీ నాటికి ప్రతి లక్ష మందికి 161 కేసులు (దేశ వ్యాప్తంగా 22 లక్షల కేసులు) నమోదవుతాయని అంచనా వేసింది. అంటే, వారికి చికిత్స అందించటానికి ఆస్పత్రుల్లోని పడకలు ఏ మూలకూ సరిపోవు.

అదే ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి అత్యంత కఠిన చర్యలు, ప్రయాణాల నిషేధం, సోషల్ క్వారంటైన్, లాక్‌డౌన్ వంటివి అమలు చేస్తే.. అదే మే 15వ తేదీ నాటికి ప్రతి లక్ష మందికి ఒక కేసు చొప్పున (మొత్తం 13,800 కేసులు) నమోదవుతుందని అంచనా కట్టింది.

కాబట్టి, భారత ప్రజలందరూ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

ఈ నివేదిక తయారుచేసిన 'కోవ్-ఇండ్-19 స్టడీ గ్రూపు'లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు దేబశ్రీరాయ్, రూపం భట్టాచార్య, లిలీ వాంగ్, మాక్స్‌వెల్ సాల్వాటోర్, షారిఖ్ మొహమ్మద్, అరిత్రా హాల్దర్, యివాంగ్ ఝూ, పీటర్ సాంగ్, సౌమిక్ పూర్కాయస్తా, దేబ్‌రాజ్ బోస్, మౌసమి బెనర్జీ, వీరా బాలాదండేయుతాపాని, పరీక్షిత్ ఘోష్, భ్రమర్ ముఖర్జీ ఉన్నారు.

డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్

''సునామీని తప్పించుకోవటానికి మూడు వారాలే గడువు'': డాక్టర్ రమణన్

''మిగతా దేశాలతో పోలిస్తే మనం కాస్త వెనకే ఉండవచ్చు. కానీ ఇక్కడ స్పెయిన్, చైనా లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎంత వేగంగా జనం ఇన్ఫెక్షన్‌కు గురయ్యారో.. అలాంటి పరిస్థితులే ఇక్కడ కూడా వస్తాయి. కొన్ని నెలల్లో మనం కరోనా సునామీ కోసం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది'' అని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ డైరెక్టర్ డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఇన్ఫెక్షన్ వ్యాపించడం అనేది మూడో దశ, ప్రమాదకరమైన స్థాయి.

''అమెరికా, బ్రిటన్‌లలో 20 నుంచి 60 శాతం జనం ఇన్ఫెక్షన్‌కు గురై ఉంటారు. భారత్‌లో దాదాపు 20 శాతం జనాభా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంటుందని ఒక అంచనా. ఆ సంఖ్య తక్కువేం కాదు. 20 శాతం జనాభా అంటే దాదాపు 30 కోట్ల మందికి ఈ వైరస్ సోకుతుంది'' అని డాక్టర్ రమణన్ పేర్కొన్నారు.

ప్రతి ఐదుగురిలో ఒకరికి, అంటే 40 నుంచి 50 లక్షల మందికి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉంటుందని, వారిని ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.

మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

''దేశంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో కలిపి ఐసీయూ బెడ్స్ మొత్తం 70 వేల నుంచి లక్ష వరకూ ఉంటాయి. జనాభాను బట్టి చూస్తే, ఈ సంఖ్య చాలా తక్కువ, ఆందోళన కలిగించే విషయం కూడా. మనకు సన్నాహాల కోసం ఎక్కువ సమయం కూడా లేదు. చైనా ఎంత వేగంగా స్పందించిందో మనం కూడా అలాగే అవన్నీ చేయాల్సి ఉంటుంది'' అని చెప్పారు.

దేశంలో తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించాలన్నారు. ''స్టేడియంలను కొన్నిరోజులు ఆస్పత్రులుగా మార్చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి'' అని సూచించారు.

''మన దగ్గర పరిస్థితిని అదుపు చేయడానికి మూడు వారాల సమయం ఉంది. ఈలోపే అన్నీ చేయాలి. మనం సునామీ దూసుకురావడం కనిపిస్తున్న ఒక ప్రాంతంలో ఉన్నామని ఊహించుకోండి. సమయానికి అప్రమత్తం కాకపోతే, మనం ఆ సునామీ గుప్పిట్లోకి వెళ్లిపోతాం, ప్రాణాలు కోల్పోతాం'' అని రమణన్ అన్నారు.

అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని, ఎలాంటి కలవరానికి గురికావద్దని చెప్పరు. కానీ ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)